Previous Page Next Page 
అష్టావక్ర పేజి 33


    అష్టావక్ర :- క్షుద్రగణాధిపతి కాష్మోరా మూడోసారి లేచిన నిద్రలో, రెండు'సార్లు పుంజుకున్న శక్తితో అష్టావక్రగా జన్మిస్తాడు. గర్భంనుంచి వెలువడటంద్వారా తల్లినీ, పుట్టినరోజే తండ్రినీ చంపి, కుక్కలు, తోడేళ్ళ సాయంతో పెరిగి పెద్దవాడై భూమ్మీద సైతాను రాజ్యాన్ని స్థాపిస్తాడు. అతడి ఆగమనానికి ముందుగా అదే గ్రామంలో వరుసగా వికృత శిశువులు జన్మిస్తారు. ప్రమధ గణాధిపతులు అష్టావక్రుణ్ణి పెంచి పెద్దజేస్తారు. క్రూరుడై, రక్తం తాగుతూ, మాంసాన్ని భుజిస్తూ అష్టావక్రుడు పెరిగి పెద్దవాడవుతాడు. కేవలం దెయ్యాన్ని నమ్మినవాళ్లు మాత్రమే అతడి రాజ్యంలో సర్వసౌఖ్యాలు అనుభవిస్తారు".

    సిద్ధార్థ మొహంలో రక్తం ఇంకిపోయింది.

    గోడలు కృంగి మీదపడుతున్నట్టు భావన కలిగింది. స్పృహ తప్పుతున్నట్టు అనిపించింది.


                          22


    డాక్టర్ రంగప్రసాద్ చాలా సేపు తన కుర్చీలో అలానే కూర్చుండి పోయాడు.

    ....ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు అతడు.

    అంతలో ఒక ఆలోచన స్పురించింది.

    గ్రామంలో తనపట్ల అవిశ్వాసం జనించి, అప్పటివరకూ తన దగ్గిర ట్రీట్ మెంట్ తీసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళలో ముగ్గురు నిండు గర్భవతులు వున్నారు. అందులో ఇద్దరు బాబాతో తాయెత్తు కట్టించుకున్నారు. మూడో స్త్రీకి బాబా తాయెత్తు కట్టనన్నాడు. ఆమె దేముడికి అపచారం చేసింది కాబట్టి అనర్హురాలు అన్నాడు. ఆమె ఒక కూలీ స్త్రీ. భర్త ఎంత ప్రాధేయపడినా లాభంలేకపోయింది. నిరాశతో వాళ్ళు పురిటికోసం పక్క పట్నపు ఆస్పత్రికి వెళ్ళారు.

    ఏం జరిగిందీ అక్కడికి వెళ్లి చూస్తే..?

    ఈ ఆలోచన వచ్చాక అతడు ఆగలేదు. పట్నంలో హాస్పిటల్ కి వెళ్ళాడు. డాక్టర్ తో "నేను లేబర్ రూమ్ లోకి వెళ్ళవచ్చా?" అని అడిగాడు.

    "అదేమిటి ప్రసాద్! మీరూ డాక్టరేగా!! మీకు అభ్యంతరం ఏముంటుంది? రండి" అంటూ తనతోపాటు తీసుకువెళ్ళాడు ఆ డాక్టరు.

    అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల గదుల్లానే వుంది ఆ రూము కూడా. పట్టించుకున్న నాధుడు లేడు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? గవర్నమెంటు పనికాబట్టి పనివాళ్ళ నిర్లక్ష్యం డాక్టర్లుగానీ, సూపర్ వైజరుగానీ ఏమీ చేయలేదు. పైగా నిధుల కొరత. రంగప్రసాద్ మధ్యనున్న 'కాట్' దగ్గిరకి నడిచాడు, అక్కడ డాక్టర్ వనజాక్షి నిలబడివుంది.

