"రేపతడిని తీసుకురండి. రేపు కిడ్నీ ఆపరేషన్ కేసు వుంది. నా అసిస్టెంట్ గా తీసుకుంటాను" చెప్పాడు డాక్టర్ రాజు.
రవికుమార్, డాక్టర్ రాజు క్లబ్బులో మంచి మిత్రులు.
డాక్టక్ జయసూర్య తనేనని చెప్పుకుంటున్న శ్రీచక్ర తనుపెట్టిన పరీక్షలో నెగ్దితే అతడి మాటలు నమ్మవచ్చు. అతడు చెప్పిన ప్రకారం నల్లమల అడవిలో జయసూర్య శవాన్ని బయటకి తీసి వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు. అతడు చెప్పింది నిజమయితే దోషులను పట్టుకుని శిక్షపడేలా చేయవచ్చు.
మరురోజు శ్రీచక్రతో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోయాడు డాక్టర్ రాజు.
మూసిన తలుపుల ముందు టెన్షన్ తో కూర్చున్నాడు రవికుమార్.
రెండుగంటల నిరీక్షణ తరువాత డాక్టర్ రాజు నాప్ కిన్ తో చేతులు తూడుచుకుంటూ వచ్చాడు.
"సర్జరీలో అతడిది చాలా ఫర్ ఫెక్ట్ హాండ్. సర్జరలో అతడి ప్యూచర్ చాలా అమోఘంగా వుంటుంది. ఒక దశలో నన్ను చాలా ఆశ్చర్యపరచాడు కూడా. మంచి ఎక్స్ పర్ట్ మాత్రమే చేయగలిగిన టెక్నిక్ అది. అతడి తలకు తగిలిన దెబ్బ వలల అతడికేం కాలేదు. అంతా మామూలుగానే వున్నాడు."
అతడలా చెబుతుండగానే శ్రీచక్ర చేతులు నాప్ కిన్ తో తుడుచుకుంటూ వచ్చాడు.
" రండి ఎస్ పి సాబ్! ఒక కప్పు కాఫీ తీసుకుని వెడుదురు" ప్రకక గదిలోకి ఆహ్వానించాడు.
శ్రీచక్రని ఎంతో మర్యాదగా ప్రశ్నించాడు "మీ పేరు?"
"జయసూర్య!"
"మీరు మెడిసిన్ ఎక్కడ చేశారు?"
చెప్పాడు
"ఏ సంవత్సరం?"
అతడు చెప్పింది విని డాక్టర్ రాజు విభ్రాంతిగా చూసాడు.
"ఆర్ యూ జోకింగ్? మీరప్పటికి పుట్టివుండరు!"
"నేను చెప్పేది కరెక్టే డాక్టర్ రాజూ!" సీరియస్ గా అన్నాడు శ్రీచక్ర.
"మీ క్లాస్ లో జయసూర్య భూపాల్ అన్నతడు వుండేవాడా కాదా?"
"క్లాస్ లో ఏమిటి? అతడు మా రూంమేట్!మేం మంచి స్నేహితులం!"
"సువర్చల బాగుందా రాజూ?"
ఏమిటీ కుర్రవాడు సువర్చల బాగుందా అని అడుగుతున్నాడు, పెద్దా చిన్నా తారతమ్యం లేనట్టుగా చనువున్నవాడిలా. ఏక్సిడెంట్ లో తలకి దెబ్బ తగిలిదంటున్నాడు రవి. మతి భ్రమించి మాట్లాడుతున్నాడా? మతి భ్రమిస్తే జయసూర్య గురించి ఎలా తెలుస్తుంది? ఇతడెవరో జయసూర్య గురించి, అతడి స్నేహితుల గురించి బాగా తెలిసినవాడు అయివుండాలి.
"సువర్చల బాగుంది. కానీ మీరు?"
"ఎంతమంది పిల్లలు?'
"ఒక అబ్బాయి , ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జయసూర్య నా ఫ్రెండ్ జయసూర్య అంటే నా మిసెస్ కి చాలా ప్రేమ. సోదర ప్రేమ తన కొడుక్కి అతడి పేరే పెట్టుకుంది."
"వినీత్ ఎక్కడున్నాడిప్పుడు?'
"వాడు అమెరికాకు వెళ్ళి, అక్కడే కారు ఏక్సిడెంట్ లో పోయాడు. పోయి కూడా పదేళ్ళవుతోంది"
'అరె...." నొచ్చుకున్నాడు శ్రీచక్ర. "పూర్ ఫెలో - అర్దాయుష్షు."
