జయేంద్ర గదిలోకి వెళ్ళిపోయాడు.
తమకమో తమసమో శృతికళ్ళిప్పుడు నీటికుండలై సంతృప్తిగా అశృవుల్ని చిమ్ముతున్నాయి.
* * * *
హఠాత్తుగా నిద్రలోనుంచి మేల్కొంది శృతి.
ఇంకా తెల్లవారనట్టు అంతతా నిశ్శబ్దంగా వుంది.
సమీపంలో ఓ పాము బుసలా వినిపించింది. అది క్రమంగా లక్షల పాము నిశ్వాసాల్లా ఆమె చెవులకి సోకుతుంటే గగుర్పాటుగా లేచింది.
అనుమానంలేదు. పక్కగదిలోంచి వినిపిస్తుంది.
సభ్యతా సభ్యతల్ని మరిచి కిటికీ రెక్కల్ని తెరిచింది.
అంతే...
అదిరిపడింది అక్కడ దృశ్యాన్ని చూసి.
ఒక పాము కాటుతిన్న మనిషిలా జయేంద్ర బెడ్ పై మెలితిరిగిపోతున్నాడు.
అదికూడాకాదు...జయేంద్ర కళ్ళు నిప్పుల్లా మెరుస్తున్నాయి. ఉద్వేగంగా లోపలికి వెళ్లేదేకాని ఎవరో బలంగా పట్టుకున్నట్టు ఆగిపోయింది.
అక్కడ జయేంద్ర నగ్నంగా వున్నాడు...
పసిమి ఛాయతో మెరుస్తున్న అతడి శరీరంనుంచి స్వేదం వరదలా ధార కడుతూంది. గాయపడిన కళింగ నాగులా ఊపిరి ఎగదన్నుతున్నట్టు ఉక్కిరిబిక్కిరౌతూ దొర్లుతున్నాడు...
ఆమె చూస్తుండగానే పరుపును క్రూరంగా పైకి లాక్కుని ఉక్రోషంగా పీలికలుచేస్తూ ఒక మండే జ్వాలలా ఎగిసిపడుతున్నాడు.
శృతి వెన్నులో చలి మొదలైంది. ఏం జరిగిందీ, మరేం జరగబోతుందో తెలీని స్థితిలో నిలబడ్డ డాక్టర్ శృతి ఆ నిశ్శబ్ద నీరవనిశీధిలో ఎలాంటి భయాందోళనకు గురైందీ అంటే ఒంటరిగా అతడ్ని సమీపించే సాహసం చేయలేకపోయింది.
ఇప్పుడేం చేయాలి.
నిస్సహాయంగా ఆలోచిస్తూంది.
అసలేం జరిగింది?
డాక్టరుగా సైతం అంచనా వేయలేకపోతూంది.
శ్వాసకోసం తెగిపోతున్నట్టు వెక్కిళ్ళు వినిపించాయి. వెనువెంటనే ఓ కీకారణ్యపు అంతర్భాగాన రాబందుల రెక్కల చప్పుడుకి బెదిరే నాగులా సంకెళ్ళను ఛేదించుకుని అమ్మ కడుపునుంచి నేలపైకి జారే పసికూనలా అస్థిమితంగా ముడుచుకుపోయాడు.
ఆమె నిర్విణ్ణురాలై చూస్తూనే వుంది.
అతడు కాళ్ళను మెలిపెట్టి ఉద్వేగంగా పైకిలేచి చేతుల్ని మోకాళ్ళకు చుట్టి నేలపై కూర్చున్నాడు. అదీ అరక్షణమే...
మరుక్షణం నిస్సహాయపు ఆర్తనాదంలా ఓ నిశ్వాసం పైకి విడిచి పొట్టను పట్టుకున్నాడు.
కొన్నిక్షణాల క్రితందాకా ఎరుపు జీరలు నిండిన అతడి కళ్ళు చీకటి నీలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలయ్యాయి. వేదన స్వేదంలా అలుముకున్న ఆ సమయాన అతడి కళ్ళు గండిపడిన వాగులయ్యాయి.
