Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 32


    వర్ధనరావు అంతకుముందు నిర్మించిన చిత్రం ఆరోజే రిలీజయింది.
    "మా సినిమా చూట్టానికొస్తారా?" అడిగాడతను సీతని.
    "ఎప్పుడు?" అడిగింది సీత.
    "ఇవాలే ఫస్ట్ షోకి మనకి రెండు సీట్లు ఉంచమని చెప్పాను. మీరు సరేనంటే వెళ్దాం."
    "ఓ! నాకేం పనికూడా లేదు" సరదాపడుతూ అందామె. సినిమా తీసిన ప్రొడ్యూసర్ పక్కన కూర్చుని సినిమా చూస్తే అదో దర్జా! హాలు వాళ్ళు సినిమా మనుషులు అందరూ తమని గౌరవించడం_ సపర్యలు చేయడం_ చాలా బావుంటుందలా!
    సాయంత్రం అయిదున్నరవరకు మాధవరావు కోసం ఎదురుచూస్తూ కూర్చుందామె. అతన్తో చెప్పి సినిమాకు వెళ్ళాలనుకొంది. తీరా అతను రాకముందే కారొచ్చేసరికి చేసేదిలేక పనిమనిషికి చెప్పి కారులో థియేటర్ కి చేరుకుంది. హాలు చుట్టూ ఇసుక వేస్తే రాలని జనం. పోలీసులు విజిల్స్, కేకలు, లాఠీలు ఊపడాలు మధ్యనుంచి కారు హాలు ఆవరణ లోపలికి చేరుకొని పోర్టికోలో ఆగింది. చుట్టూ నిలబడ్డ జనమంతా ఆమెవంకే పరిశీలనగా చూస్తున్నారు. అలాంటి అదృష్టం తనకు కలిగినందుకు అసూయపడుతున్నారేమో అనుకోండి సీత. తను బందర్లో ఉండగా అనేకసార్లు తన క్లాసు పిల్లలతో సినిమాలకెళ్ళింది. చాలా సినిమాలు తను మొదటిరోజు చూసినవే. మొదటిరోజు సినిమా చూడటమంటే తమకి చాలా గొప్పగా ఉండేది. ఆ రష్ లో నలభై పైసల టిక్కెట్టు కోసం క్యూలో నుంచుని ఎన్నో బాధలు పడి సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఆ సమయంలో తూనీగల్లా సరాసరి హాలు ముందుకొచ్చి ఆగిన కార్లలో నుంచి దిగి వెళ్ళే స్త్రీ పురుషులను చూసి అంతటి అదృష్టం తనలాంటి వాళ్ళకు లభిస్తుందా అని కలలు కంటూండేది. ఇవ్వాళ్టికి ఆ కల నిజమయిపోయింది.
    కారు దిగి నుంచునేలోగా వర్ధనరావు హడావుడిగా వచ్చాడక్కడికి.
    "రండి!" అన్నాడు ఆహ్వానిస్తూ.
    మేనేజరు గదిలో కూర్చున్నారిద్దరూ.
    "ఇంకా మాట్నీ వదల్లేదు! "టాక్" ఎలా వుంటుందోనని హడలిపోతున్నాం..." నవ్వుతూ అన్నాడతను. సీత నవ్వేసింది.
    "మీరిక్కడే కూర్చోండి. మాట్నీ వదిలేశాక వస్తాను" బయటికి వెళ్తూ అన్నాడు.
    సీత టేబుల్ మీదున్న పేపరు చూస్తూ కూర్చుంది. హఠాత్తుగా ఆమె దృష్టి అందులో ఉన్న సినిమా వార్తల మీదకు మళ్ళింది, గంధర్వావారి తరువాతి చిత్రానికి ప్రముఖ రచయిత్రి సీత గారి "జీవిత సోపానాలు" నవలను ఎన్నుకొన్నారు. మరో విశేషమేమంటే ఆ చిత్రానికి ఆమే ప్రప్రథమంగా సంభాషణలు రాస్తున్నారు...
