Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 34


    ఆయన సోఫాలో కూచుని ఎదురుగా వినయంగా కూచున్న విజయ్ కుమార్ చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు.
    "సరే అబ్బాయ్. అర్థమయింది. మీ చెల్లెలు మా అబ్బాయిని ప్రేమించిందంటావు. అంతేగా" అన్నాడు చివరకు తేల్చి పారేస్తున్నట్లుగా.
    విజయ్ కొంచెం యిబ్బందిగా "వాళ్ళిద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకున్నారండీ" అన్నాడు.
    "అదేలే. ఏదో ఒకటి. రెంటికీ పెద్ద తేడా లేదు."
    విజయ్ కుమార్ ఏం జవాబు చెప్పాలో తెలీక చిన్నబుచ్చుకున్న ముఖంతో మౌనంగా కూర్చున్నాడు.
    "సరే అబ్బాయ్, ఆ ప్రేమా గీమా అలా వుంచు. నా చిన్నతనంలో నా డబ్బుని చూసి చాలామంది ప్రేమించారు. ఆ సంగతి వదిలెయ్. ఇంతకీ నువ్వు చెప్పదలుచుకుందేమిటి? మా అబ్బాయికి మీ చెల్లెల్నిచ్చి పెళ్ళి చెయ్యమని...అదేగా"
    "అవునండి"
    "భేష్ బావుంది. బావుంది. ఇంతకీ కట్నమెంత యిస్తావు?"
    "...వాళ్ళిద్దరూ...వాళ్ళిద్దరూ...ప్రేమించుకున్నారండి."
    "ప్రేమ సరేలేవయ్యా, గాడిదగుడ్డు ప్రేమ...సరే...అది వాళ్ళిద్దరికీ సంబంధించినది. నువ్వూ నేనూ ప్రేమించుకోలేదుగా" అంటూ హహహహ అని నవ్వాడు.
    విజయ్ యిబ్బందిగా కూర్చున్నాడు.
    "డబ్బు...హహ్హహ్హహ...డబ్బు నే మాట్లాడింది డబ్బు గురించి"
    విజయ్ ఏం మాట్లాడాలో తెలీక మెదలకుండా వుండిపోయాడు.
    "ప్రేమించుకుంటే కట్నం తీసుకోకూడదని ఎక్కడుంది? ఆ మాటకొస్తే ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ కట్నమివ్వాలి."
    "ఎక్స్ క్యూజ్ మి సార్. కట్నాలిచ్చే శక్తి నాకు లేదు."
    "లేదా? హహ్హహ్హహ్హ. అయితే ఎందుకొచ్చావు నా దగ్గరకు? అప్పనంగా మా వాడ్ని ఎగరేసుకుపోదామనా?"
    "వాళ్ళిద్దరూ..."
    "ఈ ప్రేమలూ గీమలూ నేను కేర్ చెయ్యనని చెప్పాను. నేను డబ్బున్న వాడ్ని. నేను డబ్బును ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. గౌరవిస్తాను. ఏం చూసుకుని నీ సంబంధం ఒప్పుకోమంటావయ్యా? డబ్బా? లేదు. స్టేటసా? లేదు. ఉద్యోగమా? నీకదీ పోయిందని నువ్వే చెబుతున్నావు. ఇహ...మీ చెల్లెలు గుణవంతురాలా? అదే. కేరెక్టర్ అదీ లేదు."
    "బలరామయ్యగారూ"
    "ఎందుకయ్యా అలా అరుస్తావు? ఇదిగో యివన్నీ చూడు ఆ ఉత్తరాల కట్ట అతని మీదకు విసిరేశాడు.
    విజయ్ వొణికే చేతుల్తో వాటిలో ఒకటి రెండు చూశాడు. పచ్చి బూతులు, మాధురి ఎవరెవరితో ఎలా తిరిగిందో, శృంగార క్రీడలు, రసయాత్రలు జరిపిందో, ఎన్నిసార్లు కడుపులు తీయించుకుందో, శ్రేయోభిలాషిగా హెచ్చరిస్తూ రాసిన ఉత్తరాలు.
    అతని ముఖం మాడిపోయింది.
    "సో. ఇలాంటి చెత్త సంబంధం చేసుకోమంటావు. మా అబ్బాయి జీవితం సర్వనాశనం చెయ్యమంటావు."
    విజయ్ నిస్సహాయంగా, నిర్జీవంగా అక్కడ్నుంచి లేచాడు.


