"అంటే కేన్సర్ వచ్చినవాళ్ళు బ్రతకవచ్చంటారా?" హేళనగా అడిగింది.
"కేన్సర్ లో చాలా రకాలుంటాయ్. తెలుగు సినీ ప్రేక్షకులారా! చాలా కేన్సర్ లు ప్రారంభదశలో కొనుక్కోగలితే ప్రాణానికి అపాయమే వుండదు. చిన్న ఆపరేషన్ తో వృద్దాప్యం వచ్చేవరకూ కేన్సర్ భయం లేకుండా బ్రతికిన వారు కోకొల్లలు! అంచేత అలాంటిసినిమా భయాలు మాని సినిమా జీవితంలో నుంచి రియల్ లైఫ్ లో కిరండి మిస్ జయసుధా!".
ఆమె అతనివేపు ఆశ్చర్యంగా చూస్తోంది.
"అంటే- నేనూ కేన్సర్ నుంచి తప్పించుకోగలనా?"
"సెంట్ పర్సెంట్! టోపేకాలోని మెనింగర్ ఫౌండేషన్ వాళ్ళు చేసిన పరిశోధనల్లో ఏమిబయటపడిందో తెలుసా? విల్ పవర్ వున్న పేషెంట్లు శరీరం ఉష్ణోగ్రతనూ, బ్లడ్ సర్క్యులేషనూ అద్భుతంగా కంట్రోల్ చేశారట! అలాగే అదే విల్ పవర్ తో కేన్సర్ కి ఇమ్యూనిటీ శరీరంలోనే డెవలప్ చేసుకోవచ్చు. విల్ పవర్ అనేది ఆయా వ్యక్తులమీద ఆధారపడి వుంటుంది. అందరికీ విల్ పవర్ వుండదు. వున్నాగానీ దాని వల్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతాయని తెలీదు-"
"అంటే విల్ పవర్ కేంద్రీకరిస్తే మన శరీరమే ఆ జబ్బుకితగిన మందు కనుక్కోగలుగుతుందా?"
"అనే అనేకమంది డాక్టర్లు చెప్తున్నారు. కొన్నికేసుల్లో ప్రైమరీ లెసియాన్స్ పూర్తిగా మాయమయిపోవటంజరిగిందట!"
అతని మాటలు జయసుధలో విపరీతమయిన సంచలనంకలిగించసాగినయ్. అతనిమాటలు నమ్మలేకపోతోంది-నమ్మకుండానూ వుండలేకపోతోంది.
"అంటే నేనేం చేయాలంటారు?" కుతూహలంగా అడిగింది.
"మిగతా అన్ని విషయాల్లాగానే వ్యాధి నిరోధక శక్తికూడా మనిషి మనసువల్లే తయారవుతుంది. కనుక మనసు ఆలోచనలను కంట్రోల్ చేయాలి. కేన్సర్ వల్ల ప్రాణభయం లేదని, కేవలం ఆ కాస్త శరీర భాగానికే పరిమితం చెందిందనీ, అది విస్తరించే ప్రసక్తేలేదనీ అనుకోవాలి! అసలు దాన్ని గురించి ఎలాంటి సందేహాలు మనసులో ప్రసక్తేలేదనీ అనుకోవాలి! అసలు దాన్ని గురించి ఎలాంటి సందేహాలుమనసులో మెదలకూడదు,థాట్స్ అన్నీ కూడా సెంట్ పర్సెంట్ పాజిటివ్ గా ఉండాలి!".
జయసుధకు అతనిమాటలు విపరీతమయిన ఆత్మ విశ్వాసం కలిగించసాగినయ్. నిజంగా అతను చెప్పినట్లు చేస్తే తను బ్రతుకుతుందేమో! కేన్సర్ మిగతా శరీర భాగలకు విస్తరించకుండా ఆగిపోతుందేమో!
ఒకవేళ నిజమయితే-అతను చెప్పినట్లేజరిగితే తను సాధారణ జీవితం గడపగలుగుతుందా? వివాహం చేసుకుని-మిగతా అందరిలా-
ఆమెకు సిగ్గు కలిగింది.
తను ఎలాగు చనిపోతున్నానన్న నమ్మకంతో భవానీశంకర్ తో కొంచెం అతిగా ప్రవర్తించింది. అతనేమనుకుంటున్నాడో-
అతని చేతులు ఆమె చెంపలను మూసివేసినయ్.
"జయా! యూ మస్ట్ ఫైట్! ఇది కేవలం నీ చేతుల్లో వున్నది. నువ్ బ్రతకాల్సిందినీ కోసమే కాదు! నా కోసం కూడా!"
