ఆ తరువాత కొంచెం సేపట్లోనే జానకికి గుండెల్లో నొప్పి వచ్చింది. "దేవుడా! నేను చచ్చి పోతున్నాను. నేను బ్రతకను. అయ్యో! తులసీ! నువ్వెలా బ్రతుకుతావే? మీ నాన్న చూడవే? ఇలా ఉన్నా నా దగ్గరకి రాలేదు. ఆయన్ని కాస్త కనిపెట్టి చూడవే! తల్లీ! ముసలిప్రాణం...." అని కేకలు మొదలుపెట్టింది. తులసి, సూర్యం ఇద్దరూ హడలిపోయారు. తులసి కంగారుగా తల్లి గుండె రాయటం మొదలుపెట్టింది. సూర్యం డాక్టర్ని పిలుచుకొచ్చాడు. డాక్టర్ జానకిని పరీక్ష చేస్తుండగా వెళ్ళి జగన్నాథం పంతుల్ని పిలుచుకొచ్చాడు సూర్యం. జగన్నాథం పంతులు భార్యను చూసి గట్టిగా ఏడవబోతే నర్స్ లు తిట్టి ఊరుకోబెట్టారు. డాక్టర్ చేసిన ఇంజక్షన్ల ఫలితమో, ఏమో_ రెండు మూడు గంటల తర్వాత స్థిమితపడింది జానకి.
"దొంగ జబ్బు. ఎప్పటికప్పుడు ఇలాగే ఉంటుంది." అంది నర్స్ కొద్దిపాటి విసుగుతో.
"ఇంతకూ ప్రాణం పోలేదన్నమాట!" అన్నాడు జగన్నాథం పంతులు, ఏదో ఆశాభంగం పొందినట్లు.
జానకికి ఈ విధమయిన గుండెపోటు ప్రారంభమయ్యాక ఇలాంటి దశలు చాలానే అనుభవించింది తులసి. మొదట్లో తల్లి నిజంగా చచ్చిపోతున్నట్లే భావించి ఎంతో బాధపడి, కుమిలి కుమిలి ఏడ్చేది. ఎంత ఖర్చయినా, ఎలాగయినా, తల్లిని బ్రతికించుకోవాలని తాపత్రయపడేది. కానీ, రాను రాను ఏ ఏడుపులూ, గోలా, అవన్నీ జీవితంలో ఒక భాగమైనట్లు అలవాటైపోయాయి.
జానకి స్థిమిత పడ్డాక, జగన్నాథం పంతులు రహస్యంగా సూర్యంతో ఏదో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. సూర్యంతో కలిసి తిరిగి హోటల్ గదికి వస్తూ "నాన్నగారు మీతో రహస్యంగా ఏం మాట్లాడారు?" అని అడిగింది తులసి.
సూర్యం వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
"చెప్పండి!" అని రెట్టించింది తులసి.
"వింటే మీరు బాధపడతారేమో!"
"పరవాలేదు. చెప్పండి."
"ఏం లేదు.... ఒక పదిరూపాయిలుంటే అప్పుగా ఇవ్వమని అడిగారు...."
తల గిర్రున తిరిగింది తులసికి.
ఈ 'ఆప్తుల' మధ్య, ఇలాంటి 'ఆత్మీయుల; మధ్య ఎలా బ్రతకాలి తను? చటుక్కున సూర్యంవైపు తిరిగి రెండు చేతులూ జోడించి, "సూర్యంగారూ! ఆత్మాభిమానమూ, సిగ్గు బిడియాలూ అన్నీ వదిలి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థన మన్నిస్తారా?" అంది.
సూర్యం కదిలిపోయి, జోడించిన తులసి చేతులను విడదీస్తూ ఛీ! ఛీ! అలా అయిపోకండి. ఏమిటో చెప్పండి? నేను చెయ్యగలిగినదేదైనా చేస్తాను?" అన్నాడు.
"నా ఉద్యోగం నాకిప్పించండి. అది చాలు. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి...."
"నేను ఆ కంపెనీకి మేనేజర్ నే కాని ప్రొప్రయిటర్ కని కాను. ఏం చెయ్యగలను? మీ చెయ్యి బాగయితే...."
ఆశాభంగంతో అదుపు తప్పిన ఉక్రోషం ఆవరించుకుంది తులసిని.
"అవునులెండి. మీరు చంద్రకి ఉద్యోగం చూపించాలి మరి! నాకెలా ఇవ్వగలరు?" అంది కసిగా....
"ఏ పొజిషన్ లో ఉన్నా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయని ఎందుకు అర్ధంచేసుకోవు తులసీ! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవూ?"
