Previous Page Next Page 
వజ్రాల పంజరం పేజి 33


    అన్నది సశ్యని దృష్టిలో  పెట్టుకునే అయినా విజూష చెక్కిళ్లు ఎరుపెక్కాయి.

 

    "ముందు ఆ ప్రశ్నేదో  అడుగు" సశ్య రెట్టించింది.

 

     "హృదయమనెడి పుట్టలోన నిద్రించుతున్న
    వలవనెడి నాగకన్యను వెలికిదార్చి
    ఇచ్చవచ్చినయట్టు లాడించుచుండె
    నాటి యుపదేశమని యోడినాగసరము"

 

    చెప్పటం ఆపి అన్నాడు రుత్వి - "ఇది రాసింది ఎవరు? ఏ కవిత లోనిది తెలుసుకుని చెప్పాలి. చెబితే వెంటనే మొదటి పరీక్ష నెగ్గినట్టే."

 

    ఇద్దరూ తెల్లమొఖాలు వేసుకు చూస్తుంటే చెరో కాగితంపై రాసిచ్చాడు అదే కవితని.

 

    ఆ తర్వాత అరనిముషం వ్యవధిలో ఇద్దరూ వెళ్ళిపోయారు.

 

    అప్పుడు ఫోన్ చేశాడు రుత్వి ఎవరికో.

 

    "నేనే... రుత్వి"

 

    "....."

 

    " ఇద్దరికీ ఓ పరీక్ష పెట్టాను. ఇచ్చింది ఓ తెలుగు కవిత."

 

    "చెబుతామన్నారా?"

 

    "చెప్పాలి"

 

    "ఐ డౌట్"

 

    "మీకు తెలీదు. గెలుపుకన్నా ఓటమిని ఒప్పుకోలేని అమ్మాయిలు ఈ ఇద్దరూ."

 

    "అయినా ఇలాంటి పరీక్ష ఎందుకు పెట్టావ్?"

 

    క్షణం ఆగి అన్నాడు రుత్వి -

 

    "ఆ స్థాయికి చెందిన ఇద్దరమ్మాయిలు నన్ను కోరుకోవడాన్ని నేను వరంగా భావిస్తున్న మాట నిజమే అయినా నాకు మానసికంగా మరింత దగ్గర కావాలీ అంట్ యిలాంటి పరీక్ష తప్పదు.

 

    నేనడిగిన ప్రశ్నకి జవాబు తెలుసుకునే ప్రయత్నంలో నేను ప్రతిక్షణమూ వాళ్లకి గుర్తొస్తుంటానుగా.
 


    అప్పుడు నన్ను కోరుకోవడమనేది ఇన్ ఫాచ్యుయేషనా లేక ప్రేమా అన్నది నాకూ బోధపడుతుంది."

 

    "గూడ్. మంచి అనాలిసిస్."

 

    "థేంక్స్"

 

    "పాపం పిచ్చి పిల్లలు. తెగ రెచ్చిపోయుంటారేమో ఈపాటికి... బై"

 

    ఆవలివేపు ఫోన్ క్రెడిల్ చేసిన వ్యక్తి ఎవరో కాదు... విజూష స్నేహితురాలు స్పూర్తి.


 
    విశాలమైన భవంతిలో అడుగుపెడుతూనే అసహనంగా ఓ సోఫాపై చతికిలబడిపోయింది విజూష.


 
    ఎలా అయినా సరే ఎందుకైనాగానీ చాలా స్వల్పకాలంలో రుత్వికి దగ్గరైపోయింది.

 

    అసలు తమ ఇద్దరి పరిచయం ఎంతని?

 

    మొన్నెప్పుడో  చెలికాడుగా కనిపించిన వ్యక్తి పేరు మిలింద్ కదూ!

 

    ఆ తరువాత రెస్టారెంట్ టీవి క్విజ్ ప్రోగ్రాంలో రుత్విగా దర్శనమిచ్చాడు.

