Previous Page Next Page 
అష్టావక్ర పేజి 34


    'కృష్ణ' అని చెబుదామనుకున్నాడు. మనసు ఎదురు తిరుగుతూంది. క్షుద్రశక్తులు తన అశక్తతని చూసి వికటాట్టహాసం చేస్తున్నట్టు భ్రాంతి కలుగుతూంది. "క్...కు....కృ...కర్....ర్....ర....రవి" అన్నాడు. అతడి నుదుటిమీద చెమట ధారాపాతంగా కారుతూంది. తను ఓడిపోతున్నానన్న విషయం స్పష్టంగా తెలుస్తూంది. ఈ అదృశ్య శక్తితో ఎలా పోరాడటం? నిజంగా క్షుద్రదేవతలు వున్నాయా? ఉస్సోక్ వెనుక అండగా నిలబడి సాయం చేస్తున్నాయా? ఇంతకాలపు తన తాత్వికజ్ఞానం కేవలం ఆత్మ సంతృప్తికేనా?

    అంతలో అతనికి రంజిత ఇచ్చిన వాచీ సంగతి గుర్తువచ్చింది. "-ఒక ముఖ్యమైన అవయవం నీ శరీరం నుంచి మాయమైపోతుంది" అని సూచన ఇచ్చినప్పుడు తన మెదడు ఇదే విధమైన నిర్వీర్యానికి లోనైంది. దాన్ని కోణాన్ని వివరిస్తూ రంజిత వాచీ నుంచి వచ్చే సానిక్ సౌండ్స్ గురించి చెప్పింది.

    అవే తరంగాల్ని ఇప్పుడు ఈ క్షుద్రశక్తులమీద ప్రయోగిస్తే?

    .... అతడు మరి ఆలస్యం చేయదల్చుకోలేదు. చేతులు వెనుకనుంచి కదల్చడం మొదలుపెట్టాడు. బంధించి వుండటం వల్ల అవి పైకి రావడం కష్టం అవుతూంది. అయినా ఇది జీవన్మరణ సమస్య! మేచేతుల దగ్గిర నొప్పి విపరీతంగా వుంది. అతడు ఆపలేదు. వెనుకవైపు మెడవరకూ చేతులు వచ్చాయి. అప్పుడు 'రాడ్'ని నొక్కాడు. వినిపించీ వినిపించనట్టు శబ్దం మొదలై క్రమేణా అదృశ్యమైంది. చెవులకు సంబంధించినంతవరకూ మాత్రమే అది అదృశ్యమైందనీ, మెదడు దాని తరంగాల్ని గ్రహిస్తూందనీ అతడికి సరీగ్గా పదిక్షణాల్లో అర్ధమైంది.

    అప్పటివరకూ ఆ గదిలోవున్న 'ఇబ్బందికరమైన' వాతావరణం తొలగిపోయిన అనుభూతి కలిగింది. మెదడుని నొక్కిపట్టి వుంచిన 'శబ్దం' మాయమైన భావం కలిగింది. సినిమాల్లో ఒక బాణానికి వ్యతిరేకంగా మరో బాణం వచ్చి రెండూ ఢీకొని మసి అయిపోయినట్లు క్షణాల్లో మామూలు పరిస్థితి నెలకొంది.

    "థాంక్యూ రంజితా" అనుకున్నాడు!  ఉస్సోక్ లో చేరబోయే సభ్యులచేత ఆ సంస్థ ఎలాగైనా నిజం చెప్పిస్తూంది అని తను చెప్పగానే ఇంతదూరం ఆలోచించి... ఇదేదో ప్రకంపనాలకి సంబంధించిన విషయం అని గ్రహించి, ప్రజెంటేషన్ మిషమీద తన చేతికి ఈ వాచీ కట్టి పంపిన గర్ల్ ఫ్రెండ్- తన కాబోయే భార్య- ఈ విధంగా తన జీవితాన్ని రక్షించింది.

