పది నిమిషాల్లో పెళ్ళికి సిద్ధం చేశాడు పూజారి.
దండలు తెచ్చారు స్నేహితులు.
జేబులో పొట్లం కట్టి ఉన్న మంగళసూత్రం పూజారి చేతికి అందించాడు చంద్రకాంత్.
మంత్రాలు చదువుతున్నాడు పూజారి.
గౌరీపూజ అంటున్నాడు. మరేదో పూజ అంటున్నాడు.
అతను చెప్పేవి యాంత్రికంగా చేస్తోంది అర్చన.
మాంగల్యం తంతునానేనా మంత్రాలు వినిపిస్తున్నాయి.
మంగళసూత్రం తన మెడలో కడుతున్న చంద్రకాంత్ చేయి మెడమీద చల్లగా తగులుతోంది.
క్లిక్ మన్న శబ్దంతో ఫ్లాష్ వెలిగింది. ఫోటోలు తీశాడు చంద్రకాంత్ ఫ్రెండ్.
భగవంతుడా! నేను తీసుకున్న నిర్ణయం మంచో, చెడో తెలియదు. నీ మీదే భారం వేస్తున్నాను. అన్నీ సవ్యంగా జరిగేలా చూడు స్వామి అని మొక్కుకుంది.
తల్లిదండ్రులను మోసం చేశానన్న తలపు ఆమె కంటి నుండి అశ్రుబిందువుగా జారింది.
* * * *
హైదరాబాద్ నగరశివార్లలో అత్తాపూర్ ప్రాంతం.
పూనా హైవేని ఆనుకొని ఉన్న ఆ ప్రాంతం ఇంచుమించు ఊరికి బయట అని చెప్పుకోవాలి.
ఆ గ్రామంలో ఉన్న ఇరుకు సందుల్లోని మారుమూల వున్న యిల్లు అది. ఇంటి చుట్టూ పాతబడిన ప్రహరీగోడ.
ఆ ఇంట్లో ఐదుగురు వ్యక్తులున్నారు. వాళ్ళలో నలుగురు యువకులు, ఒక స్త్రీ వున్నారు.
ఆ ఇంటిముందు వచ్చి ఆగింది ఒక స్కూటర్. దానిమీద నుండి ఇద్దరు వ్యక్తులు దిగారు.
వాళ్ళు వచ్చిన విషయాన్ని కిటికీలోనుండి చూసి మిగతా వ్యక్తులకు చెప్పింది ఆ స్త్రీ.
ఇంటి ముందువైపు వున్న చిన్న గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించారా వ్యక్తులు. వాళ్ళని చూస్తూనే తలుపు తెరిచి చిరునవ్వు నవ్వి "హలో సెబాస్టియన్! హౌ ఆర్ యు" అంటూ బయటికి వచ్చాడతను.
"ఫైన్" అంటూ లోపలికి వెళ్ళాడు సెబాస్టియన్.
ఆ వెనుకనే లోపలికి వచ్చాడు కొరియన్ కూడా.
"కూర్చోండి" అంటూ అక్కడున్న ఉడెన్ బెంచి చూపించాడు అతను.
ఆ వ్యక్తి పేరు ఉపేంద్ర. ఉగ్రవాద వ్యక్తుల్లో ఒకడు.
రాజధాని నగరంలో జరిగే రాజకీయ పరిణామాలు, సంఘటనల గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందించడం వాళ్ళ పని.
రెండు గ్లాసుల మంచి నీళ్ళు తీసుకువచ్చింది ఆ స్త్రీ.
ఇద్దరూ త్రాగారు.
"ఇక సరిగ్గా నాలుగు రోజులు టైముంది. గ్లాసు క్రింద పెడుతూ అన్నాడు సెబాస్టియన్.
"మా ప్లానింగ్ మేము మొదలు పెట్టాము" చెప్పాడు ఉపేంద్ర.
"ప్లానింగ్ ఏ రకంగా చేస్తున్నారు?"
"అంటే?"
"అంటే....గన్ ఉపయోగిస్తున్నారా? బాంబు ఉపయోగిస్తున్నారా?"
"గన్ తోనే చంపటం" అని ఆ స్త్రీ వైపు తిరిగి ఏదో సైగ చేశాడు.
ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
నిమిషం తరువాత ఓ వ్యక్తి వచ్చాడు.
"ఇతని పేరు పాల్. రైఫిల్ షూటింగ్ లో పెర్ ఫెక్ట్. ఇతనికి మీరు స్టేజ్ మీదకు ఎంట్రీ యిప్పించాలి" చెప్పాడు ఉపేంద్ర.
ఒకసారి పరీక్షగా పాల్ ని చూశాడు సెబాస్టియన్.
