ఆమె అంటే అసహ్యం అన్నాను. ఆమె నన్ను మీరనడం మాని నువ్వనసాగింది.
"నా గురించి ఏమనుకున్నా బాధలేదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో"
ఆమె కదలలేదు. "నేను ఆడదాన్ని. నా అందంతో ఎవరినయినా వశపర్చుకోగలనని నా నమ్మకం. ఆ నమ్మకం తోనే ఈ గదిలో అడుగుపెట్టాను. నీ విషయంలో కూడా విజయం సాధిస్తే కానీ వదలను"
ఆమె చాలా ఖచ్చితంగా అంది. అప్పుడు నాకు నిజంగా భయం వేసింది. ఆమె మాటలకు దెబ్బతిని, కోపగుంచుకుని వెళ్ళిపోతే ఆ తర్వాత గోపీ రఘులు వచ్చి కాసేపు నన్ను బోరుకొట్టి పోయేవారు నా పవిత్రత నిలబడేది. కానీ ఆడది నన్ను సవాలు చేసి నాముందు నిలబడితే...
కోమలి నన్నెప్పుడూ సవాలు చేయలేదు. ప్రాధేయపడింది.
ఈమె ప్రాధేయపడడంలేదు.
"అది నీవల్ల కాదు" అన్నాను బింకంగా.
"నిన్ను నేను రేప్ చేస్తాను" అందామె.
ఈ మాట ఒక ఆడదానినోట వింటానని నేనెన్నడూ అనుకోలేదు. అది నాకు అవమానంగా కూడా తోచింది.
ఆమెవంక చూశాను.
నన్ను ప్రలోభపెట్టడానికి ఆడదానిగా తానేం చేయాలో అన్నీ చేయబోతున్న సూచన ఆమె నవ్వులో కనబడింది.
ఆమెకు కాస్త పక్కగా గోపీ కనబడ్డాడు.
"ఒరేయ్ రామం....ఒక ఆడది నిన్ను రేప్ చేస్తానంది ఏ స్థితికి దిగజారిపోయావురా? మగాడికింతకంటే అవమానమున్నదా? ఇప్పటికయినా పరిస్థితి మించిపోలేదు. చేసిన తప్పులు దిద్దుకో! జీవితంలో ఆనందమెలా వుంటుందో రుచి చూడు. అయినా ఇలాంటి అవకాశాలు నీలాంటి వెధవలకే వస్తాయేమిటో-ఊఁత్వరపడు" అంటున్నాడు.
"రామం! చరిత్ర నీ కధను సువర్ణాక్షరాలతో లిఖిస్తుంది. ఒక ఆడది మగవాడిని శారీరకంగా రేప్ చేయడం అసాధ్యం. ఆమె నీ మనసును రేప్ చేస్తుంది నీ మానసిక బలాన్ని నిరూపించు పవిత్రతకు విలువ నాపాదించు. నీమనోబలంతో చేతనయితే ఆమెలో మార్పు తీసుకుని రా" అంటున్నాడు రఘు.
ఆ తర్వాత ఆ గదిలో ఓ పావుగంటసేపు ఏం జరిగిందీ ఎవరికీ చెప్పుకోలేదు. కాని మొత్తంమీద విజయం నాదే!
నేనామెకు లొంగలేదు సరిగదా నన్ను లొంగదీసుకోవడం అసాధ్యమన్న గ్రహింపు ఆమెకు కలిగించాను.
అయితే అప్పుడు ఆమె వెళ్ళిపోలేదు.
ఉన్నట్లుండి ఏడుపు మొదలెట్టింది.
నేనామెను ఓదార్చలేదు. ఓదార్చాలని అనిపించలేదు.
కాసేపు ఏడ్చి తనే ఊరుకుందామె "నన్ను ఓదార్చాలని కూడా మీకు అనిపించదు కదూ?"
"నీవంటివాళ్ళు ఏడవడమే మంచిది" అన్నాను.
"ఇకమీదట నాకు జీవితమంతా ఏడుపే" అంది ఆమె.
"అది నీ మనసులో ఉంది. లేకుంటే నీకేలోటూ లేదు" అన్నాను.
"నేనెలా ఫెయిలయ్యానంటే, నిన్నే మాత్రమూ ఆకర్షించలేక పోయానంటే నా భర్త నన్ను బ్రతకనిచ్చినా, జీవితంలో ఇకముందు నువ్వు నాకు కరువయ్యేలా చేస్తాడు."
"నిన్ను నీ భర్త పంపాడా?"
"అవును ఆయన సహకారం లేనిదే ఈ ఇంట్లోకి ఈ సమయంలో ఎలా రాగలను?"
"నీ భర్తకు బుద్ది లేకపోతే నీకయినా సిగ్గుండదూ, ఆడదానివి కదా, మగాడికి నచ్చజెప్పే బదులు నువ్వే ఇందుకు సై అంటూ తయారవుతావా?"
"ఆడదాన్ని కాబట్టే ఇష్టంలేకపోయినా ఇలా రావలసి వచ్చింది"
"ఎందుకు?"
"నువ్వు నాపట్ల ఆకర్షితుడివైతే, ఆయన నీ భార్య జోలికి వెడితే నువ్వు అభ్యంతరం పెట్టలేవు. తను పతనమయ్యే ముందు ఎదుటివాణ్ణి తన స్థాయికి దింపుతాడాయన. ఆ పథకంలో ఇంతవరకూ ఫెయిల్ కాలేదు. ఈరోజు నా చేతకానితనం నీముందు ప్రదర్శితమైంది"
నేను మాట్లాడలేదు.
"నేను సామాన్య గృహిణిని. నాకు మగాణ్ణి లొంగదీసుకునే ట్రిక్కులేం తెలుస్తాయి? ఇంతకాలం పరాయి ఆడదనగానే లొట్టలు వేసే మగాళ్ళు దొరికారు కాబట్టి నా పని సులభంగా నెరవేరిపోయేది. ఇప్పుడు నీవంటి అరుదయిన మగవాడు ఎదురు కావడంతోనే నా చేతకాని తనం బయల్పడింది. నా చేతకాని తనాన్నయినా క్షమించరు బహుశా ఇది విడాకులవరకూ పోవచ్చు" ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు" అందామె మళ్ళీ.
నేను మాట్లాడడానికి భయపడుతున్నాను. నా మనసులో గోపీ రఘు యింకా తీవ్రంగా పోట్లాడుతూనే వున్నారు. ఆమె ఎదురుగా వున్నంతసేపూ-గోపీ నన్ను వదలడు. గోపీని రఘు వదలడు.
"నీ ఆశయాలు మంచివి. ఆదర్శాలు మంచివి. కానీ ఒక్క కోరిక కోరుతున్నాను. నేను అసహాయురాలైన ఆడదాన్ని. నేను ఫెయిలయ్యానన్న భావం కలిగించకు నీభార్య విషయంలో నీవు అన్ని జాగ్రత్తలూ తీసుకో. నా విషయంలో మాత్రం నీ ఆదర్శాలను మరిచిపో నేనెలాగూ పవిత్రతను కోల్పోయినదాన్నే - ఈ అవకాశాన్నుపయోగించుకో..."
ఆమె ఇప్పుడు మరో దారిన ప్రయత్నిస్తుంది.