Previous Page Next Page 
నిషా పేజి 32

     "మీదంతా విచిత్రం చినబాబూ! అవి చూసి ఏం చేస్తారు?" విచిత్రంగా బుగ్గన వేలుంచుకొంది తుంగభద్ర.

    "బొమ్మలు గీస్తాను"

    "సత్తుగిన్నెల్నీ మట్టికుండల్నీనా?" పరిహాసంగా అడిగింది.

    "అవును! వాటినే గీస్తాను!"
 
    "మీరు తమాషా చేస్తున్నారా నన్ను? పరిచారికతో పరిహాసమేమిటి, చినబాబు?"

    "పరిహాసం కాదు! నేను నిజంగానే గీయాలనుకొంటున్నాను. సామాన్యుల జీవనశైలి మీద నేనో చిత్రం వేద్దామనుకొంటున్నాను. ఈ రాజభవనంలో కూర్చుంటే ఊహ స్ఫురించడంలేదు. ఈ రోజు ఊళ్ళో తిరిగి చూడాలనుకొంటున్నాను." "సాదా మనుష్యుల్లా మీరు ఊళ్ళో తిరిగితే ఏం బాగుంటుంది? మీ హోదాకు తగదు!"
 
    "నేను సాదా మనిషిని కాక నా తలమీద కిరీటం వుందా? మా కిరీటాలు, మా సింహాసనాలు, మా కత్తులు కటార్లు, మేం వేటాడిన జంతువులు మ్యూజియంలో భద్రపరచబడ్డాయి!"

    "మీ కిప్పుడు కిరీటం లేకపోవచ్చు, సింహాసనం లేకపోవచ్చు, ప్రజలే ప్రభుత్వం కావచ్చు. మీ హోదా ఎక్కడికీ పోలేదు. మీ సంస్కృతీ సంప్రదాయాలు పోలేదు. మీది రాచరక్తం! అదెక్కడికి పోతుంది?

    "సామాన్యుడి రక్తం, రాచరక్తం అని వుండవు. ఏ గ్రూపు, బి గ్రూపు ఇలా గ్రూపులుగా వుంటుంది రక్తం. నేను గాయపడి రక్తం పోగొట్టుకున్నాననుకో! నీ రక్తం నా గ్రూపునకు చెందిందయితే నీ రక్తం ఇచ్చి నాకు ప్రాణదానం చేయొచ్చు! మీరు తినే అన్మే మేమూ తింటున్నది. బంగారం తినడంలేదు.

    "మాటలకేం చినబాబూ? ఎంతయినా మీరు మీరే! మేము మేమే"

    "ఈ మిధ్యా రాచగౌరవం కంటే జనసామాన్యంలో కలసిపోయి సామాన్యంగా జీవించడమే నాకిష్టం. ఈ బోగభాగ్యాలూ , సుఖాలూ - వీటి మీద నాకు వ్యామోహం లేదు, తుంగభద్రా!"

    "మీరు వాటిని వదలాలన్నా, అవి మిమ్మల్ని వదలవు బాబుగారూ!"

    "పెద్దదానివి చక్కగా 'వికీ' అని పిలువకూడదు? అంత పొడవు పేరెందుకు? వినడానికి నాకు కష్టం. పిలవడానికి నీకు కష్టం"

    "అపరాధం, చినబాబుగారూ. మేం అలా పిలువకూడదు"

    "చూస్తుండు. ఒకరోజు మీ ఇంటికి భోజనానికి వస్తాను. మీ మట్టికుండల్లో వండిన అన్నం రుచి చూస్తాను."

    "మీరు తింటానంటే నేను పెడతానా చినబాబుగారూ? పెట్టను. అంత అపచారం నేను చేయను. మీరిలా మాట్లాడకూడదు. మీరిలా ఆలోచించకూడదు. మీరేపని చేసినా మీ తండ్రి తాతల గౌరవం నిలబెట్టేట్టుండాలి గాని ఇలా దిగజారిపోకూడదు."

    వికీ ముఖం రక్తారుణి దాల్చింది. "తండ్రి తాతల గౌరవం నిలబెట్టాలా? ఎందులో? అందమైన స్త్రీలను చెరపట్టడంలోనా? భోగవిలాసాల్లో మునిగి తేలడంలోనా? ఆస్తీ ఐశ్వర్యాలు ప్రోగుచేసుకోవడంలోనా? సామాన్యుల రక్తం పీల్చడం లోనా? ఎందులో.......ఎందులో నిలబెట్టాలి గౌరవం?" ఆవేశంగా అడిగాడు.

