Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 33


    "నేను నమ్ముకున్న షిర్డీసాయే ఈ రూపంలో వచ్చాడేమోనండీ. తనను నమ్మినవారింటికి తను ఏదో ఒక రూపంలో వస్తానని చెప్పాడు సాయి తన భక్తులతో."

    "మీరు  నమ్ముకున్న సాయి నన్ను పంపాడేమోగానీ, నేను సాయిని కాను. దయచేసి ఈ సంఘటనకి ప్రచారం కల్పించవద్దు. నన్ను ఇంకో సాయిని చేసో, స్వామిని చేసో, నాకు పూజలు చేయడం మొదలుపెడతారు జనాలు. లోకకళ్యాణానికి  అవసరమైనప్పుడు నా శక్తిని ఉపయోగించమని  గురుదేవుల ఆజ్ఞ. ఇక్కడ ఆ అవసరం కనిపించి, వారి ఆజ్ఞ శిరసా వహించాను."

    "మీరు నిజంగా మా పాలిట దేవుడు" ఆమె భక్తితో చేతులు జోడించింది.

     "వద్దు. నన్ను దేవుడిని చేయవద్దు. నా పేరు శ్రీచక్రకుమార్ అమ్మా. ఇంజనీరింగ్ పట్టభద్రుడ్ని. నన్ను తీసుకువచ్చి, నా కొడుకు ఎన్ని రోజులు బ్రతుకుతాడో చెప్పమని పరీక్ష పెట్టాడులే మీ ఆయన. తప్పు తుందా? చెప్పాను అరవయ్యేళ్లు బ్రతుకుతాడని."

    నిన్నటిదాకా శ్రీచక్రని ఒక మోసగాడికింద లెక్కగట్టి ఆధారాలు దొరకగానే కటకటాల వెనక్కి  నెట్టివేయాలని  తహతహలాడిన రవికుమార్ పరిస్థితి ఇప్పుడు యజమాని పాదాలముందు పడి వుండే పెంపుడు కుక్కలా వుంది.

     మరునాడే తన పోలీసు బలగంతో శ్రీచక్రనీ, స్వామినీ వెంటబెట్టుకుని నల్లమల్లకి బయలుదేరాడు.


                       *    *    *    *    *

   
    అదొక ఫైవ్ స్టార్ హోటల్.

     మారుతీరావు తన మిత్రబృందంతో లోపలికి వెడుతున్నాడు.

    శ్రీచక్ర, కౌస్తుభతో బయటికి వస్తున్నాడు.

     చూసీచూడనట్లుగా వెళ్ళిపోతున్న కొడుకుని  దగ్గరికి పిలిచాడు మారుతీరావు.

     "ఎవర్రా ఆ అమ్మాయి?"

    "నాకు తెలిసినమ్మాయి డాడీ!"

    "తెలిసిన అంటే?"

    "తెలిసిన అంటే పరిచయమున్నదీ అని అర్దం."

    "చమత్కారం చాలుగానీ ఎవరాపిల్ల?"
   
    "ఆ మాత్రం  అర్దంకాలేదా మారుతీ. షికార్లకి హోటళ్లకీ, అతడితో తిరుగుతున్నదంటే. పెట్ట పుంజుతో జత కట్టిందని అర్దం" భాషా భళ్లున నవ్వాడు.

     "మారుతీ! ఇతడు నీ కొడుకా?ఆశ్చర్యంగా వుందే! ఇతడి లాంటి  మనిషే మనూళ్లో జమీందారుగారు చనిపోతే, చితికి నిప్పుపెట్టి కర్మకాండ చేశాడు. జమిందారుగారికి కొడుకు వరసైన  దూరపు బంధువు అని చెప్పారు.  దినవారాలు అయిన ఆ నాలుగురోజులూ ఊళ్లో ఎవరు పొయ్యిలు రాజేయలేదు. అందరూ అక్కడే భోజనాలు చేసారు, పేదలకి వస్త్రదానాలు చేసారు. పెద్ద ఖర్మ ఎంత ఘనంగా చేశారంటే లక్షో, రెండు లక్షలో ఖర్చయి వుంటుంది. అన్నట్టు ఈ పిల్ల కూడా  అక్కడ వుంది.  కాష్ బ్యాగ్ చేతిలో పట్టుకుని పనివాళ్లమీద అజమాయిషీ చేస్తూ కనిపించింది.  డౌటు లేదు.  మారుతీ. ఇథడిలాంటి మనిషికాదు.  ఖచ్చితంగా అతడే ఇతడు. ఇతడి గుండే నేను చెప్పిన దానికి సాక్ష్యం" అన్నాడు మునిరాజు.

    "నీ అనుమానం కూలా? వాడు ఫ్రెండ్స్ తో తిరుపతి వెళ్లొచ్చాడు రా! అది తిరుపతి గుండు."