                             *    *    *    *


    విజయ్ వెళ్ళిపోయాక దీక్షిత్ లోపలికొచ్చాడు.
    "నాన్నా! మా ప్రేమ గురించి యెంతో విడమర్చి చెప్పాను. అయినా నువ్వు__
    "నోరు ముయ్యరా చవటా" అన్నాడు బలరామయ్య. డబ్బు విలువ నీకేం తెలుస్తుందిరా కుర్ర సన్నాసివి. డబ్బు లేనిదే ప్రపంచమే లేదురా. ఈ మనుషులు, స్వామీజీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయవేత్తలు, ఆఖరికి దేముళ్ళు...వాళ్ళంతా డబ్బున్న వాళ్ళకే అందుబాటులో వుంటార్రా. వొరేయ్ నువ్వు ప్రేమించినందుకు అభ్యంతరం లేదు.
    కాని ఇలాంటి అమ్మాయినా? పది లక్షల కట్నం తేగల పిల్లను, మన కులానికే చెందినదాన్ని అన్ని క్వాలిఫికేషన్సూ సరిగ్గా వున్నాయో లేవో చూసుకుని ప్రేమించాలిరా. ఆ ముకుందరావు కొడుకు చూడు తనతోబాటు ఎమ్.బి.బి.యస్. చదివే అమ్మాయిని ఎంచుకొని ప్రేమించాడు. కట్నానికి కట్నమూ దండుకున్నాడు. ఎం.పి. సీటుకోసం మూడున్నర లక్షలు పెట్టి డొనేషనూ కట్టించుకున్నాడు. ఆదిరా ప్రేమంటే. ఆహా! ఆదిరా జీవితమంటే. పోరా అలాంటి పిల్ల వుంటే చూసి ప్రేమించు. తక్షణం ప్రేమించి తీసుకురా. తక్షణం పెళ్ళిచేసి పారేస్తాను. హహహహ జీవిత సత్యం తెలుసుకోరా. పోరా పో.


                             *    *    *    *


    మాధురి తలుపులు గడియ వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంతకీ తియ్యటం లేదు.
    బయట విజయ్, సుజాత, వినోద్, సుశీలమ్మగారూ, ప్రసాదరావు అంతా చేరారు.
    "మాధురీ తలుపు తెరువమ్మా"
    "నిన్ను గురించి మేమెవరూ చెడుగా అపార్థం చేసుకోలేదమ్మా"
    "మాధురీ!"
    "మాధురీ! మాధురీ!"
    తలుపులు కొడుతున్నారు.
    గట్టిగా బాదుతున్నారు.
    తెరవబడటం లేదు.
    "ఏమండి!" సుజాత గొంతు వణుకుతోంది. "తొందరపడండి. ఏదన్నా అఘాయిత్యం"
    విజయ్ కు కాళ్ళలో బలం నశిస్తోంది.
    "మాధురీ! మాధురీ"
    వినోద్ ఇల్లంతా గబగబ వెతికి పలుగులాంటి వస్తువొకటి తీసుకొచ్చాడు. దాంతో బద్దలుకొట్టడానికి ఉపక్రమించాడు.
    లోపల...
    మాధురి అయోమయ స్థితిలో వుంది. జీవితం మీద యిచ్ఛ నశించింది.

 Previous Page Next Page