"అంతా తెలిసినట్లు మాట్లాడుతున్నారు. ఇంతకీ మీరు....?"
"రామాపురం జమిందారు వెంకట కృష్ణ భూపాల్ గారి వారసుడిని. జయసూర్య భూపాల్ ని. ఇంకా ఏమని చెప్పను? ఒకసారి రామాపురం వచ్చి, ఈ అన్న యిచ్చే పసుపు కుంకుమలు తీసుకెళ్లమని చెప్పు సువర్చలకి. నేనిక వస్తాను. రవికుమార్ గారూ! మీ పరీక్షలో నెగ్గినట్టేకదా?"
"ఇంకొక్క పరీక్ష తరువాత రిజల్ట్ చెబుతాను. మీరు వెళ్లండి. నేను తరువాత వచ్చి కలుస్తాను."
శ్రీచక్ర వెళ్లిపోయాడు.
"ఏమిటి కుర్రాడు? తను జయసూర్య భూపాల్ నంటాడేమిటి....? అతడు పాతికేళ్ల క్రితం మనోవైకల్యంతో ఇల్లు విడిచి ఎటో వెళ్లిపోయాడు ."
"మీకేమనిపిస్తోంది?"
"నా గురించి, జయసూర్య గురించి బాగా తెలిసినవాడనిపిస్తోంది. బహుశా జయసూర్య డైరీలు చదివి, అతడి ఆల్బంలో మేం కలిసి దిగిన ఫోటోలు చూసినవాడై వుంటాడు. నన్నేదో తమాషా పట్టించడానికి తనే జయసూర్యనని చెబుతున్నాడు."
"జయసూర్య గురించి మీకు తెలిసిన సంగతులు చెప్పండి?"
"అతడి జీవితంలో చాలా విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఒస సన్యాసి నుండి గురూపదేశం పొందాడు. గురు కటాక్షమో, పూర్వజన్మ పుణ్య విశేషమో అతిలో ఒక సూపర్ పవర్ చోటు చేసుకుంది. నా భార్య ఒక ఆపదలో వున్నప్పుడు, అతడిని తలచుకోగానే రక్షించాడు" ఇరవై అయిదేళ్ల క్రిందటి సంఘటన వర్ణించి చెప్పాడు.
"ఇంతకీ ఇతడెవరు? తనే జయసూర్యనని ఎందుకు చెబుతున్నాడు?"
"ఆ మిస్టరీ చేదించే ప్రయత్నంలోనే అతడిని మీ దగ్గరికి తీసుకు వచ్చాను డాక్టర్. నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు తప్పక మీ సందేహాన్ని తీర్చగలననుకుంటాను."
మరురోజు శ్రీచక్రని తనింటికి తీసుకెళ్లాడు రవికుమార్.
"మీకు ఒక పేషెంట్ ని చూపిస్తాను. అతడి పరిస్థితి ఏమిటో, అతడు ఎన్నిరోజుల్లో చచ్చిపోతాడు చెప్పాలి."
గదిలో మంచంమీద పధ్నాలుగు, పదిహేనేళ్ల వయస్సున్న ఒక పిల్లవాడు పడుకుని వున్నాడు. చిక్కిపోయిన చాలా బలహీనంగా కన్పిస్తున్నాడు.
"ఇతడు ఎన్నిరోజుల్లో చచ్చిపోతాడో కరెక్ట్ గా చెప్పాలి."
శ్రీచక్ర ఒక్క నిముషం తధేకంగా చూసాడు ఆ పిల్లవాడిని.
"బాబూ! ఒకసారి లేచి కూర్చుంటావా?"
"వాడు స్వయంగా లేవలేడు. లేపి కూర్చోబెట్టాలి. లేపి కూర్చోబెట్టనా?" లేపడానికి ముందుకు వంగాడు రవికుమార్.
"మీరు లేపనక్కర్లేదు. అతడు లేచి కూర్చుంటాడు."
"వాడు తనకు తానుగా లేచి కూర్చుని మూడునెలలు గడిచి పోయాయి."
"నా చేతిని పట్టుకుని లేచి కూర్చో బాబూ!"
శ్రీచక్ర చేతినందించాడు. సన్నగా, పుల్లలా వున్న చేతిని మెల్లగా ఎత్తి, ఆచేతిని పట్టుకున్నాడు కుర్రాడు.
లేచి కూర్చో."
కుర్రాడి కళ్ళల్లో అశక్తత కదలాడింది.
