Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 33


    ఇంటర్వెల్ అయింది.
    ఓ కుర్రాడు ట్రేలో రెండు కూల్ డ్రింకులు తీసుకొచ్చి అందించాడు ఇద్దరికీ.
    "మీరు చూస్తుండండి! నేను ఫోన్లో మాట్లాడి కొద్దిసేపట్లో వస్తాను..." అంటూ వెళ్ళిపోయాడు వర్ధనరావు. సినిమా చివరివరకు రావడం కుదరలేదతనికి. అతనొచ్చి అయిదు నిమిషాలు కూర్చునేసరికి సినిమా అయిపోయింది.
    "సినిమా ఎలా వుంది మీకు?" అడిగాడతను.
    "చాలా బావుంది"
    "వెరీగుడ్! మీదీ నా టేస్టేనన్నమాట" నవ్వుతూ అన్నాడు.
    సీత నవ్వింది.
    "సరే మీరు కార్లో ఇంటికెళ్ళిపోండి. నేను తరువాత వస్తాను."
    సీత కిందకు దిగి సిద్ధంగా ఉన్న కార్లో కూర్చుంది. పది నిమిషాల్లో ఆమె ఇంటిముందు ఆగింది కారు. కాలింగ్ బెల్ మోత విని నిద్రకళ్ళతో తలుపు తెరచాడు మాధవరావు.
    "ఆఫీసు నుంచి ఎన్నింటికొచ్చారు?" బట్టలు మార్చుకుంటూ అడిగింది సీత.
    "నువ్వు అటు వెళ్ళావు, నేను ఇటు వచ్చాను. అంతే! రాగానే! నువ్వు రాసిపెట్టిన చీటీ చదివాను. భోజనం చేసి పనిమనిషిని పంపేసి హాయిగా నిద్రపోయాను"
    సీత తను కూడా ఎంగిలిపడి గదిలో కొచ్చింది. సినిమాలో ఆ ప్రణయ దృశ్యాలే ఆమె కళ్ళముందు కదులుతున్నాయి. మనసు పూర్తిగా కోరికలతో నిండిపోయింది. మాధవరావు పక్కనే పడుకొని అతనిమీద చెయ్యి వేసింది. కాని అప్పటికే మాధవరావు నిద్రలో ఉన్నాడు.
    ఉక్రోషం ముంచుకొచ్చింది సీతకు. రోజూ తను రాసుకుంటూ కూర్చుంటుంది. అది ముగిసేసరికి అతను నిద్రపోతున్నాడు. చేసేదిలేక తనూ నిద్రపోతోంది. కోరికలు కూడా తనతోబాటు బలవంతంగా నిద్రపోతున్నాయి. ఏవిటిది? సంసారమంటే ఇదేనా?
    చాలాసేపు నిద్రపట్టక సతమతమయిందామె.

                              12

    సినిమాకు సగంవరకూ సంభాషణలు రాయడం పూర్తయిపోయింది. అదంతా ఓసారి చదువుకుంటే ఎంతో సంతృప్తి కలిగిందామెకు. అంతటి చక్కని సంభాషణలు రాయడానికి సగం కారణం వర్ధనరావే! ఆయన దగ్గరున్న పాత స్క్రిప్టులు ఎంతో సహాయం చేశాయి.
    సినిమాకు ప్రారంభోత్సవం జరిగింది. సినీ నటులతో పాటు తన ఫోటోలు కూడా చాలా సినిమా పత్రికల్లో వచ్చాయి. దాంతో ఆమెకు అభిమానులు మరింత పెరిగిపోయారు. రోజూ తనను చూడడానికి ఎవరో ఒకరు ఇంటికి రావడం జరుగుతోంది. పాప బాధ్యత పూర్తిగా మాధవరావు మీదా, పనిపిల్లమీదా వదిలేసిందామె. ఎప్పుడయినా ఖాళీ దొరికితే కాసేపు ఎత్తుకుని ముద్దులాడటం అంతే!
    "ఇవాళ నా బర్తుడే!" అన్నాడు వర్ధనరావు ఆరోజు సీత ఇంటికొస్తూనే.
    "హ్యాపీ బర్తుడే టూయూ!" అంటూ పాట పాడేయమన్నారా?" నవ్వుతూ అడిగిందామె.
    "నేను పుట్టినరోజు అంత అట్టహాసంగా జరపనులెండి! నాకు కావలసిన వాళ్ళతో ఈ రోజంతా సరదాగా గడిపేస్తాను. అదే నాకిష్టం."
    "ఈ పద్ధతి బావుంది ఒక్క పైసా ఖర్చుండదు..." అంది నవ్వేస్తూ.
    "అబ్బే! డబ్బు ఖర్చు చేయాల్సివస్తుందని జరపటం లేదనుకుంటున్నారా! అలాగయితే మీరు నన్నింకా సరిగా అర్థం చేసుకోలేదన్నమాట..." ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడతను.
    "ఊరికే అన్నాన్లెండి తమాషా కోసం! మీ విషయం నాకు తెలీదా?" త్వరగా అనేసింది సీత. అతను బాధపడతాడేమోనని ఖంగారుపడిందామె.
    "సరే_అలా అన్నందుకు మీ మీద తరువాత యుద్ధం చేస్తాను. ఇవాళ నా పుట్టినరోజవడం వల్లా_ఇవాళ నాక్కావలసినవారు మీరేగనుక_ఇవాళ సాయంత్రం మీరు నా అతిధి కాబట్టి ప్రస్తుతానికి మిమ్మల్ని తేలిగ్గా వదిలేస్తున్నాను"

 Previous Page Next Page