ఇదిగో ఇన్నాళ్ళకు నేనున్నానూ అంటూ చెప్పకుండానే బ్రతుకుయానంలో తోడయ్యాడు. నీలి నింగి క్రింద రంగు తివాసీలా పరుచుకున్న తన మనసుపై పొగమంచి పొరలోనుంచి దూసుకొచ్చిన ప్రచండ భానుడిలా అనిపించినా ఆ తర్వాత అతి స్వల్పకాలంలో నీరెండగా మారేడు.
ఎప్పుడో ఆకులు రాలిన అరణ్యంలాంటి తన శూన్యంలోకి అణువులా ప్రవేశించి ఇప్పుడు అనంతమైపోయాడు.
అతడు తనకు కావాలి.
అతడి శ్రేయస్సూ తనదిగా మారాలి.
అందుకు ముందు అర్ధంకాని అతి సున్నితమైన పొరల్ని తను సుతిమెత్తగా స్పృశించి...
ఆమె ఆలోచనలు చెదిరి ఫోన్ శబ్దంతో...
ముందు ఉలిక్కిపడింది.
ఇంకా తెల్లవారని ఈ సమయంలో ఇది మరో అపశకునంలా అనిపిస్తూంది.
"హలో..."
"నేనే."
ఆమె వూహ తప్పుకాలేదు ఓడిపోయిన 'బ్లాక్ మాంబా' తనను హెచ్చరించాలని ఫోన్ చేస్తున్నాడు.
"తెలివితేటలు ప్రదర్శించావు శృతీ" కర్కశంగా వినిపిస్తూందతడి కంఠం, "ఇప్పుడు పూర్తిగా ఆపదలో చిక్కుకున్నావు."
నిజానికి ఆమె అదిరిపడింది. కాని ధైర్యాన్ని కూడగట్టుకుంది. "నువ్వూ మాట తప్పావు."
"నువ్వెంత నీ బ్రతుకెంత?"
"అణువంతే కావచ్చు మిస్టర్ బ్లాక్ మాంబా. కానీ ఇప్పుడు నీకు ఈ అణువుతోనూ అవసరం పడింది కదూ..."
"మిస్. శృతీ! నీకన్నా లక్షలరెట్లు బలాడ్యులైన పోలీస్ డిపార్ట్ మెంట్ ని గడగడలాడించినవాడ్ని నేను. జంటనగరాలలోని లక్షలమంది ప్రజల గుండెల్లో సింహస్వప్నాన్నై వణికించినవాడ్ని. నాతో పోరాటం సాధ్యమే అనుకుంటున్నావా!"
"నువ్వు కిరాతకుడివి బ్లాక్ మాంబా...నువ్వు సాగించిన నరమేధం చాలు. నువ్వేమిటో తెలుసుకోవడానికి కొత్తగా పరిచయం అనవసరం."
"ఇంత తెలిసినదానివి నాతో గొడవకెలా సిద్ధపడ్డావు."
"నాకెంత తెలిసో అటుంచి నువ్వూ ఓ విషయం తెలుసుకోవడం మంచిది బ్లాక్ మాంబా! నేను మొండిదాన్ని. అంటే తెగించినదాన్ని. కాబట్టే ప్రస్తుతానికి నీకంటే బలవంతురాల్ని. ఆశ్చర్యపోకు...నీ మూలంగా ఈ జంటనగరాలలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకంటే నేను గొప్పదాన్ని అనుకోవటం లేదు. సో...ఇప్పుడు నీ బెదిరింపులకి లొంగదలచుకోలేదు."
"గూడ్..."
"థేంక్స్...సో ఇప్పుడు చెప్పు. డాక్టర్ సంఘమిత్రని ఎందుకు అపహరించినట్టు..."
"అది నీకు అనవసరం. అప్రస్తుతం."
"అయితే ఇక మన మధ్య చర్చ అనవసరం..." ఖండితంగా చెప్పింది.
