Previous Page Next Page 
తులసి పేజి 33

                                                                      12

    ఆ మరుసటి రోజే సిద్దేశ్వరీ ఆలయంలో మహాపూజ.

    ఆ రోజు అక్కడ చాలా కోలాహలంగా వుంటుంది. ఆ హడావుడిలోనే లోపలికి ప్రవేశించాలి అనుకుంది తులసి.

    ఆమె కూర్చుని రెండు ఉత్తరాలు వ్రాసింది. ఒకటి అబ్రకదబ్ర అంకుల్ కీ రెండవది కమీషనర్ ఆఫ్ పోలీస్ కి

    ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు ఉద్వేగంతో ......

    ప్రొద్దునే లేచి, తొందర తొందరగా తయారయి, ఫ్రెండ్ ఇంటికి అని చెప్పి, సిద్దేశ్వరీ ఆలయానికి బయలు దేరింది.

    ఆమె అక్కడకు చేరుకునే సరికి కోలాహలంగా వుంది. వందలమైళ్ళ దూరం నుంచి వచ్చినవాళ్ళు, నగరంలో వున్న ధనవంతుల కార్లు ఆ వీధి అంతా నిండివున్నాయి. యాభై పెళ్ళిళ్ళు ఒకే సారి జరుగుతున్నంత సంబరంగా వుంది అక్కడ.
   
    సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశించి ఆమె. ఆ రోజు సిద్దేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పదు. ఆమెకు కనకాభిషేకం జరుగుతూంది. పదహారేళ్ళ వయసున్న ఇద్దరు కన్నెపిల్లల భుజాలమీద చేతులువేసి ఆమె సింహాసనం వద్దకు నడుస్తూంది. భక్తులు పారవశ్యంతో చూస్తున్నారు.

    ఆమె పక్కకి తిరగబోయి, చప్పున ఆగిపోయింది. జనాన్ని ఎడం చేసుకుంటూ చక్రవర్తి అటువైపే వస్తున్నాడు. ఆమె మొహంచాటు చేసుకుని గిరుక్కున వేరొక పక్కకి తిరిగింది. అక్కడో ద్వారం వుంటే మరి ఆలోచించకుండా తోసుకుని వెళ్ళింది.

    ఒక నిముషం ఆగి, ఎవరూ ఆ గదిలో లేరని నిశ్చయించుకుని తల లోపలికి పెట్టి చూసింది.

    సహజంగా ధైర్యవంతురాలూ, సాహసవంతురాలూ అయిన తులసి కూడా అదృశ్యాన్ని చూసి భయకంపితురాలు అయింది.

    ఎనిమిది అడుగుల నిలువెత్తు విగ్రహం - కాళీకాదేవిది, ఆమె ముందున్నది. క్రిందనుంచి చూడడం వల్ల అది మరింత భయంకరంగా కనబడుతోంది. విగ్రహపు ఒక చేతికి వున్న త్రిశూలానికి ఒక చిన్న మేకపిల్ల గుచ్చబడి వున్నది. శరీరం నుంచి రక్తం ఒక్కొక్క చుక్కే కారుతూంది.

    దాన్ని చూసికాదు ఆమె భయపడింది - కాళికాదేవి మరోచేతివైపు చూసి, మనిషి తల జుట్టు పట్టుకుని వేలాడదీసింది. విగ్రహం తాలూకా మరోచెయ్యి.

    అది నిజంగా మనిషి తలే అయితే శరీరంనుంచి వేరుచేసి చాలా కాలం అవడం వల్ల రక్తం బొట్లు కారడం లేదు. ఆదృశ్యాన్ని చూసి తులసి కడుపులో తిప్పింది. తనని తాను సంభాళించుకుని తూలి క్రింద పడకుండా జాగ్రత్తగా దిగి ఆ గొట్టానికే ఆనుకుని ఓ నిమిషం కళ్ళుమూసుకుంది.