సుమారు ఐదడుగుల నాలుగంగుళాల ఎత్తు వున్నాడతను.
సంనగాం బలహీనంగా వున్నాడు. నున్నగా వున్న చిన్న జుట్టు కొద్దిగా పెరిగిన గడ్డం, నూనూగు మీసాలు.
అతనికి ఇరవై సంవత్సరాలు మించి వుండకపోవచ్చు.
"ఇతనా!" అప్రయత్నంగా అన్నాడు సెబాస్టియన్.
నవ్వాడు ఉపేంద్ర.
"అందరూ పొరపాటు పడేది అక్కడే. ఇతను హత్య చేయగలడా! అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. అదే మన ఎడ్వాంటేజ్. మీరు ఇతనికి ప్రెస్ వీడియోగ్రాఫర్ గా ఎంట్రీ యిప్పించగలిగితే చాలు."
"ప్రెస్ వీడియోగ్రాఫర్! అంటే మీ ప్లాన్ ఏమిటో చెప్పగలరా?"
ఒకింత ఇబ్బందిగా కదిలాడు పాల్.
"ఆ విషయం....మేము ఎవరికీ చెప్పకూడదు. మీకు కావలసింది సంజుని చంపటం. అంతేకదా! ప్లానింగ్ మాకు వదిలిపెట్టండి. ప్రెస్ వీడియోగ్రాఫర్ గా పాల్ ని స్టేజ్ మీదకు పంపటంతో మీ బాధ్యత ముగుస్తుంది. ఆ తరువాత చేయవలసిన పని మేము చూసుకుంటాము."
ఇంకేమీ మాట్లాడలేదు సెబాస్టియన్.
"ఇదిగో స్టేజి ఎరేంజ్ మెంట్స్ తాలూకు బ్లూ ప్రింట్. పోలీస్ డిపార్టుమెంట్ మనుషులనుంచి మేనేజ్ చేసి తెచ్చాను. ఇది మీకు చాలా అవసరం. తీసుకోండి" అంటూ తన ప్రక్కనున్న బ్యాగ్ లో నుండి కొన్ని పేపర్స్ బయటకు తీయబోయాడు సెబాస్టియన్.
"అహ....అవసరం లేదు. బ్లూ ప్రింట్స్ కాపీలు మా దగ్గర కూడా వున్నాయి" చెప్పాడు ఉపేంద్ర.
అక్కడున్న స్టూలుమీద కూర్చుని గోళ్ళు కొరుక్కుంటున్నాడు పాల్. అతని ముఖంలో ఎటువంటి భావాలు లేవు. అతనికి ఈ మాటలు అన్నీ అర్ధం అవుతున్నాయా లేదా! అసలతనికి తెలుగు వచ్చా రాదా అన అనుమానం కూడా వచ్చింది సెబాస్టియన్ కి.
ఉపేంద్ర ప్లానింగ్ చూసి ఆశ్చర్యం వేసింది. ఎంత పాస్ట్ గా వున్నాడు? తను యిద్దామనుకున్న బ్లూప్రింటుని తనకంటే ముందే సంపాదించి పెట్టుకున్నాడు. పోలీస్ డిపార్ట్ మెంటు నుంచి ఇటువంటివి సంపాదించడం కష్టసాధ్యం అనుకున్నాడు. కానీ....అతను తెచ్చాడు. ఉపేంద్ర ప్లానింగ్ చూశాక అతనీ పని తప్పక చేయగలడన్న నమ్మకం వచ్చింది.
"నేను ఇక వెళతాను" లేచి నిలబడ్డాడు సెబాస్టియన్.
"అలాగే! రేపు మళ్ళీ రండి. ఈ రోజు జరిగే డెవలప్ మెంట్స్ గురించి మాట్లాడుకోవచ్చు" అన్నాడు.
"సరే" అని కరచాలనం చేశాడు సెబాస్టియన్.
అతని వెనకనే వచ్చాడు కొరియర్ కూడా.
మరో నిమిషానికి వాళ్ళిద్దరూ ఎక్కిన స్కూటరు మాయం అయింది.
వాళ్ళు వెళ్ళగానే తలుపు బోల్టువేసి లోపలికి వచ్చాడు ఉపేంద్ర.
"రాజా! ఆ పేపరు యిలా తీసుకురా" చెప్పాడు.
లోపలి గదిలోకి వెళ్ళి నిమిషం తర్వాత తిరిగి వచ్చాడు అతను.
అతనితోపాటే ఇంట్లో వున్న మిగతా ముగ్గురు కూడా వచ్చారు.
పేపర్స్ తెరిచి టేబుల్ మీద వుంచాడు.
గోడ దగ్గరకు వెళ్ళి లైట్ స్విచ్ ఆన్ చేసింది ఆ యువతి.