"దారికి రానంటావు" సహనాన్ని కోల్పోతున్నట్టు అరిచాడు.
"మిస్టర్ బ్లాక్ మాంబా. ఒక అవసరంతో నాకు ఫోన్ చేసిన నువ్వు కొన్ని కనీస నియమాల్ని పాటించనివాడు నీతో చర్చ అర్ధంలేదన్నది నా అభిప్రాయం...బలంతోనే అంతా సాధించలేవని తెలుసుకుంటే వెంటనే సంఘమిత్రగార్ని విడిచిపెట్టు."
"లేకపోతే..."
"ఆయన అపహరణ సంగతి పోలీసులకి తెలియచేస్తాను. పాపం నువ్వు అతి ప్రయాసతో సాధించిన 'డ్రగ్'ని పోలీసుల సొంతం చేస్తాను. అన్నట్టు చెప్పటం మరిచాను. నీ దగ్గరుండే నీ పేరుగల సర్పం అదే బ్లాక్ మాంబా. చాలా ప్రమాదకరమైంది. దానికి నీలా మనుషులంటే లక్ష్యంలేదు. కాటేసేముందు నీలా ఫోన్ చేయదు...కాటేసాక ఏ మందూ పనిచేయదు."
వ్యంగ్యంగా నవ్వు వినిపించింది. "తెలివైన దానివి."
"మరేం...నాకూ అనిపిస్తూంది."
"వెల్...దెన్ గెట్ రెడీ."
"దేనికి?"
"నీకు అత్యంత విలువైన ఓ మనిషిని నష్టపోవడానికి."
శృతి నిశ్శబ్దంగా వుండిపోయింది.
"చూడు శృతీ. నీవరకూ నేనేమిటో ముందు తెలియచేయబోతున్నాను. నువ్వు పోలీసులకి తెలియచేస్తావో లేక బలమైన రక్షణనే ఏర్పాటు చేసుకుంటావో సిద్ధంకా...సరిగ్గా ఇరవై నాలుగుగంటల్లో నీ జయేంద్ర ప్రాణాలుతీయబోతున్నాను చాలా దారుణంగా"
శృతి చేతులు కొద్దిగా కంపించాయి. "శతృత్వం మనిద్దరిమధ్య"
"కాని నా ప్రయత్నాన్ని తెలివిగా విఫలంచేసింది జయేంద్ర" తోడేలులాంటి నవ్వు వినిపించింది. "నాకు సమస్య ఏర్పడేది తెలివైన వాళ్ళదగ్గర్నుంచే కాబట్టి ముందు వాళ్ళనే కడతేర్చడం సాంప్రదాయంగా పెట్టుకున్నవాడ్ని. సో...దమ్ముంటే కాపాడుకో సరిగ్గా... ఇరవై నాలుగు గంటలు..."
అవతల ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వింటూ రిసీవర్ని హుక్ పై వుంచింది.
ప్రత్యర్ధి ఎంత బలవంతుడో ఆమెకు తెలీనిదికాదు. కానీ జయేంద్రని రక్షించాలనుకుంది. ఆ రక్షణకి ఏ బలగాన్నీ ఆశ్రయించాలని ఆమె అనుకోలేదు. చివరకి జయేంద్రకి సైతం ఈ విషయం తెలియపరచకూడదనుకుంది.
"శృతీ" అన్న పిలుపువిని గిరుక్కున వెనక్కి తిరిగింది.
అక్కడ జయేంద్ర నిలబడివున్నాడు. చాలా మామూలుగా వున్నాడు. రాత్రి ఏం జరిగిందీ ఆలోచించనంత సాధారణంగా.
"ఫోన్ చేసిందెవరు?"
"ఓ స్నేహితురాలు" ఠక్కున అబద్ధం చెప్పింది. మనం అర్జెంటుగా బయలుదేరాలి.
ఎక్కడికో చెప్పలేదు. హెరాయిన్ అతడెక్కడ దాచిందీ అడగలేదు. రాత్రిచూసిన అతడి నగ్నదేహం గుర్తుకొస్తుంటే లజ్జగా తల వంచుకుని తొందరచేసింది.
