Previous Page Next Page 
పెంకుటిల్లు పేజి 33


    ఆయనే తిరిగి అన్నాడు : "నాకు చావంటే భయంలేదు. ఉదయం డాక్టరు మీతో రహస్యంగా ఏదో చెబుతూంటే అనుమానం వేసింది. పిరికితనంకాదు-శకుంతలని గురించి ఆందోళన"

    ఆయనకు కొద్దిగా ఆయాసం వచ్చింది. వగరుస్తూంటే ప్రకాశరావన్నాడు; "ఎందుకు ఆయాసం తెచ్చుకుంటారు? పడుకోండి."

    కష్టంమీద నవ్వి ఆయన అన్నాడు : "జీవితంలో నాకు అభిమానమైంది అది అతిగా మాట్లాడటం. నాకు ఓపిక ఉన్నంత వరకూ మాట్లాడతాను" అని కొంచెం ఆగి "ఇప్పుడు నాకు ప్రాణంపోదే అనుకోండి. నయమవుతుంది. కాని రేపు ఇంకో రోజున హైబ్లడ్ పెష్రర్ వస్తుంది. అప్పుడేమవుతుంది? చివరి దశలో మాట్లాడుకోవలసిన విషయాలు మధ్య దశలోనే మాట్లాడుకుందాం. బలహీనత ఒక్కటే ప్రాణం పోవటానికి కారణం కాదు. బలంగా వుండటం ఒక్కటే ప్రాణం కాపాడటానికి కారణం కాదు."

    ఆయనతో ఇహ వాదించి లాభం లేదని ప్రకాశరావు నిశ్శబ్దంగా వినటానికే నిశ్చయించుకొన్నాడు.

    "ఈ లోకంలో శకుంతలకు నేను తప్ప వేరెవ్వరు లేరు. నేను పోతే....." ని రుద్ద కంఠంతో "స్నేహపాత్రులైనవారిగా నాకు మీరు ఒకరే కనిపించారు. మీరు డానికి ఏమయినా సాయపడగలరా?" అన్నారు.

    ప్రకాశరావు కొంచెం ఉలిక్కిపడి ఆయనవంక ప్రశ్నార్థకంగా చూశాడు.

    "లేనిపోని కోరికలు కోరి ఇష్టం వున్నా, లేకున్నా ప్రమాణాలు చేయించుకోను. దాని జీవితం ఒక మార్గంలో పడేవరకూ అంగరక్షకుడుగా వుండండి. వాగ్దానాలు చేయనవసరం లేదు.సరే అంటే చాలు."

    "సరే" అని ప్రకాశరావు దృఢంగాఅన్నాడు.

    "బంధువులని గురించి నా కెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. మాకూ ఎవరో బంధువులున్నారుగాని ఇప్పుడు వాళ్ళకీ వీళ్ళకీ కబుర్లు పంపంటం నాకేం ఇష్టంలేదు. స్నేహపాత్రులైనవారు మీవంటివారు ఒక్కరు చాలు" అన్నారు.

    ప్రకాశరావు ఏమి మాట్లాడాలో తెలియక వూరుకున్నాడు.

    ఆయన కొంచెంగా నవ్వి "శకుంతల గురించి మీరో విషయం తెలుసుకోవాలి. ఆమె మనసులో ఉన్నది సగం కంటే ఎప్పుడూ బయటపెట్టదు. అది గ్రహిస్తే చాలు" అన్నాడు.

    ఆ తర్వాత బహుశా ఈ నలభై అయిదేళ్ళ జీవితంలో జరిగిపోయిన ముఖ్య సంఘటనలేవో ఒకదాని తర్వాత ఒకటో, ఒకదాని మీద ఒకటో ఆయన మనసులో మెదులుతూ వుండవచ్చు. చిరునవ్వు పెదాలపై నాట్యమాడుతూండగా మాట్లాడకుండా పడుకున్నారు. ప్రకాశరావు రెండుమూడు నిమిషాలు అక్కడే మౌనంగా కూర్చుండి, అక్కడికి శకుంతల జావగ్లాసుతో రావటం చూసి, లేచి గదిలోకి వెళ్ళిపోయాడు.

