సెబాస్టియన్ దూరంగా వున్నాడన్న విషయం నిర్ధారణ చేసుకుని "చాలా నమ్మకస్తుడు. ఇంతకుముందు మన కంరీంనగర్ దళానికి ఎనిమిది ఎ.కె 47 గన్స్ సప్లయ్ చేసింది ఇతని మనుషులే. చాలాసార్లు బాంబులు కూడా సప్లయ్ చేశాడు. త్వరలో ఆర్.డి ఎక్స్ కూడా తెప్పించాలని ప్రయత్నించుతున్నాడు. ఒక రకంగా ఇతనితో స్నేహం కంటిన్యూ చెయ్యటం మనకి చాలా మంచిది" చెప్పాడు కొరియన్.
ఒకింత తృప్తిగా తల ఆడించాడు నర్సింగ్.
సెబాస్టియన్ కళ్ళకు తిరిగి గంతలు కట్టారు.
తడుముకుంటూ....అడుగులో అడుగు వేసుకుంటూ జీపువైపు నడవసాగాడతను.
* * * *
ఆ రోజు ప్రవర్తన చాలా వింతగా తోచసాగింది అర్చన తల్లికి.
ఉదయం ఆరు అవగానే నిద్ర నుండి లేచింది.
తలంటు పోసుకుంది.
"మొన్ననే కదే తల మీద స్నానం చేశావు. మళ్ళీ ఇవాళే చేస్తున్నా వేమిటి?" అన్న తల్లి ప్రశ్నకి "చేస్తే తప్పేమిటి?" అంది.
స్నానం అయ్యాక పూజ గదిలో దూరి కనీసం పావుగంట పైగా పూజ చేసింది.
ఇది మరీ విడ్డూరం అనిపించింది తల్లికి.
జన్మానికోసారి తప్ప ఆమె ఆ పూజ గది ముఖం కూడా చూడదు.
అంతేకాదు! కొత్త చీర కట్టుకుని రెడీ అయింది కాలేజీకి.
"కొంపతీసి నీ పుట్టినరోజా ఏమిటే?" అనడిగిన తల్లి ప్రశ్నకి "ఏం పుట్టిన రోజునే కొత్తబట్టలు వేసుకోవాలా?" అని ఎదురు ప్రశ్నించింది.
"దీనికేదో అయింది ఇవాళ" అనుకుంది తల్లి.
పనులన్నీ చేస్తూనే వుంది కానీ కాలు, చెయ్యి ఆడటం లేదు అర్చనకి.
ఏదో భయం....
తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నానేమోననే బాధ.
పరిణామాలు ఎలా వుంటాయోనన్న బెదురు.
ఆ ముందు రోజు రాత్రంతా కూడా నిద్ర లేదు.
ముందు రోజే కాదు, గతవారం రోజులుగా ఏ రోజూ సరైన నిద్ర వుండటం లేదు.
టైము చూసుకుంది. తొమ్మిదవుతోంది.
మరో ఐదు నిమిషాల్లో కాలేజీకి బయలుదేరాలి.
రోజూ కాలేజీకి వెళ్ళడం మామూలే.
కానీ ఇవాళ కాలేజీకి బయలుదేరాలంటే ధైర్యం చాలటంలేదు. కాళ్ళూ చేతులూ ఆడటం లేదు.
కానీ వెళ్ళక తప్పదు.
"భగవాన్ అన్నీ సవ్యంగా జరిగేలా ఆశీర్వదించు" అని మరోసారి మొక్కుకుంది.
తన కారుని తీసుకుని బయలుదేరింది.
కొంత దూరం వెళ్ళాక కాలేజీ రూట్ నుంచి ప్రక్కకు తిప్పింది. అది చంద్రకాంత్ ఇంటి వైపుకు వెళ్ళే దారి.
ఆ వర్షం కురిసిన రాత్రి ఆ దారిలో వచ్చింది. మళ్ళీ ఈ రోజు మాత్రమే అటుగా వస్తోంది.
తన కారుని ఎవరైనా చూస్తే!
