"ఒండర్ పుల్ ఆఫర్ డియర్! ఉద్యోగం దొరికింది. కానీ ఇక్కడ కాదు మద్రాస్ లో."
"మద్రాస్ లో ఏం పని?"
"సినిమా హీరోయిన్ దగ్గర నైట్ వాచ్ మన్."
తులసి పగలబడి నవ్వేస్తోంది.
"ప్రస్తుతానికివే సంగతులు. వివరాలు వచ్చే సంచికలో. కానీ నువ్వు ఇక్కడే వుండాలి. ఇద్దరం అక్కడి కెళ్ళడం కుదరదు."'
తులసి కలవరపాటుతో చూసింది. "ఎందుకు కుదరదు!"
"వివరాలు వచ్చే సంచికలో అన్నాను కదా!"
"ఇహ నువ్వు లేకుండా నేనెలా వుండను."
"అంతవరకూ మహేష్ తో మానేజ్ చేసుకో!"
అతని డొక్కలో గట్టిగా పొడిచిందామె.
'అమ్మో!" నొప్పితో అరచాడు సురేష్.
"ఇంకెప్పుడూ పిచ్చి మాటలు మాట్లాడకు మరి!" కోపంగా అంది.
"పతియే ప్రత్యక్ష దైవం స్కీమూ నీది?" అడిగాడతను.
"నిజంగా మద్రాస్ వెళ్ళాలా?"
ఏదొక అబద్దం ఆడకపోతే లాభం లేదు. తను కూడా వచ్చేస్తానంటుంది.
"మద్రాస్ అంటే మద్రాస్ కాదు. అక్కడి నుండి ఎక్కడికో మళ్ళీ.....సవుదీ, దుబాయ్, ఇరాక్......"
"ఓ గల్ప్ జాబ్......."
"ఎస్! గల్ప్ జాబ్....."
తులసికి అబద్దం చెప్పటం తనకి ఇష్టం వుండదు. ఏదో ఘోరమయిన తప్పు చేతున్న ఫీలింగ్ కాల్చేస్తుంటుంది.
"చాలా డబ్బు దొరుకుతుంది కదూ!"
"రేపే నీ అకౌంట్ లో లక్ష రూపాయలుంటుంది చూడు....."
తులసి నిరాశ పడింది. "జోక్స్ వద్దని చెప్పానా?"
"రేపు తెలుస్తుంది కదా........"
ఆమెతో సహా హటాత్తుగా నేలమీదకు ఒరిగిపోయాడు.
"వదులు......" ఆమె జుట్టంతా విడిపోయి ఇద్దరి ముఖాలనూ కమ్మేస్తోంది.
"ఇటీజ్ టూ లేట్......" చీకట్లోంచే అన్నాడు.
"యూ ఆర్ ఏ డెవిల్......." అంది నిస్సహాయంగా.
"అది మగాడి డ్యూటీ.......ఆడకుతురి డ్యూటీల్లాగా.......కార్యేషు మంత్రి, శయనేషు రంబా అన్నట్లు మగాడు కూడా కార్యేషు రాజా, శయనేషు డెవిల్ ....." కొద్ది నిమిషాల తర్వాత ఆమె నుదుటి మీద స్వేద బిందువులను నాలుకతో తుడిచాడతను.
"సురేష్......నువ్వు నన్నొదిలి ఎక్కడికీ పోవు కదూ?"
డోంట్ బీ సిల్లీ - మనం రెండు రకాల ఆకలితో చచ్చిపోతాం.
"చెరో చోట వుండడం కంటే అదే మంచిది" మొండిగా అందామె.
"తులసీ! ఈ జాబ్ కొద్ది రోజులే - తరువాత - హెవెన్ - ఉదయం నుంచీ సాయంత్రం వరకూ ఇలాగే హాపీగా -"
"ఇష్టం లేదని చెప్పాక ఇంక ఆ విషయం మాట్లాడ వద్దు" పెదాలు బిగించింది చిరుకోపంతో, దాంతో నలబై ఏళ్ళ ప్రౌడ లాగా కనిపించింది.
"తులసి! ఆడపిల్ల లీలా మొండికేస్తే చాలా అసహ్యంగా వుంటుంది."
"నువ్వెన్నయినా చెప్పు! నేను వినను."
ఆమెను దూరంగా తోసివేశాడు.
'అయితే నిన్ను వదిలేస్తాను - ఈ క్షణం నుంచి మనం ఒకరి కొకరు ఏమీ కాము.'
"నీలాంటి ఇడియట్ తో కాపురం చేయటం నాకూ యిష్టం లేదు."
"నీలాంటి దానితో ఇంతకాలం కలిసి వున్నందుకు నరకం అనుభవించాను."
"ఏం నేనేం బాధలు పెట్టాను నిన్ను?" ఉక్రోషంగా, రోషంగా అడిగింది.
"ఒకటేమిటి? అన్నిటికీ తలనొప్పే, నాకిష్టమైన భంగిమలు వద్దంటావ్, దాని క్కూడా టైమూ, తిది, నక్షత్రం అంటావ్ - వన్ బై టూ వద్దంటావ్ - కాలిప్లవర్ , కారెట్ కలిపి వండటం చేత కాదు. . ఐ డోంట్ లైక్ డార్క్ డెవిల్ అంటావు."
తలుపు దగ్గర చప్పుడయింది.
ఒక్క ఉదుటున లేచి పెద్ద అంగలతో దూకి తలుపు తేరిచాడతను.
తలుపుకి చెవి ఆన్చి నిలబడి వుంది గంగాభవాని.
కొద్ది క్షణాలు బ్రహ్మాండమైన నిశ్శబ్దం ఆవరించింది ముగ్గురి మధ్యా.