    మరునాడు ఉదయం పదిగంటలకు ప్రకాశరావు తనగదిలో కూర్చుని వున్నాడు. నిన్నటినుంచీ వివిధ సంఘటనలచేత అతని మనసంతా కల్లోలం అయిపోయింది. వేళకి తిండీ, సరిగ్గా నిద్రా లేకపోవటం చేతా ఆరోగ్యం కూడా సరిగ్గాలేదు. నిన్నటిలాగే యివాళకూడా ప్రయివేటు కుర్రాళ్ళు వస్తే వంట్లో బాగాలేదని చెప్పకుండానే పంపేశాడు.

    ఇంతలో బయటినుంచి పోస్టుమేన్ కేకలా వినబడగా వెళ్ళి ఒక కవరుతో తిరిగి వచ్చాడు. అది ఇంటిదగ్గర నుంచి వచ్చిందని తెలుస్తూనే వుంది. చించి చదివాడు. చదవటం పూర్తయ్యేసరికి అతను నిరుత్తరుడయాడు.

    అతనిలో ఆవిరిస్తున్న ఆలోచనలు ఇంకా ఒక స్థాయిలోకి చేరుకోక ముందే తండ్రిని పడుకోబెట్టి ఆ గదిలోకి వచ్చిన శకుంతల "ఎక్కడి నుంచి ఉత్తరం?" అని అడిగింది.

    ప్రకాశరావు జవాబు చెప్పకుండా మ్రాన్పడిపోయి చూశాడు. తరువాత జీవం లేనట్లుగా చేతిలోని ఉత్తరం ఆమెకు అందిచ్చాడు. ఆమె చదివింది.

    "ఇంకా మూడురోజులుంది." అంది తలయెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ.

    "మీరు......"

    "ఇవాళే బయల్దేరి వెళ్ళాలా?"

    ఏం చెప్పాలో ప్రకాశరావుకూ తెలీదు. అన్నగారి పెళ్ళి యింత త్వరలో నిశ్చయించబడటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్నగారి తత్వం అతనికి తెలుసు ఇప్పుడప్పుడే వివాహానికి ఒప్పుకోడని కూడా అతను భావించాడు.

    కాని యిలా జరిగిపోయింది. ఇరుకులో చిక్కుకున్నట్లు అతను బాధపడ్డాడు. వెళ్ళడమా? మానడమా? వెడితే ఎలా? మానితే ఎలా?

    చివరికి ఏదో నిశ్చయించుకొని "నేను వెళ్ళను" అన్నాడు.

    "అదేమిటి?"

    "అంతే, వెడితే ఎలా?"

    "వెళ్ళకపోతే ఎలా?" అతని మనసులో ఇరుపక్షాలా జరుగుతున్న పోరాటంలో శకుంతల ఒకవైపు నిలిచి మాట్లాడింది.

    తిరిగి ఆమె అంది. సాక్షాత్తు అన్నగారి పెళ్ళికి వెళ్ళకపోతే యేమనుకుంటారు? మీరలా ఎందుకన్నారో నా కర్థం అయింది. కాని..... "

    "మీరు వంటరిగా జబ్బుతోవున్న తండ్రితో యెలా వుండగలరు?"

    శకుంతల నవ్వి "రోగాలు రాకపోతే ఒక మనిషీ. వచ్చాక ఒక మనిషీనా ఏమిటి? ఎన్నో సంవత్సరాలు ఆయనతో నేను గడిపాను. మీరు లేకపోతే నాలుగు రోజులు వుండలేనా?" అంది విచారంతో కూడిన కంఠంతో.

    "మీరు అతిశయోక్తిగా భావించుకున్నాసరే, నాకు వెళ్ళాలని లేదు."

    "నాకు తెలుసు" ఆమె దృఢంగా అంది.

    "మీ గురించి నాకు చాలా సంగతులు తెలుసు. అవసరం వచ్చినప్పుడు ఇవతల ఏమయిపోతోందో అని తటపటాయించటంలో అర్థంలేదు. మీరు వెళ్ళాల్సిందే."

