తులసి అంతా వింటూ కూచుంది. ఏం మాట్లాడలేదు. జబ్బుతో ఉన్న తన తల్లి దగ్గరకు చంద్ర వెళ్ళింది. తన తల్లి ఏదో నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నట్లు చంద్ర దగ్గర ఏడ్చింది. చంద్ర బెడ్, జాం తన తల్లికి తినిపించింది. ఛీ! ఛీ! ఏం మనుష్యులు? ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర అలా ఏడుస్తారా? ఎవరేది అందిస్తే అది అందుకుంటారా? ఇన్ని రోజులుగా, చీరలు కొనుక్కోకుండా, కనీసం ఆఫీస్ లో టిఫిన్ అయినా తినకుండా, డాక్టర్ కొనమన్న మందులన్నీ కొని, డబ్బు ఉన్నా లేకపోయినా టానిక్ లు కూడా కొని ఇచ్చినందుకు ఇదా ప్రతిఫలం? ఆ రోగం ఒక రోజుతో తగ్గేదా? అలాంటి ఏడుపులో ఒక రోజుతో తీరేవా? ఇదంతా ఎవరికర్థమవుతుంది? ఇన్నాళ్ళకు అలిసిపోయి, విసిగిపోయి, రెండే రెండు గంటలు అన్నీ మరిచి నిద్రపోయింది. ఆ అపరాధానికి తల్లి తనను చంద్రముందు బయటపడేసింది. తల్లిమీద జాలి కలగటానికి మారుగా ఒక విధమయిన కోపమే కలిగింది తులసికి.
"ఇలా హోటల్ గదిలో ఉంటే బోలెడు ఖర్చవుతుంది తులసీ! ఏదైనా చిన్నవాటా అద్దెకు తీసుకుని ఉంటే మంచిదికదూ! వంటచేసి మీ అమ్మగారికి కేరియర్ కూడా తీసుకెళ్ళవచ్చును" అన్నాడు సూర్యం.
"కావాలంటే, ప్రస్తుతం నేను ఉంటున్న వాటాలో ఒక గది ఇస్తాను. కొంతకాలం ఎలాగో సర్దుకోగలను" అంది చంద్ర.
తులసి పొగరుగా, "థాంక్స్! నాకేమీ అక్కర్లేదు. ప్రస్తుతం ఈ ఖర్చంతా కృష్ణారావు భరిస్తున్నాడు. నిజమే! అందుకు చంద్రగారికి బాధగా ఉన్నా, నేనేం చెయ్యలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను. నాకు వీలయినంత త్వరలో నీ బాకీ అంతా తీర్చేస్తాను" అంది.
చంద్ర రోషంతో మండిపడుతూ ఏదో అనబోయేటంతలో సూర్యం చంద్ర చెయ్యి గట్టిగా పట్టుకుని "చంద్రా!" అన్నాడు మందలింపుగా.
చంద్ర తగ్గిపోయింది. క్షణ క్షణానికీ తులసి మనసు కొలిమిలా రగిలిపోతోంది. ఆ సమయానికి కృష్ణారావు వచ్చాడు. సూర్యంనూ, చంద్రనూ చూసి ఎంతో సంతోషంతో, "మీరిద్దరూ ఇక్కడికెలా వచ్చారు? తులసి ఇక్కడున్నట్లు మీకెలా తెలిసింది" అన్నాడు.
చంద్ర నిష్ఠూరంగా అంటున్నట్లు, "నువ్వెంత రహస్యంగా ఉండాలని చూసినా, మాకు తెలియదనుకుంటున్నావా?" అంది.
కృష్ణారావు తెల్లబోతూ, "నేను రహస్యంగా ఉంచాలనుకున్నానా?" అన్నాడు.
చంద్ర పకపక నవ్వుతూ, "పిచ్చి కృష్ణా! ఇంత అమాయకుడివి ఎలా బ్రతుకుతావయ్యా! ఏ క్షణంలో ఎవరి వలలో పడతావో అనే నా దిగులు!" అంది.