తులసి యదా ప్రకారం వంటింట్లోకి పరుగెత్తింది.
వెంటనే కోలుకుంది గంగాభవాని.
"ఇల్లు ఖాళీ చేసే విషయం కనుక్కుందామని వచ్చాను" అంది తడబడుతూ.
"మా మాటలన్నీ విన్నందుకు యాభయ్ రూపాయలు కట్ చేస్తాం!"
"మీరే గట్టిగా మాట్లాడుతున్నారు......తప్పు నాదేలా అవుతుంది."
'అయినా యాభయ్ రూపాయలు కట్ అవుతాయి. రెండు తెలుగు సినిమాల్లో వుండేన్ని సెక్స్ డైలాగ్ లు విన్నందుకు" ఆమె టాఫిక్ మార్చింది.
"తులసి అంత పనికి రానిదయితే నువ్వు ఉద్యోగం లేకుండా ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నట్లో?"
"పొరుగు వాళ్ళ కోపరేషన్ లేకపోవడం వల్ల."
ఆమె ముఖం ఎర్రబడింది. కళ్ళు డేగ కళ్ళుగా మారినాయి."
తులసి బయటి కొచ్చింది. జుట్టు ముడి వేసుకుంటూ.
"ఇలాంటి మనిషి నెందుకు అంటిపెట్టుకుని వున్నారో తెలీటం లేదు" తులసి తో అందామె.
"ఓసారి అంటుకుంటే మీరూ అంతే" కసిగా అన్నాడు సురేష్.
తులసి కొద్ది క్షణాలు నవ్వకుండా వుండడానికి విఫల ప్రయత్నం చేసింది.
"ఇల్లు సంగతి....."
"మీరు షాక్ తిననంటే మీకు అద్భుతమైన వార్త చెప్పబోతున్నాను" ఆమె మాటకు అడ్డుపడుతూ అన్నాడు.
"ఏమిటది?"
"జ్యోతిష్యం నిజమయే రోజు వచ్చేసింది."
"నాతొ ఆ విషయం మాట్లాడవద్దు.'
"మిమ్మల్ని స్వర్గంలో విహరింపజేసే రోజు రేపే"
ఆమె ముఖం అగ్ని గుండంలా తయారైంది.
"ఎందుకంటె మీకు ఆరు నెలల అద్దె ఏడ్వాన్స్ యిస్తున్నాం - పాత బాకీ కూడా తీర్చి."
"ఉద్యోగం మళ్ళీ వచ్చిందా మీకు?" తులసిని అడిగిందామె అనుమానంగా.
"కాదు......తనకి వచ్చిందట."
"నేనమ్మను"
"అందుకే రేపటి వరకూ ఆగమన్నాను. ఇంక మీరు దయచేసి బయటికెళ్తే మేమిద్దరం శ్రోతలు కోరిన కార్యక్రమం ప్రారంభిస్తాము. శ్రోత తలుపు వెనుక గల భవాని. శ్రీపురం కాలనీ నుంచి....."
గంగాభవానీ కోపం అణచుకుంటూ వెళ్ళిపోయింది.
"క్షణం భార్యని వదల్లేని వాళ్ళు వుద్యోగం చేయాల్సిందే...."
సురేష్ మళ్ళీ తులసిని చుట్టేయబోయాడు.
"నువ్వా వుద్యోగానికి వెళ్ళ దల్చుకుంటే నాతొ మాట్లాడవద్దు...." అతనిని దూరంగా నెడుతూ అందామె.
"సంసారం చెయ్యటానికి ముఖ్యం మాటలు కాదు......"
"నన్ను 'టచ్" చేసినా వూరుకొను"
"కుంతీ .......సూర్యుడు 'టైప్' ట్రై చేద్దాం!"
విశ్వ ప్రయత్నం చేసి నవ్వాపుకుంది.
"నువ్వెన్నయినా చెప్పు .......నన్ను వదిలి వెళ్ళటానికి వీల్లేదు."
"ఇదంతా ఎవరి కోసమనుకుంటున్నావు?"
"నా కవసరం లేదని చెప్తున్నాగా."
"మరెలా బ్రతుకుదాం?"
"మా ఇంటి కెళ్దాం! కొన్నాళ్ళు మా వాళ్ళు ఆదుకుంటారు."
"నేను మీ పిల్లికో పాలు పెట్టి, మీ అమ్మా నాన్నల కాళ్ళు పిసకాలి అంతేగా!"
"డోంట్ టాక్ లైక్ దట్."
సంభాషణ తెగటమూ లేదు ........ముడిపడటమూ లేదు. ఎన్ని రోజులయినా అలాగే కొనసాగేట్లుంది.
ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తటం తప్ప గత్యంతరం కనిపించలేదు సురేష్ కి.
తులసిని వదిలి వెళ్ళడం తనకూ ఇష్టం లేదు. కానీ తప్పదు.......నిర్ణయం తీసుకున్నాక.
* * * *
రాజ్యలక్ష్మి గది తలుపు తెరచింది.
"ఇప్పుడే బయల్దేరుతున్నాను - ఇంతలో వచ్చారు మీరు."
"ఎక్కడికి?"
"మాములేగా......మీ వుద్యోగం దొరికినట్లేనా?"
"ఆ మీకు ధాంక్స్ చెప్దామని వచ్చాను -----థాంక్స్ గివింగ్ సేరిమనీ ఎప్పుడు ఏర్పాటు చేసుకుందామంటారు?"
"రేపు?"
"రేపటికి మీకు బ్రహ్మాండమైన పార్టీ యిచ్చే స్థితిలో ఉంటాననుకుంటాను."
"లెటజ్ హోప్ సో........"
"సహదేవ్ మీకు మంచి ఫ్రెండా?"
"ఎందుకలా అడిగారు?"