    "కాదు, శ్రాద్దపు గుండు. జమిందారుగారికి  కర్మకాండ నిర్వహించి నందుకు చేసుకున్న క్షురకర్మ."

    "మనూరి ముఖమైనా వాడింతవరకూ చూడలేదు. మనూళ్లో ఒక జమిందారు వున్న సంగతి వాడికెలా తెలుస్తుంది?తల్లీదండ్రీ మేం బ్రతికుండగా వాడు ఇంకెవరికో పిండాకూడు పెట్టడం ఏమిటి మునిరాజూ? నీ కళ్లని ఒకసారి డాక్టర్ కి చూపించుకుంటే బాగుంటుందేమో?"

    "మీరిద్దరూ వాదులాడుకోవడం దేనికి? అతడితే చెప్పమంటే సరిపోతుందికదా?"

    "ఏరా? అతడు చెప్పేదంతా నిజమేనా?"

    "నిజమే!"

    "మనూళ్ళో జమీందారుగారు చనిపోతే నువ్వు శ్రాద్దం పెట్టడం ఏమిటిరా?"

    "పెట్టానుడాడీ!"

    మారుతీరావు ముఖం పాలిపోయింది.

     "తల్లిదండ్రులు బ్రతికుండగానే నువ్వు గుండు గీయించుకుని ఎవరో అనాధ  ప్రేతానికి పెద్దకర్మ చేయడం ఏమిటి?" తల బాదుకోవడం ఒక్కటే తక్కువగా అన్నాడు మారుతీరావు.

     "అనుకోకుండా ఒక ప్రెండు వెంట అక్కడికి వెళ్లటం జరిగింది డాడీ. ఆ సమయానికి ఆయన చనిపోయారు. వున్న ఒక్కగానొక్క కొడుకు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఆయన కథ వింటే జాలేసింది. ఆయనకి దూరపు బంధువుగా చెప్పుకుని ఆయనకి దహనసంస్కారం, కర్మకాండ నిర్వహించాను."

    "ఎవడో దిక్కు మాలినవాడు చస్తే,  నువ్వు కర్మకాండ చేయడం ఏమిటిరా?"

    "మనిషికీ, మనిషికీ మధ్య పూలదండలో దారంలా  కనిపించని బంధం ఒకటుంటుంది. అది రుణానుబంధం. జనన మరణ చక్రంలో చిక్కుకున్న మనిషి  ఈ జన్మలో  తండ్రి అయితే, వచ్చే జన్మలో కొడుకుకావచ్చు.  ఇంకెక్కడో పుట్టి, ఏమీ కాకపోవచ్చు. రుణానుబంధం అన్నది మాత్రం అలాగే వుంటుంది. ఏ జన్మ ఋణమో. ఈ జన్మలో జమిందారుగారికి కర్మ చేసి తీర్చుకున్నాను. దాన్ని మానవతా దృష్ట్యా ఒక మంచిపని చేశానని అభినందించాలిగాన, ఇలా రాద్దాంతం చేస్తారేమిటి?"

    "ఈ వేదాందం ఎక్కడ నేర్చావురా?"

    "నీ కొడుక్కి  కూలి బాగానే పడిందిలే మారుతీ. జమిందారుగారికి పిల్లలు లేకపోవడంవల్ల ఆయనకున్న లక్షల ఆస్తి ఆయన వీలునామా ప్రకారం, నీ కొడుక్కి కలసివచ్చింది. తనకి ఎవరు తల కొరివిపెట్టి కర్మ చేస్తారో, వాళ్లకే తన స్థిరాస్తులు చెందుతాయని, ఆ ముసలాయన విల్లు వ్రాశాడులే."

    "ఎవరికో వ్రాస్తే ఆయన దాయాదులు వూరుకుంటారా?"

    "ఎవరున్నారు? ఒకరో, ఇద్దరో పెద్ద తాతగారి మునిమనుమలున్నారు. వాళ్ళెక్కడో అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో వున్నారు. వాళ్ళు కోటీశ్వరులు. వాళ్లు. ఈ ముష్టి లక్షలకు ఆశపడేవాళ్లు కాదు" చెప్పాడు మునిరాజు.

     "నేను కూడా ఈ ముష్టి లక్షలకు ఆశపడను. ఏ అనాధ శరణాలయానికో, విద్యాసంస్థలకో వ్రాసి ఇచ్చేద్దామనుకుంటున్నాను."

    "ఆ పని మాత్రం నన్నడగకుండా చేయొద్దు. డబ్బుతో వ్యవహారం.  చిన్నవాడివి. నీకు తెలియదు" అన్నాడు మారుతీరావు.

     పని నిముషాల తరువాత హోటల్ గదిలో మునిరాజు ముఠా రహస్య సమాలోచన ప్రారంభమైంది.

     భాషా వివరిస్తున్నాడు ప్లాను.