జయసుధ కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినయ్.
"మీ కోసమా?"
"అవును! ఈ కొద్ది గంటల్లో నేను మనిద్దరిగురించి అందమైన కలలు కనేశాను. ఇప్పుడా కలలు చిన్నాభిన్నమయితేతట్టుకోలేను-అందుకే-ఇంతగా ప్రాధేయపడుతున్నాను".
జయసుధకు తెలుస్తూనే వుంది.
విల్ పవర్ విషయంలో తను ఓ రాక్షసి.
ఎన్నిసార్లు, ఎన్ని సంఘటనలు? సెవెన్త్ క్లాస్ చదివేప్పుడు డ్రాయింగ్ రాదంటూ పుస్తకం తన ముఖంమీద విసిరి కొట్టినప్పుడు తనెంత హర్టయింది? ఆ తరువాత పదిహేనురోజులు స్కూలుమానేసి కేవలం బొమ్మలుగీయటమే ధ్యేయంగా రాత్రింబగళ్ళు శ్రమపడింది. ఫలితం ఏమయింది? ఆ తరువాత డ్రాయింగ్ లో ఎప్పుడూ ఫస్ట్ మార్క్ తనదే!
తనకు చిన్నప్పటినుంచే సినిమాలంటే ప్రాణం. సినిమా చూడటంకోసం భోజనం మానేసిన రోజులు ఎన్నో! ఓసారి తల్లి తనకు సినిమా చూడ్డానికి డబ్బు ఇవ్వనని మందలించేసరికి తనకెంత కోపం వచ్చిందని! ఆ రోజునుంచీ సంవత్సరం పాటు ఒక్క సినిమా కూడా చూడకుండాగడిపింది. తల్లీ, తండ్రీ, ఫ్రెండ్స్ ఎవరుబ్రతిమాలినాసరే చూళ్ళేదు. చివరకు తల్లితనది పొరబాటనివప్పుకున్నాక అప్పుడు మళ్ళీ సినిమాలు చూడటం ప్రారంభించింది.
ఇలా ఎన్నో సంఘటనలు-
అన్నిచోట్లా తన విల్ పవర్ దే విజయం-
మరి ఈ కాన్సర్ విషయంలో కూడా తన విల్ పవర్ ఎందుకు గెలువలేదు. ఇమ్యూనిటీ ని ఎందుకు డెవలప్ చేయలేదు?
"కమాన్ మైడియర్ ఫ్రెండ్! ఈ క్షణం నుంచేపోరాటం మొదలయింది. ప్రాణాల్ని కాపాడుకునే పోరాటం! అ అపోరతంలో మొదటి భాగం- ఈ బండి యాక్సిడెంట్ నుంచి తప్పించుకోవడం! కమాన్" అతని చేయి అందుకుని అతనితోపాటు వెనుకవేపుకు నడవసాగిందామె.
అప్పుడే 8 డౌన్ కృష్ణా కెనాల్ స్టేషన్ వేపు పరుగెడుతోంది.
* * *
గురుమూర్తి అదిరిపడ్డాడు. తన బండి విజయవాడ స్టేషన్ దాటి మద్రాస్ డైరెక్షన్ లోకిపరుగెడుతోంది.
"బాస్! బ్రతికాం! విజయవాడ స్టేషన్లోనే ఏదొక కొలిజనో, డిరైల్ మెంటో అయిపోతుందనుకున్నాను. కానీ మన కోసం లైన్ ఖాళీగా వుంచారు. విజయవాడలో ఈ టైమ్ లో లైన్ ఖాళీగా వుండటమే ఆశ్చర్యం" అన్నాడు అసిస్టెంట్.
"మనల్ని మద్రాస్ లైన్లోకి వదిలారు. ప్రస్తుతానికి ఓ.కే. గానీ ఎన్ని బ్లాక్ సెక్షన్స్ ఖాళీగా ఉన్నాయో తెలీదు. అటువేపయినా మంచి రైజింగ్ గ్రేడియెంట్ వుంటే బండి ఆగుతుందా!" ఆశగా అన్నాడతను.
కృష్ణా బ్రిడ్జిమీదనుంచి నిమిషాల్లో దాటేసింది 8 డౌన్.
అప్పటికే ఆ వార్త న్యూస్ పేపర్స్ వాళ్ళకి తెలిసిపోయింది. న్యూస్ పేపర్స్ కి చెందిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు, కార్లలో తెనాలి రూట్లో బయలుదేరారు. ఏ ఊళ్ళో చూసినా జనం యాక్సిడెంట్ అవబోతున్న రైలునీ, అందులోని ప్రయాణీకులనూచూడాలన్న కుతూహలం, ఆతృత, జాలి - ఫ్లాట్ ఫార్మ్స్ మీద, లెవల్ క్రాసింగ్ గేట్ల దగ్గరగుంపులు గుంపులు గుంపులుగా-
* * *
మృదుల కంట్రోల్ ఆఫీస్ లోని గ్లాస్ ఛాంబర్ లో కూర్చుంది.
