మనసు ఏమాత్రం పనిచెయ్యటం లేదు. అసలేమీ తెలియటం లేదు.
చచ్చిపోవాలి ఉరేసుకుని.
కళ్ళముందు ఏవేవో దృశ్యాలు. చేతులు యాంత్రికంగా పనిచేస్తున్నాయి.
చీరె మెలికలు త్రిప్పి, తాడులా తయారు చేసి...
"వదినా...నేను..."
"ప్రేమ...యింత భయంకరంగా వుంటుందనుకోలేదొదినా"
"జీవితం యిలా విషపు కోరలతో కాటేస్తుందని అనుకోలేదు వదినా"
"అందుకే..."
"అందుకే నేను..."
"వెళ్ళిపోవాలనుకున్నాను"
సుజాత ఏడుస్తూ మాధురిని కావలించుకుంది.
"నువ్వు చెప్పావు వదినా. ప్రేమ చాలా గొప్పది కావచ్చు కాని, ప్రేమించబడేవాళ్ళు అల్పజీవులని. ఆ సత్యం బాగా తెలిసొచ్చింది వదినా.
"మాధురీ! జీవితమంతా, జీవిత సౌభాగ్యమంతా కేవలం ఒక్క సంఘటన మీద, లేక కొన్ని సంఘటనల మీద ఆధారపడి లేదు. ఆఫ్ట్రాల్ మీది చాలా చిన్న...మనం మలుచుకోవటానికి వీలైన అంశం. దీన్ని గురించి మనల్ని మనం పోగొట్టుకోకూడదు. చెరిపితే చెరిగిపోయే మచ్చల్ని నిర్దాక్షిణ్యంగా చెరిపెయ్యాలి. భద్రంగా జాగ్రత్త పరచుకోకూడదు. అమాయకంగా యెంత తెలివితక్కువ పని చెయ్యబోయావు! తృటిలో ఎంత ప్రమాదం తప్పింది!"
ఇంత మంచివాళ్ళ మధ్య వుండటమెంత అదృష్టం.
ఈ దుర్మార్గపు, వెకిలి ప్రపంచం మరింత అసహ్యంగా కనిపిస్తోంది.
* * * *
విమలాదేవి, రాధాప్రియ కలుసుకున్నారు.
ఇద్దరూ చాలా ఉత్సాహంగా వున్నారు.
తాను అంతకుముందు రెండు మూడు గంటల క్రితమే సహస్ర నామం చేయించటానికి గుడికెళ్ళినప్పుడు తన మొగుడితో రాధాప్రియ జరిపిన రొమాన్స్ విమలాదేవి ఊహల్లోకి కూడా రాదు.
"ఇవేళ చాలా వార్తలు, విశేషాలూ వున్నాయి."
"ఏమిటేమిటి?"
"ఆ విజయ్ గాడికి ఉద్యోగం వూడింది. అదెప్పుడో జరిగిందనుకోండి. ఇప్పుడు బయట పడింది.
"వాడు వేసిన వెధవ్వేషాలకు గొప్ప శాస్తి జరిగింది. లేకపోతే మనలాంటి మంచివాళ్ళ మీదకు పెళ్ళాన్ని ఉసిగొల్పుతాడా?"
"యిహ వాడి తిప్పలు, పడేపాట్లు చూసి తీరాలి. హహహహ"
"ఆ మాధురి లేదూ? దీక్షిత్ గాడితో సినిమాలకూ, షికార్లకూ తిరిగి రోమాన్స్ చేసిందా? కోటీశ్వరుడి కోడలవుదామని రకరకాల ప్లాన్లు వేసి కలలుకందా? అన్నీ సర్వనాశనమైపోయాయి. ఆ బలరామయ్య మా స్టేటస్ కు మీరు తగరని రిఫ్యూజ్ చేయటమే గాకుండా మెడబెట్టి బయటకు గెంటేశాడు.
