"అవును. పరుగు పందెంలో ఫస్టువచ్చాననే నాకీ ఉద్యోగం ఇచ్చారు. పక్కకి తప్పుకోవయ్యా బాబూ! అవతల ప్రమాదాలు జరిగిపోతున్నాయి" రిషి అరిచాడు.
ఇంతలో మేడమీద నుండి ఢాం అన్న పెద్ద ప్రేలుడు శబ్దం వినిపించింది.
"అయ్యో అనుకున్నంతా అయింది. నే చెప్పలేదూ" అంటూ రిషి వాచ్ మెన్ ని ఒక్క తోపుతోసి లోపలికి పరిగెత్తాడు. రిషికి హాల్లోకి వెళ్ళగానే మేడమెట్లు కంగారుగా దిగుతున్న లింగం "అయ్యో! అమ్మాయిగారు...." అన్నాడు.
"ఏవైంది? ఏం అఘాయిత్యం చేసుకుంది" రిషి గాభరాపడుతూ అడిగాడు.
లింగం బాధగా "అమ్మాయిగారికి ఎందుకో చాలా కోపం వచ్చిందండీ. ఇంకెవరి మాటా వినరు" అన్నాడు.
"ఏం చేస్తోందో చెప్పవయ్యా బాబూ" అరిచాడు రిషి.
"మీరే చూడండి" అని లింగం క్రిందకి వెళ్ళిపోయాడు.
రిషి గబగబా పైకి వెళ్ళి ఆశ్రిత గది తలుపు తోసాడు. ఆశ్రిత మంచంమీద కూర్చుని పెద్ద పెద్ద బెలూన్లు ఊది ఠప్ మని చప్పుడొచ్చేలా బద్దలు కొడుతోంది. ఆ దృశ్యం చూడగానే రిషికి చాలా నవ్వు వచ్చేసింది.
"ఏం చేస్తున్నావో అని భయపడ్డాను. ఇదా నువ్వు చేస్తున్న పని? పిచ్చిపిల్లా" అంటూ లోపలికి నడిచాడు.
ఆశ్రిత అతనివైపు వురిమి చూసి దిగ్గునలేచి క్రిందకి వెళ్ళింది.
రిషి కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు.
ఆశ్రిత సరాసరి వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ సిలెండర్ ఇవతలికి లాగింది.
రిషి అమాంతం అడ్డంపడి "ఒద్దు ఆశ్రితా. అలాంటి ప్రమాదాలు చెయ్యకు, జరిగిన సంగతేమిటో చెప్పనియ్యి" అన్నాడు.
ఆశ్రిత విసురుగా జడ వెనక్కి వేసుకుని సిలెండర్ వెనకాల పెట్టిన పెద్ద పెద్ద ఇత్తడి గుండిగలూ, తాంబాళాలూ ఇవతలికి లాగింది.
"ఇవి ఎందుకు ఆశ్రితా?" రిషి విస్మయం వ్యక్త పరిచాడు.
ఆశ్రిత మాట్లాడలేదు. అవన్నీ కష్టపడి పెరట్లోకి తీసుకెళ్ళింది. రిషి కూడా ఆమెకి సాయం చేసాడు.
ఆశ్రిత అక్కడ కూర్చుని ఉప్పూ, చింతపండూ తీసుకుని బాగా నల్లగావున్న గుండిగని కసా పీసా తోమడం మొదలుపెట్టింది.
"అసలేం జరిగిందో తెలుసా? నేను సుబ్బుల్ని" అతను మాట్లాడుతుంటే ఆశ్రిత వురిమి చూసింది.
రిషి తడబడి "పనిమనిషి రాలేదా? పాపం ఒక్కదానివే ఇవన్నీ ఎలా తోముతావు?" అని అడిగాడు.
ఆమె మాట్లాడలేదు. ఇంకా స్పీడుగా తోమసాగింది.
రిషి కూడా ఒక గుండిగ తీసుకుని తోముతూ "నీవు ఇందాక మాట్లాడింది నా పెళ్ళి గురించి నన్ను.... నువ్వు అపార్ధం చేసుకున్నావు" అని చెప్పబోయాడు.
ఆశ్రిత లేచి లోపలికి వెళ్ళిపోయింది.
రిషి ఆమె వచ్చాకా చెప్దాం అనుకుంటూ తోముతూ వుండిపోయాడు.
ఆ నల్లగా కిలంపట్టిన గుండిగలు తోముతుంటే అతనిలో ఏదో కసి చెలరేగింది. అతనికి తెలియకుండానే వాటిని మెరిసేటట్లు చెయ్యాలనే సంకల్పంతో మరింత జోరుగా తోమడం మొదలుపెట్టాడు. అవి మెరిసే కొద్దీ ఉత్సాహం పెల్లుబికింది. మంచి మూడ్ లో అతను గుండిగలు తోముతుండగా....
"అయ్యో బాబూ ఇదేమిటి?" అంటూ లింగం పరిగెత్తుకుంటూ వచ్చాడు.
రిషి ఆపకుండానే "నన్ను ఆపకు, చూడు వీటి పనిపడ్తాను. ముందు బక్కెట్లో నీళ్ళు తీసుకురా" అన్నాడు.
లింగం పెద్ద బకెట్టుతో నీళ్ళు తీసుకొచ్చాడు. వాటిని కడుగుతుంటే అవి తళతళా మెరుస్తుంటే రిషి ఆనందంగా "చూసావా నా తడాఖా. ఎలా మెరిపిస్తున్నానో" అన్నాడు.
"అదే పట్టుదల అన్ని విషయాల్లో చూపిస్తే బాగుపడతారు" అన్న ఆశ్రిత గొంతు వినిపించింది.
రిషి ఆశ్రితవైపు చూసి "నా పట్టుదల పరీక్షించడానికే ఈ గుండిగలు దాచిపెట్టావా?" అని అడిగాడు.
రిషి హుషారుగా "వెరీగుడ్! నాకు పకోడీలంటే తగని ఇష్టం" అని తరగడం మొదలు పెట్టాడు.
"తరుగుతూ ఉండండి. ఇప్పుడే వస్తా" అని ఆశ్రిత పక్కన బుట్ట పెట్టి వెళ్ళింది.
"ఓ.... అలాగే" అని పక్కకి చూసిన రిషి ఉలిక్కిపడ్డాడు. బుట్టలో దాదాపు మూడుకిలోల ఉల్లిపాయలున్నాయి.
నాలుగు తరిగేటప్పటికే రిషి కళ్ళమ్మట నీళ్ళు కారిపోయి, ఏమీ కనిపించడం మానేసింది అయినా తడుముకుంటూ పట్టుదలగా తరుగుతూనే ఉన్నాడు. కాసేపటికి కళ్ళు మూసుకుని తరుగుతూ కసుక్కున వేలు కోసేసుకుని కెవ్వున అరిచాడు. అప్పటికే అతని చొక్కా నిండా రక్తం కారడం చూడగానే "ఏమైంది?" అంటూ ఆశ్రిత పరుగున వచ్చింది. అతని వేలునుండి రక్తం కారటం చూడగానే "అయ్యో పాపిష్టిదాన్ని. కోపం కొద్దీ ఎంతపని చేసానూ?" అంటూ అమాంతం అతని వేలు నోట్లో పెట్టుకుంది