"కాలేజీకి వెళ్ళకుండా ఇటెందుకు వెళుతున్నావని అడిగితే....ఏం చెప్పాలి?"
నిమిషాలు గడుస్తున్నాయి.
చంద్రకాంత్ ఇల్లు దగ్గర పడుతోంది.
అతని ఇంటి వైపు వెళుతుంటే ఆ రాత్రి కారులో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.
ఆ రోజు ఆ సమయంలో చంద్రకాంత్ అలా ఎందుకు ప్రవర్తించాడో, తానెందుకు లొంగిపోయి సహకరించిందో యిప్పటికీ కలగానే వుంది.
పెళ్ళి కాకుండా ఇటువంటి పని తప్పనిపించిందోసారి.
తప్పేమిటనిపించింది మరోసారి.
వద్దు అని వారించింది మనసు.
కావాలని....సహకరించిన వయసు....రెండిటి మధ్య జరిగిన యుద్ధంలో వయసే గెలిచింది.
కోరికలే గెలిచాయి.
కారు చంద్రకాంత్ ఇంటి మలుపు తిరిగింది.
దూరంగా రోడ్డు మీద నిలబడి కనిపించారు చంద్రకాంత్, అతని స్నేహితులు మరో యిద్దరు.
అర్చన కారు చూడగానే వాళ్ళ ముఖాలలో నవ్వు వికసించింది.
కారు ఆపింది అర్చన. డోర్లు తెరిచింది.
వెనక సీట్లో కూర్చున్నారు చంద్రకాంత్ మిత్రులు యిద్దరూ.
అర్చనని ప్రక్కకి జరగమని డ్రైవింగ్ చంద్రకాంత్ తీసుకున్నాడు.
నిమిషం తర్వాత కారు వేగాన్ని అందుకుంది.
ఇరవై నిమిషాల తర్వాత కారు సిటీ లిమిట్స్ ని దాటిపోయింది.
ఇప్పుడది యాదగిరిగుట్ట వైపుగా దూసుకుపోసాగింది.
"నువ్వు ఇలా వస్తున్నట్లుగా మీ వాళ్ళెవరైనా తెలుసుకున్నారా?" అడిగాడు చంద్రకాంత్.
ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది ఆమెలో.
ఎంతసేపటి నుంచో అతికష్టం మీద కంట్రోల్ చేసుకుని వుందామె.
"అరె అర్చనా! ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్" ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా అన్నాడు చంద్రకాంత్.
అతని భుజం మీద తల ఆన్చి చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడ్చిందామె. ఇక పలకరించలేదు అతను.
ఆ సమయంలో ఆమె మానసిక స్థితి ఎలా వుంటుందో అర్ధం చేసుకోగలడతను. కన్న తల్లి దండ్రులని... కంటికి రెప్పలా చూసుకుంటున్న వాళ్ళని అతి దారుణంగా మోసం చేస్తోంది అన్న మాట.
తన తల్లిదండ్రులకు ప్రేమలు యిష్టం వుండవు. నిజానికి అర్చన కూడా ప్రేమలకి, ప్రేమ పెళ్ళిళ్ళకి వ్యతిరేకి.
కానీ....
విధి బలమైనది.
ఆమె ఎంత వద్దు అనుకుందో....అంత బలంగా అతని పట్ల ఆకర్షితురాలయ్యింది.
అతని పరిచయం స్నేహంతో ఆగిపోవాలనుకుంది. ప్రేమగా మారకూడదనుకుంది. కానీ మారింది.
ప్రేమను పెళ్ళిగా మార్చకూడదనుకుంది. ఆ ప్రేమ దగ్గరే ఆపివేసి అతన్ని మర్చిపోవాలనుకుంది. సాధ్యపడలేదు.
చివరికి....అతనితో శరీరాన్ని కూడా పంచుకుంది.
ఈ విషయం తల్లిదండ్రులకి తెలియదు.
తెలిస్తే అసలు చంద్రకాంత్ తో పెళ్ళికి ఒప్పుకోరు కారణం ఇద్దరి కులాలు వేరు. అంతేకాదు....ఆస్థి, అంతస్థులు విషయంలో అతడిది స్కూటరు స్థాయి అయితే, తనది మెర్సిడెస్ కారు స్థాయి.