    "రాజరికాలు రద్దుకాకముందు వాళ్ళు చేసిన మంచి పనులూ ఉన్నాయి చినబాబు గారూ! గుళ్ళు గోపురాలు కట్టించారు. చెరవులు కుంటలు త్రవ్వించారు. ప్రజల బాగోగులు చూశారు. చంద్రుడికి మచ్చవున్నట్టే వాళ్ళలోనూ కొంత చెడువుండేది!"

    "సరేసరే! నువ్వు ప్రభుభక్తి పరాయణురాలివని ఒప్పుకొంటున్నాను. నేను మాత్రం వస్తున్నాను మీ ఇంటికి"

    "రాముడు శబరి ఆశ్రమం పావనం చేసినట్టుగా మీరు వస్తానంటే నేనేం చేసేది?"

    ఆరోజు సాయంత్రం తుంగభద్రతో కలసి, వెనక్కి చేతులు కట్టుకొని మనుష్యుల్నీ ఇళ్ళనీ శ్రద్దగా పరికిస్తూ నడుస్తూన్న వికీని విచిత్రంగా చూడసాగారు జనం.

    ఊళ్ళో చాలా మందికి వికీ ఎవరో తెలియదు. చినరాణికి ఒక కొడుకున్నాడని, అతడు విదేశాల్లో చదువుకుంటున్నాడని తెలుసుగాని అతడినంతవరకూ చూడలేదు. రాజాసాబ్ ఎస్టేట్ లో పనిచేస్తున్నవాళ్ళు మాత్రం చూసారు.

    వదులొదులుగా వున్న లాల్చీ పైజమాలో అతడెంతో సామాన్యంగా తుంగభద్రతో స్నేహపూర్వకంగా సంభాషిస్తూ నడుస్తూన్నా చువ్వలా ఆరడుగుల పొడవు, మంచి వర్చస్సు కలిగిన అతడు చెప్పకపోయినా అసామాన్యమైన వ్యక్తిగానే కనిపిస్తున్నాడు. ఎక్కడివాళ్ళక్కడ టక్కున ఆగిపోయి కళ్ళప్పగించి చూస్తున్నారు. ఇద్దరు ముగ్గురు గుంపుగా నిలబడి గుసగుసలాడుకొంటున్నారు. చినరాణిగారి కొడుకని చాలామంది ఊహించగలిగారు.

    పల్లె, పట్నం కాని ఊరది. చాలా వరకు పల్లెటూరి ఛాయలే కనిపిస్తున్నాయి. కావిళ్ళలో నీళ్ళు మోసుకుపోయే మగవాళ్ళు, తలమీద జంట బిందెలతో ఆడవాళ్ళు, కోళ్ళు, మేకలు.....ఎగుడు దిగుడుగా వున్న దారిలో సరిగా నడవరాకుండా పేడకళ్ళు, రొచ్చుగుంటలు, రోడ్డు ప్రక్కనే వున్న చిన్న చిన్న డబ్బా దుకాణాలు....... పావలా అర్ధ ఇచ్చి ఆ పూటకు కొనుక్కుపోయే వాళ్ళు........ఎటు చూసినా అపరిశుభ్రం..........దరిద్రం.

    ఆ సందు దాటి కొంచెం విశాలంగా వున్న వీధిలోకి అడుగుపెట్టారు.

    ఊళ్ళో చెప్పుకోదగ్గ వైశ్య, బ్రాహ్మణ గృహాలుండేవి ఆ వీధిలోనే.

    నడుస్తూన్న వికీ పాదాలు టక్కున ఆగిపోయాయి.

    ఎత్తయిన ఆర్చీలత కట్టబడిన సువిశాలమైన ఒకింట్లో నుండి ఎవరిదో పాట, పాటకనుగుణంగా ఎవరో నర్తిస్తున్నట్టుగా అందెల సవ్వడి వినిపిస్తున్నాయి.

    వికీ మంత్ర ముగ్దుడైనట్టుగా ఆ ఇంటికేసి కదులుతూంటే తుంగభద్ర కంగారుగా వారించింది.

    వద్దు. చినబాబుగారూ!మీరు వెళ్ళకండి"

    "ఎందుకు?"

    "అది వేదప్రకాశంగారి ఇల్లు!"

 Previous Page Next Page