Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 33


    "ఇంతకూ ఇతగాడు మంచివాడేనా? అతన్ని గురించి అన్నీ తెలుసుకున్నావా? మళ్ళీ అడిగింది శాంత."
    "భలేదానివేనే నువ్వు! అసలు అందాకా అలోచించనేలేదు. అన్నీ చూశావా అంటే ఏం చెప్పను!" అంది నవ్వాపుకుంటూ.
    "అలాగయితే ఆలస్యం చేయకుండా త్వరగా తేల్చుకో అవన్నీ! పెళ్ళి చేసుకోకుండా ఊరికే వెంబడి తిరిగే రకమయితే_వెంటనే గుడ్ బై చెప్పేసెయ్."
    ఇద్దరూ లేచి ఆఫీస్ లోకి బయల్దేరారు.
    సావిత్రి తన సీట్లో కూర్చుంది.
    "హెడ్ క్లర్క్ గారు పిలుస్తున్నారు" ఫ్యూన్ వచ్చి నుంచున్నాడు.
    లేచి హెడ్ క్లర్క్ దగ్గరకు వెళ్ళిందామె.
    "ఆఫీసరుగారు అడిగారు ఏవో ఫైల్స్ కోసం! నువ్వు సీట్లో లేనప్పుడు..." నవ్వుతూ అన్నాడు కళ్ళజోడులో నుండి అదోలా చూస్తూ.
    సావిత్రి కర్ధమయింది. తను సీట్లో లేకపోవడం సాకుగా పెట్టుకున్నాడన్నమాట. ఇప్పుడు తను బ్రతిమాలాలని అతని ఉద్దేశ్యం. ఒకవేళ బ్రతిమాలితే సాయంత్రం సినిమాకో. మరెక్కడికో రమ్మనమని పిచ్చివాగుడు వాగుతాడు. అది తనకిష్టంలేదు. జరిగేదేదో జరుగుతుంది. అంతగ్గాకపోతే ఆ ఆఫీసర్ కి తనే వెళ్ళి జరిగిందంతా వివరించి క్షమాపణ చెప్పుకోవటం మంచిది.
    "అవును సీట్లో లేను! నాకు తెలిసినాయనతో క్యాంటీన్ కెళ్ళాను__" నెమ్మదిగానే అంది.
    "ఆఫీస్ టైమ్ లో క్యాంటీన్ కెళ్ళకూడదని తెలీదా?"
    "తెలుసు! ఇంతకూ ఇప్పుడేం కావాలో చెప్పండి విసుగ్గా అంది సావిత్రి.
    "అదే__ఈ అర్ధగంటా సీట్లో లేనందుకు ఎక్స్ ప్లనేషన్ రాసివ్వాలి..."
    "ఎందుకు? అలా రాసివ్వమని ఆఫీసరుగారడిగారా?"
    "అదంతా నీకు అనవసరం."
    "సరే ఇదేదో ఆఫీసర్ గారినే అడుగుతాను__" చరచరా ఆఫీసర్ గదిలోనికి నడిచిందామె.
    "యస్..." అన్నాడు ఆఫీసర్ ఆమెవంక చూసి.
    "ఏవో ఫైల్స్ అడిగారుట కదుసార్! ఆ సమయంలో నేను క్యాంటీన్ కెళ్ళాను. ఏమడిగారో కనుక్కుందామనీ..."
    "నేనేమీ అడగలేదే!" ఆశ్చర్యంగా అన్నాడాయన.
    "మరి హెడ్ క్లర్క్ గారు మీరు అడిగారనీ, నేను సీట్లో లేనందుకు ఎక్స్ ప్లనేషన్ రాసిమ్మనీ అంటున్నారు.
    "సరే__ నేను కనుక్కుంటానుగానీ నువ్వెళ్ళిక..."
    సావిత్రి బయటకు నడవబోయింది.
    "ఇదిగో చూడమ్మా!" మళ్ళీ పిలిచాడాయన.
    సావిత్రి వెనక్కు తిరిగి ఆయన టేబుల్ దగ్గరకు నడిచింది.
    "ఆఫీసు టైములో క్యాంటీన్ లో ఉండటం మంచిది కాదు. ఇకముందు అలా జరుగకుండా చూడు..."
