Previous Page Next Page 
కళ్ళు పేజి 33


    కల్పవల్లి మొహంలో కలవారపాటు కనిపించింది- కాని వెంటనే కప్పిపుచ్చుకుంటూ "లేదు" అన్నది.

 

    "సరే" అంటూ రంజిత బయటకు వెళ్ళిపోయింది.


                                     *  *  *


    ప్రఫుల్లకుమార్ షాక్ నుంచి కోలుకుని.

 

    ఆ వ్యక్తికేసి చూస్తూ "ఎందుకొచ్చావు?" అనడిగాడు.

 

    అతనికి ముప్పై, ముప్పై రెండేళ్ళుంటాయి. ఇంచుమించు ప్రఫుల్లకుమార్ అంత పొడవూ వుండి, బలిష్టంగా వున్నాడు. గడ్డం పెరిగి వుండి కళ్ళలో క్రూరత్వం కదులుతోంది.

 

    ఆ వ్యక్తి నవ్వాడు. "కుమార్! నా కళ్ళుగప్పి నువ్వెక్కడికీ పోలేవనీ, నిన్ను నేననుక్షణం నీడలా వెంటాడుతూ ఉంటాననీ నీకు తెలుసు. నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసుననీ నీకు తెలుసు."

 

    "ఏం కావాలి?" అన్నాడు ప్రఫుల్లకుమార్.

 

    "డబ్బు."

 

    "ఎంతకావాలి?"

 

    "పదివేలు."

 

    "ఇవ్వకపోతే ఏం చేస్తావు?"

 

    "ఓ పది నిముషాల తర్వాత నువ్వు కటకటాల వెనుక ఉంటావు."

 

    ప్రఫుల్లకుమార్ ఒక్కక్షణం మెదలకుండా ఊరుకుని "సరే" అన్నాడు. బెడ్ రూంలోవున్న వాడ్రోబ్ దగ్గరకు నడిచి డోర్ తెరిచి లోపల సొరుగులో చెయ్యిపెట్టాడు. అతని చెయ్యి మెరుపులా బయటకు వచ్చేసరికి వ్రేళ్ళమధ్య చిన్న రివాల్వర్ నిగనిగలాడ్తూ మెరిసింది.

 

    ఆ వ్యక్తి తొణకలేదు. "కుమార్! నువ్వు నన్ను చంపటమో, నేను నిన్ను చంపటమో ఓ సమస్యకాదు. నేనంత తెలివితక్కువవాడ్ని కాదనీ నీకు తెలుసు, నేనిక్కడ్నుంచి అరగంటలో బయటకు రాకపోతే నిన్ను కటకటాల వెనక్కి పంపించే ఏర్పాట్లు చేసుకునే వచ్చాను" అన్నాడు.

 

    "అసలు నువ్వు లోపలకెలా వచ్చావు?"

 

    ఆ వ్యక్తి నవ్వాడు. 'నా వ్రేళ్ళు నీవాటికన్నా పదునైనవని తెలీకపోవటం హాస్యాస్పదంగా వుంది."

 

    ఒక్కక్షణం నిశ్శబ్దంగా గడిచింది. ప్రఫుల్లకుమార్ రివాల్వర్ లోపల పెట్టేసి ఓ నోట్లకట్ట బయటకు తీశాడు. అతనివంక అసహ్యంగా చూస్తూ విసిరేశాడు. "నువ్వంటే భయపడి ఈ డబ్బిస్తున్నాను అనుకోకు" అన్నాడు.

 

    "నేనంటే నువ్వు భయపడుతున్నావని అనుకునేటంత మూర్ఖుడ్ని కాదు. నీ అవసరం కొద్దీ ఇస్తున్నావని తెలుసుకునే తెలివితక్కువ వాడ్ని కాను" అన్నాడు.

 

    తర్వాత డబ్బు లెక్కపెట్టుకుని సంతృప్తిగా తలవూపి జేబులో పెట్టుకున్నాడు.

 

    "వస్తా కుమార్. నువ్వు నన్నిలా పోషిస్తున్నంతకాలం నీ కార్యకలాపాలకు నేనడ్డంరాను. నువ్వు బంగారుగుడ్లు పెట్టే బాతువు. నువ్వు కలకాలం ఆరోగ్యంగా వుండటమే నా ధ్యేయం" అంటూ గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు.


                                                             *  *  *


    రంజిత మందాకిని ఇంటిముందు కారు దిగింది. ఇంటి తలుపులు బయటిగేట్ తో సహా తాళం వెయ్యబడి కనిపించాయి. ఒక్క నిమిషం గేటు దగ్గర ఆలోచిస్తూ నిలబడింది.