అంతకుముంచు డి.ఆర్.ఎమ్.రంగనాథన్ ఫోన్ లో అన్న మాటలే ఆమె చెవిలో మార్మోగుతున్నాయ్.
"మైడియర్ సీనియర్ డి.ఓ.ఎస్! 8 డౌన్ సంగతి తెలీగానే ఇమీడియెట్ గా ఏ.డి.ఆర్.ఎమ్. ని గానీ నన్నుగానీ కన్సల్ట్ చేయకుండా డెసిషన్స్ తీసుకున్నారు. దటీజ్ వెరీబాడ్. ఎనీవే- నేను ఇప్పుడింకేమీ అనను కానీ ఒక్క విషయం. మీరు తీసుకున్న డెసిషన్ కి మీరే బాధ్యులని మాత్రం గట్టిగా చెప్తున్నాను. మీ ప్లాన్ లో ఏదయినా అవాంఛనీయసంఘటన జరిగితే-అయ్ విల్ బి ది లాస్ట్ మాన్ టు స్పేర్ యూ!"
"ఓ.కే.సర్! నా నిర్ణయానికి, ప్లానింగ్ కి నేనే పూర్తి బాధ్యత వహిస్తాను, నేను చేసిన ప్లానింగ్ సక్రమంగానే ఉందనినాకు తెలుసు!".
"ఓ! యూ ఆర్ సోమచ్ కాన్ఫిడెంట్! దెన్ ఇటీజ్ ఓ కే! మిస్ మృదులా మగాళ్ళతో పాటు ఆడాళ్ళు కూడా చాలారంగాల్లో సమానంగా సక్సెస్ అవుతున్నారు. కాదనటం లేదు. కానీ రైల్వేస్ లో ఆపరేటింగ్ డిపార్టు మెంట్ వేరు. మహామహులే ఫెయిలయిపోయారు. డెఫినిట్ లీయూ విల్ బి ఇన్ ట్రబుల్! ఎనీ వే - ఎప్పటికప్పుడు డెవలప్ మెంట్స్ నాకు చెప్తూ వుండండి!".
"యస్సార్!"
మృదులకు ఒక్క క్షణం భయం వేసింది.
తను తీసుకున్న నిర్ణయం కరక్టేనా? ఒకవేళ ఆ ప్లాన్ లో ఏమాత్రం పొరబాటు జరిగినా తను రిజయిన్ చేయటంతప్ప గత్యంతరం లేదు. నిజంగానే తను తొందరపడింది. 8 డౌన్ విషయం తనకు తెలీగానే తను డి.ఆర్.ఎమ్. రంగనాథ్ ని కన్సల్ట్ చేసి వుంటే బాగుండేది. కానీ కన్సల్ట్ చేస్తే ఏమవుతుందో తనకు బాగా తెలుసు. ఆ సమయంలో అతనెలా మాట్లాడతాడో కూడా తను ఊహించుకుంది.
"సో! 8 డౌన్ బ్రేక్ ఫెయిలయి విజయవాడ స్టేషన్ లో కొస్తోందని ఇన్ ఫర్మేషన్ వచ్చింది. అందుకని గాభరాపడి ఫోన్ చేశారు. అవునా! యూ మస్ట్ నో మృదులా! మగాళ్ళు చేసే జాబ్స్ అన్నీ స్త్రీలు కూడా చేయగలరు అని పోటీ పడుతున్నప్పుడు ఆ విషయం ఋజువు చేయాల్సి వుంటుంది- థింక్ చేసి ప్లాన్ చేయండి! ఒకవేళ మీవల్లకాకపోతే అప్పుడు నాకుచెప్పండి" అంటాడతను.
అందుకే అతనిని కన్సల్ట్ చేయకుండానే డెసిషన్ తీసుకుంది. తన భవిష్యత్తంతా ఈ డెసిషన్ మీద ఆధారపడి వుంది.
మృదుల ఠక్కున తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
తను ఇంక ఆ విషయాలు ఆలోచించటం అనవసరం-
జరగబోయేది జాగ్రత్తగా మానిటర్ చేయాలి.
డిప్యూటీ కంట్రోలర్ ఆమె దగ్గరి కొచ్చాడు.
"పిలిచారా మేడమ్!"