    ప్రకాశరావు ఆమెతో ఏమీ మాట్లాడలేకపోయాడు. తన ప్రయాణం యిహ ఎలాగూ తప్పదని అతనికి బోధపడింది. అందుకని సన్నాహాలు చేయసాగాడు. ఈ రోజుగూడా ఇక్కడే వుండి మరునాడు తెల్లవారు ఝామున బయలుదేరి వచ్చేసేయాలని అతని సంకల్పం. రామారావుగారితో యి విషయం చెప్పటానికి అతను జంకాడు. చివరికి శకుంతలే చెప్పింది. ఆయన నవ్వి "భయం ఎందుకు? పదిమంది మనుష్యులుండి చేసేదేమిటి? తప్పకుండా వెళ్ళిరండి" అన్నారు. ఆ రోజు తను అక్కడే వుండి చేయదలచినదంతా చేశాడు ప్రకాశరావు. రంగయ్యను వెయ్యికళ్ళతో కాపాడుతూండమని మరీ మరీ చెప్పాడు.

    మరునాటి ఉదయం శకుంతలకు నాలుగున్నరకు మెలుకువచ్చింది. ప్రకాశరావును లేపాలని ఆమెకు వెంటనే గుర్తుకువచ్చింది. పోయి లేపింది.

    ప్రకాశరావు కళ్ళు నులుముకుంటూ లేచి "టైమయిందా?" అంటూ ఆదుర్దాపడుతూ నిల్చున్నాడు. ఒక గంటలో ప్రయాణానికి సిద్ధం అయిపోయాడు. రంగయ్య బండి పిలుచుకువచ్చేందుకు పోయాడు. అతనికి ఏదో లోటుగానే వుంది. స్థిమితంగా వెళ్ళలేకుండా వున్నాడు.

    అతను గదిలోంచి బయటకు రాబోతూండగా శకుంతలే లోపలికి వచ్చింది. అతనికి ఓ విషయం ఆమెను అడగాలని వుంది ఆ మాటే అన్నాడు బయటకి.

    "అడగండి."

    ఎందుకో తడబడ్డాడు. నోరు జారి చప్పున మాట బయటకు రాలేదు. గుడ్లు మెటకరించి చూడటం తప్పితే ఏమీ చేయలేకపోయాడు. అతని అవస్థ చూస్తూ శకుంతల "సరేలెండి" అంటూ బయటికి వెళ్ళిపోయింది.

    అతనా కంగారులో ఏమి చెప్పటానికీ తోచక మాటకంటే చేతకే అనాలోచితంగా ప్రాముఖ్యం ఇచ్చి తొందరపడి ఆమెను చేయిపట్టుకుని ఆపి "నా మీద కోపంలేదని చెప్పండి" అన్నాడు.

    ఆమె అతనివంక తెల్లబోయిచూసి, త్వరగా గట్టిగా నవ్వి "భలే వారే! నాకేం కోపంలేదు" అంది. ఇంతలో రంగయ్య బయటనుంచి కేకవేశాడు. రామారావుగారితో చెబుదామంటే ఆయనింకా నిద్రనుంచి లేవలేదు. ప్రకాశరావు తెలికబడిన హృదయంతో బండిలోకి వచ్చి కూర్చుని "పోనియ్" అన్నాడు.

   
                                                       17

    చాలా రోజుల్నుంచీ బోసిపోతూన్న యిల్లు కొన్ని రోజుల్నుంచి కళకళలాడిపోతోంది. ఇంటికి పెళ్ళికళ వచ్చింది. క్రమక్రమంగా బంధుమిత్రులంతా రాసాగారు.

    మొగపెళ్ళివారు కావటంవల్ల చేయవలసిన పని ఎక్కువలేదు. రాధ చాలా చురుకైన పిల్ల కావటంవల్ల ఉన్న కొద్దిపనినీ తెలివితేటలతోనూ, సమర్ధతతోనూ నిర్వహించసాగింది. నారాయణకు గుడివాడ సంబంధమె స్థిరపడింది. అతను పెద్దగా జోక్యం కూడా కలిగించుకోలేదు. ఏమాత్రం అశాంతి, మనస్థాపాలూ లేకుండానే ముహూర్తం నిశ్చయింపడింది. నారాయణ చెప్పింది ఒక్కటే. ఎవరేమి సలహాలు చెప్పినా అతను వినిపించుకోలేదు. తను పట్టు విడవలేదు. "నాకు కట్నం అక్కర్లేదు" అని మొదటినుంచీ అంటున్నాడు. అలాగే చేశాడు.