ఇక నిభాయించుకోలేకపోయింది.
పరిసరాలను గుర్తించలేని స్థితిలో కొన్ని నిముషాలనుంచి మధనపడుతున్న అతడ్ని చేరుకోవాలనుకుంది.
కాని ఆ కొద్దిపాటి అలికిడికి ఒక చప్పుడు విన్న సర్పంలా వెనక్కి మరలాడు.
అదిరిపడ్డ శృతి డోర్ కర్టెన్ వారనే నిలబడిపోయింది గుండెలుగ్గ పట్టుకుని.
క్రమంగా ఉద్విగ్నత సన్నగిల్లింది. సంఘర్షణ చల్లబడినట్టు వ్యధాభరిత హృదయంతో వెల్లకిలా పడుకున్నాడు.
మూసుకున్న అతడి కనురెప్పల అంచులను దాటిన ఏ విషాదమో వై తరణిలా ఉబికివస్తూంది.
దూరంనుంచే గమనించిన శృతి మనసు ద్రవించిపోతూంది. అంతసేపూ తను చూసింది ఓ రుగ్మతే అయితే అది మానసికమో, శారీరకమో ఆమె అంచనా వేయలేకపోతూంది.
ఇదేమిటి...?!
తాత్వికుడిలా కనిపిస్తూ, కోరగానే వరమివ్వగల ఋషిలా అనిపించే ఈ వ్యక్తికిదేం శాపం?
నెమ్మదిగా...చాలా నెమ్మదిగా...అతడికి చేరువగా నడిచింది.
ఏ భావాతీత ధ్యానంలోనో మిగిలినట్టు, అతడి మొహంలో ఎలాంటి భావమూ కనిపించకపోయినా పసిమిఛాయలో మెరిసే అతడి నగ్నదేహం ఒక అనుభవజ్ఞుడైన శిల్పి సృష్టికి తార్కాణమైన శిల అని అనిపించింది. వెనువెంటనే అది ఆమె స్త్రీత్వపు గట్టున తాకే అలగా మారింది.
ఆమె నేత్రాలు... ...మూసుకున్న అతడి కనురెప్పలనుంచి, అదిరిపడే అతడి పెదవులమీదుగా, విశాల వక్షస్థలాన్ని తాకి, వేగంగా నాభిని...అక్కడనుంచి దిగువగా...
శృతిలో అస్పష్టంగా శృతి చేయబడిన ప్రకంపన...!!
రెండు పదులు దాటిన ఆమెకు పురుష స్పర్శ కొత్తయినా, ఒక నగ్న శరీరాన్ని చూడటం కొత్తకాదు. చదువుకునే రోజుల్లో అనాటమీలు...శరీరంపై ఏ ఆచ్చాదనాలేని మేల్ బాడీస్ ని...చూసింది. చాలా దగ్గరగా, ప్రాక్టికల్స్ లో..... ప్రతి అవయవాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది!
కాని ఇదేమిటి...? ఎందుకు తనలో ఈ అలజడి?
ఎక్కడో ఏ మనసు అట్టడుగు పొరల్లోనో ఓ ఆలోచన రగిలి మనసును డోలాయమానంగా కుదుపుతుంటే, నిగ్రహమే సడలుతుందనిపించిందో, లేక బ్రతుకుగతి తప్పుతుందని భ్రమసిందో...అతడ్ని స్పృశించాలన్న కోర్కెను అదిమిపెడుతూ వేగంగా గది బయటికి నడిచింది.
అయితే అయిదు నిముషాలు గడిచాయి.
కనుకొలకులనుంచి రాలిపడిన చివరి నీటిబొట్టు జయేంద్ర చెంపపై చారికగా, ఆవిరై అతడ్ని అప్పుడు స్పృహలోకి రప్పించింది.