    రంగాప్రసాద్ ఆమెకి తెలుసు. ఆ మాటకొస్తే చాలామంది డాక్టర్లకు అతడు తెలుసు. చాలామంది డాక్టర్లు చెయ్యాలనుకున్నదీ- కేవలం ఊహల్లోనే ఊహించుకుని చాలామంది సంతృప్తిపడేదీ- అతడు పల్లెలో చేసి చూపిస్తున్నాడు. అందుకే అతడంటే అందరికీ భక్తీ- గౌరవం! ఆ నిస్వార్థత చాలామంది ఆశయాల్లోనే కప్పబడిపోతూ వుంటుంది.

    "ఎంత సేపట్నుంచీ ప్రయత్నం చేసినా మూవ్ అవటం లేదు" అంటూ ఆమె ఇంగ్లీషులో వివరించబోయింది. అంతలో పక్కమీద పేషెంటు చిన్న జర్క్ ఇవ్వటంతో ముగ్గురి దృష్టీ ఆ కాబోయే తల్లి మీద పడింది. నర్సు చటుక్కున వంగి, అడ్జెస్టు చేసింది.

    ముందు కాళ్ళు దర్శనం అయ్యాయి.

    రంగాప్రసాద్ ఊపిరి బిగపట్టాడు. పుట్టనుంచి ఒక సర్పం, గత రాత్రి తాలూకు ఆహారం జీర్ణంకాని అవస్థలో మెల్లమెల్లగా బయటకు వచ్చినట్టూ... ఒక ఇబ్బందికరమైన భావన! అంతలో పూర్ణ శిశువు బయటకు వచ్చింది.

    రంగప్రసాద్ అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు. అంత అనుభవం వున్న వనజాక్షి కూడా కళ్ళు అప్పగించి లిప్తపాటు ఏమీ తోచనట్టు చూసింది. శిశువు కాళ్ళతోపాటు నడుము కూడా వచ్చింది. మూడో డాక్టర్ కి డెలివరీ కేసుల్లో అంత అనుభవం లేదు. కాబట్టి అతడు మామూలుగా వున్నాడుగానీ- మిగతా ఇద్దరికీ ఆ అపసవ్యత తెలుస్తూంది.

    అంతలో కాళ్ళ మధ్యనుంచి శిశువు శరీరం మొత్తం బయటకి వచ్చింది.

    గర్భిణీ స్త్రీ మొహం దగ్గర వున్న నర్సు కంగారుపడుతూంది. చప్పున ఈ లోకంలోకి వచ్చినట్టు వనజాక్షి డాక్టరు మేల్కొని, ఆమె అటు వెళ్ళింది. రంగప్రసాద్ మాత్రం కదల్లేదు. స్థాణువులా అలా నిలబడి వున్నాడు.

    తల్లి మరణించిందని తెలుస్తూనే వుంది. అయినా అతడు కదల్లేదు. తను చేసేదేమీలేదని అతడికి తెలుసు. అయినా అతడు ఆలోచిస్తున్నది అదికాదు. కన్నార్పకుండా శిశువునే చూస్తున్నాడు.

    ప్రపంచ చరిత్రలో ఏనాడూ అలా జరిగి వుండదు. పుట్టిన ఏ శిశువూ ఎక్కడా లేని విధంగా- కూర్చుని వున్నాడు. కాళ్ళు 'మూడు' అంకెలా వున్నాయి. మరో నర్సు చిన్న గుడ్డతో సర్దుతోంది. ఆమెకూడా కొత్తదే కావచ్చు. తలని ముట్టుకోవటానికి భయపడుతూంది.

    శిశువు కళ్ళు తెరుచుకుని వున్నాయి!!!

    పుట్టి రెండు నెలలయిందా? కడుపులోంచే ప్రపంచాన్ని చూస్తున్నాడా- అనిపించేటట్టు వున్నాయి ఆ కళ్ళు. గుండె లోతుల్లో రహస్యాన్ని పరికిస్తున్నట్టు రంగప్రసాద్ వైపు తీక్షణంగా చూశాయి! అంతలోనే నవ్వేయి!! ఎనిమిదోవాడు వస్తున్నాడు సుమా- అని ఏడోవాడు చెప్తున్నట్టు సందేశం అందింది. తన సందేశపు రియాక్షన్ ఎలా వుంటుందా అన్న కుతూహలంతో చూస్తున్నట్టు వున్నాయి ఆ కళ్ళు! సమాధిమీద గడ్డి దుబ్బులా అతడి తల వూగుతూంది.

