Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 33


    "ఇంకెవరో కూడా - నాకూడా తిరుగుతున్నట్లూ, ఎవరివో కళ్ళు నన్ను పొంచిపొంచి చూస్తున్నట్లూ అనిపిస్తుంది. గోపయ్యా! నిజంచెప్పు, ఇది భ్రమేనంటావా?"

    గోపయ్య మాలతి మొహంలోకి ఒకసారి చూసి "మీరు అమ్మగార్ని మరచిపోలేకుండా వున్నారయ్యగారూ!" అన్నాడు.

    శేఖర్ హఠాత్తుగా ఉద్రేక పూరితుడయ్యాడు. "గోపయ్యా! ఆ రాక్షసిపేరు నా ముందు ఎత్తకు. ఆ రోజెందుకంత ఔదార్యం చూపించానా అని ఇప్పుడు పశ్చాత్తాపంతో క్రుంగిపోతున్నాను. ఆలోచించిన కొద్దీ అదంటే కసి పెరిగిపోతుంది. ఎంతగా ప్రేమించాను? ఎంత ఆరాధించాను? కానీ ప్రతిఫలంగా ఏం చేసింది? నా గుండె పగలకోట్టింది. నా మనసులో విషంలాంటి ద్వేషం నింపేసింది.....గోపయ్యా! ఇప్పుడది నా ఎదుటవుంటే...." ఆమె అతనికెదురుగా వుంది. ఆవేశంవల్ల అతనికి గుండెలో నొప్పివచ్చింది. "అబ్బ!" అంటూ ఛాతీ దగ్గర చెయ్యి నొక్కిపెట్టుకున్నాడు. మాలతి నిగ్రహించుకోలేక చేతులు జాచి అతన్ని పట్టుకోబోయింది. గోపయ్య ఆమెను వారించి తను వెళ్ళి అతన్ని పట్టుకుని మెల్లిగా నడిపించుకుంటూ కుర్చీలో కూర్చోబెట్టాడు. క్రమంగా అతనికి ఉపశమనం కలిగింది.

    మీరలా ఆవేశపడకూడదని డాక్టరుగారు చెప్పారయ్యగారూ!" అన్నాడు గోపయ్య.

    "నా బాధ నీకుతెలీదు గోపయ్యా! ఆ దృశ్యాలు కళ్ళు లేకపోయినా నా కాళ్ళముందు మెదుల్తూ ఇలా నా గుండెలను పిండేస్తున్నాయి. పగతో నేనెంత రగిలిపోతున్నానో....."

    "నాకు తెలుసయ్యగారూ! అమ్మగారిప్పుడు మీ ఎదుతవుంటే చంపి పారేసే వారు. అంతేనా?"

    మాలతి ఉలిక్కిపడింది. ఆమె ముఖం వెలవెలబోయింది.

    గోపయ్య మళ్ళీ అన్నాడు "కానీ అలంటి ఆలోచనకైనా ఇప్పుడు అవకాశం  లేదు .....అమ్మగారు.....చచ్చిపోయారు....."       

    మాలతి కెవ్వున అరవబోయి తమాయించుకుంది.

    శేఖర్ కూడా తృళ్ళిపడ్డాడు. "గోపయ్యా! ఏమన్నావు? మాలతి చచ్చిపోయిందా? నా మాలతి చచ్చిపోయిందా?"

    "అవునయ్యగారూ! నాకీ సంగతి మొన్ననే తెలిసింది. మీకెలా చెప్పాలో తెలియక తటపటాయిస్తూ వున్నాను. నిద్రమాత్రలు మ్రింగి పోయారట......"

    శేఖర్ దు;ఖం ఆపుకోలేక "మాలతి చచ్చిపోయింది. నా మాలతి చచ్చిపోయింది"అని ఆర్తనాదం చేశాడు. మళ్ళీ ఇంతలోనే కటువుగా మారాడు. "పీడా విరగడైపోయింది. నాకిప్పుడెంతో శాంతిగా వుంది గోపయ్యా! కానీ ఆశ్చర్యంగా వుంది. అంది అంత ధైర్యస్ధురాలు, ఇంతత్వరగా ఓటమి ఒప్పుకుంటుందనుకోలేదు. ఆ శంకర్ గాడు దాన్ని వదలదనీ, తనూ అతనితో రాజీ పడకపోయినా కొత్త జీవితం వెతుక్కుంటూ ముందుకు పోతుందనీ అనుకున్నాను."

    మాలతి ఆ మాటలన్నీ వింటూ భరిస్తూ ఊరుకుంది.