ఆ కాంతిలో పేపర్స్ మరింత స్పష్టంగా కనిపించింది.
ఆ కాగితాలవైపు కొద్ది క్షణాలు పరిశీలనగా చూశాడు ఉపేంద్ర.
"ఈ సెబాస్టియన్ కి ఇటువంటి పనులలో ఏ మాత్రం అనుభవంలేదు" సడన్ గా అన్నాడు పాల్.
తలలు తిప్పి అతనిని చూశారు అందరూ.
"అవును. ఇతని మీద నమ్మకం పూర్తిగా వుంచలేము! నాటు బాంబులు ,తుపాకులు అమ్మటానికి తప్ప యిటువంటి పనులకు ఏమాత్రం పనికిరాడు. అందుకే మన ప్రయత్నం మనం కూడా చేద్దాం. స్టేజ్ మీదికి వెళ్ళేవరకూ సెబాస్టియన్ మీద ఆధారపడినా, బయటకు రావడానికి మన మార్గం మనం వెతుక్కోవాలి. అందుకే తిరిగివచ్చేందుకు అతన్ని ఏమీ చేయమనలేదు .సంజు చనిపోవడం సెబాస్టియన్ కి కావాలి. ఆ తరువాత మన మనిషి వున్నా,చనిపోయినా అతనికి సంబంధం లేదు. మన మనిషిని రక్షించడానికి పెద్దగా ఆసక్తి కూడా చూపకపోవచ్చు. అందువల్ల మన మనిషిని మనమే రక్షించుకోవాలి. కాలేజి బయట మనం ఒక అంబులెన్స్ పెట్టుకొని వుండాలి. వాళ్ళని పాల్ చంపినా మరుక్షణం మనం రెడీ అవ్వాలి. స్టేజి మీద నుంచి గేటువరకు ఎలా రాగలుగుతాడో అది పాల్ శక్తి యుక్తుల మీద ఆధారపడి వుంటుంది. ఒక వ్యక్తికి మించి, ఆ క్యాంపస్ లో మన మనుషులు వుండటం చాలా ప్రమాదం.
అందువల్ల ఎదురి వ్యక్తుల ప్రాణం తీయటమే కాదు. తన ప్రాణం తను రక్షించుకోవటం కూడా చాలా అవసరం. దీనికి కావలసిన ట్రైనింగ్ నేను రేపు ఇస్తాను. రేపు కాలేజి గ్రౌండ్స్ కి వెళదాం. ఒకసారి మనం స్వయంగా చూసి విషయాన్ని అవగాహన చేసుకోవాలి .పాల్! నువ్వు నాలుగైదుసార్లయినా రిహార్సల్ వేసుకోవాలి. స్టేజి మీద సెక్యూరిటీ ఏర్పాట్లు ఎటువైపు ఏ విధంగా వుంటాయో మన దగ్గర ప్లాను వుంది. దానిని దృష్టిని వుంచుకుని, నువ్వు ఎటునుండి ఫైర్ చేస్తే నీకు ప్రమాదం వుందో, ఎటు నుండి ఎస్కేప్ అవటం తేలిక అవుతుందో ఆ డైరెక్షన్ నుండి తప్పించుకొని మా అంబులెన్స్ ని చేరుకోవటానికి ఎన్ని నిమిషాలు పడుతుందో అంతా పెర్ ఫెక్ట్ ప్లాన్ గా వుండాలి. ఇంకొక రెండు రోజులు గడిచిందంటే....స్టేజి ఏర్పాట్లు మొదలయిపోతుంది. ఆ తరువాత మనమా స్థలాన్ని చేరటం ,ట్రయల్ వేయడం అసంభవం అవుతాయి."
"మరి బయటకు వచ్చాక ఆ అంబులెన్స్ లో మనం ఎటువైపు వెళ్ళాలి?" అడిగాడు రాజు.
"హైకమాండ్ ఇన్స్ స్ట్రక్షన్స్ అయితే సిటీలోనే వుండమని....ఎందుకంటే హోం డిపార్ట్ మెంటు మొత్తం అక్కడే వుంటుంది కాబట్టి వాళ్ళు అప్రమత్తంగా వుంటారు. క్షణాల్లో వైర్ లెస్ మెసేజ్ అన్నివైపులకు వెళ్ళిపోయింది. సిటీ బోర్దర్స్ మొత్తం క్లోజ్ అయిపోతాయి. కాబట్టి సిటీ వదిలి పారిపోవటం ప్రాణం మీదకు తెచ్చుకోవటమే అవుతుంది."
"మరి ఎక్కడికి వెళ్ళాలి?"
"ఇక్కడికే!"
"ఇక్కడికా?" తెల్లముఖం వేశాడు.