"లేరా! మంచివాడివి కదా! లేచి తిరగాలనిలేదూ? నీతోటి పిల్లలతో ఆడుకోవాలనీ, స్కూల్ కి వెళ్ళి చదువుకోవాలనీ లేదూ?"
"ఉంది" అన్నట్లు తలూపాడు.
"బ్రతకాలని ఆశలేదూ?"
కుర్రాడి కళ్ళల్లో నీళ్లు.
"ఏడవకూడదు. బ్రతకాలన్న నీ ఆశే నీకు ఆయుష్షును పోస్తుంది. లేమరి!"
కుర్రాడు శక్తినంతా కూడదీసుకుని నెమ్మదిగా లేచి కూర్చున్నాడు.
"వెరీగుడ్! మంచం దిగి కొంటెం అటూ ఇటూ తిరుగరా! నువ్వు క్రింద పడకుండా నేను పట్టుకుంటానులే."
రవికుమార్ చూస్తుండగానే ఒక అధ్బుతం జరిగిపోయింది.
శ్రీచక్ర చేతిని గట్టిగా వడిసి పట్టుకుని అప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లాడు తప్పటడుగులు వేస్తున్నట్లుగా అడుగులు వేయసాగాడు.
ఆరునెలలుగా మంచంలో పడివున్న పిల్లాడు లేచి నడుస్తుంటే రవి కుమార్ కళ్లు పత్తికాయలయ్యాయి."
"ఎన్నేళ్ళు బ్రతుకుతాడో కరెక్ట్ గా చెప్పమన్నారు కదా! అరవై ఏళ్లు బ్రతుకుతాడు. భార్యాపిల్లలతో పరిపూర్ణమైన జీవితం అనుభవిస్తాడు."
బీరువా తెరిచి కవరొకటి తీసుకువచ్చాడు రవికుమార్. అందులోంచి కాగితాలు లాగి, అతడిముందు కుప్పపోశాడు.
"ఈ రిపోర్టులన్నీ వాడికి బ్లడ్ కాన్సర్ అని చెబుతున్నాయి. ఇంకొక్క పదిహేనురోజులే బ్రతుకుతాడని చెప్పాడు డాక్టర్లు. మీరు అరవయ్యేళ్లు ఆయుష్షు అని చెబుతున్నారు. ఇదేదో సంభవం?" దుఃఖం, ఆవేశం కలగలిసిన స్వరంతో అన్నాడు రవికుమార్.
"నేనూ డాక్టర్నే కదా! నా మాట కూడా నమ్మాలి మీరు. వీడికి బ్లడ్ కాన్సర్ లేదు. ఏంలేదు. కావాలంటే రేపు మళ్లీ టెస్టులు చేయించండి. ఈ కాగితాల్లో వున్న రిపోర్టులన్నీ అబద్దం అని వస్తుంది. బలహీనంగా వున్నాడు. మంచి ఆహారం యిస్తే కోలుకుంటాడు."
"మరి నాకు సెలవా?'
"కొంచెం ఆగండి. లలితా ఇలా రా!"
అతడి భార్య లలిత వచ్చింది, ఆమె వస్తూనే గోడ పట్టుకుని నడుస్తున్న కొడుకును చూసింది. ఆమె కళ్లు విభ్రాంతిగా మారాయి.
"సురేష్ నడుస్తున్నాడండీ. నా బాబు నడుస్తున్నాడండీ" ఆమె ఆనందంతో కేకలు పెట్టినంత పని చేసింది.
"నడవడమే కాదే. అరవయ్యేళ్లు బ్రతుకుతాడుట."
ఆవిడ ఆనందం పట్టలేనట్టుగా కొడుకును కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది. కడుపులా చిచ్చుపెట్టి పోతాడనుకున్న కొడుకు నడుస్తున్నాడు.
"మహానుభావులు కొందరు ప్రదర్శించే మహాద్బుతాలు గురించి ఎవరయినా చెప్పినప్పుడు ఈ ప్రజల అజ్ఞానమే వాళ్ళకా గొప్పతనం తెచ్చి పెడుతుందని అనుకునేవాడిని. మామూలు మనుషులు మానవాతీత శక్తులు ప్రదర్శిస్తారంటే నమ్మేవాడిని కాదు. ఈ రోజు చూశాను ఒక మహాధ్బుతం. ఈ రోజు చూశాను ఒక మహానుభావుడ్ని. మీ చేయి తగలగానే వాడు లేచి నడుచాడు. నా కళ్లముందే జరిగిందిది."