     "వచ్చే పున్నమిరోజు రాత్రి భైరవుని కొండలోని గుప్తనిధిని స్వామి స్వయంగా తీసి ప్రభుత్వపరం చేస్తున్నట్లుగా సమాచారం అందింది. స్వామి మహామంత్రవేత్త. సామాన్యులు ఎవరూ ఆ గుప్తనిధిని తాకలేరని, తానే స్వయంగా ఆ నిధిని కైవసం చేసుకుని ప్రభుత్వ పరం చేస్తానని  చెప్పాట్ట.

     ఆ రోజు నల్లమలకు ఎంతో బందోబస్తుతో వెళుతున్నాడు మన సి. ఎం. ఏర్పాట్లు బాహాటంగానే జరుగుతున్నాయి. అయితే చెంచుగూడేలలో సి. ఎం. పర్యటనగా పత్రికలకిస్తున్నారు. గిరిజనుల కష్టసుఖాలను మన సి. ఎం. స్వయంగా విచారిస్తాడు. పున్నమిరోజు పగలే చెంచుగూడెం చేరుకుంటాడు సి. ఎం.

     వాళ్ళ కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటాడు. వాళ్ల గుడిసెల్లో వాళ్లు తాగే  గంజినీళ్లు వాళ్ళ చిప్పల్లోనే తాగుతాడు. వాళఅలు పడుకునే మంచాల్లో విశ్రమిస్తాడు. వాళ్ళకేవో  వరాలిస్తాడు.  ఈ రాత్రికి ఈ పని రహస్యంగా జరిగిపోతుంది. గిరిజునులకు సంబంధించిన గుప్తనిధి రాత్రికి రాత్రే హెలీకాప్టర్ లో ఎగిరిపోతుంది."

    "ఎగిరిపోతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా?"

    "ఊరుకోం. కొందరు చెంచు యువకులను కూడగట్టుకుంటున్నాం. తమకు సంబంధించిన నిధిని ఎవరో గద్దలా తన్నుకుపోతున్నారంటే వాళ్లు సహజంగానే కోపోధ్రిక్తులైపోతారు. వాళ్లని ఉపాయంగా  మనవైపు త్రిప్పుకోవాలి. ఆ రాత్రి నిధి గుహలోంచి బయటికి రాగానే చెంచు యువకులతో అటాక్ చేయించాలి. వాళ్లకి బాంబులు, తుపాకులు, కావాల్సిన మారణాయుధాలనన్నిటినీ సప్లయ్ చేసి పెట్టామనుకోండి. చెంచు యువకుల చేతుల్లో  సి. ఎం. , సి.ఎం. బలగం హతమారితే మన చేతుల్లో చెంచు యులకులు చస్తారు. గుప్తనిధితో మనం హెలికాప్టర్ లో ఎగిరొస్తాం."

    "ప్లాన్ బాగానే వుంది. ఆచరణలో ఇది సాధ్యమా?"

    "ఎందుకు సాధ్యంకాదు? ఇదిగో మన ప్లాన్ కాగితంమీద  వేసి పెట్టాను. ఇది నల్లమల అడవి. ఇది భైరవుని కొండ. రాత్రిపూట గనక రాళ్ల వెనుక, చెట్ల వెనుక దాగివుండి కావాలన్నప్పుడు దాడి చేయడం సులువు. ఇదిగో ఈ రాళ్ల వెనుక బాంబులతో మనం, మనవాళ్లు దాగి వుంటారు."

    బాటిల్సూ, గ్లాసులూ మొదలైన సరంజామా తీసుకు వచ్చాడు వెయిటర్.

     అతడితోపాటు మరొకతడు కూడా వచ్చాడు.

     అక్కడున్న ఖాళీ కుర్చీ ఒకటి లాక్కుని  కూర్చున్నాడు.

     అతడిని చూడగానే అందరి గుండెలూ బేజారయ్యాయి.

    "ఏమిటి? మిత్రులంతా ఇక్కడ సమావేశమయ్యారు. మళ్లీ ఎవరి ప్రాణం తీయబోతున్నారు?' అంటూనే టేబుల్ మీద పరచిన ప్లాన్ కాగితం చేతికి తీసుకుని చూశాడు.

     "ఏం సార్! అనుకోకుండా మీరు...." మారుతీరావు నీళ్లు నమిలాడు.

     "మిమ్మల్నందర్నీ అత్తారింటికి  తీసుకెళ్లి మర్యాద చేద్దామని!"

    "అత్తారిల్లా? మేం ఏం తప్పు  చేశాం?' బింకంగా అడిగాడు భాషా.

     "పాతిక సంవత్సరాలక్రితం  కనిపించకుండాపోయిన జయసూర్య కేసు నేను టేకప్ చేశాను. ఇన్వెస్టిగేషన్ లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. ఒక్కరుకాదు, ఆరుమంది మీదపడి కత్తులతో పొడిచి పొడిచి అతడిని చంపేశారు. శవాన్ని అక్కడే పూడ్చిపెట్టారు.

 Previous Page Next Page