ఇరువురినీ మార్చి మార్చి చూస్తూ అడిగాడు అనుమానం....
అవునన్నట్టు తల ఊపింది ఆషా. ఆమె నోట మాట పెగలడం లేదు.
"ఆల్ రైట్! నీ సెంటిమెంటును నేనెందుకు దెబ్బకొట్టాలి_ఇతడిని అబ్జర్వేషన్ లో పెడతాం. ఇతను పోలీస్ ఆఫీసరు అని గాని, వాళ్ళ ఏజంటు అని గాని తెలిసిన మరుక్షణం ఇతనితో పాటు నిన్ను కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేస్తాం!"
"థాంక్స్ కమాండర్! మేం ఉభయులం మీ పట్ల సర్వధా విధేయులమే!" సంతోషంగా నొక్కి వక్కాణించింది ఆషా.
ఆమె ఆనందానికి అంతులేదు! అదొక వైచిత్రి.
అషాను కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు కిరణ్ కుమార్.
కనిపించీ కనుపించనట్టు చిరునవ్వు నవ్వింది ఆషా.
విచ్చుకున్న పెదవులు, విప్పారిన నేత్రాలు.
* * *
టి.వి. వార్తలు అంతటితో ముగుస్తున్న సమయంలో భళ్ళున తెరుచుకున్నాయి తలుపులు. ధడేలు మన్న శబ్దానికి తృళ్ళిపడింది ఆమె.
ఎదురుగా, గుమ్మంలోని వ్యక్తిని చూడగానే డాక్టరు సునంద నవనాడులు కుంగిపోయినట్టయింది.
కుంచించుకుపోయింది. అయోమయంగా వుంది....
అప్పటికి నైట్ డ్యూటీకి రావలసిన సిస్టర్ ఇంకా రాలేదు.
వంట మనిషి కిచన్ రూమ్ ప్రక్కనే వున్న స్టోర్ రూమ్ లో పడుకుంది.
తను మేడ మీద డ్రాయింగ్ రూమ్ లో వున్నది.
కాపలా పోలీసుల జాడలేదు....
వచ్చీ రావడమే భానురేఖ తన భుజాన వున్న ఎయిర్ బ్యాగ్ లో నుంచి రైఫిల్ తీసి లోడ్ చేసి డాక్టరు సునందకు గురి పెట్టింది.
"డాక్టరుగారూ! మీకూ నాకూ శత్రుత్వం లేదు. ఆ రోజున_సూపర్ ఫాస్ట్ ట్రెయిన్ లో_రహస్యంగా మీరు తీసిన మా ఫోటోలను నెగిటివ్ లతో సహా మాకు ఇచ్చివేయడం వలన మీకువచ్చేనష్టం ఏమీ లేదు. ఇవ్వకపోతే మాత్రం మిమ్ము కిడ్నాప్ చేసి మా స్థావరానికి తీసుకు వెళ్ళక తప్పదు. ఏం నిర్ణయించుకుంటారో వెంటనే తేల్చి చెప్పండి" సూటిగా అడిగింది భానురేఖ.
తెల్లబోయిన డాక్టరు సునంద తేరుకునే లోగానే టెలిఫోన్ వైర్ ను గుంజివేసింది భానురేఖ.
టి.వి. సౌండ్ వాల్యూమ్ ను కావాలనే పెంచింది. తమ సంభాషణ బయటకు వినిపించ కూడదు!
తను ఎంతటి విషమ స్థితిలో ఇరుక్కుపోయిందో అర్ధమయింది డాక్టరు సునందకు.
మాక్రోఫిల్మ్ ఇవ్వందే ఆమె తనను వదలదని రూడి చేసుకుంది.
"ఏం నిర్ణయించుకున్నారు?" రెట్టించింది భానురేఖ, మరునిముషమే.
"నాతో రండి!" అంటూనే లేచి కదలింది డాక్టరు సునంద ముఖ చెమట తుడుచుకుంటు.
గురిపెట్టిన రైఫిల్ ను అలాగే వుంచి, రెప్పవాల్చకుండా ఆమెనే చూస్తూ అనుసరించింది భానురేఖ.
ఓరకంట పరిసరాలను పరిశీలిస్తూనే వుంది. తన జాగ్రత్తలో తను!
డాక్టరు సునంద సరాసరి కిందకు దిగి, ఆపరేషన్ థియేటరు తలుపులు తెరచింది.
అదే క్షణంలో_ నైట్ డ్యూటీకి రావలసిన సిస్టర్ పరుగు పరుగున వచ్చింది. ఖంగారుగా వచ్చింది.
ఆమె ఖంగారుకు కారణం డ్యూటీకి ఆలశ్యంగా రావడం కాదు, ఆమె తండ్రి!
ఆమె తండ్రి గుండె నొప్పితో క్రిందుమీదు లవుతూ బయట రిక్షాలో పడి కొట్టుకుంటున్నాడు!
మెరుపులాంటి ఆలోచన తట్టింది డాక్టరు సునందకు.
"సారీ! మీరు కాసేపు వెయిట్ చేయండి. లేదా రేపు వచ్చినా ఫరవాలేదు. చూశారుగా_హార్ట్ పేషెంటు....! హార్ట్ ఎటాక్ రావడం అతనికి ఇది మూడవసారి. తక్షణమే ఇంటెన్సివ్ కేర్ లో వుంచకుంటే చనిపోవడం ఖాయం....! ప్లీజ్....!"
అది చావు బ్రతుకుల సమస్య. ఆమె డాక్టరు. అవతల పేషెంటు. సందిగ్ధంలో పడింది భానురేఖ.
చురుగ్గా ఆలోచించింది. షార్ప్ నెస్ ఆమె నైజం.
"ఆల్ రైట్! పేషెంట్ కు ట్రీట్ మెంట్ ఇవ్వండి! మీరు మైక్రోఫిల్మ్ నా చేతికి ఇచ్చేంత వరకు మీ సిస్టర్ నా దగ్గరే వుంటుంది. మీరు ఫిల్మ్ తీసుకురావలసిన సమయం, అందించవలసిన స్థలం నేను రేపు ఫోన్ చేసి చెబుతాను. ఈ విషయం గురించి పోలీసులు సమాచారం ఏమాత్రం పొక్కినా, ఈమె శవమే మీకు దక్కుతుందని మాత్రం మరచిపోకండి!"
ఇందాక సిస్టర్ వచ్చినపుడు వీపు వెనుకకు పెట్టిన రైఫిల్ ను ఇప్పుడు ముందుకు తీసి సిస్టర్ కణతకు గురిపెట్టింది భానురేఖ.
చకచకా బయటకు నడిపించింది.
బయట సిద్దంగా వున్న అంబులెన్స్ లోకి సిస్టర్ ను నెట్టి, తను గబుక్కున ఎగిరి కూర్చుని తలుపు లాక్ చేసుకున్నది భానురేఖ.
సైరన్ మోగించుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది అంబులెన్స్.