Previous Page Next Page 
నిషా పేజి 33

    "అయితే!"

    "గుడిదగ్గర అయిన రభస చాలదని ఇంటికి వెడతారా?"

    "ప్రతిసారీ అలాగే జరుగుతుందని ఎందుకు భయపడుతావు తుంగభద్రా? ఊరికే ఇంట్లోకి వెళ్ళినంత మాత్రాన అవమానించే మనుష్యులైతే వాళ్ళ వేదాధ్యయనం, వాళ్ళ బ్రాహ్మణ్యం వాళ్ళకు అదే నేర్పిందేమో అడుగుతాను"

    నిస్సహాయంగా వికీని అనుసరించింది తుంగభద్ర.

    లోపలికి అడుగు పెడితే బయటికి కనిపించేదానికంటే విశాలంగా కనిపిస్తుంది వేదప్రకాశం ఇల్లు. నాలుగువైపులా వరండాలున్న మధ్యరంగం, చేదబావి , తులసికోట, తులసికోటకు కొంచెం దూరంలో గుంజకు కట్టివేసిన తెల్లటిగోవు, ఆ ప్రక్కనే పాలు త్రాగి గంతులు వేస్తున్న దాని దూడ.

    నగిషీలు చెక్కబడిన పెద్ద పెద్ద దర్వాజాలు, గుమ్మాలకి పూసల ఆర్చీలూ, పూసలతో కుట్టిన చిలుకలు, మిద్దెకు చువ్వ నుండి వ్రేళాడుతున్న దోగాడు కృష్ణుడు........ పాతకాలంనాటివే అయినా చాలా ఖరీదైన దేవుడిపటాలు.

    ఒక్క నిముషంలో వికీ కళ్ళు వాటినంతటినీ చుట్టి అక్కడ తండ్రిపాటకు అనుగుణంగా నర్తిస్తూన్న భ్రమర మీద ఆగిపోయాయి.   

    ఒక అపరిచితుడు ఇంట్లోకి ప్రవేశించినా పాట మధ్యలో ఆపకూడదన్న నియమం వల్ల ఆపలేదు వేదప్రకాశం. పాట ఆపకుండానే అక్కడున్న కుర్చీలో కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు.

    పమిట చెరుగు నడుముకు చుట్టి, చీర కుచ్చిళ్ళు నడుం దగ్గర దోపుకొని నర్తిస్తూన్న భ్రమర పువ్వుమీద ఎగిరే భ్రమరంలా, తూనీగలా, ఆకాశంలో చల్లగాలికి తమాషాగా పల్టీలు కొట్టే పావురంలా కనిపించింది వికీకి.

    సంచీలో వున్న కెమెరా అతడి చేతిలోకి రావడం, భ్రమర వివిధ భంగిమల్లో వుండగా రెండు మూడుసార్లు ఫ్లాష్ వెలుగడం గమనించాడు వేదప్రకాశం. ఆయన కళ్ళు ఎర్రబడిపోయాయి.

    పాట, నర్తనం ముగిశాయి.

    "మీ కెమెరాలో రీలు తీసి ఇటివ్వండి" గంభీరంగా అన్నాడు వేదప్రకాశం.

    "ఇది ఆటోమేటిక్ కెమెరా! ఫోటోలు వచ్చేశాయి చూస్తారా?

    "ఫోటోలు ఇటివ్వండి. లోపల రీలేమన్నా ఉంటే కూడా ఇవ్వండి"

    వికీ తీసిచ్చాడు.

    వేదప్రకాశం అవి తీసికెళ్ళి సన్నగా పొగవస్తూన్న హోమగుండంలో వేసి మంట మండించి వచ్చాడు.

    "ఎందుకలా చేశారు?" వికీ ముఖం అప్పటికే పాలిపోయింది.

    "కెమెరా కూడా తీసి కాల్చనందుకు సంతోషించండి. వెళ్ళండి. ఇంకెప్పుడూ ఇక్కడికి రావడానికి ప్రయత్నించకండి. మీ నీడ సైతం మా ఇంటిమీద పడడానికి వీల్లేదు తెలుసా?" కటువుగా అన్నాడు వేదప్రకాశం.

    వికీ తొణక్కుండా,  "ఇప్పుడు ఏం తప్పు నావల్ల జరిగిందని మీ ఈ తీర్పు?" అనడిగాడు.

    "వాద వివాదాలు వద్దు వెళ్ళండి."

