నేను అందాల సుందరి బన్నీ ఇంట్లో కాలు పెట్టాలంటే పేరయ్య వేషం సరిపోతుంది. అదయినా ఆమె ఇంట్లో లేనప్పుడు ఆ ఇంట్లో నేను కాలు పెట్టటం మంచిది.
పెళ్ళిళ్ళ పేరయ్య వేషం ధరించి నాలుగు రోజులు ఆ వీధిలో తచ్చాడాను. నాలుగోరోజు సుందరి ఇంట్లోంచి బయటికి వచ్చి ఎక్కడికో వెళుతున్నది. ఆమె ఎక్కడికి వెళుతున్నదో రహస్యంగా వెన్నంటి చూడమని మా వాడికి చెప్పి నేను ఇంట్లో దూరాను.
ఇంకో భాగంలో అద్దెకున్నావిడ బయటికి వచ్చింది.
"ఎవరు కావాలండీ!" అంటూ.
"నా పేరు బ్రహ్మశాస్త్రి! పెళ్ళిళ్ళ పేరయ్యని. ఈ ఇంట్లో ఓ అమ్మాయి వుందని ముద్దుపేరు బన్నీ అంటారు. ఆ అమ్మాయి నాన్నగారికి పెరాల్ సీస్ అనగా పక్షవాతం అని..."
"అదా! పాండురంగంగారి కోసం వచ్చారా! సరిసరి ఇసింటా సందులోంచి వెళ్ళండి. పెరటివేపు భాగం వారిది." వివరించింది ఆవిడ.
ఈ ఇంటి తీరు చూస్తుంటే గదిలో భాగం వుంది. మళ్ళీ మాట్లాడితే భారతదేశం జనాభా మొత్తం ఇక్కడే వుందా అనిపిస్తున్నది.
ఏ మాత్రం జంకుగొంకు లేకుండా పెరటివేపు వెళ్ళి -
"పాండురంగంగారూ! పాండురంగంగారూ!" అని పిలిచాను.
"ఎవరూ!" అంటూ పదిహేను ఏళ్ళ అబ్బాయి బయటికి వచ్చాడు.
"పాండురంగంగారు మీ నాన్నగారు కదూ?" అడిగాను.
"అవునండీ!"
"ఇంకా ఎవరెవరు మీ ఇంట్లో వున్నారు బాబూ!" కళ్ళజోడు సవరించుకుంటూ అడిగాను.
ఆ కుర్రాడు నవ్వాడు. ఆ నవ్వు ఆరోగ్యంగా నవ్వినట్లులేదు. నే అడిగిన తీరుకి నవ్వొచ్చి వుంటుంది.
"మా ఇంట్లో ఎవరెవరు వుండటం ఏమిటండీ! మా నాన్నగారూ, అమ్మ, మా అక్క నేను నా తరువాత వాళ్ళు లక్ష్మీ, పార్వతి. ఆఖరి తమ్ముడు ఉదయ్ అంతే."
"భలేవాడివి నాయనా! మీ ఇంట్లో వాళ్ళు నాకు తెలియదా, మీ నాన్నగారితో మాట్లాడాలి. పరాయివాళ్ళు ఎవరైనా వున్నారెమో అని అడిగాను."
"ఓ...అదా !"
"ఆ...అదే. మీ అక్క ముద్దుపేరు బన్నీ కదూ! అసలు పేరు ఏదో వుండాలి."
ఆ కుర్రాడు చెప్పటానికి నోరు తెరిచాడు. ఇంతలో__
"ఎవర్రా వచ్చింది!" అంటూ ఒకావిడ బైటికి వచ్చింది.
"అమ్మా! ఈయన నాన్నగారి కోసం వచ్చారు." అని చెప్పి కుర్రాడు బైటికి వెళ్ళిపోయాడు.
నేను మాటలు కల్పించుకుని పాండురంగం గారికోసం వచ్చినట్లు చెప్పాను.
ఆమె నన్ను లోపలికి ఆహ్వానించింది.