    "కానీ మనసులోని వేడి దహించివేసి వుంటుంది. అది ఒక మాటన్నది గోపయ్యా! పాపం చేసినవాళ్ళంతా పాపులు కాదంది. నిజమే కావచ్చు. కానీ మంచివాళ్ళు చేసిన పాపంకూడా పాపంగా మాత్రమే పరిగణించే చిన్న గుండె నాది. ఏం చెయ్యను? నాలో అంతకంటే విశాలత్వం లేదు. నేనంటే...."

    అతన్లోని సంఘర్షణ ఆమె అర్ధం చేసుకుంది. ఈ లోకంలో ఒకరినొకరు అర్ధం చేసుకున్నా - మనుషుల్లోని స్వార్ధ ప్రలోభంవల్ల చాలా సమస్యలు పరిష్కరించ బడవు.

    "అయ్యగారూ! అమ్మగార్ని మీరు మరచిపోవాలి."

    శేఖర్ కి  మళ్ళీ రోషం వచ్చింది. "మరిచిపోకపోతే - నేనింకా జ్ఞాపకం పెట్టుకున్నాననుకున్నావా? ఒకనాడు భార్య కదాఅని కొంచెం సానుభూతి తప్పలేదు.."

    గోపయ్య అతని మటలకు అడ్డుతగులుతూ, బయటినుంచి ఎవరో వస్తున్నట్లు అభినయిస్తూ, "ఆ, ఎవరూ?" అన్నాడు. మాలతికి సంజ్ఞ చేసి.

    ఆమె వెళ్ళి గుమ్మందగ్గర నిలబడింది.

    "అరె, దుర్గా! నువ్వా? అక్కడే నిలబడిపోయావేం? లోపలకు రా. మన అయ్యగారి ఇల్లు ఇదేనమ్మా!"

    "ఎవరది గోపయ్యా?" అడిగాడు శేఖర్.

    "మా దుర్గ అయ్యగారూ! నా మనమరాలు. ఒరిస్సాలో స్ధిరపడిపోయిన నా రాజ్యం కూతురు."

    "అవును. ఎప్పుడూ చెబుతూవుంటావు. అరె! ఒక్కతేవచ్చిందా అక్కడనుంచి? ...అన్నట్లు ఆమెకు మాటలురావుకదా? ఎంతఇబ్బంది పడిందో?"

    "అవునయ్యగారూ! మూగపిల్ల. దుర్గా! అయ్యగారికి నమస్కారం చెయ్యమ్మా!"

    మాలతి రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేసింది.

    "ప్రయాణపు బడలికలో వుందేమో, లోపలకు వెళ్ళి విశ్రాంతి తీసుకోమను గోపయ్యా!"

    "దుర్గా! లోపలకు వెళ్ళమ్మా!"

    మాలతి ఒక్కనిముషం సంకోచించి, తర్వాత లోపలకు వెళ్ళిపోయింది

    గోపయ్య సంతోషం నటిస్తూ అన్నాడు. "హమ్మయ్య! ఇంకేం భయం లేదయ్యగారూ! మా దుర్గ వచ్చేసింది. గొంతు లేకపోతేనేం? దుర్గ మహా గుణవంతురాలు, తెలివయినది. అది అన్నిపనులూ ఇట్టే చేసేస్తుందయ్యగారూ!"

    శేఖర్ హఠాత్తుగా కటువుగా అన్నాడు "గోపయ్యా! నాకది తెలియదనకు. నీ నాటకం నాకు అర్ధమయింది."

    "అవును గోపయ్యా! నాకంతా అర్ధమయింది. నేనిక్కడ ఒంటరిగా కుమిలిపోతున్నాననీ, నా అజాపజా కనుక్కునే వాళ్ళులేరనీ దుర్గకి ఉత్తరం రాసి నువ్వే రప్పించావు" అంటుంటే అతనిగొంతు గాద్గదికమయింది. "నేను నీ మాట వినడంలేదని సాయంగా నీ మనమరాల్ని తెచ్చుకున్నావు - నేనంటే నీకెందుకింత అభిమానం గోపయ్యా?"

    చేతిని ముందుకు చాచి తడుముకుంటూ అతని చెయ్యి ఆప్యాయంగా పట్టుకున్నాడు.

    గోపయ్యకు కళ్ళలో నీళ్ళుబికాయి. "అయ్యగారు!" అంటూ ఆ చేతిని ఆప్యాయంగా నిమిరాడు.

    "గోపయ్యా! నన్ను లోపలకు తీసుకువెళ్ళు."

    శేఖర్ కుర్చీలోంచి లేచాడు. గోపయ్య అతన్ని జాగ్రత్తగా పట్టుకుని లోపలకు తీసుకెడుతూంటే మాలతి ఎదురుగా వచ్చింది.

"చూడు దుర్గా! అయ్యగారు పొద్దుటినుండీ ఏమీ తీసుకోలేదు. నీ చేత వారికి పాలూ, మందూ ఇద్దువుగానీ రామ్మా!"

 Previous Page Next Page