ఓ ట్రాన్స్ లో వున్నట్టు ఆమెను అనుసరించాడు మరో అరగంటలో.
సరిగ్గా ఇదే సమయంలో రాత్రి పాముకాటుతో చనిపోయిన డేవిడ్ మరో పసికందులకు అటాప్సీ చేసిన డాక్టర్ హరి శరీరంలో వున్న విషయం ఏ సర్పానికి చెందిందీ తెలీదని డి.సి.పి. ప్రసన్నకి తెలియచేస్తున్నాడు...
ఈ దేశంలోని డాక్టర్లకు పరిచయమైన విషాలు నాగుకాటుతో కక్కే 'కోబ్రడిన్' వైపర్స్ మూలంగా రక్తంలో ప్రవేశించే 'వైపరిన్' తప్ప బ్లాక్ మాంబా విషానికి సంబంధించిన అవగాహన లేదు.
ఆ సమయంలో డి.సి.పి. ప్రసన్నకి గుర్తుకొచ్చింది డాక్టర్ శృతి.
ఉదయం ఏడున్నరకల్లా దివ్యతేజ ఎపార్ట్ మెంట్స్ కి వచ్చిన ప్రసన్నకి శృతి ఇంటికి తాళంవేసి వుండడం కనిపించింది.
నిరాశగా వెనక్కి మరలబోతుంటే "ఎవరు కావాలంకుల్" అంటూ పలకరించాడు స్కూలుకి బయలుదేరుతున్న నానీ... "శృతి ఆంటీయా?"
"అవును" తల పంకిస్తూ చూసాడు.
"నా పేరు నానీ అన్నమాట. బడికి వెళుతున్నాను..."
"గడుగ్గాయి" నానీ సమీపంలో నిలబడ్డ విశ్వేశ్వరశాస్త్రి నెమ్మదిగా అన్నాడు. "పోలీస్ అంకుల్ వచ్చింది నువ్వు బడి కెళుతున్నావో లేదో చెక్ చేయాడానిక్కాదు. ఆంటీ గురించి."
"మీకు తెలీదా అంకుల్" సీరియస్ గా అడిగాడు.
"అహ...! నీకు తెలుసా" లేమాని చిగురుటాకులా కనిపిస్తున్న నానీని చూస్తూ ఉత్సుకతగా అడిగాడు.
"నాకూ తెలీదు...ఆంటీ నాకూ చెప్పలేదన్నమాట..." ఆంటీ ఓ దారుణమైన పొరపాటుచేసినట్టు తల పంకిస్తుంటే ఆ స్థితిలోనూ నవ్వకుండా ఉండలేకపోయాడు ప్రసన్న.
"డేవిడ్ అంకుల్ చచ్చిపోయాడని పొద్దుటే చెప్పారనుకుంటే ఆంటీ లేదన్నమాట...మరేమో నేను స్కూలుకి తాతయ్యతో వెళ్తున్నాను..."
"ఏ స్కూలు..." ప్రసన్నవాక్యం ఇంకా పూర్తికానేలేదు.
"డే ఫోడిల్స్...నన్ను తీసుకువెళతావా అంకుల్...మరేమో తాతయ్య ముసలాడన్నమాట. తోడువస్తాడుగాని బాగా అలసిపోతాడు"
"వీడో అల్లరివెధవ బాబూ...పట్టించుకోకండి"
"ఫర్వాలేదు. నేను వెళ్ళేది అటే. జీపులో తీసుకెళతాను" ప్రసన్న నచ్చచెప్పాడు విశ్వేశ్వరశాస్త్రిగారికి.
"అప్పుడే అంకుల్ ని కాకపట్టేశావురా గడుగ్గాయి..."
విశ్వేశ్వరశాస్త్రి అబ్బురంగా చూస్తుంటే పరిచయం చేశాడు నానీ.