    "అలాగేనండీ!"
    తన సీటు చేరుకుందామె. హెడ్ క్లర్క్ ఆమెతో మాట్లాడ్డానికి సాహసించలేకపోయాడు. మరికాసేపట్లో తన ఆఫీసర్ దగ్గర్నుంచి పిలుపురానే వచ్చింది. తిరిగి వచ్చాడు. అతని మొఖం మాడిపోయి వుండటం గమనించి తనలో తనే నవ్వుకొంది సావిత్రి.
    సాయంకాలం శాంతతో కలసి ఇల్లు చేరుకునేసరికి అక్కడ శంకర్ బాలకృష్ణతో మాట్లాడుతూ కనిపించాడు.
    "అడుగో నీ హీరో! నీకోసం ఇక్కడే బీటు వేశాడు" అంది శాంత నవ్వుతూ. సావిత్రికి కూడా నవ్వాగలేదు.
    "అది సరేగాని ఆ మధ్యన ఓ తమాషా జరిగింది... బాలకృష్ణగారు బాగా తాగి తోటలో పడిపోయారట. ఆవిడ పాపం కంగారుపడి శంకర్ ని పిలుచుకొచ్చింది. ఇద్దరూ కలసి లోపలకు చేర్చారట... ముసలాడు అలాంటి తాగుడు పక్షి అంటే నమ్మబుద్ధి కావటం లేదు కదూ?"
    "నీకు చెప్పనేలేదు_మా బంధువులమ్మాయి ఒకామె కలిసింది మా ఊళ్ళో. ఆవిడ ఓ చిన్న రచయిత్రిలే. ఈ మహానుభావుడు పనిచేసేప్పుడు ఓసారి కథలపోటీ నిర్వహించారుట. దానికి ఆవిడ ఓ కథ పంపిందట. ఓ రోజు ఈయన సాక్షాత్తూ వాళ్ళింటికి వెళ్ళి "ఫలానా కథ రాసింది నువ్వేనా అమ్మాయి?" అని అడిగాడట. ఆవిడ ఆశ్చర్యంగా "మీరెవరు?" అనడిగిందట.
    నేను  ఆ పత్రికలో ఒక ఎడిటర్ ని. నీ కథకి మొదట బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఆ మొత్తం నీకిస్తున్నందుకు నువ్వు నాకో చిన్న సహాయం చేయాలి. అని చెప్పి, ఆ బహుమతి మొత్తంలో సగంకిమ్మన్నాడట. అలా ఒప్పుకుంటేనే బహుమతి ఇస్తాననీ పోతే మరెవరికయినా పోతుందనీ అన్నాట్ట. ఆ మాట వింటూనే ఆవిడకు కోపం వచ్చిందట గానీ ఆ బహుమానం కన్నా తనకు మంచి పేరొస్తుందని ఆశపడి వప్పుకొందిట. ఇలాంటి రచయిత్రుల్నీ రచయితల్నీ అన్నమాట ఈయన తయారు చేస్తోంది."
    "చాలా దుర్మార్గుడే__" ఆశ్చర్యంగా అంది సావిత్రి.
    "ఇలాంటి రకాలు అన్ని రంగాల్లో ఉండబట్టే మనదేశం గతి యిలా వుంది."
    ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే చీకటి పడిపోయింది. సావిత్రి చూపంతా బయటికే ఉంది. శంకర్ ఒకవేళ తనకోసం వస్తాడేమోనన్న ఆశ మనసులో కదులుతూనే వుంది. అయితే అతను బాలకృష్ణతో మాట్లాడి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు తను ఇంటివైపు చూడడం మాత్రం గమనించింది సావిత్రి. శాంత ఉందన్న కారణంగానే అతను రాలేదని తనకు తెలుసు. కాని అతను ఆఫీసుకు రాకపోవడమే మంచిది. లేకపోతే తను మళ్ళీ అ హెడ్ క్లర్క్ తో ఇబ్బంది పడాల్సొస్తుంది. మరి అతనిని రావద్దని మాత్రం ఎలా చెప్పగలదు తను...అయినా ఇంకెన్ని రోజులు? శాంత ఎలాగూ వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఇంటిదగ్గరే కలుసుకోవచ్చు.

 Previous Page Next Page