Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 33


    ఏం చెయ్యాలో తోచలేదు తులసికి. కారు దిగి హోటల్ లో అడుగుపెడుతోంటే కాళ్ళు వణికాయి. ఏమయితే అయిందనే మొండి ధైర్యంతో, మరొక మార్గతరం లేక కృష్ణారావు తీసుకున్న గదిలో ప్రవేశించింది తులసి. సామానంతా గదిలో పెట్టాడు కృష్ణారావు. తులసి కోసం కాఫీ ఫలహారాలు తెప్పించాడు. తులసి తిన్నాక "నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. ఈలోగా విశ్రాంతి తీసుకోండి" అని వెళ్ళిపోయాడు. అతడలా వెళ్ళగానే గది తలుపులు గట్టిగా బోల్ట్ పెట్టుకుని మంచంమీద వాలిపోయింది. అన్ని ఆలోచనలనూ, అన్ని ఆందోళనలనూ మింగేస్తూ నిద్ర ముంచుకు వచ్చింది. నిద్రలేచి టైం చూసుకునేసరికి సాయంత్రం ఆరయింది. అలసటతో అంతవరకు వెనక్కు నెత్తిన ఆలోచనలన్నీ ఒక్కసారి ఝుమ్మని ముసురుకోసాగాయి. కృష్ణారావు తనకు చాలా సహాయం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నట్లు? వట్టి పొగరుబోతూ, రౌడీ అని అందరికీ తెలిసిన వ్యక్తి ఇంత సహాయం చేస్తున్నాడంటే, ఊరికే చేస్తాడా? దానికి తోడు ఈ హోటల్ రూం? కొంపతీసి ఏదైనా దురుద్దేశం లేదుకదా! ఇప్పుడు తనేం చెయ్యగలదు? కృష్ణారావు కాదంటే ఇప్పుడు తనను ఆడుకునే వారెవరు? ముందు తనకు చెయ్యి స్వాధీనం కావాలి_ అంటే డబ్బు కావాలి_ అంటే కృష్ణారావు సహాయం కావాలి. ఏ మోజూ లేకుండా కృష్ణారావు తనకు సహాయం చేస్తాడా? తప్పకుండా ఏదో ఉంది. పోనీ, పాడుచెయ్యకుండా తనను పెళ్ళిచేసుకుంటే బాగుండును! ఛీ! కృష్ణారావు లాంటి ముండల ముఠాకోరుని.... ఎవరు మాత్రం గొప్పవాళ్ళు? సూర్యం మాత్రం?..... ఆ చంద్ర....  
    చంద్రని తలుచుకోగానే అణువణువూ భగ్గుమంది తులసికి__ "బజారుముండ! ఎంత అహంకారం?" అనుకుంది కసిగా.
    ఆలోచించి ఆలోచించి ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణారావుని పెళ్ళిచేసుకోవటం కంటే మంచి మార్గం ఏదీ లేదనే నిర్ణయానికి వచ్చేసింది తులసి. తన చాకచక్యమంతా ఉపయోగించి కృష్ణారావు తనను పాడుచెయ్యకుండా పెళ్ళిచేసుకునేలా ప్రయత్నించాలని కూడా నిర్ణయించుకుంది. ఆ ఊహ రాగానే ఒక్కసారి ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంది. ఆ ప్రతిబింబం ఏమాత్రం అందంగా కనిపించలేదు. దానికితోడు అవిటిచెయ్యి అనుకోకుండా తనను తాను చంద్రతో పోల్చుకుంది. నిశ్చయంగా తనకంటే చంద్ర అందమైనదే అనుకోవలసి వచ్చేసరికి, చంద్రమీద ఏదో అక్కసు కలిగింది. వెంటనే చంద్రమీద అక్కసు పెంచుకుంటున్న తనకూ, తనమీద అక్కసు పెంచుకొంటున్న సుమతికీ తేడా ఏమిటనే ఆలోచన కూడా వచ్చింది. ఈ ఆలోచనలూ,అవి తెచ్చే చికాకు భరించలేక స్నానానికి లేచింది.