    అతడి మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది. అయితే ఆ కృతజ్ఞతతో పాటూ ఆనందం కూడా వుంది. ఇంత తెలివయినది తన భార్య కాబోతున్నందుకు కలిగిన ఆనందం అది! ఇంతకాలమూ తను మ్యాజిక్ చేస్తే కళ్ళు విప్పారితం చేసుకునే అమాయకపు ఆడపిల్లల్ని మాత్రమే చూసేడు. ఆడవాళ్ళ తెలివితేటలు మీద అతనికి అంత గొప్ప అభిప్రాయం లేదు. కానీ అతడి అభిప్రాయాల్ని తలక్రిందులు చేస్తూ ఇన్నాళ్ళకి ఒక అమ్మాయి ప్రేక్షకుల్ని మ్యాజిక్ చేసి మ్యూట్ గా అమ్యూజ్ చేసే సాధారణమైన వాచీని మెజస్టిక్ గా ఉపయోగించి తన తన మ్యూటిలేట్ అవకుండా కాపాడింది.

    ఆ తరువాత అతడు విజృంభించాడు.

    ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు. దాదాపు నాలుగు గంటలపాటు అతడిని ప్రశ్నించిన తరువాత అతడు సభ్యుడుగా స్వీకరించబడ్డాడు. గెలిటెన్ లోంచి బయటకు వచ్చాక అతడిని తీసుకు వచ్చిన బ్లాక్ స్కెలిటన్ ఆ విషయాన్ని చెప్పాడు. అంతలో వృద్ధుడు వచ్చి అతడిని పక్కగదిలోకి తీసుకువెళ్ళాడు.

    ...దట్టంగా అలుముకొన్న పొగమేఘాల్లోంచి ఎవరో హరికేన్ లాంతరు పట్టుకొస్తున్నట్టుగా సన్నటి వెలుగు దగ్గిరకొచ్చింది. ఒక పళ్ళెంలో రబ్బరు ముద్రలాంటి పుర్రె మండుతూండటం చూశాడు. సేవకుడు పళ్ళేన్ని పెట్టేసి, మౌనంగా అక్కడనుంచి నిష్క్రమించాడు.

    "ఏమిటిది?" అడిగాడు షాడో.

    ఉస్సోక్ ముద్ర సభ్యుడా- ఈ క్షణం నుంచీ ప్రపంచంలో ఎక్కడున్నాసరే- నీ తోటి ఉస్సోక్ సభ్యుల్ని గుర్తుపట్టడానికి ఈ ముద్ర సాయపడుతుంది. అలాగే నీకు వారి ముద్రలు కనపడతాయి. వారిని గుర్తించగలవు".

    షాడో చేతివేళ్ళు వాచీ రాడ్ ని నొక్కాయి.

    వృద్ధుడు మైకంలో పడటానికి మరో రెండో నిముషాలు పడుతుంది. అంతవరకూ ఆపటానికి సంభాషణ కొనసాగించాడు.

    "మీరెవరు?"

    "నేను రెడ్ స్కెలిటన్ ని. మిత్రుడా! చేరగానే నువ్వు బ్లూ స్కెలిటన్ వి అవుతావు! నీ పనులనుబట్టి నీకు ఉన్నతి లభిస్తుంది. అంచెలంచెలుగా పైకి వస్తావు. అన్నిటికన్నా అత్యుత్తమ స్థానం రెడ్ స్కెలిటన్! వీరు మాత్రమే మహాదష్ట అనుంగు సహచరులు".

    మహాదష్ట... మహాదష్ట...

    నాలుగైదుసార్లు అనుకున్నాడు.

    అంతలో ఆ వృద్ధుడు పటకారుతో పుర్రె ఆకారంలో వున్న స్టాంపుని పట్టుకుని "సిద్ధంకా" అన్నాడు.

    "అదేమిటి స్వామీ! ఇప్పుడేగా ముద్రవేసింది" అన్నాడు షాడో. అన్నాడేగానీ అతడి గుండె వేగంగా కొట్టుకుంటూంది. తనకి ఇది మరో సమస్య.

    "వేసేశానా?"

    "అవును, చూడండి" అంటూ దగ్గిరగా వెళ్ళాడు. ఆ వెళ్ళటంలో వాచీని అతడికి మరింత దగ్గిరగా తీసుకువెళ్ళాడు.

    "ఆ...అవును కదూ" అన్నాడు వృద్ధుడు. షాడో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఈసారి కూడా తాంత్రిక శక్తిమీద యంత్రమే గెల్చింది.