 

    ముత్పు చిప్పలో  రాలిపడిన ఉల్కగా కనిపించాడు. ఎడారి తీరం లాంటి యవ్వనపు మైదానంలో నురుగు పూలు పూయించి రోషంగా బ్రతికి తనకి  మధుమాసపు మైకాన్ని కళ్యాణ మంజీర ధ్వనుల్ని రమ్యంగా వినిపించే బృందావన్ ని రుచిచూపించి గాఢమైన తన బ్రతుకు నిశ్శబ్దంలో కాంక్షల సింహాసనాన్ని రాల్చి నరాలకి అల్లిన పొదరిల్లులా మారేడు.


 
    రెండు దశాబ్దాలుగా తన యవ్వనంలో తొలిసారి మనసు పొరని తట్టిన తుణీరమై, తీరమై, ద్వారమై, హారమై, హర్షమై, వర్షమై.....

 

    ఎందుకింతగా సంచలనాన్ని కలిగిస్తున్నాడు?

 

    తొలిచూపు ప్రేమంటే ఇదేనా?

 

    అంటే..

 

    సశ్యని నిజంగా రుత్వి కోరుకోవడం లేదా?'

 

    కోరుకోవడమే నిజమైతే ఆమెతో  తనని పోటీకి ఎందుకు దించాడు. సశ్యని  వదిలించుకోవాలనుకుంటూ అందుకు తనను ఆయుధంగా వాడుకుంటున్నాడా?

 

    అప్పుడు సశ్యకన్నా రుత్విని తనే ఎక్కువ ఆకర్షించినట్టేగా.

 

    నిజానికిప్పుడు స్పూర్తితో కాసిన రెండు నెలల పందెం గుర్తురావడంలేదు.


 
    ఇప్పుడు రుత్వి పెట్టిన పరీక్ష తరువాత కొన్ని వారాలపాటు సశ్యతో జరిగే పోరాటం అందులో తనులేదూ సశ్య రుత్వికి దగ్గర కావడం.

 

    నిట్టూర్పుల నెగళ్ళు ఆమెను లోలోపల మండే క్రతుహోమ గుండంగా మార్చుతుంటే దిశ మారిన నీరస ఏకాదశి నిశీధిలా వెంటనే తేరుకుంది.

 

    సమీపంలోని టీపాయ్ పైనున్న  ఫోనందుకుని స్పూర్తికోసం ఫోన్ చేసింది.

 

    రుత్వికి ఇంతలో తనెంత దగ్గరయిందీ చెప్పడం మాత్రమే కాదు. రుత్వి ఇచ్చిన కవితా పంక్తుల్ని చెప్పి అవి ఏ కవి రాసినవో తెలుసుకోవాలని చెప్పాలనుకుంది.

 

    కానీ స్పూర్తి తప్పించుకుందని తెలీని విజూష వెంటనే ఏంచేయాలో పాలుపోక క్షణం ఆలోచించి రెండు మూడు వారపత్రిక ఆఫీసులని కాంటాక్ట్ చేసింది. ప్ర ముఖ తెలుగు రచయిత ఇంటిఎడ్రస్, ఫోన్ నెంబర్ తెలుసుకుంది.
 


    ఎంత ఖర్చయినాగానీ జవాబు తెలుసుకుని సాధ్యమైనంత త్వరలో రుత్వితో చెప్పాలి... అదీ సశ్యకన్నా ముందు.

 

    "హలో....." అవతలివైపు నుంచి ఓ మగగొంతు వినిపించింది బొంగురుగా "ఎవరు?"

 

    "నేను మీ అభిమానిని" ఆ మాత్రం అకువ నటించడం తప్పదనుకుంది విజూష.

 

    అనేసాక  తను గుర్తుచేసుకుంటూ  "అసలు మీరు బొంగరాల రంగారావుగారేనా?"అంది.


 
    అంత పెద్ద రచయిత గొంతు ఛండాలంగా వుండే అవకాశంలేదన్న ఆలోచనతో.

 

    "ఆయన నిద్రపోతున్నారు"

 

    "ఈ టైంలోనా?" అప్పడు సమయం మధ్యాహ్నం పన్నెండున్నర కావస్తుంటే "బహుశా రాత్రంతా రాసుకుంటూ బిజీగా వున్నారేమో" అనుకుంది.

 

    వెంటనే "ఎన్ని గంటలకి లేస్తారు?"

 

    "ఇప్పుడప్పుడే లేవడు" వ్యంగ్యంగా వినిపించింది.

 Previous Page Next Page