ఘనీభవించిన ఏ గతపు తెరలో ఫెటేల్మని చిట్లి...మనసును మండించినట్టు 'దాగలేమమ్మా' అంటూ మరో రెండు అశ్రుబిందువులు అతడి కనురెప్పలమాటున చోటుచేసుకున్నాయి.
అతడి పెదవులు ఆర్తిగా కదులుతున్నాయి యిప్పుడు.
"వేదాలతో, మంత్రపుష్పాల ఉచ్ఛారణతో పునీతుడ్ని కావాల్సిన నన్ను ఒక వేదనకి వారసుడిగా మార్చిన నా తండ్రీ! ఇదిగో ఈ నిశ్శబ్ద రోదనే నా జీవితకాలపు నేస్తమైపోయింది. బ్రతుకుబాటలో ఒక నుంచయినా గతానికి అతీతంగా నడక సాగిద్దామనుకున్నానే. మళ్ళీ ఈ నిశిరాత్రి నిట్టూర్పులేమిటి...ఎందుకు నన్ను శాపగ్రస్తుడ్ని చేశావు. ఈ చీకటి కుహరాల సంఘర్షణలో నన్నెందుకు జవాబు దొరకని ప్రశ్నగా మార్చావు. నాకు జన్మనిచ్చి నాకు కాకుండాపోయిన నా తండ్రీ! ఎన్నాళ్లు నాకీ చెర...ఎప్పుడు నాకీ బ్రతుకునుంచి విముక్తి."
మగతగా కళ్ళు మూసుకుంటున్న అతడికి తెలుసు ఇప్పుడు మొదలైన ఈ చీకటి మధనం కొన్నిరాత్రులపాటు మెలిపెట్టి వేధిస్తుందని...కాని ఎవరికి చెప్పుకోగలడు. ఈ బాధని ఏమని నిర్వచించగలడు.
నిస్త్రాణంగా నిద్రలోకి జారిపోయాడు.
* * * *
తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నా, శృతికది కాళరాత్రి అయ్యింది.
జవాబు దొరకని ఎన్నో ప్రశ్నల్లో ఇప్పుడు జయేంద్ర కూడా ఒకడయ్యాడు...
ఒక ఆడదానిగా కాదు డాక్టరుగా పరిపరివిధాలా ఆలోచించింది.
చివరగా అదో మానసికమైన 'ఫోబియా'గా అనుకుంది. అదీ ఇదమిద్దంగా ఆమెకు తోచడంలేదు...
మనుషులకు అతీతమైన ఋష్యత్వాన్ని అతడిలో దర్శించినా అతడు అర్ధంకాని పజిల్లా ఆదినుంచీ అనిపిస్తూనే వున్నాడు. ఒకవేళ చికిత్సే తప్పనిసరైతే అతడినుంచి చాలా తెలుసుకోవాలి! అతడేమిటి అన్నది పూర్తిగా గ్రహిస్తే తప్ప డాక్టరుగా అయినా ఒక్క అంగుళమైనా తను ముందుకు సాగలేదు.
డాక్టర్ సంఘమిత్ర గుర్తుకొచ్చాడు...
వెనువెంటనే జయేంద్ర లల్లీతోబాటు, తన మాటపై వెళ్ళి, క్షేమంగా తిరిగిరావడం...అతడి సాహసం...అన్నీ వరుసగా జ్ఞప్తికొచ్చాయి. అంతెందుకు...గడిచిన కొన్ని గంటల క్రితం జరిగిన సంఘటనలో తనను రక్షించాలని అతడు ప్రదర్శించిన ధైర్యం చాలు తననతడెంత ఇష్టపడుతున్నదీ తెలుసుకోడానికి...
ఎన్నాళ్ళయింది తనూ ఓ ఆడపిల్లనన్న విషయం మరిచి. ఒక ఆదర్శంకోసం తను బ్రతుకుతున్నా కాని ఒక చల్లని మాట ఉషఃకాల హిమానీ మృదుపధాలలో ఊరటగా అందించే ఒక కరస్పర్శకోసం తనూ అలవోకగా అయినా ఆలోచించడంలేదూ...