Previous Page Next Page 
తులసి పేజి 34

                                                13

    బయట్నుంచి చూసిన వాడెవడూ ఆ ఇంట్లో అంత మంచి ఆపరేషన్ థియేటర్ వుందనుకోరు. పైకి పురాతన భవనంగా కనబడుతూంది కాంపౌండ్ లో పిచ్చి మొక్కలు అస్తవ్యస్తంగా పెరిగినయ్. లోపల గదుల్నిండా బూజు వుంది. గచ్చంతా దుమ్మూ - కానీ ఆ గది ఆ ఒక్క గది .......తలుపు తెరిచి లోపలికి చూస్తూనే విస్తుబోయేడు పండిత్.

     గోడలు అద్దాల్లా మెరుస్తున్నాయి. దాదాపు ముప్పై అడుగుల పొడవూ, ఇరవై అడుగుల వెడల్పూ వున్న ఆ గది నిండా ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్, వైర్లూ అమర్చబడి వున్నాయి.

    "నా యావదాస్తీ ఈ గది. ఈ పరికరాలు" అన్నాడు సన్యాల్.

    "ఫాంటసీ సినిమా చూస్తున్నట్టుంది."

    "మనిషి జీవితమే ఒక ఫాంటసీ" నవ్వేడు..." మరిక ఆలస్యం దేనికి?"

    "నాకు భయంగా వుంది."

    "ఈ క్షణం ఇక భయానికి చోటులేదు పండిత్. ఇన్నాళ్ళూ నేను చేసిన ప్రయత్నానికి ఒక రూపం రాబోతూంది చరిత్రలో ఎవరూ సాధించలేని విజయం మనమిద్దరం సాధించబోతున్నాం"

    "కానీ ఫెయిల్ అయితే, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్ళం అవుతాం"

    "అందుకే చావడానికి సిద్దంగా వున్నవాడిని తీసుకువచ్చాను"

    అప్పుడు చూసేడు పండిత్ - రోగిని కుర్చీలో తల వెనక్కి వాల్చి పడివున్నాడు.

    "ఇతనో పిచ్చివాడు. నాకు బాగా తెలుసు. "టప్ టపా టప్" అని అరుచుకుంటూ రోడ్లవెంట తిరిగేవాడు. నిన్నే ఇతడిని బయట పొదల్లో పడి వుండగా చూసేను. ఎవరో ఇతడిని చచ్చే వరకూ కొట్టి అక్కడే పడేసేరు. పిచ్చివాడిని కొట్టవలసిన అవసరం ఎవరికి వచ్చిందో నాకు అర్ధం కాలేదు. ఏది ఏమైనా నాకు కావాల్సిన 'వస్తువు' దొరికింది. ఈ పిచ్చివాడు ఈ ఆపరేషన్లో మరణించినా లోకం పట్టించుకోదు. అదే గానీ, బాగుపడితే లోకం జోహార్లర్పిస్తుంది. పండిత్ - నువ్వు నాకు సాయం చెయ్యాలి. మూడోకంటికి ఈ విషయం తెలియకూడదు - చేస్తావా?"

    పండిత్ తటపటాయించి "చేస్తాను" అన్నాడు.

    అయిదు నిమిషాల తర్వాత ఆపరేషన్ ప్రారంభం అయింది. ఆపరేషన్ అంటే కత్తులూ కటార్లతో రక్తం ధారాపాతంగా కార్చే ఆపరేషన్ కాదు మనిషి విజ్ఞానం ఆ పరిధిని ఎప్పుడో దాటిపోయింది. వంటి నిండా దెబ్బల్తో రక్తం కోల్పోయిన, నిస్సత్తువగా వున్న రోగిని కూడా ఆపరేట్ చేసే ఆధునిక పరికరాల్ని కనుక్కొంది విజ్ఞానంయ

    ఆ గదిలో ఆపరేషన్ టేబిల్ లేదు. పళ్ళ డాక్టర్ గదిలో వుండే కుర్చీలాంటిది వుంది. ఒక పెద్ద న్యూరోసైక్రియాట్రిక్ యూనిట్ లో వుండవలసిన పరికరాలన్నీ ఆ గదిలో ఉన్నాయి.

    సన్యాల్ రోగి వైపు చూస్తూ అన్నాడు "ఇతడు ఒకప్పుడు చాలా తెలివైన వాడు అయ్యుంటాడు న్యూరోలాజికల్ పరీక్షలో ఏమీ బయటపడలేదు. ఎలక్ట్రో ఎన్ సెఫె లో గ్రామ్ మామూలుగానే వుంది. మెదడు యొక్క కుడివైపు టెంపోరల్ లోబ్ లోనే ఏదో పాడయింది. మనం చెయ్యవలసిందల్లా - అది ఏమిటో కనుక్కొని సరిచెయ్యటమే. అయితే ఆ పనిని మనం కాకుండా కంప్యూటర్ చేస్తుంది. నా ఉద్దేశ్యం, ఆ ఇరిటేషన్ వున్న భాగం లింబిక్ సిస్టమ్ యొక్క పోస్టీరియల్ ఏరియాలో వుండే ఎమిగ్ డాలా అయి వుంటుందనీ అదే అతడిని పిచ్చివాడిని చేసింది. 'టప్ టపా టప్' అని మాటిమాటికీ అరిచేలా చేస్తుంది. ఆ చచ్చుపడిన మెదడు భాగానికి మనం ఎలక్ట్రిక్ షాక్ యివ్వాలి. మెదడుకి షాక్ ఇవ్వడం అనేది చాలాకాలం నుంచి వస్తున్నదే. అయితే దానివల్ల కొన్ని దుష్పరిణామాలు కూడా కల్గుతున్నాయి. అందువల్ల నేను ఈ షాక్ ని మెదడు బయట్నుంచి కాక లోపలే కలిగేలా చేస్తున్నాను"

    "అంటే ఎలా?"

    "ఎలా అంటే, ఇతడి మెదడులోకి నలభై ఎలక్ట్రోడ్స్ చొప్పించి ఆ ఎలక్ట్రోడ్స్ కి కావల్సిన కంప్యూటర్ ని అతడి చెవి వెనకకు కుట్టేసి, దానికి రెండువైర్లు అమర్చి, సిగరెట్ పాకెట్ సైజులో వుండే ప్లూటోనియం -239 ఆక్సైడ్ ఐసోటోప్ ని అతడి భుజంమీద అమర్చటం ద్వారా"

    తెరిచి వుంచిన పండిత్ నోరు అలానే వుండిపోయింది.

    ఆ ప్రొఫెసర్ రోగి మెదడులో ఎలక్ట్రోడ్స్ చొప్పించి, చెవి ప్రక్కన కంప్యూటర్ కుట్టి, దాంతో మెదడుని సరిచేస్తాడు - ఇంకో భాషలో చెప్పాలంటే మనిషి మెదడుకి బదులు కంప్యూటర్ అమరుస్తాడా సాధ్యమయ్యే పనేనా ఇది?

    కళ్ళెదురుగా కనబడుతుంటే కాదనటం ఎలా?

    మనిషి విజ్ఞానికి అవధుల్లేవు. ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే....... అవుతే..... అసలీ సైన్సు ఎక్కడికి వెళుతూంది! సైన్సు ఇంత వేగంగా ముందుకెళుతూంటే మనిషి ఇంకా చేతబడుల దగ్గిరే వున్నాడా? ఆ తరువాత ఆలోచించడానికి అతడికి సాధ్యంకాలేదు.

 Previous Page Next Page