Previous Page Next Page 
తదనంతరం పేజి 33


    ఓ మహోవన్యసంలా సాగిన ఆమె వాక్ప్రవాహానికి అతను అచేతనుడై వుండిపోయాడు.


    "ఇంకో సంగతి గమనించారా?" అంది అరుంధతి, ఆమె గొంతులో బాధతో కూడిన చిన్న వణుకు వుంది. అతను గుర్తించలేదు.


    "ఊ?"


    "మంచివాడు, నైతిక విలువలున్నవాడు, పెద్దమనిషి అయినవాడు, నీతి పరుడు, ఉదాత్తుడు, విశాల దృక్పథం కలవాడు. యిన్ని మంచి లక్షణాలున్నా డబ్బులేకపోతే మనిషి గౌరవించబడడు. ఇవన్నీ బలహీనతలుగానే పరిగణించ బడతాయి. మనిషిలో ఎంతో దుర్మార్గమున్నా, క్రూరత్వమున్నా అతన్ని అసహ్యించుకుంటూనే విలువనిస్తూ వుంటారు. ఆ విలువ యివ్వటంలో కొంత నిజాయితీ కూడా ఉంటుంది. అతను చెప్పిన మాటలనే యితరులు గౌరవిస్తూ వుంటారు. ఆఖరికి దేముళ్ళు, గొప్ప గొప్ప స్వామీజీలూ, పీఠాదిపతులూ కూడా వాళ్ళనే గౌరవిస్తూ వుంటారు."


    ఆమెలో అగ్ని జ్వాలలా చెలరేగుతున్న ఆవేదన అతని కర్థమైంది.


    ఆమె స్కూల్ ఫైనల్ వరకూ చదువుకుంది. తర్వాత పెళ్ళయిన కారణంగా చదువు ఆపేసినా, సామాజిక విషయాలమీద, తమ చుట్టూ పరిభ్రమించే అనేక సమస్యల మీద గొప్ప అవగాహన ఉందని తెలుసు.


    క్షణంపాటు ఆమె తన భార్య అయినందుకు గర్వించాడు.


    "కాబట్టి...మనిషికి ముఖ్యంగా కావల్సింది డబ్బు. అది లేనప్పుడు మిగతా విలువలెన్నివున్నా వాటికి గుర్తింపు లేదు. ప్రస్తుత మనస్తత్వాలను బట్టి మనిషి తనకున్న దానితో ఎడ్జస్ట్ కాలేడు కాబట్టి, రోజు రోజుకూ పెడుతున్న ఖర్చుల దృష్ట్యా చాలామందికి అది అసాధ్యం కూడా కాబట్టి, ఒక మనిషి సంపాదనమీద ఇంట్లోని వారంతా ఆధారపడటం కుటుంబ జీవితాన్ని మరీ దుర్భరం చేస్తుంది కాబట్టి, ఇంట్లోని వయసొచ్చిన ప్రతివాడూ సంపాదించితీరాలి. కష్టమన్నది ఏమిటో, బాధ్యతంటే ఏమిటో! వాళ్ళకు తెలియాలి కాబట్టి అందరూ ఉద్యోగాలు చెయ్యాలి. అందుకని నీరజ ఉద్యోగం చెయ్యటంలో తప్పులేదు. ఆ మాటకొస్తే నీరజేకాదు, ఆసరమనిపిస్తే నేనుకూడా చేస్తాను"


    "నువ్వు కూడా చేస్తావా?"


    "ఏం చెయ్యకూడదా?"


    "అలా అనికాదు. ఈ వయసులో..."


    "ఉద్యోగానికీ వయసుకీ సంబంధమేముంది? గవర్నమెంటు రూల్సు ప్రకారం రిటైరై విధిలేక వూరుకోవటం తప్ప_ రిటైరయిన వాళ్ళు ఉపాధికోసం ఏవేవో ఉద్యోగాలు చేస్తోన్న వాళ్ళని ఎంతమందిని చూడడంలేదు? ఎంతమంది వయోవృద్ధులను రకరకాల వ్యాపారాలతో, వృత్తులలో చూడటం లేదు? కూలీ నాలీ చేసుకునే వాళ్ళలో, రిక్షాలు తొక్కేవాళ్ళలో, డాక్టర్లలో, ప్లీడర్లలో వయసుమళ్ళినవాళ్ళు ఎంతమంది కష్టపడటం లేదు?"


    "కాని ఈ సమాజం దుష్టస్వభావంతో, పోకిరీ మూకతో, గూండాయిజంతో మగ్గిపోతోంది. ఆడపిల్ల నలుగురిలో మెలిగితే ఏం జరుగుతుందోనన్న హీనంగా వున్నాయి పరిస్థితులు. నీరజకేదన్నా కీడు జరిగితే..."


    "అంటే?"


    "బయటకు కాలుపెడితే ఆడపిల్లని మొగవాడు ఎలా వెంటాడుతాడో నాకు తెలుసు. ఆమె అనుక్షణం ఎన్ని అవమానాలను, ఎలాంటి ఒత్తిడులకు లోనుకావల్సి వస్తోందో నాకు తెలుసు. అలాంటిదేదయినా జరిగి, ఇలా మాట్లాడుతున్నందుకు బాధపడకు...తనకు..."


    "చెడిపోయే స్థితి వస్తుందనా?"


    అతను జవాబు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు.


    "ఒకవేళ... ఒకవేళ...అలాగే జరిగితే...ఏం చెడిపోతే?"

 Previous Page Next Page