పాండురంగంగారు వాలుగావున్న కుర్చీలో పడుకుని వున్నారు. పక్కనే కుర్చీపీట మీద మరచెంబు గ్లాసు ఏదో టానిక్ సీసా వున్నాయి. ఆయన వళ్ళో రామాయణం కాబోలు వుంది. పక్షపాతం ఎడంవైపు భాగానికి వచ్చింది. కుడి చేతితో పేజీలు తిప్పుతున్నారు. కళ్ళకి జోడు ముతక పంచ, చేతులున్న బనీను, ముగ్గు బుట్టలా నెరిసిన తల వయోభారము. సంసార భారము, కలిపి చావలేక బతుకుతున్న మధ్యరకం సంసారి అని తెలిసిపోతున్నది.
లోపలికి వెళ్ళగానే ఆయనకి నమస్కారం పెట్టాను.
"మీరు...!" అర్ధోక్తిగ ఆగిపోయారు. అవును మరి నన్నెప్పుడూ ఆయన చూడలేదు కదా!
ఆమె నాకు కుర్చీ వేసింది. అది శిధిలావస్తలో వుండటం చూసి జాగ్రత్తగా కూర్చున్నాను.
"నా పేరు బ్రహ్మశాస్త్రి. కాలక్షేపంగా వుంటుందని, ఇదో పుణ్య కార్యంగా భావించి వుచితంగా పెళ్ళి సంబంధాలు కుదురుస్తుంటాను. దీక్షితులుగారు చెపితే వచ్చాను."
"దీక్షితులా!" అంటూ ఆలోచనలో పడ్డాడు.
"దీక్షితులు మీరు వారికి బాగా తెలుసుట. మీరు రిటైర్ కావటం ఈ వ్యాధి మేకు రావటం, ఫింషను తప్ప ఏదీ ఆధారం లేకపోవటంతో మీ బన్నీ వుద్యోగం చేయటం అన్నీ చెప్పారు. మీ ఆఖరివాడు ఉదయం..."
"ఈ పాపిష్టి వ్యాధితో ఏదీ గుర్తు రావటం లేదు. సరే, దీక్షితులుని ఓసారి రమ్మను." అని చెప్పి ఆయన కష్టసుఖాలు చెపుతూ వుండిపోయాడు.
అందాల సుందరి పేరు బన్నీ అసలు పేరు ఏమిటో తెలుసుకోవాలని ఆయన మాటలకి మధ్య మధ్య అడ్డు తగిలి ఏదో ప్రశ్న వేస్తే ఆయన ఆ ప్రశ్నకి మాత్రమే జవాబు ఇచ్చి మళ్ళీ తను చెప్పే విషయంలోకి వెళ్ళిపోయేవాడు.
"మీ అమ్మాయి ఏ కంపెనీలో వుద్యోగం చేస్తున్నది ?"
"రావ్ అండ్ రావ్ అని రకరకాల పౌడర్లు చేస్తుంటారు. ఆ కంపెనీలో పని టైపిస్టుగా చేస్తున్నది. ఆరు వందల దాకా జీతం ఇస్తారు. అయితే ఆ లెక్కలు రాయటానికి మధ్య మధ్య మాత్రమే పిలుస్తారు."
"అవునౌను నాకు తెలుసు మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కూడా ఇదే వుద్యోగం చేస్తున్నది." చిన్న కొత్త కోశాను.
"నా బ్రతుకు ఇలా అయింది. రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఆడపిల్ల సంపాదించి తెస్తే తిని కూర్చోటం."
ఆమె కాఫీ తీసుకువచ్చి ఆయనకో గ్లాసు నాకో గ్లాసు ఇచ్చింది.
"పెళ్ళి కావాల్సిన పిల్ల. ఏ ఈడు ముచ్చట ఆ యీడుది." ఆమె ఇంకా ఏదో చెప్పబోయింది.
"విచారించి ప్రయోజనం లేనప్పుడు విచారించి ప్రయోజనం లేదు. అన్న విషయం మీకు తెలియదేమీ కాదు. ఇంకో నాలుగు ఏళ్ళు ఆగితే మీవాడు చేతికి అంది వస్తాడు. బుద్ధిమంతుడు కానీ కట్నం కోరనివాడు పెళ్ళాం బిడ్డలకి భోజనం పెట్టగలవాడిని మీ అమ్మాయికి చూస్తాను. మీరేం బెంగ పడకండి." అన్నాను.
ఆమె మొహంలో కొట్టొచ్చినట్లు ఆనందం కనపడింది.
పాండురంగం గారి ముఖం కూడా కలకల లాడింది.