Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 33


    "ఏమీలేదు"
    "మాధురీ! నీ జీవితంలోకి దురాక్రమణ చేశానని తెలుసు. ప్రేమలో సుఖం కన్నా వేదనే ఎక్కువుంటుందని తెలుసు. సమస్యలు చీల్చి చెండాడుతాయని తెలుసు. కాని...నీ ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతున్నాను."
    "దీక్షిత్!"
    ప్రశ్నార్థకంగా చూశాడు.
    "ఒకమాట చెప్పు"
    "ఏమిటి మాధురీ"
    "మన స్నేహం, నేను మీ యింట్లో కాలు పెట్టడం ఎలాంటి అగౌరవ పరిస్థితులకీ దారితియ్యనియ్య కూడదు."
    "అలాంటి అవకాశమివ్వను"
    "దీక్షిత్ ఇహ వెళదాము"
    ఇద్దరూ లేచారు.
    బయటికొచ్చి పది అడుగులు వేశాక మాధురి ఉలిక్కిపడింది.
    దీక్షిత్ గమనించాడు.
    "ఏమిటి మాధురీ?"
    "ఎవరి కంట పడకూడదో వాళ్ళ కంటనే పడ్డాం"
    "ఎవరా వ్యక్తి?"
    మా ప్రక్కింటి రాధాప్రియ. మహా భయంకరమైన మనిషి."
    ఆమె గుండె గబగబ కొట్టుకుంటోంది. రాధాప్రియ రోడ్డుమీద నడుస్తూ తమ ఇద్దర్నీ చూడటం, ఆమె కళ్ళలో తొణికిసలాడిన కసి. నిర్దాక్షిణ్యంగా వెంటాడుతున్నాయి.


                            *    *    *    *


    సుజాత లోపలి గదిలోంచి ఇవతలికొస్తోంది. గేటు అవతల పదేళ్ళ కుర్రాడు తచ్చాడుతూ కనిపించాడు.
    "ఎవరబ్బాయి నువ్వు?" అనడిగింది.
    "సుజాతగారు మీరేనా?"
    "నేనే. ఏం కావాలి?" అంటూ దగ్గరకొచ్చింది.
    "ఈ ఉత్తరం" అంటూ చేతిలోని ఓ కవరు గేటవతల్నుంచే ఆమె కందించాడు.
    "ఎవరు నువ్వు? ఈ ఉత్తరమేంటి?"
    ఆమె ప్రశ్న పూర్తి కాకుండానే "హిహిహి" అని నవ్వి రివ్వున పరిగెడుతూ పారిపోయాడు.
    రెండు మూడు సెకండ్లు ఆశ్చర్యపడుతూ నిలబడింది. మనసులో ఏదో అనుమానం.
    తర్వాత కవరు విప్పి అందులో ఉన్న కాగితం బయటికి తీసింది.
    కొంకిరి బంకిరిగా ఉన్న అక్షరాలతో, దారుణమైన భాషలో...
    "నీ మరదలు మాధురి దీక్షిత్ అనే కుర్రాడితో సినిమాలు, షికారులే కాదు...ఇంకా చాలా వెలిగిస్తోంది... అన్నీ పూర్తయినాయి... ఇద్దరికీ అదే పని... ఈపాటికి కడుపు కూడా వచ్చి ఉంటుంది... వాడు తిరుగుబోతు ముండా కొడుకు...వాడుకుని వదిలేసే రకం..."
    ఇంకా నీచమైన, జుగుప్సాకరమైన భాషలో వాళ్ళిద్దరి ప్రేమకలాపాలు వర్ణించబడ్డాయి. కొంత కొంత దస్తూరి అర్థంకావటం లేదు.
    దిగ్భ్రాంతితో నిలబడిపోయింది.
    ఆ ఉత్తరం, బాధ __ శరీరంలో ఏదో వికారం పుట్టుకు వస్తోంది.
    వెనక నుంచి మాధురి వచ్చింది. "వదినా! ఏమిటలా నిలబడిపోయావు?"
    "ఊ"
    "ఏమయింది వదినా"
    సుజాత నిశ్శబ్దంగా ఉత్తరం అందించింది.
    మాధురి చదివింది. ఉత్తరం మొదలుపెట్టగానే ఆమె చేతులు వొణకటం మొదలుపెట్టాయి. ఫెయింటయి పడిపోతానేమోననిపించింది. అయినా నిగ్రహించుకుని చివరిదాకా చదివింది.
    నిలబడలేక సోఫాలో కూలబడిపోయింది. వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    సుజాత కాసేపామెను ఏడవనిచ్చింది.
    అలా ఏడ్చి ఏడ్చి తర్వాత మాధురి తలవంచుకుని వుండిపోయింది.
    సుజాత "నిజమేనా?" అని అడగలేదు.
    "చూడు మాధురీ. ఎవరో ఆకతాయి వెధవలు రాసిన ఆకాశరామన్న ఉత్తరాన్ని నమ్మేటంత మూర్ఖురాల్ని కాదు. కాని ఈ ఉత్తరం నీకెందుకు చూపించానంటే _ మనచుట్టూ ఎలాంటి విష ప్రపంచముందో చూద్దామని"
    మాధురి ఏడుపు నాపలేదు.
    "మాధురీ! నువ్విలా బాధపడతావంటే..."
    "వదినా! అంది మధురి. ఆమె నిజం చెప్పెయ్యటానికే నిర్ణయించుకుంది."
    సుజాత ఆమె ముఖంలోకి కొంచెం చకితురాలయి చూసింది.
    "ఆ ఉత్తరంలో వున్నదంతా నిజంకాదు, దారుణమైన అబద్ధాలు. కాని అందులో ఒకే ఒక్క నిజముంది__ నేను దీక్షిత్ ని ప్రేమించటం"
    సుజాత కళ్ళలో విస్మయం.
    మాధురి దీక్షిత్ గురించి, అతనికీ తనకూ మధ్యవున్న ఎఫైర్ గురించి ఏడ్పుల మధ్య చెప్పేసింది.
    సుజాత మాధురి తలమీద చెయ్యివేసి నిమిరింది. "ప్రేమించటం తప్పుకాదు మాధురీ. కాని ప్రేమ చాలా గొప్పది. కాని ప్రేమించబడ్డ వాళ్ళంతా అందుకు అర్హులు కాదు."
    మాధురి మళ్ళీ ఏడుస్తోంది.


                                   14


    బలరామయ్యగారికి ప్రపంచంలో అన్నిటికన్నా ప్రీతికరమైనది డబ్బు.
    డబ్బంటే అందరికీ ప్రేమే. కాని కొందరు దాన్ని ప్రేమించటం మరీ విపరీతంగా వుంటుంది.
    ఆయనకి డబ్బు సంపాదించటంలోని మెలకువలన్నీ తెలుసు. దాన్ని ఎలా దాచుకోవాలో తెలుసు. ఎలా పెంచుకోవాలో తెలుసు. అది బయటకు జారిపోకుండా ఎలా బిగపెట్టుకోవాలో తెలుసు. డబ్బు విషయంలో ఎలా కఠినంగా వుండాలో, నిర్ధాక్షిణ్యంగా వుండాలో తెలుసు. అవన్నీ నేర్చుకుంటే వచ్చినవి కాదు, స్వతహాగా వొంట్లో జీర్ణించుకుపోయాయి.

 Previous Page Next Page