    తన కళ్ళముందే చినరాణిగారి కొడుక్కి ఇంత అవమానం జరుగుతూంటే సహించలేకపోయింది తుంగభద్ర. అతడి చెయ్యి పట్టి లాక్కుపోతూ, "నేను చెప్పానుకదా చినబాబుగారూ, ఇక్కడికి వద్దని. అనర్ధం జరుగుతుందన్నానా? జరుగనే జరిగింది." "వేదప్రకాశంగారంటే గొప్ప విద్వత్ సంపన్నులని, కళాకారులని విన్నానుగాని వారూ, వారి సంతానం వట్టి గుడ్డివారూ, చెవిటివారూ అని తెలిసింది" అని పరిహాసంగా నవ్వాడు వికీ.

    పైకి పరిహాసాన్ని వ్యక్తం చేసినా అవమానాగ్ని అతడిని దహిస్తూనేవుంది.

    ఎప్పుడో ఎన్నేళ్ళ క్రిందటో తనతండ్రి వల్ల జరిగిన అపకారానికి ఇప్పుడు ప్రతీకారం తనమీద తీర్చుకొంటున్న వీళ్ళనేమనాలో, ఏం చేయాలో పాలుపోలేదు వికీకి.

    తుంగభద్రతో కలసి బయటికి వచ్చాడు.

    ఆ ఇంటికి వెనుకవైపు వున్న తుంగభద్ర ఇంటికి వెళ్ళినా అతడి మనస్సంతా ఈ విషయం గురించే  ఆలోచించసాగింది, ఎలా......ఎలా వాళ్ళకు బుద్ది చెప్పడం? ఎలా వాళ్ళ కళ్ళు తెరిపించడం? వాళ్ళనుకొన్నట్టు తాను చెడ్డవాడు కాదని ఎలా నిరూపించుకోవడం? ఎలా......ఎలా?

    నులకమంచం వాల్చి, దానిమీద మెత్తటి పక్కపరచి, దానిమీద అతడిని కూర్చోబెట్టి, "వెళ్ళిన వాళ్ళు ఊరికే వుండక భ్రమరాంబిక ఫోటోలు, ఎందుకు తీశారు? అంది కోపంగా తుంగభద్ర.

    "ఫోటోలు తీయడం తప్పా?"

    "తప్పా? తప్పున్నరా? పరాయి ఆడపిల్లను ఫోటో తీయడం తప్పుకాదా? అదీ, ఆమె నాట్యం చేస్తున్నప్పుడు"

    "అందమైన అమ్మాయి అందమైన నాట్యభంగిమలో ఉండగా ఫోటో తీయడంలో తప్పేముందో నాకర్ధం కావడంలేదు."

    "దొరల మధ్య, దొరసానుల మధ్య పెరిగొచ్చిన మీకు తప్పేదో ఒప్పేదో ఏం తెలుస్తుంది. మీరసలు బంగళా వీడి బయటికి రాకండి. వస్తే ఏదో ఒక తంటా తెస్తూనే వుంటారు."

    "బాగుంది. నన్ను మరీ అంత మూర్ఖుడి క్రింద జమ కట్టావేమిటి?"

    "మూర్ఖంకాదు చినబాబుగారూ! నిప్పేదో, నీరేదో తెలియని అమాయకత్వం"

    "నేనేం అమాయకుడిని కాదు. నాకంతా తెలుసు."

    "తెలుసు కాబట్టే పరాయి ఆడపిల్లను ఫోటోలు తీశారేమో. అదీ వాళ్ల నాన్నగారు చూస్తుండగా!"
 
    "నేనా అమ్మాయికి కన్ను కొట్టినట్టో, చెయ్యి పట్టుకొన్నట్టో అడుగుతావేమిటి?"

    "అయ్యగారికి కన్నుకొట్టడం సంగతి తెలుసన్నమాట" చిలిపిగా నవ్వింది తుంగభద్ర.  "ఒక ఆడపిల్లను అవమానించడానికి కన్నే కొట్టాలా? కౌగలించుకోవాలా? పెళ్లయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయే పరాయి ఆడపిల్ల ఫోటోలు మీదగ్గరుండడం ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. ఇలా తన భార్య ఫోటోలు ఒక అబ్బాయి దగ్గరున్నాయని ఆమె పెనిమిటికి తెలిస్తే?"

 Previous Page Next Page