Previous Page Next Page 
డెత్ సెల్ పేజి 32

 

    సురేష్ త్రుళ్ళి పడ్డాడు కానీ అంతలోనే సర్దుకున్నాడు.
    "మెంటల్ క్లినిక్ లో చెకప్ చేయించుకుంటాను."
    అతను సురేష్ మాటలు విన్పించుకోలేదు.
    "నీకో జాబ్ ఇస్తాము సురేష్. జాబ్ చేసినన్ని రోజులు నువ్వు మా ఆఫీసులో వుంటావ్. నీ మీద సర్వహక్కులు మాక్ వుంటాయి. మీ వాళ్ళెవర్ని మీరు కలుసుకోడానికి , మాట్లాడడానికీ వీల్లెద్దు. మాతో పూర్తిగా సహకరించాలి! ఈ షరతులన్నిటికీ వప్పుకుంటే ........' కొంచెం ఆగాడు అతను. "నీకు పది లక్షల రూపాయలు యిస్తాము.'
    సురేష్ లో చలనం కలిగింది.
    'అసాధ్యం అది పది లక్షలా? ఎవర్ని ఫూల్ చేయటానికి? లక్ష అంటే వంద రూపాయలు అని అర్ధమా?" అతని కళ్ళజోడు వైపు మరో సారి చూశాడు సురేష్.
    ఎందుకో అతనివంక చూస్తుంటే ఆందోళన కలుగుతోంది......ఇందులో ఏమీ మోసం లేదు కదా! ఏదయినా సమస్యలో చిక్కుబడటం కదా!
    "చాలా ఆశ్చర్యంగా వుంది నాకు. కానీ ఆ జాబ్ ఏమిటో .....నా మీద మీకుండే హక్కులేమిటో చెప్తారా?"'    "జాబ్ సంగతి తర్వాత! ముందు మాక్కావలసింది అంగీకారం. తరువాత ఈ ఉద్యోగం గురించి అనుమానాలూ, ప్రశ్నలూ లేకుండా మేం చెప్పింది చేయటం అలా అని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా గానీ, ప్రమాదకరమైన పనులు గానీ చేయించను. ఏదొకటి త్వరగా నిర్ణయించుకుని చెప్పాలి."
    చకచకా ఆలోచించాడతను. తనతో పది లక్షల రూపాయల పని ఏం చేయించుకుంటారు వాళ్ళు? తను అలాంటి అసాధారణమైన పనులేం చేయగలడని? ఏదయినా గాని పది లక్షలు.....తను మరో జన్మ ఎత్తినా సంపాదించలేని మొత్తం.........పది లక్షలు సంపాదిస్తే లైఫ్ ఎలా మారిపోతుంది! తులసిని ఎన్ని విధాలయిన సుఖాల్లో ముంచి తేల్చవచ్చు. కానీ పది లక్షలు నిజంగా యిస్తారా? అతని వైపు మరోసారి చూశాడు సురేష్. ఖరీదయిన డ్రస్ ......గోల్డ్ రింగ్ .....గోల్డ్ సిగరెట్ కేస్...అతని రూపం - అతనికది చాలా తేలిక అన్పిస్తోంది.
    "నేనేం చేయాలో చెప్పండి!"
    అతను కొద్ది క్షణాలు తనవంకే సూటిగా చూడటం గమనించాడు సురేష్. అలా చూడటం ఆందోళన కలిగిస్తోంది తనకు.
    "అయితే ప్రశ్నలూ, అనుమానాలూ లేకుండా నీ అంగీకారం తెలుపవన్న మాట. మనం ముందిది తేల్చుకోవటం చాలా ముఖ్యం" అతని గొంతు రాన్రాను భయంకరంగా మారుతున్నట్లుంది. బెదిరింపు అస్పష్టంగా కనబడుతోంది.
    సురేష్ కి చెమటలు పడుతున్నాయి. ఇందులో ఏదో పన్నాగం వుంది. చట్టానికి వ్యతిరేకం, ప్రమాదకరమయినవి ఏమీ చేయించరంట.......మరలాంటి దేమీ లేకుండా పది లక్షలు ఊహూ? గుడ్డిగా ఆశపడితే ....తరువాత విచారించాల్సి రావచ్చు.
    'సారీ! ముందు అన్నీ వివరంగా తెలుసుకుంటే గానీ మీ ఉద్యోగానికే ఒప్పుకోలేను" అతని ముఖంలో క్షణం పాటు కోపం కన్పించి మాయమయింది.