    తులసి స్నానంచేసి బట్టలు కట్టుకుంటూ ఉండగా తలుపుతట్టిన చప్పుడు అయింది. తలుపు చేతితో టకటకమని కొడుతూంటే ఎవరో సుత్తితో తన గుండెలమీద 'ధన-ధన' మని కొడుతున్నట్లే అనిపించసాగింది. మూసిన ఆ తలుపుల వైపు భయంగా చూసింది. ఆ తలుపులు తీయాలంటే, తీసి_ ఆ రాత్రి సమయంలో, ఒంటరిగా తానున్న ఆ హోటల్ గదిలోకి కృష్ణారావును ఆహ్వనించాలంటే_ గుండె దిటవు చాలటంలేదు. కానీ, ఏదో ఒకటి త్వరత్వరగా క్షణాలలో నిర్ణయించుకోవాలి! ప్రేమ, ఆప్యాయత ప్రకటిస్తూ.... ప్రస్తుతానికి ఎలాగో గండం తప్పించుకుంటే.... తరువాత సంగతి ఆలోచించుకోవచ్చును.
    "నందో రాజాభవిష్యతి__! నాటికొక్క దైవంబు లేదే!" ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి! తన తెలివితేటలన్నీ ఉపయోగించి అత్యంత మృదుస్వరాన ఉదాత్తానుదత్తాది భేదాలలో తన అభిమానాన్నంతా ధ్వనింపచేస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది.
    "ఎవరూ కృష్ణారావేనా? కాస్త ఆగాలి సార్! ఒక్క అయిదు నిముషాలు....అంతమాత్రం ఓపిక లేకపోతే ఎలాగండీ! మెనీ మెనీ థాంక్స్ ఫర్ ది హెల్ప్. నిజంగా మీరు లేకపోతే, ఈ కష్ట సమయంలో ఏమయిపోయేదాన్నో? నిజంగా ఆ కృష్ణభగవానుడే, ఈ కృష్ణుణ్ణి నాకు అండగా చూపించాడేమో! అన్నివిధాలా శ్రీకృష్ణుడే లెండి మీరు అంటే నా అర్థం....ప్లీజ్ డోంట్ మిస్ అండర్ స్టాండ్ మి! నాకు మీమీద ఉన్న నమ్మకం ఈ లోకంలో ఎవరిమీదా లేదు. ఎంత ఆపదలో నయినా మరొకరిమీద విశ్వాసముంచి ఇలా హోటల్ గదిలో ఉండగలిగేదాన్ని కాదు. బట్ కృష్ణా! నాకు మీ మనసు తెలుసు! ఎంత ఉదాత్త ప్రకృతిమీది! ఒంటరిగా, నిస్సహాయంగా ఉన్న ఆడపిల్లలమీద మీరు అత్యాచారాలు ఒక్కనాటికీ చెయ్యరు__ చెయ్యరుగాక చెయ్యరు. నేను హామీ ఇయ్యగలను. మీకు నిజంగా ప్రేమ కలిగితే దర్జాగా పెళ్ళి చేసుకుంటానంటారు. అంతేకాని క్షుద్రంగా, నీచంగా, ఘోరంగా....."
