Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 33

    ఈ కెమేరాను ఉపయోగించుకుని పద్మిని నుంచి కొన్ని రహస్యాలు లాగాలి. జీవితకాలం ప్రణయాన్ని పంచుకునేందుకు నా ఇంటికి వచ్చిందామె. ఆమె నా నుంచి రహస్యాలు ఎందుకు దాచాలి?
   
    డాక్టర్ విలాస్ ఆనందంగా "మీరు తీసుకుంటారని నాకు తెలుసు. విష్ యూ అండ్ మీ ఆల్ ద బెస్ట్..." అన్నాడు.
   
    అతడు నాపై విజయం సాధిస్తున్నాడని నాకు తెలుసు. కానీ ఓడిపోవటానికి నా కారణాలు నాకూ వున్నాయి.
   
    ఈ విశేషం కోమలికి చెప్పకూడదనే అనుకున్నాను. కానీ ఆమె నాకు డిపార్టుమెంటుకు ఫోన్ చేసినప్పుడు "కోమలీ! నాకు విలాస్ తన భార్య ఫోటోలు చూపించాడు ఆమెపై నాకిప్పుడు గౌరవభావం నశించింది" అని చెప్పాను.
   
    కోమలి పెద్దగా రియాక్టవలేదు. 'అలాగా...." అని మాత్రం అంది.
   
    "ఈ రోజు మనం కలుసుకొనడం కుదరదు. డిపార్టుమెంట్లో గెస్ట్ లెక్చర్ వుంది" అని కూడా ఆమెకు చెప్పాను.

                                        O    O    O    O
   
    ఆ రోజు కూడా పద్మిని తన పిన్నిగారింట ఉండిపోయింది. రాత్రి ఎనిమిది గంటలకు నేను ఇల్లు చేరాను.
   
    నిన్నటికిలా ఈ రోజు విలాస్ వచ్చి నన్ను పలకరించలేదు. ఎందుకోగానీ అతడు వచ్చి నన్ను పలకరిస్తే బాగుండుననిపించింది. మనసులో ఏ మూలో నాకు అతడి పట్ల ఆకర్షణ ఉన్నట్లే ఉన్నది.
   
    ఇంట్లోకి వెళ్ళాక తలుపులు వేసి పాంటు, షర్టు విప్పి లుంగీ కట్టుకుని పడక గదికి వెళ్ళాను.
   
    గదిలో స్విచ్ వేయగానే నాకు కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు.
   
    నా మంచం మీద ఒక యువతి అటు తిరిగి పడుకుని ఉంది. దీపం అలికిడికి, వెలుతురుకు కాబోలు...ఆమె ఇటు తిరిగింది.
   
    చూస్తూనే ఆమెను గుర్తుపట్టాను.
   
    నేననుకున్నట్లు ఆమె కోమలి కాదు.
   
    డాక్టర్ విలాస్ భార్య!
   
    ఉదయమే ఆమె ఫోటోలు చూశాను. ఇప్పుడామెను చూస్తున్నాను.
   
    నా మనసు పరిపరివిధాల పోయింది.
   
    ప్రపంచంలో అవినీతి పెచ్చుమీరిపోతుందా! స్త్రీ పురుషుల నైతిక విలువలకు కొత్త అర్ధాలు వస్తున్నవా? లేక ఒక్కనా విషయంలోనే ఇటువంటి విపరీతానుభవాలు కలుగుతున్నవా?

    కొన్ని ఆదర్శాలకూ, ఆశయాలకూ కట్టుబడ్డ నా విషయంలోనే ఇటువంటి అనుభవాలెందుకు ఎదురవ్వాలి?
   
    ఆమెకు అప్పుడే చిన్న కునుకుపట్టి వుండాలి. అట్నించి ఇటు తిరిగాక ఒక్క క్షణం కనులుమూసుకునే ఉండి తర్వాత నెమ్మదిగా చూడటానికి ప్రయత్నించింది కనురెప్పను విడీ విడగానే స్విచ్ బోర్డు వద్ద నిలబడివున్నా నేను కనిపించాను. నా వంక ఓ క్షణం అలా చూసిందామె.
   
    ఉన్నట్లుండి ఉలిక్కిపడి లేచికూర్చుంది. జారిపోయిన పైట సవరించుకుంది.
   
    ఆమె ముఖానికి బురఖాలేదు.
   
    ఉదయం ఆమె ఫోటోలు చూశాను...ఇప్పుడామెను చూస్తున్నాను...
   
    మెదడు చురుగ్గా పనిచేస్తున్నది. శరీరం వేడెక్కుతున్నది!
   
    ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది! ఎలా వచ్చింది?
   
    ఆమె మంచంమీంచి లేచి నిలబడి నన్ను సమీపించి "నా గురించి మీరేమనుకున్నాసరే, నేను మీకోసం వచ్చాను" అన్నది.
   
    "ఎవర్నువ్వు?" అన్నాను ఎరగనట్లు.
   
    "తెలియనట్లు నటించకండి. నేనెవరో మీకు తెలుసు" అన్నదామె ఆమె గొంతు ఇదివరలో నేనెన్నడూ వినివుండనంత మధురంగా ఉన్నది...అది బహుశా ఏకాంత మహాత్మ్యం అయుండాలి.
   
    "నాకు తెలియదు నేనెప్పుడూ నిన్ను చూడలేదు..."
   
    "ఉదయం మీరు నా ఫోటోలు చూస్తున్నప్పుడు తెర చాటున ఉండి మీ ముఖభావాలు చూశాను. ఫోటోలు చూసి మనుషులను గుర్తుపట్టడం రాదా మీకు?" అన్నదామె.
   
    నాకు అదో రకం కసి వచ్చింది. "ఫోటోలో ఇలా లేవు నువ్వు" అన్నాను.
   
    "ఫోటోలో ఉన్నట్లు చూస్తేకానీ గుర్తించలేరా?" అన్నదామె నవ్వుతూ...
   
    వాటంచూస్తే ఆమె నా చేత గుర్తించబడడానికి ప్రయత్నిస్తున్నదనిపించింది అందుకే కంగారుగా "వద్దు" అన్నాను.
   
    "ఏం?" అన్నదామె.
   
    "వెంటనే వెళ్ళిపో నువ్వు" అన్నాను.
   
    "నేను వెళ్ళను" అన్నదామె__
   
    ఆమె మొండితనానికి ఆశ్చర్యపోతూ "నీ మీద నా కెంతో గౌరవభావం ఉండేది....ఉదయం ఫోటోలు చూడగానే అది కొంత తగ్గింది. ఇప్పుడు నీవంటే అసహ్యం వేస్తున్నది" అన్నాను.
   
    "అసహ్యమెందుకు!" అందామె.
   
    "నీకు భర్త వున్నాడు. నాకు భార్య ఉంది. నీవు నీ భర్తతో ఉండాలి. నేను నా భార్యతో వుండాలి. అది సహజం. సమాజానికి భిన్నంగా ప్రవర్తించే ఆడవాళ్ళంటే నాకు చాలా అసహ్యం"
   
    ఆమె నావంక అదోలా చూసి "నిన్ను చూస్తూంటే నాకు నీతిపరుడనిపించడం లేదు. భయస్తుడివనిపిస్తున్నది" అన్నది.

 Previous Page Next Page