                                                         24


    సిద్ధార్థ భవానీశంకరం బంగళాకి వెళ్ళాడు. నిర్మానుష్యంగా వుంది అది. ఒకరిద్దరు నౌకర్లు వున్నారంతే. సిద్దార్ధని చూసి సెల్యూట్ చేశాడు ఒక నౌకరు.

    "రవి వున్నాడా?"

    "లేడు సాబ్. కృష్ణాపురం బోయిండు".

    సిద్ధార్థకి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఈ సమయంలో అతడు కృష్ణాపురం ఎందుకు వెళ్ళాడా- అని. కానీ దాని గురించి అంత పట్టించుకోకుండా, "కారు వుందా" అడిగాడు.

    "ఉంది సాబ్".

    సిద్ధార్థ షెడ్ లోంచి కారు బయటకు తీశాడు.

    అయిదు నిముషాల తరువాత అతడి కారు తాపీగా కృష్ణాపురం వైపు సాగిపోతూంది. అతడిని చూసిన వారెవరూ అతడు అరగంట క్రితం అమితమైన క్షోభ అనుభవించినవాడని అనుకోరు. అష్టావక్రుడు తన భార్య కడుపున పుట్టబోతున్నాడన్న విషయం తెలిసినపుడు అతడు కదిలి పోయాడు. అష్టావక్రుడి వివరణ లైబ్రరీలో చదివినప్పుడు కంపించి పోయాడు. అయితే కొద్ది నిముషాలు మాత్రమే! వెంటనే సర్దుకుని మామూలు మనిషి అయిపోయాడు. అయిపోయినదానికి క్షోభపడటం అతడికి అలవాటులేదు. అవవలసినదెలాగా అని ఆలోచించటమే అతడికి తెలిసింది. ఒకసారి విషయం తెలిసిపోయాక అతడి మనసంతా కర్తవ్యం మీదే లగ్నమైంది.

    సిద్ధార్థ మ్యాప్ లో కృష్ణాపురం పక్కగా వున్న గ్రామాలు చూశాడు. అంత పరిధిలో రెండు గ్రామాలు వున్నాయి. కాబట్టి ఆ మరుసటిరోజు సిద్ధుడు ఆ గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో గడిపి వుండాలి. అక్కణ్ణుంచి ఆ తరువాతి రోజు మళ్ళీ ఇంకోవైపుకి వెళ్ళిపోయి వుండాలి. ఇలా లెక్కకట్టుకుంటూ వెళ్తే మొత్తం పదహారు గ్రామాలు తగిలాయి. ఇన్నీ వెతకాలి. అదృష్టం ఏమిటంటే ఇవన్నీ ఒకదాని కొకటి పక్కపక్కనే, మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్నాయి. పోతే ఒక కష్టం వుంది. గ్రామంలో ప్రతివీధి వెతకాలి. సత్రాలు వెతకాలి. గుళ్లూ గోపురాలు వెతకాలి. బిచ్చగాళ్ళు  వుండే ప్రతి ప్రదేశమూ వెతకాలి. ఇది సామాన్యమయిన విషయం కాదు.

    కారు వేగంగా వెళుతూంది. అయిదు నిముషాల తరువాత కృష్ణాపురపు పక్క గ్రామం పొలిమేరల్ని ప్రవేశించింది.


                                                      25


    ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్!

    అతడు విశాలమైన మెట్లు ఎక్కి రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి ప్రవేశించాడు. "డాక్టర్ వంశీకృష్ణ వున్నారా" అని అడిగాడు.

    "ఉన్నారు. మీరు?"

    "...రంగప్రసాద్".

    రిసెప్షనిస్టు ఇంటర్ కమ్ లో మాట్లాడి, "వెళ్ళండి. అక్కడున్నారు ఆ గదిలో" అంది. రంగప్రసాద్ మరో విశాలమైన ద్వారంలోకి ప్రవేశిస్తూ వుండగా లోపల్నుంచి ఒకామె వేగంగా వస్తూ, అదే వేగంతో అతడిని చూసుకోక, ఢీకొట్టింది. ఇద్దరూ ఒకేసారి 'సారీ' అన్నారు. రంగప్రసాద్ అంతలో ఆమెని చూశాడు.

    ఒక్కక్షణం ఊపిరి పీల్చడం మర్చిపోయాడు.

