Previous Page Next Page 
రుధిర మందారం పేజి 34

    "పెళ్ళి మాట ఎత్తితే చాలు. ఎంత కోపమో."
    "ఎందుకు?"
    "మీ ఖర్మకి మిమ్మల్ని వదిలేసి నా దోవననేను పెళ్ళి చేసుకుని వెళ్ళటానికి నేనేం రాక్షసినా స్వార్ధపరురాలినా మీ సుఖమే నాకు ముఖ్యం అంటుంది."
    "బుద్ధిమంతుల లక్షణం అది."
    "అది వుత్త బుద్దిమంతురాలే కాదు. అఖండమైన తెలివితేటలు కలది. చదువులో ఫస్ట్. టైపులో ఫస్ట్. కుట్టు అల్లికలు, వకరకమా! అమ్మాయిని చూశారా!"
    "ఆ...చిదిమి దీపం పెట్టవచ్చు."
    "నా కూతురని కాదుగాని, ఆ అందం రాజకుమార్తెలకు వుండ వలసింది.
    "మరే."
    "ఇప్పుడిప్పుడే నా వ్యాధి నుంచి కొద్దిగా కోలుకుని ఇలా కుర్చీలో పడుకోగలుగుతున్నాను. ఇంకాస్త తగ్గితే ఏదో వక మార్గం చూస్తాను." పాండురంగంగారు రేపటి ఆశతో దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ అన్నారు.
    ఇంతసేపు మాట్లాడినా బన్నీ అసలు పేరు తెలుసుకోలేకపోయాను. ఆ సంసారం లోతుపాతులన్నీ తెలుసుకోగలిగాను. ఆ ఇంటి తీరు తెన్నులు చూశాను. పేరు తెలుసుకుని వెళ్ళటమే ఇహ.
    "దీక్షితులు మీ బన్నీ అసలు పేరు ఏదో చెప్పాడు మర్చిపోయాను. అరవయ్యో పడిదాట లేదు అప్పుడే మరుపు వచ్చింది." భారంగా నిట్టూర్పు విడుస్తూ అన్నాను.
    "వయసుకి మతిమరపుకి అసలు సంబంధం లేదు. మా బన్నీ అసలు పేరు చాంతాడంత వుంది. వున్న దేముళ్ళు దేవతలు చుట్టాలు మా అమ్మగారి పేరు అత్తగారి పేరు కల్పి పెట్టాము. చివరికి దీప్తి అని వస్తుంది. చిన్నప్పుడు బన్నులా వుండేదని బన్నీ అని ముద్దుగా పిలిస్తే అందరికీ బన్నీ అయింది."
    "దీప్తి ఎంత చక్కని పేరు! బన్నీ అన్న ముద్దుపేరు కూడా బాగుంది. మనిషిలాగానే పేరు కూడా అందమైనది" వాళ్ళు చెప్పేది వింటూ ఆలోచించాను.
    నేవచ్చిన పని అయిపోయింది. అమ్మాయికి మంచి పెళ్ళి సంబంధం చూస్తానని చెప్పి వాళ్ళ దగ్గర శలవు తీసుకుని బైటికి వచ్చాను.
    వాళ్ళింట్లో పెద్ద పిల్లవాడు తప్ప ఎవరూ కనపడలేదు. బహుశా ఆడుకోటానికి వెళ్ళి వుంటారు.
    నా పని ఇంత తేలిగ్గా అయినందుకు సంతోషిస్తూ ముందు ఈ వేషం మార్చటానికి ఇంటికి బైలు దేరాను.
                                                                                  31
    "ఏమిటి విశేషాలు! పిక్చర్ కి వెళదామా!" వుషారుగా అడిగాను.
    అర్జున్ ఫోన్ లో అర్జంట్ గా పిలుస్తున్నాడని నాయర్ చెప్పటంతో ఫోన్ దగ్గరకు పరుగున వెళ్ళి రిసీవర్ అందుకున్నాను.
    "నీవు ఎలా వున్నావో అలా బైలుదేరిరా."
    "ఏమిటి ఇలా లుంగీతోనే వచ్చేయనా!"
    "లుంగీ కాకపోతే లంగా. చాలా సీరియస్ విషయం వచ్చేయ్యి."