"మహ బాగా జరిగింది. లేకపోతే వాళ్ళ అంతస్తేమిటి? వీళ్ళ అంతస్తేమిటి? వెధవ్వేషాలు కాకపోతేనూ"
"ఆ మాధురి ఆ షాక్ కి తట్టుకోలేక ఫ్యానుకి ఉరేసుకుని సూసైడ్ చేసుకోవాలని ట్రైచేసింది."
"చచ్చిందా! ఎక్కడా యింట్లోంచి ఏడుపులు వినిపించటం లేదే."
"చావలేదు. అదంతా ఓ స్టంట్. యాక్షన్. ఇంట్లో వాళ్ళ సింపతీ గెయిన్ చెయ్యడానికి."
"అవునండోయ్. మీరు సైకాలజీ బాగా కనిపెట్టారు.
"ఆ విజయగాడు అభిమానం అభిమానం అంటూ విర్రవీగాడా? ఇప్పుడు ఊరి నిండా అప్పులు పెరిగిపోయేసరికి జోలె పుచ్చుకుని రామేశం దగ్గరకు బయల్దేరాడు."
"వాడి పొగరణిగిందన్న మాట. అవునూ ఆ వినోద్ గాడు గెడ్డం పెంచుతున్నాడు దేనికి?"
"మొదట్లో ఫ్యాషన్. ఇప్పుడు విషాద భంగిమ. ఛ ఛ వాడి మొహం చూస్తేనే అసహ్యం నాకు" అంటూ రాధాప్రియ ఏవగించుకుంది.
విమలాదేవి లోపలికి వెళ్ళి రెండు కప్పుల్లో టీ, ట్రే నిండా వేడి వేడి పచ్చిమిరపకాయ బజ్జీలూ తీసుకొచ్చింది.
"ఓహో. మసాలా టీ పచ్చిమిరపకాయ బజ్జీలు వారేవా" అంటూ రాధాప్రియ భుజాలెగరేసింది.
15
గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశిస్తోన్న విజయ్ నూ, వినోద్ నూ చూసి వరండాలో ఈజీ చైర్ లో కూర్చుని వున్న రామేశం భ్రుకుటి ముడిపడింది.
"వెధవ న్యూసెన్స్. కష్టాలలో వున్నారుగా. మీదపడటానికొచ్చారు. ప్రపంచములో మనదార్న మనని బతకనివ్వరు" అంటూ లోలోపల విసుక్కున్నాడు.
పైకి మాత్రం నవ్వుతూ "అరె! చెప్పాపెట్టకుండా వచ్చేశారే. ఇదిగో అమ్మాజీ ఎవరొచ్చారో చూడు. మాట్లాడవేమిటి? బయటికెళ్ళింది కాబోలు"
"ఆఁ రండి రండి" అన్నాడు.
అన్నదమ్ములిద్దరూ మెట్లెక్కి వరండాలో ఆయనకు దగ్గరగా వున్న కుర్చీలో కూర్చున్నారు.
"ఆ! ఏమిటి సంగతులు. అంతా బావున్నారా?"
విజయ్ కు మొదట్నుంచీ ఇలాంటి కుశల ప్రశ్నలూ, లౌకిక సంభాషణా యిష్టం లేదు.
"నీతో కొంచెం పని వుండి వచ్చాను మామయ్యా" అన్నాడు.
"ఏమిటీ! వినోద్ కి ఉద్యోగం రికమండేషనా? చెప్పు. ఇక్కడ ఆర్.డి.ఓ., సబ్ కలెక్టరూ, ఎమ్.ఎల్.ఏ... అంతా మనకి తెలిసిన వాళ్ళే.
"అదేం కాదు మామయ్యా. కొంత డబ్బు కావాలి."
"డబ్బా?"
"అవును మామయ్యా" అంటూ విజయ్ తన పరిస్థితి గురించి క్లుప్తంగా చెప్పాడు.
"పాతికవేలు సర్దుబాటు చేస్తే మూడు నాలుగు నెలల్లో గవర్నమెంటు నుంచి నాకు రావాల్సిన ఎమౌంట్ వచ్చేస్తుంది. ఇంట్రస్ట్ కూడా కలిపి ఇచ్చేస్తాను."


