Previous Page Next Page 
తులసి పేజి 32

    "మరి తులసి వివరాలు-"

    "నీకూ నాకు మధ్య వ్యాపారపు అగ్రిమెంట్ కుదర్లేదుగా దార్కా."

    దార్కా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. దొరికిన లేడిని చంపకుండా ఆడిస్తున్న పులిలా తాపీగా వుంది సిద్దేశ్వరి.

    "ఈ భవనాన్ని సర్వనాశనం చేసైనా సరే తులసి చిరునామా సంపాదిస్తాను"

    "లక్ష రూపాయలు ఇశ్తానన్నా ఒక మనిషిని చంపడానికి ఇష్టపడని నువ్వు అంత ఘాతుకానికి తలపడి నా అనుచరుల్ని చంపుతావని నేననుకోను" అని ఆమె నవ్వింది.

    దార్కా ఎటూతోచని వాడిలా నిలబడ్డాడు. సిద్దేశ్వరి తన అడుగు జాడలు చెరుపుతూ అంది. "ఆలోచించుకో దార్కా నీకు ఒక్కరోజు టైం యిస్తున్నాను."

    ఒక రోజు.....

    అంటే.....

    తులసి మరణానికి ఇంకా ఎంతో సమయం వుండదు. ఈ ఒక్క రోజూ తను ఇక్కడే బందించబడితే- ఇక ఎలా --

    "నీ జీవితాశయం నెరవేరాలంటే నీకు తులసి వివరాలు కావాలి. అది చెప్పగిలగేది నేను ఒక్కదాన్నే. దానికి ప్రతిఫలంగా నాకు నువ్వు సాయం చెయ్యాలి. అది బిజినెస్." అని ఆమె ఆగి, "నేనీ అడుగుజాడలు ఎందుకు చెరుపుతున్నాననో తెలుసా" అంది. దార్కా మాట్లాడలేదు. నా కాలి క్రింద మట్టిలో నా మీద చేతబడి.....ఆ.... నాభిస్థానంలో వుండే శంఖినీ నాడిమీద ప్రయోగం చెయ్యకుండా" అంటూ ఆమె నవ్వింది హేళనగా.

    దార్కా నిర్లిప్తంగా "నేను నీమీద చేతబడి అంటూ చెయ్యవలసి వస్తే శంఖినీ మీద చెయ్యకూడదు సిద్దేశ్వరీ నడుము దగ్గర వుండే లకుహా నాడిమీద చెయ్యాలి"

    ఆమె అదిరిపడి "ఏమిటీ" అంది.

    "మరి పురుషులకు చేతబడి చేసేది లకుహ మీదేగా, సిద్దేశ్వరీ -మంత్రగాడి కళ్ళు పిల్లికంటే చురుకయినవి సుమా" అంటూ మొట్టమొదటిసారి నవ్వేడు. "నాకు నిన్ను చూసిన క్షణమే అనుమానం వచ్చింది నువ్వు స్త్రీవి కావు."

    ఆమె స్థాణువైంది. పాలిపోయిన మొహంలోకి తిరిగి రక్తం చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. "చాలు తెలుసుకున్నావ్? నిన్ను బ్రతకనివ్వకూడదు" అంటూ వెళ్ళిపోయింది.

 Previous Page Next Page