    "ఎక్కడికి?"
    అర్జున్ గబగబ ఎడ్రస్ చెప్పాడు.
    ఉలిక్కిపడ్డాను. "ఆ వీధిలోనేగా శ్యామలరావు వుంది!" అనుమానంగా అడిగాను.
    "అవును. శ్యామలరావు భార్య ఘోరంగా హత్య చేయబడ్డారు" అర్జున్ చెప్పాడు.
    ఇంక నేను ఏమీ వినదల్చుకోలేదు. "వస్తున్నా" అని రిసీవర్ క్రెడిల్ మీద వుంచి బెడ్ రూములోకి దూసుకువెళ్ళాను.
    రెండే రెండు నిమిషాలలో నా డ్రస్ అయిపోయింది.
    నాయర్ టీ తీసుకువచ్చాడు.
    "టైమ్ లేదు" అంటూ బైటికి పరుగుతీసాను.
    కారులోకన్నా రాయల్ బాగుంటుందని రాయల్ బైటికి తీశాను.
    రాకెట్ వేగంతో రాయల్ ని ముందుకు దూకించాను.
                                         32
    శ్యామలరావు ఇంటిముందు జనం గుమిగూడారు.
    పోలీసులు వాళ్ళని అదుపుచేస్తూ దూరంగా వుంచుతున్నారు.
    జనం మధ్యలోంచి లోపలికి వెళ్ళాను.
    లోపల వేలుముద్రలు ఫోటోలు లాంటి తతంగం పూర్తి అయింది. అర్జున్ దగ్గరకు వెళ్ళాను. జరిగింది రెండు ముక్కల్లో చెప్పాడు.
    శ్యామలరావుది, భార్యది ముఖాలు చెక్కేశారు. శరీరంమీద చాలాచోట్ల మేకులుకొట్టి అలా వుంచేశారు. చాలాచోట్ల కమిలి వాతలు తేలివుంది. ఎవరోగాని చాలా దారుణమైన హింసలు పెట్టి పెట్టి వీళ్ళ ప్రాణం తీసారు. నేలమీద ఒక్క నెత్తురుబొట్టు కూడా లేదు. అంటే వీళ్ళని ఎక్కడో హత్యచేసి ఇక్కడ తెచ్చి పడేసి వుంటారు.
    నేను చూడటం అయిపోయింది.
    "వెళదాం" అన్నాను.
    "నా పని అయిపోయింది" అన్నాడు అర్జున్.
    ఇరువురం ఇవతలికి వచ్చాము. అక్కడ ఇంకా మేము చేయవలసింది ఏమీలేదు. రాయల్ ని పోలీసుకి ఇచ్చి జీపులో ఇద్దరం స్టేషనుకి వచ్చాము.
    "వూ...ఇంక కానియ్యి" అన్నాను కుర్చీలో కూర్చుంటూ.
    అర్జున్ చెప్పటం మొదలుపెట్టాడు.
    "నీవు ఈ కేసువివరం నాకు చెప్పావు కదా విజయ్! అప్పటినుంచి మన జాన్ గాడిని ఆ ఇంటిమీద కన్నువేసి వుంచమన్నాను. శ్యామలరావు భార్య తీర్ధయాత్రలకు వెళుతున్నట్లు ఎవరికీ తెలియదు. ఓరోజు వుదయం పాలవాడు పనిమనిషిలాంటి వాళ్ళు వస్తే గుమ్మంలో వుండి ఒకతను సమాధానం ఇచ్చి తాను శ్యామలరావు బావమరిదినని....అక్క, బావ యాత్రలకు వెళ్ళారు నెలదాకా రారు. ఆ నేలా ఇంటి కాపలాగా నేను వుంటాను. కాని నేను హోటల్ భోజనం చేస్తాను. కనుక పాలు, పనిమనిషిలాంటి అవసరాలు లేవు అని చెప్పటంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజంతా ఆ కొత్తవాడు అక్కడేవుండి ఇంటికి వచ్చినవాళ్ళకల్లా ఇదే మాట చెప్పి పంపాడు. దాంతో అలా అలా ఈ వార్త పాకింది. 

 Previous Page Next Page