    ఒకరోజు అందరి యిళ్ళలోనూ పిలుస్తూ, రాధ తండ్రిగారి స్నేహితుడు గనుక గంగాధరంగారి యింట్లోనూ పిలవటానికి వెళ్ళింది. అంతకు ముందుదాకా వాకిట్లో కూర్చుని చుట్ట కాల్చుకుంటూన్న ఆయన లోపలి పోయి ఆడవాళ్ళతో ఏమి చెప్పాడో యేమిటో వాళ్ళు తలుపులు బిడాయించుకున్నారు. రాధ పిలిచి చూసింది. కాని జవాబు లేదు. ఆమె కొంచెం అవమానంతో యింటికి వచ్చినప్పుడు తండ్రితో యీ విషయం చెప్పింది. ఆయన ఒకసారి ఆకాశంలోకి చూసి, మళ్ళీ తల దించుకున్నాడు.

    ముసమ్మగారికి శరీరంలో అలానేవుంది. మనుమడి పెళ్ళి అవుతూన్నదంటే బ్రహ్మానందపడింది. కాని ఆవిడగారికి పెత్తనం చేద్దామంటే బొత్తిగా వీలులేదాయె. మంచంమీదనుంచి కదలలేదు. అయినా ఉత్సాహాన్ని ఆపుకోలేక కోడలిని పిలిచి అప్పుడప్పుడూ ఏవేవో ఆజ్ఞలిస్తూ వుండేది.

    ఆవిడని పెళ్ళి అయిపోయేవరకన్నా జీవించి వుండేటట్లు చేయాలని చిదంబరం ఆవిడ మందుల కోసం, ఆహారం కోసం బాగా డబ్బు చేయసాగాడు. మందుల నిమిత్తం అయితేనేమిటి, పెళ్ళి ఖర్చులకూ, అవసరాలకూ అయితేనేమిటి డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు కాసాగింది. ఈ అపరిమితమైన ఖర్చును చూసి నారాయణకు భయం వేసింది. తన పెళ్ళి ఇంత ఆడంబరంగా చేసి బోలెడు వ్యయం చేయటం అతని కేమాత్రం  ఇష్టంలేదు. కాని ప్రతిదానికీ అడ్డంకులు చెబుతూంటే వాళ్ళు విసుక్కుంటారేమోనని ఊరుకునేవాడు. ఈ మనుష్యులకు ముందు ఆలోచన ఏమీ లేదు ఏమిటా అని తనలో తనే వ్యధ చెందుతూ, యీ విధంగానే ఇంకా కొంత కాలం ప్రవర్తిస్తే వీళ్ళగతి యేమవుతుందోనని కుమిలిపోయేవాడు.

    పెళ్ళికి చిదంబరం తమ్ముడికికూడా శుభలేఖ, రమ్మని మరీ మరీ ప్రాధేయపడుతూ ఒక ఉత్తరమూ వెళ్ళాయి. కాని అందరూ బయల్దేరే రోజునన్నా ఆయన ఆగమనంగానీ, ఆయన దగ్గర్నుంచి వర్తమానంగానీ ఏమీలేదు ముసలమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుంటూ "వాడెక్కడరా? నేనేనాడో చచ్చిపోయానని వాడు భావించాడు. ఈ అసువులు పోయేలోగా ముసలి తల్లిని ఒకమాతయినా చూడటానికి వాడు రాడు" అంది.

    అన్నపూర్ణ భర్తతోసహా రెండురోజులు ముందుగానే వచ్చింది. ప్రకాశరావు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా కనిపించి, హాయిగా నిట్టూర్చాడు.

    అన్నపూర్ణ భర్త ముకుందరావు, ప్రకాశరావు ఇద్దరూ ఆ సాయంత్రం షికారు పోయినప్పుడు ముకుందరావు బావమరిదిని అడిగాడు; చదువెలా సాగుతోంది?" అని.

    "ఏదో...."

    ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకొని నవ్వుకొన్నారు ఏదో వ్యక్తిగత వింతలు, వ్యధలు వాళ్ళ ముఖాల్లో క్షణకాలం మెరిసి ఆ నవ్వులో మిశ్రితం అయిపోయాయి.

    ప్రకాశరావు కొన్ని కొన్ని విషయాలలో ఎంత అమాయకంగా వుంటాడంటే- ముకుందరావు "ఈసారి మీ అక్కయ్యను నాతోపాటు తీసుకుపోను" అని అన్నప్పుడు అతనికి ఏ మాత్రం అర్థం కాలేదు.

 Previous Page Next Page