తన తల్లిదండ్రుల మనస్తత్వం తెలుసు.
తన తల్లి దూరపు బంధువుల అబ్బాయి ఒకతను వున్నాడు. అతను అమెరికాలో ఎంబిఏ చేసి వచ్చాడు. కోట్ల ఆస్థి వుంది. అతనికి ఇచ్చి చేయాలన్నది వాళ్ళ ఆలోచన.
అందువల్ల చంద్రకాంత్ తో పెళ్ళి ఊసెత్తితే చంపేస్తారు. అందుకే అతనో సలహా యిచ్చాడు. మూడో కంటికి తెలియకుండా రహస్యంగా పెళ్ళి చేసుకుని, దండలు మార్చుకుని ఆ తర్వాత తల్లిదండ్రులకి చెబితే....ఇంక కాదనలేరని.
మొదట్లో కోపగించుకోవచ్చు....
కోపగించుకుంటారు కూడా! ఇంట్లోకే రానివ్వకపోవచ్చు కూడా. కానీ కొద్ది రోజులయిన తర్వాత ఆవేశాలు సర్దుకుంటాయి. పరిస్థితులు మామూలవుతాయి.
కోపావేశాల స్థానే మమకారాలు మళ్ళీ వస్తాయి. తర్వాత మామూలే.
ఏ ప్రేమ కథలోనయినా మొదట వద్దు అనటం, తర్వాత సర్దుకుపోవటం జరుగుతున్నవే! అని ఎంతో నచ్చ చెప్పాడు. ఐదు రోజులుగా అదే విషయాన్ని చెప్పి చెప్పి చివరకు ఆమెను కన్వెన్స్ చేయగలిగాడు.
"ఏ అమ్మాయి అయినా తల్లిదండ్రులతో జీవితాంతం కలిసి వుండదు. అత్తవారింటికి వెళ్ళక తప్పదు. భర్తతో కలిసి జీవించక తప్పదు. భర్త సంపాదనలోనే తినాలి. ఆ సంపాదన సరిపోకపోతే భార్య కూడా సంపాదించాలి. పుట్టింటి మీద ఏనాడూ ఆధారపడకూడదు. నేను వీడియోగ్రాఫర్ గా బాగా సంపాదిస్తున్నాను. కొద్దో గొప్పో ఆస్థి కూడా వుంది. మీ తల్లిదండ్రుల మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. కాబట్టి భయం ఎందుకు? పెళ్ళికి సిద్ధపడు" అని చెప్పాడు చంద్రకాంత్.
ఒక విధమైన తెగింపుతో సిద్ధపడింది.
గుడిలో దండలు మార్చుకున్నాక తిరిగి యింటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర చంద్రకాంత్ నే తన తల్లిదండ్రులతో చెప్పమంది. కారణం.... ఆమెకు తల్లిదండ్రుల దగ్గర చెప్పే ధైర్యం లేదు.
కారు ఆగింది.
తల తిప్పి చూసిన ఆమెకు గుడి కనిపించింది.
అప్పుడే వచ్చేశామా! ఇంత త్వరగా వచ్చిందా కారు అనిపించింది. ఆలోచనల్లో పడిన ఆమెకు సమయం తెలియదు.
"మీరు గుడిలోకి నడవండి. మేము దండలుకొని తెస్తాము" అని చెప్పారు చంద్రకాంత్ మిత్రులు.
ఇద్దరూ గుడిలో నడుస్తున్నారు.
"చంద్రకాంత్ నాకు భయంగా వుంది" అంది వణికే స్వరంతో.
ఆమె భుజం మీద చేయి వేశాడు.
"నువ్వేమీ భయపడకు. అంతా సవ్యంగానే జరుగుతుంది" అన్నాడు.
ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు.
కాళ్ళు ముందుకు కదలనని మొరాయిస్తున్నాయి.
గుడిలో అడుగుపెడుతోంటే గుండెలు అదిరిపోయాయి.
అక్కడ పూజారితో విషయం చెప్పాడతను.