    "నువ్వున్న పరిస్థితులలో కళ్ళు మూసుకుని ఈ ఆఫర్ వప్పుకుంటావనుకున్నాను" సురేష్ ఆశ్చర్యపోయాడు.
    తానున్న పరిస్థితులు అతనికేలా తెలుసు? "అలా అనుకుంటే మీరు పొరబడ్డారు" అన్నాడు సురేష్.
    "పూర్తీ వివరాలు చెప్పటం కుదరదు గానీ కొంతవరకూ చెప్తాను" అన్నాడతను సిగరెట్ వెలిగించుకుని.
    సురేష్ ఊపిరి బిగపట్టాడు    
    "ఈ వుద్యోగం ఆరు నెలలుంటుంది. నువ్వో అందమయిన భవనంలో వుంటావు. ఐశ్వర్యములో మునిగి తెలతావు! ఆ తర్వాత నీ దారి నీదే......మా దారి మాదే. మళ్ళీ ఎప్పుడూ మనం కలుసుకోము ఒప్పుకుంటే ఇప్పుడే లక్ష రూపాయలు మీ తులసి బ్యాంక్ ఎకౌంట్ లో జమ చేస్తాము. మిగతాది మన కాంట్రాక్ట్ పూర్తయ్యాక. ఇప్పుడు త్వరగా నిర్ణయించుకుని చెప్పు. నువ్వు కాదంటే నీలాంటి వాళ్ళు లక్ష మంది దొరుకుతారు మాకు' సురేష్ కి భయం వేసింది.
    తను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవకాశం మరొకరికి యిచ్చే తెలివితక్కువ పని చేయడు. ముందు లక్ష రూపాయలు.....అవునూ తన తులసి పేరూ, ఆమె పేరా బ్యాంక్ ఎకౌంట్ వున్న విషయం ఇతనికేలా తెలిసింది? ఏమో అది ప్రస్తుతం లక్ష రూపాయలే కాళ్ళ ముందు కనబడుతున్నాయ్. నిజంగా డ్రీమ్ ప్రమాదకరం కాదు. చట్టానికి వ్యతిరేకం కాదు. ఈ రెండూ కానప్పుడూ ఎందుకు భయపడటం? ఈ రెండింటిలో ఏదీ ఎదురొచ్చినా తను ఖచ్చితంగా ఉద్యోగం నిరాకరించి వచ్చేయవచ్చు.
    'అల్ రైట్ - ఎగ్రిడ్" అన్నాడు సురేష్. అతనికి తెలీకుండానే గొంతు వణికింది. కాళ్ళూ చేతులు ఐస్ లాగా అయిపోయాయి. గొంతు తడారిపోయింది.
    ఆ వ్యక్తీ పెదాల మీద చిరునవ్వు వెలిసింది భయంకరంగా.
    "మొట్టమొదటి షరతు నువ్విక్కడ జరిగిన విషయాలు గానీ, నీకు మేం చెప్పిన ఉద్యోగం గురించి గానీ ఎవరికీ తెలీనీకూడదు. కంప్లీట్ సీక్రెట్! ఆఖరికి మీ తులసికి కూడా........"
    మరోసారి భయం నరాల్లో నుంచి పాకింది. "వద్దు వద్దు వద్దు " అని ఎవరో చెవిలో ఘోషిస్తున్న శభ్దాలు . త్వరగా మళ్ళీ కూడదీసుకున్నాడు సురేష్.
    'ఒప్పుకుంటున్నాను ఎగ్రిడ్. ,మీరెలా చెపితే అలా" అన్నాడతను.
    ఈసారి గొంతు వణకలేదు.
    సహదేవ్ సురేష్ భుజం తట్టాడు.
    "గుడ్! దట్ షుడ్ బి ది స్పిరిట్!" అన్నాడు తల పంకిస్తూ. అతని పెదాల మీది సన్నని నవ్వు, కొలిమిలో కాలుతున్న సన్నని ఇనుప పట్టీని గుర్తుకు తెస్తోంది.
    "రేపే లక్ష రూపాయలు మీ తులసి ఎకౌంట్ లో క్రెడిట్ చేస్తాం."
    అతని గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోసాగింది. నమ్మాలో, నమ్మకూడదో తెలీటం లేదు.
    ఆ తరువాత ఏం జరగబోతోందో తెలీటం లేదు.
    తను ఆరు నెలల పాటు వాళ్ళెం చెపితే అది చేయాలి. నధింగ్ డేంజరస్. ఇల్లీగల్ - ఆరు నెలల తర్వాత తనకు పూర్తీ స్వాతంత్ర్యం ప్లస్ మిగతా తొమ్మిది లక్షలు క్యాష్. ఆ తరువాత ఏం భోగం అనుభవించబోతున్నాడు తను?