"రూల్స్! బజారు మనిషిని పబ్లిగ్గా తెచ్చి ఆఫీస్ లో పెట్టుకోవటం రూల్స్! చంద్రను తెచ్చి నా ప్లేస్ లో వెయ్యటానికి మీరు చాలా శ్రమపడ్డారని నాకు తెలిసింది లెండి. అందరూ చెప్పుకున్నారు. మీ దృష్టిలో ఒక పచ్చి భోగం దానికి, వొళ్ళమ్ముకునే వేశ్యకి....ఉచ్చం నీఛం లేని దానికి ఉన్న విలువ, నాకెలా వస్తుందీ?"
సూర్యం కళ్ళు నిప్పులు కక్కాయి. ఆ ముఖం చూస్తే చాలా భయం వేసింది తులసికి. ఎంతోసేపటికికాని, తనను తను నిగ్రహించుకోలేకపోయాడు సూర్యం.
"అవును. మీరు తెలుసుకున్నది నిజమే! ఏ లోపమూ లేని చంద్రకు, అన్ని అర్హతలూ ఉన్న చంద్రకు.... లోకంలో చాలా మందికంటే చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న చంద్రకు.... ఒక ఉద్యోగం ఇప్పించటానికి_ సంఘంలో ఎవరిముందూ తలవంచి, తనను తను హీనపరచుకోనక్కర్లేకుండా ఒక ఆధారం కల్పించటానికీ, నేను చాలా శ్రమపడవలసి వచ్చింది. విధివశాన కొన్నాళ్ళు బ్రోతల్ హౌస్ లో ఉండటం ఒకటే చంద్ర అపరాధం. తనది కాని ఆ అపరాధానికి చంద్ర చాలా శిక్షలే అనుభవించింది. బ్రోతల్ అనే మాట వినగానే హీనంగా తప్ప ఆలోచించటంచేతకాని సంఘంలో ఒక భాగమైన మేనేజ్ మెంట్ ని ఒప్పించటానికి నేను చాలా యాతన పడవలసి వచ్చింది. నాకంటే యాతన పడుతోంది చంద్ర. ఏ క్షణానికాక్షణం తనను కబళించాలని చూసే 'పెద్ద మనుష్యుల' బారినుండి తప్పించుకోలేక...."
సూర్యం చంద్రనింతగా పొగడటం, చంద్ర అంటే ఎంతో అభిమానంగా మాట్లాడటం తులసి సహించలేకపోయింది. "పరవాలేదు లెండి. చాలా త్వరలోనే చంద్ర పైకి రాగలదు. అలాంటి ఆఫీస్ లో చంద్రలాంటి వాళ్ళకి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి" అంది.
సూర్యానికి కూడా సహనశక్తి సన్నగిల్లిపోతోంది. "పాపం. మీ ఛాన్సెస్ నిన్న నేనూ, చంద్రా పాడుచేసినట్లున్నాం కదూ! అయామ్ సారీ!" అనేశాడు. ఎడాపెడా ఆ లెంపా ఈ లెంపా వాయించినట్లయింది తులసికి. తన మనసులోని ఒక చీకటి కోణం తన కళ్ళముందు నగ్నంగా కనపడేసరికి తట్టుకోలేకపోయింది. ఒక్కసారిగా తల పగిలిపోతున్నట్లుగా తలనొప్పి వచ్చింది. తల చేత్తో గట్టిగా పట్టుకుని "అబ్బా!" అంది. సూర్యం కంగారుగా "ఏమిటి జరిగింది?" అని తులసి నుదుటిమీద చెయ్యివెయ్యబోయాడు. తులసి తోక తొక్కిన త్రాచులా కస్సుమంటూ ఆ చేతిని పురుగును విదిలించినట్లు విదిలించి, "కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. లోకమంతా మీ చంద్రలాంటి 'గొప్ప వ్యక్తిత్వం' కలవాళ్ళతోనే నిండిలేదు" అంది.
సూర్యం ఏదో సమాధానం చెప్పబోయి ఎర్రబడిన కళ్ళతో ఆవేదన, ఆక్రోశం ప్రతిఫలించే తులసి ముఖంలోకి చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
అతడు వెళ్ళగానే గది అంతా చీకటిగా, మనసంతా శూన్యంగా అనిపించింది తులసికి కొన్ని క్షణాలు. హోటల్ ప్రొప్రైటర్ తులసి గదిలోకి వచ్చి, "మేము ప్రతి శుక్రవారమూ అకౌంట్స్ సెటిల్ చేసుకుంటాము. మీ బిల్ ఇస్తారా?" అన్నాడు. హడలిపోయింది తులసి.