"అవును. ఇలా అయితేనే ఎవరూ అనుమానపడరు. క్రొత్త ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా దొరికిపోతారు."
"కానీ....ఆ అంబులెన్స్ లో ఇక్కడి వరకు వస్తే ఖచ్చితంగా దొరుకుతాం. ఇది అసలే నేషనల్ హైవే. పైగా మన దగ్గర గన్స్ కూడా వుంటాయి."
"అలా వచ్చే ప్రసక్తేలేదు. మనం బయలుదేరటం వరకే అంబులెన్స్ లో. తరువాత మారిపోతోంది. మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను. కరెక్ట్ ప్లాన్ వివరిస్తాను. జాగ్రత్తగా వినండి" అన్నాడు ఉపేంద్ర.
"ఏడుగంటలకి అంటే....ఒక పావుగంటో, అరగంటో లేటయినా ఏడున్నరలోపుగా ప్రోగ్రాం ఖచ్చితంగా మొదలవ్వాలి. ముందుగా హోంమినిస్టర్, డి.జి.పి.ల ప్రసంగాలు వుంటాయి. ఆ తరువాత ఆమె ప్రోగ్రాం మొదలవుతుంది. సీటింగ్ అరేంజ్ మెంట్ కూడా మధ్యలో హోం మినిస్టర్, ప్రక్కగా డి.జి.పి ల సీట్లు, మరొకవైపు సంజు సీటు వుంటాయి."
"అంటే వాళ్ళ వెనుక గన్ మాన్ ఖచ్చితంగా నిలబడే వుంటారు కదా" అన్నాడు రాజు.
అవునన్నట్లు తలాడించాడు ఉపేంద్ర.
"అయితే పాల్ చావుకి ఖచ్చితంగా సిద్ధపడాలి.వాళ్ళను కాల్చి చంపాక అక్కడి నుంచి పాల్ తప్పించుకోవటం, అతనిని మనం ఎస్కేప్ చేయటం అసంభవం."
అంతవరకు మౌనంగా వాళ్ళ మాటలు వింటున్న పాల్ సడన్ గా జేబులోంచి చిన్న చాకు బయటికి లాగి బొటనవేలు మీద గాయం పెట్టుకున్నాడు.
బొట్లు బొట్లుగా రక్తం టేబుల్ మీద పడసాగింది.
"నేను ఏనాడూ చావుకి భయపడలేదు. నా ప్రతి రక్తపు బొట్టు మన పోరాటం కోసమే. ఈ కత్తిని యిదే క్షణంలో గుండెల్లో దించుకోటానికి కూడా సిద్ధమే" ఉన్మాదిగా వూగిపోతూ అన్నాడు పాల్.
పాల్ ని గాఢంగా కౌగిలించుకున్నాడు ఉపేంద్ర. జేబులోంచి కర్చీఫ్ తీసి పాల్ బొటనవేలికి చుట్టాడు. "నాకు తెలుసు పాల్! నీ మీద మాకెవరకీ ఆ సందేహం లేదు. నీ జీవితాన్ని మన పోరాటానికి త్యాగం చేయటానికి నువ్వు ఏనాడయినా సిద్ధమే" మరోసారి కౌగిలించుకుని ఆనందభాష్పాలు రాల్చాడు ఉపేంద్ర.
"మనం ఒక పని చేస్తే" అంతసేపూ నిశ్శబ్దంగా కూర్చున్న కరీం పెదవి విప్పాడు.
ఏమిటన్నట్లు చూశారందరూ.
"స్టేజిమీద వున్నప్పటికంటే ప్రోగ్రాం మొదలవగానే డి జి పి, హోంమినిస్టరు కూడా వి ఐ పి ల గ్యాలరీలలో కూర్చుంటారు కదా! ఆ సమయంలో అయితే సెక్యూరిటీగార్డ్స్ కూడా ఒక ప్రక్కన నిలబడి వుంటారు. అప్పుడు చంపటం మంచిది కదా? పాల్ ప్రాణానికి ప్రమాదం అంతగా వుండదు."
"బట్....నువ్వొక విషయం మర్చిపోయావు. మనం హోం మినిస్టర్, డి.జి పి లతో పాటు ఆమెను కూడా చంపాలి. ఆమె స్టేజి మీద వుంటుంది. వాళ్ళు స్టేజికి ఎదురుగా బయట కూర్చుని వుంటారు. అంతేకాదు హోం మినిస్టరు, డి జి పి ప్రక్కప్రక్కనే కూర్చుంటారన్న నమ్మకం ఏమిటి? అసలు ప్రోగ్రామ్ చూడటానికి కూర్చుంటారన్న గ్యారంటీ కూడా లేదు. ఇలా వేరు వేరు చోట్ల కూర్చున్న వాళ్ళని చంపటం అసంభవం. కాబట్టి ఏం చేసినా వాళ్ళందరూ స్టేజిమీద వుండగానే చెయ్యాలి."