    ఆమె వయసు ఇరవై ఎనిమిది వుంటుంది. వయస పెరిగేకొద్దీ ఆ గాంభీర్యాన్ని సంతరించుకోకపోతే ఆడవాళ్ల అందం తరిగిపోతుంది. ఈ రహస్యం తెలిసిన ఆడవాళ్ళు చాలా తక్కువ. ఆ తక్కువమందిలో ఆమె ఒకరు.

    రంగప్రసాద్ కి జీవితంలో మొట్టమొదటిసారి తనేం కోల్పోయాడో ఇంతకాలానికి తెలిసింది! ఆమె వక్షం తగిలిన ఛాతి, మెత్తగా శరీరాన్ని అద్దిన శరీరం, ఆ క్షణమాత్రకాలంలో ఒద్దికగా వంటిమీద నుంచి వచ్చి చుట్టుముట్టిన పరిమళపు గాలి అతడి మతి పోగొట్టాయి. వెన్నెముక విల్లయితే, జడ తాడయితే, రెండూ కలిసేచోట కూర్చున్న మన్మథుడు టపటపాబాణాలు వదిలేశాడు. అంతకు ముందెవరైనా చరిత్రకారుడు గానీ, నవలాకారుడుగానీ ప్రేమా, కోరికా బలంగా పెరగటానికి చిన్న కారణం, అతి చిన్న సంఘటన చాలు అనీ వ్రాస్తే చదివి నవ్వుకునేవాడే అతడు కానీ ఇప్పుడు నమ్మవలసి వస్తోంది.

    అయితే ఇదంతా క్షణకాలమే. క్షణంలో రంగప్రసాద్ డాక్టర్ రంగప్రసాద్ అయిపోయాడు.

    మళ్ళీ ఇంకొకసారి 'సారీ' అన్నాడు.

    "ఫర్వాలేదు".

    "నా పేరు ప్రసాద్- రంగప్రసాద్".

    "నాకు మీరు తెలుసు. నేను మీకు జూనియర్ని. నా పేరు నివేదిత. డాక్టర్ నివేదిత".

    "గ్లాడ్ టుమీట్ యు-"

    సేమ్ టు యు-" అని ఆమె నవ్వి, "వంశీకృష్ణ మీకోసం ఎదురు చూస్తున్నారు" అంది.

    "వస్తాను" అంటూ అతడు లోపలికి వెళ్ళాడు.

    వంశీకృష్ణ అతడిని చూసి, కుర్చీలోంచి లేచి సాదరంగా ఆహ్వానించాడు. మామూలు సంభాషణ కొంచెంసేపు పాటు జరిగాక రంగప్రసాద్ వచ్చిన పని చెప్పాడు.

    "ఇప్పటివరకూ కృష్ణాపురపు దంపతులని మాత్రమే ప్రశ్నించి వారి అలవాట్లు, అభిరుచులు ఏవైనా ఈ వికృత జననాలకి కారణభూతమవుతున్నాయా అని ఆలోచించాను. ఏ ఇద్దరు దంపతుల అలవాట్లూ ఒకలాలేవు. అందుకని మరో వికృత శిశువు గురించిన చరిత్ర సేకరిద్దామని బయల్దేరాను. ఇదంతా మీకు చీకట్లో బాణం వెయ్యటంలా కనిపించవచ్చు...."

    "లేదు లేదు. చెప్పండి".

    "మీ దగ్గిర ఇంకెవరినైనా ఇలాటి వికృత జననాల గురించిన వివరాలు వుంటే చెప్పండి".

    "మీ దగ్గిర ఇంకెవరినైనా ఇలాటి వికృత జననాల గురించిన వివరాలు వుంటే చెప్పండి".

    "మా దగ్గిరా- లేవే-"

    రంగప్రసాద్ హతాశుడయ్యాడు. అయినా వదిలిపెట్టకుండా, "మీది జెనెటిక్స్ ఇన్ స్టిట్యూట్ కదా! ఈ వివరాలు సేకరించి పెట్టుకోరా" అని అడిగాడు.

    "లేదు డాక్టర్. వాటి అవసరం మాకు లేదు. మరీ ఏదైనా కొత్త విషయం వుంటే మాత్రం ఆ అనాలిసిస్ నోట్ చేసుకుంటాం. ఉదాహరణకి కృష్ణాపురం తాలూకు జననాల రికార్డంతా మా దగ్గిర వుంది".   

 Previous Page Next Page