17
అతి జాగ్రత్తగా అత్తగారి కుటుంబానికి చెందిన సామానులన్నీ ఏరి, వీధిలోకి విసిరిపారేస్తున్నాడు నీలకంఠం. జానకి కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. సుమతి అటూ ఇటూ తిరుగుతూ, "ఇదెక్కడి అన్యాయమండీ! నుంచున్న పాటున వాళ్ళని పొమ్మంటే, ఎక్కడికి పోతారు?" అని మొగుడిమీద అరుస్తోంది. "నోర్ముయ్! నుంచున్న పాటున పొమ్మన్నానా? ఈ మూకనంతా నేను మేపలేనని నెలరోజులనుండీ చెపుతున్నాను. ఎవరైనా కదిలితేనా? అసలు కదిలే ప్రయత్నం చేస్తేనా? నావల్ల కాదు. ఇంతమందిని నేను భరించలేను." ఖండితంగా అన్నాడు నీలకంఠం. అతడు కార్యవాది. నలుగురూ ఏమనుకుంటారో అని బాధలేదు. జాలి, దయ మొదలైన సిల్లీ సెంటిమెంట్లు (అతని దృష్టిలో) అసలు లేవు. అంతరాత్మ అనేది ఎక్కడుందో, అదేమంటోందో ఇలాంటివేమీ అతను పట్టించుకోడు. ఏడ్చి ఏడ్చి జానకి గుండెల్లో నొప్పి వచ్చింది. గుండె చేత్తో పట్టుకుని ఆయాసపడ సాగింది. అది చూసి సుమతి గోలగోలగా "అయ్యో! అయ్యో! అమ్మ ఏమయినారో చూడండీ!" అంది.
నీలకంఠం తను కూడా మనిషిననిపించుకుంటూ, "పాపం. గుండెనొప్పి వచ్చినట్లుంది. ఎప్పుడూ వచ్చేదేగా! ఒక గంటాగి తగ్గిపోతుందిలే! తగ్గగానే పొమ్మను" అన్నాడు ఉదారంగా.
"పోనీ తులసిని మాత్రం వేరే ఉండమని, అమ్మనొక్కదాన్నీ మనదగ్గర ఉంచుకుందామండీ!" అంది సుమతి ప్రాధేయపడుతున్నట్లు.
నిర్ఘాంతపోయింది తులసి. నీలకంఠం తులసిని చేసుకుంటానని అన్నప్పటినుంచీ, వీలుచిక్కినప్పుడల్లా సుమతి తులసిని పరీక్షగా చూస్తుంది. అద్దం ముందు నిలబడి, తనను తను తులసితో పోల్చుకుంటుంది. మనసంతా తనకు తెలియని అసహనంతో నింపేసుకుంటుంది. అది తులసి మీద అక్కసుగా తన మనసులో పేరుకుంటుందన్న విషయం సుమతికి కూడా తెలియదు....
"నా ఖర్మకాలి, ఈ ముష్టి సంబంధం చేసుకున్నాను. ఓ ముద్దూ ముచ్చటా లేవు కాని, అమ్మనీ, అయ్యనీ పోషించాలట! ఉందిగా నీ చెల్లెలు! తను పోషిస్తుందిలే! ఆవిడకన్ని విద్యలూ తెలుసు. ఎంతమందినయినా పోషించగలదు__"
తులసి ఇంక వినలేక, బాధపడుతున్నా తల్లి చెయ్యి పట్టుకుని బయటకి వచ్చేసింది. అది చూడలేక సుమతి మొగుడితో మరింత దెబ్బలాడి ఫిట్స్ వచ్చి పడిపోయింది. అదిచూసి జానకికి ఏడుపు మరింత ఎక్కువయింది. ఈ గందరగోళం మధ్య.... చిందరవందరగా ఉన్న సామానుల మధ్య స్వాధీనంలేని కుడిచేతితో నట్టనడి వీధిలో నిస్సహాయంగా నిలబడింది తులసి. సరిగ్గా ఆ సమయానికి శ్రీకృష్ణ భగవానుడిలాగే వచ్చాడు కృష్ణారావు. జరుగుతున్న గలాటా అంతా చూసి "ఏం జరిగింది?" అని అడిగాడు తులసిని. తులసి మూడు ముక్కల్లో చెప్పేసింది. "బావ ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. అమ్మకి గుండెనొప్పి ఎక్కువయిపోయింది. ఏం చెయ్యలేక నేనిలా నిలబడ్డాను."
కృష్ణారావు వెంటనే క్రిందపడి ఉన్న సామానులు డిక్కీలో పడేశాడు. జానకిని చెయ్యిపట్టుకుని కారులో కూచోపెట్టాడు. తులసిని కూడా కూచోమన్నాడు. తులసి ఏమాత్రం ప్రతిఘటించకుండా కూచుంది. అభిమానపడి ఒకరి సహాయాన్ని తిరస్కరించే దశ దాటిపోయింది. కృష్ణారావు మొదట కారును ఆస్పత్రికి పోనిచ్చాడు. జానకిని పరీక్ష చేసి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు.
"జనరల్ వార్డ్ లో చేర్పిద్దాం. స్పెషల్ వార్డ్ లో చేర్పిస్తే చాలా డబ్బు అవుతుంది" అన్నాడు కృష్ణారావు.
తులసి వెంటనే ఒప్పుకొంది. అసలు తల్లిని ఆస్పత్రిలో చేర్పించే పాటి దక్షత కూడా లేక అల్లాడుతున్నప్పుడు ఏదో ఒక వార్డులో చేర్పించిందే మహాభాగ్యమనుకోక, ఆ వార్డూ, ఈ వార్డూ కావాలని గొంతెమ్మ కోరికలు కోరగలదా?
జానకిని ఆస్పత్రిలో చేర్పించి తులసి కదలబోతుంటే, "నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళకండే!" అని ఏడ్చింది జానకి. తులసికి విసుగేసింది. తను తిండీ తిప్పలూ లేకుండా పడివుంటే, తల్లి ఆ జ్ఞానమైనా లేకుండా ఇంకా తన దగ్గరే ఉండమంటోంది.
"మళ్ళీ వస్తానమ్మా!" అనేసి జానకి సణుగుతోన్నా వినిపించుకోకుండా కృష్ణారావుతో వచ్చేసింది.
కృష్ణారావు కారుని ఒక హోటల్ ముందు ఆపాడు. తులసి బిత్తరపోయి చూస్తూ, "ఇది హోటల్! ఇక్కడెందుకూ? తిన్నగా మీ ఇంటికి పోదాం!" అని ఒక చవట నవ్వు నవ్వి, "నాలుగు రోజులు మీ ఇంట్లో ఆశ్రయమివ్వాలి నాకు. తరువాత ఏదైనా ఆలోచించుకుంటాము" అంది. కృష్ణారావు ఇబ్బందిగా కదిలి, "ప్రస్తుతం మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అందుకే ఈ హోటల్ లో ఉండండి. తరువాత ఆలోచిద్దాం" అన్నాడు.