అంతా ఆలోచనలో పడ్డారు.
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.
"అన్నా" ఉపేంద్రని పిలిచాడు పాల్.
ఏమిటన్నట్లు చూశాడు అతను.
"మొదటి వ్యక్తిని కాల్చగానే సెక్యూరిటీ మనుషులు రియాక్టయి రెండో మనిషి మీద ఫైర్ చేసేలోగా నన్ను చంపేస్తే....అప్పుడెలా? ఇప్పుడు ఆ ముగ్గురిలో మనం ప్రాణాలు తీయాల్సిన ముఖ్య వ్యక్తి ఎవరు?"
"అదే చెప్పబోతున్నాను. నువ్వు ముందుగా కాల్చాల్సిన వ్యక్తి డి జి పి...." ఇంకా ఏదో అనబోయాడు ఉపేంద్ర.
"అదేమిటి! వాళ్ళు చంపమంటున్నది సంజుని కదా! అందుకే కదా వాళ్ళు ఖర్చు పెడుతున్నది, సహాయపడుతున్నది కూడా.." అడ్డు వచ్చాడు కరీం.
"షటప్" అసహనంగా అన్నాడు ఉపేంద్ర.
మౌనంగా వుండిపోయాడు కరీం.
"వాళ్ళు ఖర్చు పెడుతున్నది సంజుని చంపడం కోడమే అయినా, మనం కిరాయి హంతకులం కాదు. ముందుగా సంజుని కాల్చితే అదే సమయంలో గార్డ్స్ రియాక్టయి పాల్ ని చంపేస్తే....మనకి సంబంధంలేని వ్యక్తిని చంపే ప్రయత్నంలో విలువైన మన మెంబర్ ప్రాణాల్ని పోగొట్టుకుంటామా! అందువల్ల చివరిగా కాల్చేది సంజునే."
ఇంకేమీ మాట్లాడకుండా అతను చెప్పేది వింటున్నారు అందరూ.
"నువ్వు ముందుగా చంపాల్సింది డి జి పిని" చెప్పాడు ఉపేంద్ర.
అర్ధంకానట్లు చూశాడు పాల్.
"ముందుగా హోంమినిస్టర్ ని చంపకుండా డి జి పి ని చంపమంటా వేమిటి అని అనుకుంటున్నావా? కారణం చాలా సింపుల్. మరో అయిదు నెలల్లో ఎన్నికలు వున్నాయి. కాబట్టి ఈ హోం మినిస్టర్ పదవిలో వుండేది ఐదు నెలలే. ఆ తరువాత ఇతని పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందో, రాదో తెలియదు. వచ్చినా యితనే మళ్ళీ హోం మినిస్టర్ అవుతాడన్నా నమ్మకంలేదు. కానీ డి జి పి మాత్రం కొత్తగా వచ్చాడు. కొన్ని ఏళ్ళపాటు ఇక్కడే వుంటాడు. పంజాబ్ టెర్రరిస్ట్ లని గజగజలాడించిన వాడు. అతని నుండి మనకు ఎదురయ్యే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి మన మొదటి టార్గెట్ డి జి పి. తరువాత హోంమినిస్టర్. ఆ తరువాతనే సంజు" చెప్పాడు ఉపేంద్ర.
"కానీ మనం లోపలికి తీసుకెళ్ళేది ఏ రకమైన ఆయుధం? రివాల్వర్ తో అయితే ముగ్గుర్నీ చంపడం అసంభవం. కన్నుమూసి తెరిచేలోగా ముగ్గుర్నీ మట్టుపెట్టాలంటే ఎకె 47 అయితేనే సంభవం. కానీ అంత పెద్ద ఆయుధం ఎవ్వరికళ్ళా పడకుండా తీసుకెళ్ళటం అసంభవం" తన మనసులోని మాట చెప్పాడు రాజు.
నవ్వి అక్కడి స్టూల్ మీద కూర్చున్నాడు ఉపేంద్ర.
"అందులో స్టేజి మీదకు ఎకె 47 తోనే ఎంటరవుతాడు. కానీ గన్ ఎవరికీ కనపడదు. దానికొక ప్లాన్ వుంది. ఆ వివరాలు తరువాత చెబుతాను. నేను చెప్పే ప్లాన్ ని సరిగ్గా అమలు జరిపితే ఆ ముగ్గుర్నీ చంపడమే కాదు, పాల్ కూడా సేఫ్ గా బయటికి వస్తాడు. మనం ఎస్కేప్ అయ్యే ప్లాన్ చెబుతాను" అన్నాడు ఉపేంద్ర.
అక్షరం కూడా మిస్ అవకుండా వింటున్నారు అందరూ.