    "డు యూ స్మోక్ మిస్టర్ సురేష్?" సిగరెట్ ఆఫర్ చేస్తూ అడిగాడతను. అదే మాములుగా అయితే తను నిరాకరించేవాడు. కానీ ఇప్పుడు తీసుకోవాలనిపిస్తోంది.
    సిగరెట్ అందుకున్నాడు.
    "థాంక్యు."
    "వెల్ కమ్ ఫ్రెండ్! వెల్ కమ్"
    ఇంచుమించుగా అగ్రిమెంట్ అయిపోయినట్లే - నో గోయింగ్ బాక్ నౌ. లోలోపల అశాంతి పెరిగిపోతోంది. అతనిలో ఏదో ఓ అంశం ప్రమాదకరంగా కనబడుతోంది. ఖచ్చితంగా 'ఇది' అని తెలీటం లేదు. అయినా తనకు డబ్బు కావాలి. తన డార్లింగ్ - తన ప్రాణం - తులసి తన వల్ల ఎలాంటి కష్టాలు పడకూడదు.
    "ఇంకేమయినా మాట్లాడాలా మిస్టర్ సహదేవ్?" అడిగాడు అతను అసహనంగా.
    "ప్రస్తుతానికింతే మిగతా విషయాలన్నీ ఉద్యోగం మొదలయ్యాక."
    "ఎప్పటి నుంచి చేరాలి?"
    "ఎనీ టైం సురేష్ ఇవాల్టి నుంచి ఏ రోజయినా, ఏ క్షణాన్నయినా నీ అవసరం కలుగవచ్చు. అవసరం కలిగిన వెంటనే నిన్ను పిలిపించుకుంటాము...."
    "మరి మా ఇల్లు......."
    మాట పూర్తవకుండానే అతను నవ్వాడు.
    "మాకు తెలుసు.....మాక్కావలసిన వాళ్ళను ప్రపంచంలో ఏ మూల వున్నా తేలిగ్గా కలుసుకుంటాము......"
    సురేష్ లేచి నిలబడ్డాడు.
    "ఆఖరి సారి వార్నింగిస్తున్నాను సురేష్! పది లక్షలు చిన్న మొత్తం కాదని నీకూ తెలుసు.
    మనం మాట్లాడుకున్న మాటల గురించి గానీ, ఉద్యోగం గురించి కానీ ఇంకెవరికీ తెలీకూడదు. మీ తులసికి, రాజ్యలక్ష్మి కి కూడా."
    "ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    'అది వాళ్ళకే ప్రమాదం గనుక......."
    "మరి నేను ఆరు నెలలపాటు మీ దగ్గర వుంటే........"
    "ఇంకో కారణం ఏదయినా చెప్పు సురేష్! నువ్వు చాలా మంచి కధలల్లి చెప్పగలవు కదా?' సురేష్ గుండె ఝాల్లుమంది.
    ఎలా తెలుసు తన గురించి అతనికి? రాజ్యలక్ష్మి చెప్పిందా? రాజ్యలక్ష్మికి మాత్రం ఎలా  తెలుసు? నటాషా ద్వారానా?
    అతను కరచాలనం చేయటానికి చేయి జాపాడు. సురేష్ కి అతని చేయి పెద్ద బోనులా అనిపిస్తోంది.
    "మూకేన్ స్టార్ట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ సురేష్! మేము పిలిచేవరకూ........" సురేష్ హోటల్ బయటికొచ్చేశాడు.
    తులసి కరాటే ప్రాక్టీస్ చేస్తోంది. గాల్లోకి ఎగురుతూ కాళ్ళూ చేతులూ కత్తుల్లా ఊపుతూ.
    "ఎనీ లక్?" అడిగింది ఒగరుస్తూనే.
    "ఎస్! సమ్ లక్!"
    అమాంతం ఆమెను కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడతను.
    "కరాటే కూడా స్టిమ్యులెటర్ గా పనిచేస్తుందన్నమాట" అన్నాడు మరింత చొరవ తీసుకుంటూ.
    అతని చేతుల్ని తోసి వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది తులసి.
    "నేనడిగిందానికి సరిగ్గా జవాబు చెప్పవేం?" ఆయాసంతో ప్రతిఘటన ఆపేసిందామె.
    "ఫర్లేదు .......పెనుగులాడు అలాగే బావుంది" అన్నాడతను నవ్వుతూ.
    అతని గుండెలకు పూర్తిగా హత్తుకుపోయిందామే.

 Previous Page Next Page