    తలుపు మళ్ళీ తట్టిన చప్పుడయింది, ఈ సారి మరింత గట్టిగా, తులసి చీర కట్టుకోవటం పూర్తయింది. తలుపు తియ్యాలని తలుపు దగ్గరకు వచ్చింది. మరొకసారి తలుపు చప్పుడయింది. తులసి కంగారుగా "అబ్బ! ఏమిటీ అల్లరి? నన్నొకదాన్నీ ఈ గదిలో పడేసి ఎప్పుడో వెళ్ళి ఇప్పుడు రావచ్చుగానీ, నేను తలుపు తీసే కొంచెం సేపట్లోనే ఇంత హడావుడి చెయ్యాలా? ఇలా అయితే, నేనసలు తియ్యనే తియ్యను" అని కొంచెంసేపు తలుపుల దగ్గర ఆగి, ముఖానికి పట్టిన చెమటను పైట కొంగుతో తుడుచుకుని, పొడారిపోతున్న పెదవులను నాలుకతో తడుపుకుంటూ తలుపు తీసి నిర్ఘాంతపోయి నిలబడింది. గుమ్మం ముందు చంద్ర, సూర్యం నిలబడి ఉన్నారు. చంద్ర ముఖం చాలా బడలికగా ఉంది. కళ్ళలో ఏదో ఆందోళన కనిపిస్తోంది.
    చేష్టలుడిగి బొమ్మలా నిలబడిపోయిన తులసిని చూసి, "మేము లోపలికి రావచ్చునా?" అని అడిగాడు సూర్యం. సమాధానం చెప్పగలిగే శక్తి లేక పక్కకు తప్పుకుని దారి ఇచ్చి నిలబడింది తులసి, సూర్యం మొదట లోపలకు వచ్చాడు. చంద్ర గుమ్మం దగ్గరే నిలబడింది.
    "రా చంద్రా!" అన్నాడు సూర్యం. అప్పుడు లోపలకు వచ్చింది చంద్ర. సూర్యం కూజాలోంచి నీళ్ళు వంపి గ్లాసులో పోసి చంద్ర కిచ్చాడు. గడగడ తాగేసింది చంద్ర.
    "సారీ! తులసీ! నిన్ను డిస్టర్బ్ చేసినట్లున్నాం! అసలు సంగతేమిటంటే, ఇవాళ చంద్ర పుట్టినరోజు. కృష్ణని భోజనానికి రమ్మంది. వస్తానన్నాడు కానీ, రాలేదు. ఏదో బలమైన కారణం ఉంటేకాని, అలా రావటం మానెయ్యిడని కంగారు పడసాగింది చంద్ర. 'ఏం ఫరవాలేదని నేను చెప్పినా వినలేదు. చివరకు మీ ఇంటికి వచ్చాడేమో కనుక్కోవాలని మీ ఇంటికి వెళ్ళాం. అక్కడ మీ అక్కా, బావా మాట్లాడలేదు కాని, చుట్టుపక్కలవాళ్ళ వల్ల జరిగిన సంగతి తెలిసింది. మీ అమ్మగారి ఆరోగ్యం విషమించిందనీ, ఆస్పత్రికి వెళ్ళారనీ తెలిసింది. కాని, ఏ ఆస్పత్రికి వెళ్ళారో తెలీలేదు. ఆ పరిస్థితుల్లో మీరంతా ఏమయిపోయారోనని మరింత కంగారు పడ్డాం, చివరకు గాంధీ హాస్పిటల్ కే వెళ్ళి ఉంటారని అక్కడికే వెళ్ళాం. అతి కష్టంమీద మీ అమ్మగారి బెడ్ కనుక్కోగలిగాం. ఆవిడ పాపం తెగ ఏడుస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఆస్పత్రుల సంగతి తెలియనిదేముంది? వాళ్ళిచ్చిన భోజనం, పాపం ఆవిడ తినలేకపోయారు. నేను బ్రెడ్, జాం తెచ్చాను. చంద్ర బ్రెడ్ మీద జాం రాసి ఆవిడకిచ్చింది. తరువాత పాలలో కాస్త గ్లూకోజ్ కలిపి ఆవిడకిచ్చి, మిమ్మల్ని వెతుక్కుంటూ అయిదారు హోటళ్ళు తిరిగి చివరకు ఇక్కడకు వచ్చాం."

 Previous Page Next Page