"పాల్ వుపయోగించే గన్ కి సైలెన్సర్ ఫిట్ చేసి వుంటుంది. కాబట్టి గన్ షాట్స్ డి జి పికి, హోం మినిస్టర్ కి తగలగానే వాళ్ళ ఆర్తనాదాలు మనకి వినిపిస్తాయి అవి వినిపించిన మరుక్షణం మనం వ్యాన్ స్టార్ట్ చేసి రెడీగా వుండాలి...."
అతని మాటలకు అడ్డు వచ్చాడు రాజు.
"అన్నా! కాలేజీ క్యాంపస్ లోపల ఎక్కడో స్టేజి మీద వుంటారు వాళ్ళు. వాళ్ళకీ గేటు బయట ఎక్కడో వ్యాన్ లో కూర్చుని వుండే మనకి మధ్య కనీసం ఓదారు వందల గజాల దూరం వుంటుంది. అంత దూరం మనకి అరుపులు వినపడటం అసాధ్యం."
"రాజూ! నీకు వయసు ,ఆలోచన రెండూ తక్కువే. స్టేజి మీద మైక్స్ అరేంజి చేసి వుంటాయి. ఆ టైములో మైక్స్ ఆన్ లోనే వుంటాయి. చిటికె వేసినా, బాంబు పడినంత గట్టిగా మనకి వినిపిస్తుంది."
ఉపేంద్ర ఆలోచనల్ని, అనుభవాన్ని మనసులోనే ప్రశంసించాడు రాజు.
"పాల్! స్టేజి మీద నుండి నువ్వు బయటికి ఎలా తప్పించుకు వస్తావన్నది నేను చెప్పలేను. అది కేవలం నీ తెలివి తేటల్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి వుంటుంది. ఎవరైనా పోలీస్ డిపార్ట్ మెంటు మనిషి మనని అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిర్దాక్షణ్యంగా కాల్చి చంపడమే."
"వ్యాన్ లో ఎటువైపు ప్రయాణించాలి?" అడిగాడు.
"అదే చెబుతాను" అంటూ మ్యాప్ ఒకటి బయటకు తీసి టేబుల్ మీద పరిచాడు.
అందరూ పరిశీలనగా దానిని చూశారు.
"చూడండి! ఇది గేటు. ఇటు నుంచి ఎడమవైపు వస్తే పోలీస్ కంట్రోల్ రూమ్ వుంది .ఇటు రావటం ప్రమాదం .అలాగే ఇటు తిన్నగా బషీర్ బాగ్ వైపు వెళ్ళినా ప్రమాదమే. ఎందుకంటే కాలేజీ క్యాంపస్ లోకి ప్రేక్షకులు ఎంటర్ అయ్యేది అటు నుండే కాబట్టి అక్కడ కూడా పోలీసులు హెవీగా వుంటారు. అందువల్ల ఈ రెండు రోడ్స్ వదిలిపెట్టి అబిడ్స్ వైపుగా వచ్చి నాంపల్లి వైపు టర్న్ అవ్వాలి."
"కాని....అబిడ్స్ సర్కిల్ లో పోలీస్ స్టేషన్ వుంది కదా!"
"ఆ భయం అవసరంలేదు. ఎందుకంటే ఆ టైములో డ్యూటీలో వుండే ఇన్స్ పెక్టర్ ని మనం మేనేజ్ చేస్తాం. అది దాటి నాంపల్లి వైపు వచ్చి అటునుండి లతా టాకీస్ మీదుగా నిజయనగర్ కాలనీ వైపు వెళతాం. అరవై డెభై కిలోమీటర్ల స్పీడులో మన వాహనం నడపవచ్చు. అటునుండి జె ఎన్ టి యు క్యాంపస్ ప్రక్క ఇంకొక కారు సిద్ధంగా వుంచుతాం. ఆ ప్రదేశానికి రాగానే వ్యాన్ వదిలి కారులోకి ఎక్కుతాం. వ్యాన్ కి నిప్పు పెడతాం. కారులోనే ముందుకు ప్రయాణించి బంజారాహిల్స్ లో నుండి, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ మీదుగా సందుల్లోనే ప్రయాణిస్తూ యిక్కడికి రావాలి. వీలయిననంత వరకు మెయిన్ రోడ్ వదిలిపెట్టి ప్రయాణించాలి. ఏదయినా కారణాల వల్ల ఇటువైపు రావటం కష్టం అవుతుందనుకుంటే జూబ్లీహిల్స్ లోని మన ముదిరాజ్ దగ్గరకు వెళ్ళి ఆ రాత్రికి ఆశ్రయంతీసుకోవాలి."
మంత్రముగ్దుల్లా అతను చెప్పినది వింటున్నారు.
"అన్నా ఒక్క నిమిషం" అన్నాడు రాజు.
ఏమిటన్నట్లు చూశాడు ఉపేంద్ర.