    ఎయిర్ కండిషనర్ తాలుకు గొట్టంపై కప్పు గుండా వేరొక గదిలోకి ప్రవేశించడాన్ని గమనించింది.

    ఆమె గమ్యం, తను ప్రశ్న రాసి జవాబు పొందిన గది. ఆ గది రహస్యాన్ని శోధించాలి. ముందు ఆ గదిలోకి ప్రవేశించాలి .అసలు ఆ గది ఎక్కడ ?

    ఆమె వైప్ పట్టుకుని పైకి ఎక్కింది. దాని పక్కనేవున్న వెంటిలేటర్ గుండా పక్కగదిలోకి చూసింది.

    ఆ గదిలో పెద్ద ఇనప్పెట్టె వుంది. దాని పక్కనే ఒక యువకుడు మోకాళ్ళ మీద కూర్చుని గోడకి తల ఆన్చి ఏదో ఆలోచిస్తున్నాడు.

    ఎక్కడో చూసింది అతడిని -ఎక్కడ -

    జ్ఞాపకం రాలేదు.

    ఆమె మరి దాని గురించి ఆలోచించకుండా ఆ గొట్టం పట్టుకునే సాగిపోయింది.

    ఆ పక్క రూమే ఆమకు కావాల్సింది. వెంటిలేటర్ నుంచి చూడగానే గుర్తించింది. గది మధ్యగా పొడవాటి టేబిలు, చెరోవైపూ చెరో కుర్చీ, టేబిల్ మీద కాగితం -పెన్సిల్.

    వెంటిలేటర్ నుంచి క్రింద గచ్చుమీదకి ఎంత దూరం వుంటుందా అని ఆలోచించింది. దాదాపు పది అడుగులు, అయితే గచ్చుమీద తివాచీ వుంటుంది కాబట్టి పెద్ద ప్రమాదం జరక్కపోవచ్చు.

    "బెస్టాఫ్ లక్ , జోన్ ఆఫ్ ఆర్క్" అనుకుంటూ కళ్ళుమూసుకుని గదిలోకి దూకేసింది.

    ఎక్కువ చప్పుడు కాకుండా తివాచీ కాపాడింది.

    అయితే ఆమె గమనించిన విషయం ఒకటుంది. ఆ హాలుకి పక్కనే వున్న గది తలుపువేసి వుండటం -

    ఎక్కడ దాక్కోవాలో అర్ధం కాలేదు. ఆ గదిలో ఏమీ లేదు పొడవాటి బల్లతప్ప అదీ పూర్తిగా తనని దాచలేదు -అని తెలిసినా వేరే గత్యంతరం లేక - లేడిలా దాని దగ్గరకు పరిగెత్తి కిందకు దూరింది.

    టేబిల్ క్రిందనుంచి గదిలోకి వస్తున్న వ్యక్తి కాళ్ళు కనబడుతున్నాయి. ఆమె కొద్దిగా తలవంచి వస్తున్నది ఎవరో అని చూసింది.

    చక్రవర్తి!

    అతడు గది మధ్యలోకి వచ్చి ఆగేడు.

    ఆగి చుట్టూ చూసేడు.

    తులసి గుండె చప్పుడు ఆమెకే స్పుటంగా వినిపిస్తూంది. మరింత ముణగ తీసుకుని మూలకి వెళ్ళింది. అంతలో చక్రవర్తి గొంతు వినిపించింది.

    "ఈ గదిలో ఎవరో వున్నారు. ఎవరది? మర్యాదగా బయటికి రండి ఎలాగూ తప్పించుకోలేరు."

    తన కాళ్ళు కనబడ్తున్నాయేమోనని అనుమానం తులసికి కలిగింది. వాటిని కప్పుకోవడం కోసం -పైనున్న టేబిల్ మీద గుడ్డని కొద్దిగా కిందకి లాగింది.

    అదే ఆమె చేసిన తప్పు.

 Previous Page Next Page