బయట దూరంగా చెట్టు కింద బీడీలు కాలుస్తూ కూర్చున్న సాయుధపోలీసులు ఇరువురూ అంబులెన్స్ రావడం, హడావుడిగా అది వెళ్ళిపోవడం చూస్తూనే వున్నారు.
'పాపం! ఏదో యమర్జన్సీ కేసై వుంటుంది!' అని అనుకుని, కొత్తగా వస్తున్న రోగాల గురించిన చర్చలో మునిగిపోయారు.
వాళ్ళు కాపలా డ్యూటీ పోలీసులు!
తన గదిలోకి వచ్చిన డాక్టరు సునంద పడక కుర్చీలోకి జారిపోయింది.
నవీన్ అన్నట్టుగానే, టెర్రరిస్టులు తనను అంత తేలిగ్గా వదలరు....
టేబుల్ మీది నవీన్ విజిటింగ్ కార్డు మీద ఆమె చూపు నిలిచింది.
తెగిపోయిన టెలిఫోన్ వైరు వైపుకు ఆ చూపును మళ్ళించింది....
* * *
టెర్రరిస్టుల స్థావరాలను ఎలా కనుగొనాలి, ఎలా ఛేదించాలి, వాటిని ఎలా మట్టుపెట్టాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు నవీన్. అతనికి అదే ధ్యాస, అదే ధ్యానం.
గన్ మెన్ వచ్చాడు. ఇన్ స్పెక్టరు వెంకటేష్ వచ్చినట్టు తెలిపాడు.
"ఎస్, లోనికి పంపు!" అంటూనే లేచి ఆంధ్రప్రదేశ్ మేప్ వద్దకు వెళ్ళి దానిని పరిశీలించడంలో నిమగ్నమయ్యాడు నవీన్.
మేప్ లో కొన్ని గుర్తులు....తను పెట్టిన గుర్తులు.
"ఎస్! వాట్ డూ యు వాంట్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్?" అతను లోనికి అడుగిడుతుండగానే అడిగేశాడు నవీన్ మేప్ ను చూస్తూనే.
ఇన్ స్పెక్టర్ వెంకటేష్ సెల్యూట్ చేశాడు. వినయంగా చెప్పాడు:
"మీ దగ్గర పని చేద్దామనుకుంటున్నాను, సర్!"
ఫకాలున నవ్వాడు నవీన్. ఆ నవ్వు వెంకటేష్ ను కొద్దిగా చిన్నబుచ్చినట్టయింది.
"మిస్టర్ వెంకటేష్! ఏరికోరి కష్టాలను కొనితెచ్చుకుంటారా ఎవరైనా?"
"సర్! డ్యూటీని నేను ఏనాడూ కష్టంగా భావించలేదు. జాతి సమైక్యత, దేశసమగ్రత, శాంతి_భద్రతల సుస్థిరతకోసం చేసే ఏ డ్యూటీలో అయినాసరే సంతృప్తి వుంటుందని నా అభిప్రాయం, సర్! అందుకనే, ఎన్ని కష్టనిష్ఠురాలెదురైనా మీ స్క్వాడ్ లో చేరడానికి, మీ సబార్డ్ నేట్ గా పని చేయడానికి ఇష్టపడుతున్నాను సర్!" వినయ విధేయతలు ఉట్టిపడేట్టు చెప్పాడు వెంకటేష్ స్థిరమనస్కంగ.
"దట్స్ గుడ్! కాని మమతానురాగాలకు, ఈర్ష్యా ద్వేషాలకు, కక్షలు కార్పణ్యాలకు, ప్రలోభాలకు వంచనలకు అతీతంగా వుండగలవా అనే నా అనుమానం!" సూటిగా చెప్పాడు నవీన్.
"ఉండగలను, సర్!" అంతే సూటిగ, అంతకంటె వేగంగా అన్నాడు వెంకటేష్.
"ఒక పోలీస్ ఆఫీసరుకు ఎంత కరుకుదనం చురుకుదనం అవసరమో అవసరాన్నిబట్టి సందర్భాన్నిబట్టి ఆవేశకావేశాలను తగ్గించుకోవడం కూడ అంతే అవసరం. ఇది తెలుసుకుని, మెలకువగా పని చేస్తానంటే సరే, నాకేమీ అభ్యంతరం లేదు!" స్పష్టీకరించాడు నవీన్ _ చూపు అతని కళ్ళపైకి మరల్చుతు.
"మీ ఊహకు తగినట్టుగానే పనిచేస్తాను, సర్!"
"దెన్ యు ఆర్ టేకెన్ మిస్టర్ వెంకటేష్ !" కరచాలనం చేస్తూ చెప్పాడు నవీన్. ఇరువురిలోను ఉద్వేగం, ఆప్యాయత.
ఇన్ స్పెక్టర్ వీరేష్ లేని లోటును ఇన్ స్పెక్టర్ వెంకటేష్ తీర్చగలడనే నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు నవీన్.
అతను ఒక అభిప్రాయానికి వస్తే, దానికి ఇక తిరుగులేదు !
ఆ భావనే అతను తన దర్యాప్తులో మరింత ముందుకు దూసుకువెళ్ళేట్టు చేసింది. నవీన్ ది ఒకే మాట, ఒకే బాట, ఒకే గమ్యం....
* * * *
నిశి రేయి. పార్కులోని గడియారం పన్నెండు గంటలను చూపుతున్నది.
నిద్రలో వున్న డాక్టరు సునంద ఫోన్ మోతకు ఉలిక్కిపడిలేచింది.
ఫోన్ లోని విషయాలను వుంటున్న ఆమె ముఖం వివర్ణమయింది.
క్షణకాలం ఆలోజించింది. తనకు కావలసిన సరంజామాను తీసుకుని చకచకా కిందకు వెళ్ళింది. గారేజి నుంచి తన కారును బయటకు తీసింది.
ఆమె నేదో మొండి ధైర్యం ఆవరించింది.
కారు చీకటి. భయానక వాతావరణం. ఉరుములు, మెరుపులు. నలనల్లని మబ్బులు ముసురుకుంటున్నాయి.
సన్నటి వాన తుపర పడుతున్నా దానిని తేల్చివేస్తూ ఈదురుగాలి రివ్వు రివ్వున వీస్తున్నది.
టెలిఫోన్ స్థంభాలు ధ్వనిస్తున్నాయి. తీగలు ఈలలు వేస్తూ కదులుతున్నాయి.
డాక్టరు సునంద గంభీరంగా కూర్చుని డ్రైవ్ చేస్తున్నది. కారు టౌన్ షిప్ దాటింది. రాకెట్ లా దూసుకుపోతున్నది. ఆ వేగం ఆమె ఆవేశాన్ని సూచిస్తున్నది.
డాక్టరు సునంద డ్రైవ్ చేస్తూనే ఒక చేత తన వేనిటీ బ్యాగ్ జిప్ లాగి దానిలోని వస్తువును తృప్తిగా చూసింది. ఫేమ్ బుట్టను కూడా పరిశీలనగా చూసింది.