Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 32


    "ఇందులో కోపం తెచ్చుకొనేదేముంది?" నవ్వుతూ అంది సావిత్రి.
    "మీతో రోజూ కొద్ది నిమిషాలయినా మాట్లాడకపోతే నాకేదో వెలితిగా ఉంటుందండీ. ఇటు చూస్తే మీ ఫ్రెండ్స్ ఏమయినా అనుకుంటారేమోనని భయం. అందుకే ఇంటికి రాకుండా ఇలా ఆఫీసు కొచ్చేశాను... కాని ఇక్కడ మీ స్టాఫంతా మనిద్దరివంకే కళ్ళప్పగించి చూస్తూంటే ఇక్కడికి కూడా రావడం తప్పేననిపిస్తుంది నాకు" నొచ్చుకుంటూ అన్నాడతను.
    "ఏ ఆఫీసులోనయినా వాతావరణం ఇలాగే ఉంటుంది లెండి. మీరేం భయపడనవసరం లేదు... ఒక అమ్మాయి, అబ్బాయీ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకొన్నారంటే చాలు. కాలేజీలకంటే అన్యాయంగా కథలల్లేస్తారు. అయినా మీరు ఇంటికి వచ్చేయండి... మా శాంత చాలా మంచిదిలెండి. ఓసారి మాట్లాడారంటే మీక్కూడా మంచి స్నేహితురాలయిపోతుంది."
    అతను నవ్వాడు.
    "మీకో విషయం చెప్పమంటారా?"
    "ఏమిటి?"
    "నాకు మొట్టమొదటిసారిగా స్నేహం కలిసిన అమ్మాయి మీరే. అంతకుముందు అసలు ఆడపిల్లలతో స్నేహం చేయాలన్న కోరికే కలగలేదు...మరి మిమ్మల్ని చూడగానే ఎందుకు స్నేహం చేసుకోవాలనిపించిందో నాకు తెలీదు... మీ స్నేహితురాలిని మొన్న చూశాను కదా ఎందుకో ఆవిడ కొంచెం రిజర్వ్ డ్ గా ఉన్నట్లు కనిపించారు. సావిత్రి నవ్వేసింది.
    "అదేం కాదు. కొత్తలో నేనూ అలాగే అనుకున్నాను. తీరా స్నేహం కలిశాక అసలు అంతటి అమాయకురాలు ఉండదేమో అనిపిస్తుంది."
    చాలాసేపు శాంత గురించే మాట్లాడుకొన్నారిద్దరూ.
    "మరో పదిరోజుల్లో ఆమె ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతోంది. వచ్చే నెలలో ఆమెకు వివాహం నిశ్చయమయింది..." అంది సావిత్రి.
    "అయితే మరి మీరు ఒక్కరే ఉండిపోతారా ఇంట్లో?"
    "అవును. అంతగా వుండలేకపోతే ఏదయినా ఉమెన్స్ హాస్టల్లో చేరిపోతాను!" అతను కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయాడు.
    "అయితే పెళ్ళికి మీరుకూడా వెళ్తారన్నమాట...
    "వెళ్ళకపోతే ఎలా? అది ఊరుకుంటుందనుకొన్నారేమిటి? ప్రాణం తీసేస్తుంది...పైగా వెళ్ళాలని నాకూ వుంది. దాని ప్రియుడ్ని ఓసారి చూడాలని ఉంది..." అని నాలిక్కరచుకొంది సావిత్రి.
    "అంటే ఆమెది లవ్ మ్యారేజా?"
    "ఆ! ఇంచుమించుగా అలాంటిదేలెండి..." సిగ్గుపడుతూ అంది సావిత్రి.
    ఆ తర్వాత ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. ఉండుండి చూపులు మార్చుకుంటూ కూర్చున్నారు.
    "ఇంక వెళతాను... లేచి నుంచుంటూ అంది సావిత్రి.
    "సారీ! మీ టైమ్ వేస్ట్ చేశాను..."
    "అదేంలేదులెండి..."
    క్యాంటీన్ బయటకు రాబోతుంటే వారికి శాంత ఎదురుగా వచ్చింది.
    "నమస్తే..." తడబడుతూ అన్నాడతను.
    ప్రతి నమస్కారం చేసింది శాంత.
    "నేను వెళుతున్నాను సావిత్రిగారూ..." అతను వెళ్ళిపోయాడు.
    "పద__మళ్ళీ ఓ కాఫీ తాగుదాం..." అంది శాంత కౌంటర్ వైపు నడుస్తూ.
    ఇద్దరూ కాఫీ త్రాగసాగారు.
    "క్యాంటీన్ లో కబుర్ల వరకూ వచ్చిందన్నమాట వ్యవహారం..." నవ్వుతూ అంది ఆమె.
    సావిత్రి సిగ్గు పడిపోయింది. ఏం జవాబు చెప్పాలో తెలీలేదు.
    "ఇంతకూ అతగాడు వుద్యోగం చేస్తున్నాడటా?"
    "ఏమీలేదు! వుద్యోగం కోసమే ప్రయత్నిస్తున్నాడు__"
    "అయినా ఫరవాలేదు! ఇప్పుడు గాకపోతే మరో సంవత్సరానికయినా వుద్యోగం దొరుకుతుంది గదా! ఇంతకూ ప్రేమా గీమా అని ఏమయినా అంటున్నాడా?"
    "ఛీ! ఏమిటా మాటలు?"
    "ఇందులో తప్పేముందే? ప్రేమించుకోవడం తర్వాత పెళ్ళి చేసుకోవడం తప్పా."
    "అదికాదే, మేము ఊరికే మాట్లాడుకొంటూంటే?"
    "ఊరికే మాట్లాడుకోవడమేమిటి? ఊరికే చూసుకోవడం_ ఊరికే క్యాంటీన్ కెళ్ళి కాఫీలు తాగడం, అంతా ఊరికే కనబడుతుంది. దాన్నే ప్రేమ అంటారు... వయసులో వున్న ఓ కుర్రాడికీ కుర్రదానికీ ప్రేమ కాకపోతే మాటలూ_ మీటింగులూ ఎందుకు?"
    సావిత్రికి నవ్వాగలేదు.
    "నువ్వు మరీ చెప్తావులేవే..."
    "నేను మాత్రం చేసుకునేది లవ్ మారేజేగా! కాకపోతే ఇదోరకం అనుకోకుండా తమాషాగా జరుగుతోన్న పెళ్ళి మాది. ఈ కబుర్లకేంగాని ఓ విషయం చెప్తాను విను. ఇదే ఆడదానికి అవకాశాలిచ్చే వయసు. ఈ వయసు దాటితే తర్వాత వివాహం అవడం అంత తేలిక కాదు. చూస్తూ చూస్తూ ఏ రెండో పెళ్ళివాడినో చేసుకోలేము కదా! అంచేత నా యిల్లు_నా తమ్ముళ్ళు అని సినిమా కబుర్లు చెప్పకుండా వెంటనే వివాహం చేసేసుకో. వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఎంతో కొంత సహాయము చేయకూడదనేముందీ?
    సావిత్రి మాట్లాడలేదు.

 Previous Page Next Page