 

    ఎదురింట్లో వరండాలో నిలబడి ఓ నడివయసు మనిషి నిల్చుని ఆమె వంక చూస్తున్నాడు. రంజిత కొంచెం ఆగి అతని దగ్గరకెళ్ళింది.

 

    "ఈ ఇంట్లో జగన్మోహనరావు, వాళ్ళమ్మాయి వుండేవాళ్ళు. వాళ్ళేదయినా ఊరు వెళ్ళారా?" అనడిగింది.

 

    "ఊరు కాదు, ఆయన అమ్మాయిని తీసుకుని స్టేట్స్ వెళ్ళారు. కొన్ని నెలలదాకా రారు. వివరాలు కావాలంటే ఆయన ఆఫీసులో కనుక్కోండి" అని చెప్పాడతను.

 

    రంజితకు ఉసూరుమనిపించింది. నిరాశగా కారెక్కింది.


                                        13


    డాక్టర్ సంకేతినికి ప్రొద్దుటే నాలుగున్నరకల్లా నిద్రలేవటమలవాటు. ఓ పది నిమిషాలపాటు మెడిటేషన్ చేసుకుని తర్వాత నవలలు రాయడం మొదలుపెడుతుంది. ఒకటికాదు, రెండుకాదు. ఒకేసారి మూడు నాలుగు నవలలు రాస్తూ ఉంటుంది. అలా ఒకేసారి అన్ని నవలలు రాయటం ఆమెకేం సరదాకాదు. మొదట హాబీకోసం ప్రారంభించిన రచనా వ్యాసంగం సాహిత్య సీమలో ఆమెను క్రమక్రమంగా శిఖరాగ్రాన చేర్చింది. ఆమె పేరు సుప్రసిద్ధ రచయిత్రిగా ఇంటింటిలో మార్మోగిపోయింది.

 

    అటు సాహిత్యపు విలువలూ, ఇటు క్షణం క్షణం మారిపోతున్న పాఠకుల అభిరుచులు, ప్రస్తుతం రాజ్యం చేస్తోన్న సాహిత్యధోరణులూ- ఇవన్నీ ఆకళింపు చేసుకుంటూ తనని తాను పరిస్థితుల కనుగుణంగా పెంచుకుంటూ, మలుచుకుంటూ పోవటంలో ఆమె సాహిత్యాకాశంలో ధృవతారగా ప్రకాశిస్తోంది. మధ్యలో ఎంతమంది రచయితలు కొత్త కొత్త ప్రయోగాలతో దూసుకొచ్చినా ఆమె స్థానం మాత్రం సుస్థిరంగానే ఉండిపోయింది. ఆమె రాస్తున్న నవలలకు రోజురోజుకూ డిమాండ్ పెరగడంతో ఆమె వర్కింగ్ అవర్స్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ నిరంతరం శ్రమించాల్సి వస్తోంది.

 

    ఆమె రచయిత్రిగా ఎంత ప్రఖ్యాతి పొందిందో, డాక్టరుగా కూడా అంతపేరు ప్రతిష్ఠలు సంపాదించింది. ఆమె పెడియాట్రిషియన్. ఆమె హాస్పటల్ నిండా ఎడతెరిపి లేకుండా రోగాలతోవున్న, ఆ పిల్లలతోవున్న తల్లులు నిండిపోయి వుంటారు. పిల్లల ఏడుపులతో, తల్లుల తాలూకు రణగొణ ధ్వనులతో ఆమె హాస్పటల్ ఎప్పుడూ సందడిగా ఉంటుంది.

 

    రచయిత్రిగా ఎంత నిజాయితీగా వుంటుందో, డాక్టరుగా కూడా అంతే చిత్తశుద్ధితో ఒంట్లోని శక్తినంతా ధారపోసి పనిచేస్తుంది. చాలా సెన్సిటివ్ పర్సన్. ఏ పాపకో, బాబుకో సీరియస్ గా వుంటే ఆమె విలవిల్లాడిపోతుంది. ఆరోజు ఆమెకు అన్నంకూడా సహించదు. కంటిమీదకు కునుకురాదు. అనుక్షణం టెన్షన్ ఫీలవుతూ మనసంతా కకావికలం చేసుకుంటూ వుంటుంది. ఆమె సాహిత్య వ్యాసంగానికీ, వైద్యానికీ మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది.

 Previous Page Next Page