తులసి ముఖం తెల్లగా పాలిపోయింది. కృష్ణారావు, చంద్ర నవ్వటంచూసి తనూ నవ్వుతూ, "నీకెందుకా దిగులు? ఈ పనికిమాలినవాడు నీకు తప్ప ఎవరికి కావాలి?" అన్నాడు. తులసి దిగ్గున తలెత్తి చూసింది. చంద్ర తన చేత్తో అతని నోరుమూసి, "చాల్లే! ఇలాంటి పిచ్చి వాగుడు వాగకు. మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి ఎందుకు రాలేదు?" అంది.
"ఎలా రాను, అప్పుడు తులసి ఎలా ఉందో తెలుసా? తనను వదిలి నేను వచ్చేస్తే అక్కడికక్కడ మూర్ఛపోయేలా ఉంది. అయినా ప్రతిక్షణమూ నిన్నే తలుచుకుంటూ కూచున్నాను. తులసి కాస్త స్థిమిత పడగానే, పనిమీద వెళ్ళవలసి వచ్చింది. పని చెయ్యకుండా ఎలా గడుస్తుంది చెప్పు? ఇంతకూ పుట్టినరోజు బాగా గడిచిందా?"
"సిగ్గులేదూ_ అలా అడగటానికి? వండిన వంటంతా అలాగే ఉంది. నువ్వు లేకుండా, ఏం పుట్టినరోజు?"
"వాట్! ఎంత అమృతం లాంటి మాట విన్నాను. ప్రొద్దుటి నుండి శ్రమపడితే పడ్డాను కాని, మంచి ఫలితం దొరికింది. మామూలుగా మీ ఇంటికివచ్చి నీతో కలసి నువ్వు తయారుచేసిన పంచభక్ష్య పరమాన్నాలూ తిన్నదానికంటె తియ్యగా ఉందీమాట. మిస్టర్ సూర్యం! ఇంక తులసి బాధ్యత నీకప్పగించి నేను పోతున్నాను. లెట్ మి ఎంజాయ్ విత్ చంద్ర. బై _ బై! రా. చంద్రా!"
కృష్ణారావు చంద్రతో వెళ్ళిపోయాడు. హోటల్ గదిలో సూర్యం, తులసి ఇద్దరే మిగిలారు.
"మీరు....మీరు....ఇక్కడే ఉంటారా?" గొణుగుతున్నట్లు అడిగింది తులసి.
"ఏం తులసీ? నీకు కృష్ణారావులో ఉన్న నమ్మకం నాలో లేదా?"
తులసి ఇంక భరించలేని దానిలా దిండులో తల దాచుకుని నేలగా ఏడవసాగింది. సూర్యం తులసి ఎందుకు ఏడుస్తోందో అర్థం చేసుకోగలిగాడు. కాని, ఎలా ఓదార్చాలో మాత్రమే అర్థం కాలేదు.
18
సూర్యం తులసి గది పక్కనే మరొక గది తీసుకుని ఆ రాత్రి అందులో ఉన్నాడు. ఆ మరునాడు తులసిని తనే ఆస్పత్రికి తీసికెళ్ళాడు. జానకి తులసినీ, సూర్యాన్నీ అనుమానంగా చూస్తూ, "ఇవాళ సూర్యంతో వచ్చావా? కృష్ణారావు ఏమయిపోయాడు?" అంది. కొంచెం ఆశాభంగం చెందినట్లు. తల్లి భావం అర్థం చేసుకున్న తులసి సూర్యం ముందు వంచిన తల ఎత్తలేకపోయింది. సూర్యం అక్కడ ఉండగానే ఆయాసపడుతూ, "తులసీ! చిన్నపిల్లవి కావు. నీ మంచీ, చెడ్డా నీకు తెలియాలి. జాగ్రత్తగా ఆలోచించి ప్రవర్తించు" అని కూడా అనేసింది. తులసి వంచిన తల ఎత్తకుండా, సూర్యం వైపు చూడకుండా అన్నీ భరిస్తోంది....
అంతలో నర్స్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చింది. ఆ బాధకు తట్టుకోలేక "నన్నీ మాయదారి ఆస్పత్రిలోంచి తీసుకుపోవే తులసీ! నేనిక్కడ ఉండలేనే తల్లీ!" అని గోలపెట్టింది జానకి.