    రంగప్రసాద్ లో అప్రయత్నంగా చలి మొదలై వెన్ను అంతా పాకింది. వళ్ళు జలదరించింది. క్షుద్రగణాధిపతులు అందరూ తనచుట్టూచేరి, నిశ్శబ్దస్వరాలతో 'హ హా హె హో' అని అరుస్తూ నాట్యం చేస్తున్న భావన కలిగింది. అష్టావక్రుడి జననాన్ని ఇంకెవరూ ఆపలేరు అన్నట్టుగా, ధీమాగా- ఆ శిశువు అతడివైపే చూస్తూంది.

    రంగప్రసాద్ మనసులో భావాలు అనూహ్యంగా కదలాడసాగాయి. జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసింది. బాబా మాటలు నిజమేనా? అష్టావక్రుడు ఆవిర్భవించబోతున్నాడా? దానికి ఆఖరి నిదర్శనం ఇదేనా?

    కేదారగౌరి గర్భమే అందుకు నెలవు అవుతుందా?... అన్నీ ఆలోచన్లే.

    ఇంతలో లోపల తల్లి విషయం బయటకు తెలిసినట్టుంది- జనం ఏడుపులు వినిపిస్తున్నాయి. రంగప్రసాద్ కదల్లేదు. శిశువు వంక మరో మారు చూశాడు.

    ఈ భూమ్మీదకు వచ్చినపని అయిపోయినట్టు ఇవ్వవలసిన సందేశం అందజేసినట్టు, ఆ శిశువు శరీరం క్రమక్రమంగా మామూలుగా అయిపోయింది. వెనక్కి పడిపోయింది. కళ్ళు మూతలు పడిపోయాయి. శిశువు ప్రాణం కూడా పోయింది.

    అయిదు నిమిషాల తరువాత డాక్టర్ రంగప్రసాద్ ఆ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాడు. శ్మశానం నుంచి ఇంటికి వెళ్తున్నవాడిలా అతడి మొహం కళావిహీనంగా వుంది. నిస్సత్తువుగా నడవసాగాడు.

    తన చేతుల్తో గౌరి పురుడు పోయాలంటే భయంగా అనిపించసాగింది. తన వెనుక ఏడుగురు శిశువులు వికటాట్టహాసం చేస్తున్న ధ్వని- క్రమంగా దగ్గిరై చెవిలో వికృతంగా అరుస్తున్న భావం కలిగింది.


                                                         23


    "నాకు భయంగా వుంది" అంది రంజిత.

    షాడో మాట్లాడలేదు.

    "అంత పకడ్బందీగా వాళ్ళు వున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ రహస్యం బయట పడదని వాళ్ళకి నమ్మకం వుంటుంది. అటువంటప్పుడు నువ్వు వెళ్ళటం దుస్సాహసమే అవుతుంది!"

    షాడో లేచి "వెళ్ళొస్తాను రంజితా" అన్నాడు.

    తను అప్పటివరకూ చెప్పినదేమీ అతడు వినలేదు అని గ్రహించి "తప్పదా" అని అడిగింది.

    "తప్పదు రంజితా" అన్నాడు రవి. "నేను చేస్తున్నది రిస్కుతో కూడిన పని అనీ, పులుల బోనులో తల పెడుతున్నాననీ నాకు తెలుసు. కానీ తప్పదు. ఈ సమస్యేగాని నా చెల్లెలికి సంబంధించినది కాకపోయి వుంటే నేనింత రిస్కు తీసుకుని వుండేవాణ్ణి కాను" అంటూ ఆమెవైపు చూశాడు. తరువాత నెమ్మదిగా అన్నాడు-

    "ఒకవేళ నాకేమైనా అయితే, వెధవ సెంటిమెంట్లతో కృంగిపోకు. షాడోతో పరిచయం ఒక అందమైన స్మృతిలా మిగుల్చుకుని, భవిష్యత్తుని ఆనందంగా గడుపు. ఇదే నా ఆఖరి బహుమతి" అంటూ మళ్ళీ ఇంకొకసారి ముద్దు పెట్టుకున్నాడు. ఆమెకు ఆ మాటల్తో మరింత వ్యధ ఎక్కువైంది.

