"అయితే డబ్బు తీసుకుని వాడేసుకుని కట్టకుండా ఊరుకుంటారంటావు."
"కట్టరు"
"కట్టకపోతే ఎలా?"
"కట్టరు. ఏం చేసుకుంటావో చేసుకో"
సుజాత వాళ్ళవంక అసహ్యంగా చూసింది. ఆ వాతావరణంలో యిహ క్షణం కూడా వుండలేక అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
* * * *
ఆ సాయంత్రం విమలాదేవి పొద్దుట జరిగిన గొడవ నుంచి తనని బయటపడేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకోటానికి గుడికెళ్ళింది. ఆవిడకి భక్తి శ్రద్ధలూ, పూజా పునస్కారాలూ హెచ్చు. ప్రతి చిన్నదానికి దేవుళ్ళకి మొక్కులు మొక్కేస్తూ వుంటుంది.
రాధాప్రియా, సుబ్బారావు _ సుబ్బారావింట్లో ఏకాంతంగా కలుసుకోటానికి అవకాశం దొరికింది.
"విమలాదేవిగారు గుడికెళ్ళారేమిటి? అయ్యో. ఆవిడ వుంటుందని వచ్చానే" అంది రాధాప్రియ ఏమీ ఎరగనట్లు.
"ఆవిడకి దేవుడంటే మహాభక్తి, రండి రండి కూచోండి" అన్నాడు సుబ్బారావు.
రాధాప్రియ తెల్లచీర, తెల్ల జాకెట్ వేసుకుని, తలంటు పోసుకోవటం వల్ల విరబోసుకుని వున్న జుట్టుతో సుబ్బారావు కళ్ళకి మహ ఆకర్షణగా కనబడింది. అతని ఒంట్లో జరజరలు ప్రారంభమయ్యాయి.
"మీరు పొద్దుట చాలా సపోర్టు ఇచ్చారు. థ్యాంక్స్" అన్నాడు సుబ్బారావు.
"మనలో మనం ఒకళ్ళకి ఒకరు సపోర్టు ఇచ్చుకోకపోతే ఎలా?"
"మీకు షేక్ హ్యాండిచ్చి థ్యాంక్స్ చెబుతేనేగాని నాకు తృప్తిగా వుండదు." అంటూ సుబ్బారావు ఆమె చేతిని సుతారంగా అందుకుని షేక్ హ్యాండిచ్చాడు. కాని తర్వాత చెయ్యి వదలకుండా వ్రేళ్ళు నిమురుతూ అలాగే తన చేతిలో వుంచుకున్నాడు.
ఆమె విడిపించుకునే ప్రయత్నం చెయ్యలేదు.
అతనామె వ్రేళ్ళు సవరిస్తూ, ఒక ప్రక్కకి తిరిగున్న ముఖంలోకి చూస్తూ ఫీలింగ్స్ స్టడీ చేస్తున్నాడు.
ఎటువంటి అభ్యంతరం వచ్చేటట్లు కనబడలేదు.
"ఎప్పట్నుంచో...మీరంటే చాలా యిష్టం" అంటూ దగ్గరగా జరిగి చేతిని వొదిలి భుజం మీదగా పోనిచ్చి కౌగలించుకున్నాడు.
పరాయి మొగాడి భార్యతో రొమాన్సులో ఎంత థ్రిల్ వున్నది.
ఆమె ఏమీ మాట్లాడకుండా వుండేసరికి, ఆ మౌనంలోని ఆహ్వానం తెలుసుకుని ముఖాన్ని తనవైపు త్రిప్పుకుని చెంపలమీదా, పెదిమలమీదా ముద్దులు పెట్టుకుంటున్నాడు.
"ఉహు. తనివితీరటంలేదు" అన్నాడు కొంచమాగి.
నవ్వి వూరుకుంది.
తలుపు గడియపెట్టి వస్తాను."
"ఇప్పుడా?"
"ఇలాంటప్పుడే ఎవరికీ అనుమానం రాదు."
"విమల వచ్చేస్తుంది."
"గుళ్ళో అష్టోత్తరం వగైరాలన్నీ కావద్దూ?"
"వెళ్ళి చాలాసేపయింది కదండీ"
అతను చేతికున్న వాచీ చూసుకున్నాడు. "పోనీలే రేపు సహస్రనామం అవీ పకడ్బందీగా చేయించి ఎక్కువ పుణ్యం మూటకట్టుకు రమ్మంటాను."
రాధాప్రియ చిలిపిగా నవ్వి "వస్తాను" అంటూ లేచి నిలబడింది.
"వొదలాలనిపించటం లేదు" అంటూ ఆమె చెయ్యి పట్టుకుని వొళ్ళోకి లాక్కుని తనివితీరా ముద్దు పెట్టుకున్నాడు.
"నువ్వు చాలా అందంగా వుంటావు."
ఆమెకు సంతోషం కలిగింది. "అవునా?"
"నీలో గొప్ప ఆకర్షణ వుంది."
ఆమె శరీరం పులకరించింది. ముఖం పైకెత్తి అతని పెదవుల మీద గట్టిగా ముద్దుపెట్టుకుని, తర్వాత చెంపమీద చిన్న దెబ్బ వేసి లేచి వెళ్ళిపోయింది.
13
పార్కులో...
"దీక్షిత్!"
"ఊ"
"మనమలా కలుసుకుంటూంటే...నాకెందుకో గిల్టీగా వుంది."
"దేనికి?"
ఒకవైపు యింట్లో పరిస్థితులేమీ బాగాలేవు. ఆర్థికంగా కృంగిపోతున్నాం. నేను బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాననిపిస్తోంది."
"మనమేమీ తప్పు చెయ్యటం లేదే."
"కుటుంబమంతా కష్టాల ఊబిలో కూరుకుని ఉన్నప్పుడు...యిది కూడా..."
"కాని...నిన్ను కలుసుకోకుండా! నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా వుండలేను."
"ఐ టూ, కాని..."
మాధురీ! మనమిద్దరం యింత క్లోజ్ గా వచ్చాక... ఈ భావాలు నేను భరించలేను. నేనూ మీలో ఒకడ్ని. నన్ను విడిగా చూడకు"
"కాని నీకు ఉన్నదీ మాకు లేనిదీ మనిద్దర్నీ దగ్గరకు రానివ్వదనిపిస్తుంది."
"ఏమిటది?"
"డబ్బు"
"పరిస్థితులను బట్టి నేను మృదువుగా ఉన్నట్టు కనబడుతున్నా...నీకోసం ప్రపంచములో ఎవర్నీ కేర్ చెయ్యను.
ఆమె ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది.
మనిషి...ఎందుకలా తనచుట్టూ వుచ్చు బిగించుకుంటూ వుంటాడు.
సరళరేఖలా జీవిత మెందుకు సాగిపోదు.
వక్రరేఖలా సాగిపోవడమే దాని సహజ గుణం కాబోలు.
"మాధురీ!"
"ఏమిటాలోచిస్తున్నావు?"