    కొద్ది క్షణాలు అనిర్వచనీయమైన ఆనందంలో మునిగిపోయింది సీత. తనేనాడయినా అనుకుందా తనో రచయిత్రి అవుతుందనీ_ ఇలా సినిమాలకు కూడా రాస్తుందనీ?_ తను కలలు గనకుండా సాధించింది ఒక్కటే. అందుకే ఆనందంతో పాటు, గర్వం, ఆశ్చర్యం కూడా కలుగుతుంటాయ్! దీనికంతటకూ కారణం నిజంగా వర్ధనరావుగారే! ఆయన తలచుకోబట్టే తనపేరు సినిమా లోకంలోకి పాకింది. ఎన్నో నవలలు రాస్తే సంపాదించగలిగే మొత్తం ఓ సినిమాకు సంపాదిస్తోంది. తను జీవితాంతం ఆయనకు ఋణపడి ఉండాలి. అంతటి ఉపకారమిది.
    బెల్ మోగింది.
    సినిమా వదిలారు. ప్రవాహంలా జనం బయటకి పోతున్నారు. ఇరవై నిమిషాల తర్వాత వర్ధనరావు నవ్వుతూ లోపలికొచ్చాడు.
    "రండి సీతగారూ!" అన్నాడు ఆమెనుద్దేశించి.
    సీత అతన్తోపాటు మేడ మీదకు నడిచింది.
    ఇద్దరూ బాక్స్ లోకెళ్ళి కూర్చున్నారు.
    "ఎలా వుంది టాక్?" అడిగిందామె కుతూహలంగా.
    "బాగానే వుందంటున్నారు...అంటే యాభైరోజుల పిక్చరని అంచనా వేసుకొన్నాం...ఇంకా మిగతా సెంటర్స్ నుంచి కూడా వివరాలొస్తే కాని సరిగ్గా తెలీదు" అన్నాడతను.
    సినిమా మొదలయింది.
    ఆ సినిమా గురించి ఏవేవో జరిగిన విశేషాలు నవ్వుతూ చెప్తున్నాడతను. అన్నిటికీ ఊఁ కొడుతోంది సీత.
    ప్రణయ సన్నివేశంలో పాట వచ్చింది సినిమాలో. చాలా సెక్సీగా ఉందా దృశ్యం. హీరో హీరోయినూ తడిసిన దుస్తుల్లో ఒకరినొకరు పెనవేసుకు పోతున్నారు. హాలంతా కేకలు_ఈలలు.
    హఠాత్తుగా అతని చెయ్యి సీత చేతిమీద పడింది. ఆమె మెడ దగ్గర వేడి ఉచ్చ్వాసనిశ్వాసాలు. ఖంగారుపడింది సీత.
    "ఇలాంటి దృశ్యాలున్నాయి చూశారూ! ఎవరికి ఇష్టం వుండదు చూడ్డానికి. కనీసం పైకయినా వీటిని విమర్శిస్తారందరూ. కానీ ఇదేమీ లేకపోతే మళ్ళీ ఆ సినిమా దేనికీ పనికిరాదు" నవ్వుతూ నెమ్మదిగా, రహస్యంగా అన్నాడతను అని మామూలుగా తన స్థానంవేపు జరిగి కూర్చున్నాడు. అతనిచేయి మాత్రం ఇంకా సీత చేతికి తగుల్తూనే వుంది. ఏమీ చేయడానికి తోచలేదు సీతకి. చేయి వెనక్కు లాక్కొంటే అతనేమనుకొంటాడోనని మనసు పీకుతోంది. అలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటే నవ్వుతాడేమో! అయినా సినిమా ఫీల్డులో ఉన్నవాళ్ళకి ఇలాంటి పట్టింపులుండకూడదు. అక్కడ అందరూ ఎంతో చనువుగా ఉండకతప్పదు, అంటూ సరిపెట్టుకుందామె.

 Previous Page Next Page