    అతికష్టంమీద దాన్ని కప్పిపుచ్చుకుంది.

    తన చేతి వాచీ తీసి అతడికి తొడిగింది. నవ్వుతూ, "నీకు నేను గుర్తు వుండటానికి" అంది. అతడూ నవ్వేడు. కానీ ఆమె నవ్వులో జీవం లేదు. అతడు ఎంత రిస్కు తీసుకుంటున్నాడో ఆమెకి తెలుసు. మనసు మారుమూలల్లో రహస్యాల్ని కూడా క్షుద్రగణాల సాయంతో తెలుసుకోగలిగే నరరూప రాక్షసుల మధ్యకు వెళుతున్నాడు అతడు. బహుశా త్రిఇగి రా(లే)కపోవచ్చు. అత్యంత భయానకమైన ఆ సన్నివేశాన్ని అతి తేలిగ్గా తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు అవతలివారిని నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నారిద్దరూ!

    అంతలో గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. "వెళ్తాను. టైమైంది" అన్నాడు. ఆమె తలూపింది.

    అతడు బయటకు నడిచాడు.

    ఆమె అలాగే చూస్తూ నిలబడింది. క్రమక్రమంగా అతడు అదృశ్యమయ్యాడు.


                   *    *    *    *


    నిర్ణీత సమయానికి, నిర్ణీత ప్రదేశంలో అతడికోసం బ్లాక్ స్కెలిటన్ ఎదురు చూస్తున్నాడు. షాడో రాగానే "వెళ్దామా" అన్నాడు. షాడో తలూపాడు.

    అదే ఇరుకుసందు, అదే చీకటి.

    ఇద్దరూ ఒక ఇంటిముందు ఆగారు. చాలా చిన్న ద్వారం.

    బ్లాక్ స్కెలిటన్ తలుపు కొట్టాడు. లోపలెక్కడో గంట మోగుతున్న ధ్వని.

    అంతలో తలుపు తెరుచుకుంది. ఇద్దరూ లోపలికి ప్రవేశిస్తూవుంటే "మనసు నిర్మలంగా వుంచుకో. అడిగిన ప్రశ్నకి సరియైన సమాధానం చెప్పు. నువ్వు అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేవు" అన్నాడు.

    హాలు మధ్యలో ఒక చప్టాలా వుంది. దానిమీద ఇనుప చట్రం బిగించబడి వుంది. పైన ఒక పదునైన కత్తి వుంది. మెడలు పెట్టటానికి రంధ్రాలున్నాయి.

    గెలిటన్!!

    ఇద్దరి చేతులూ వెనక్కి కట్టబడ్డాయి.

    "ఉస్సోక్ ని మోసం చేసే అభిప్రాయంగానీ నీకుంటే, నీ శిరస్సూ.... నిన్ను తీసుకొచ్చినందుకు నా తలా తెగిపడతాయి".

    షాడో మాట్లాడలేదు. ఏదో అదృశ్యశక్తి తన మనసుని ఆక్రమించుకుంటున్న భావన కలిగింది. మనసుని కంట్రోలు చేసుకోవాలనుకున్నాడు. సాధ్యంకాలేదు. అంతలో మెడమీద ఛట్రం బిగుసుకుంది. మెడకి ఆరంగుళాల ఎత్తులో కత్తి వేలాడుతూ వుంది. దూరంగా శబ్దం ప్రారంభమైంది.

    దానితోపాటే ప్రశ్నలు కూడా.

    "మిత్రుడా! నీ పేరు?"

 Previous Page Next Page