ఊగిపోవటం ప్రారంభించింది. ముఖం బాగా ఎర్రబడింది. వంటిమీద బరుక్కుంటూ కుప్పిగంతులు వేస్తూ కోతి చేష్టలు చేస్తూ గట్టిగా మాట్లాడసాగింది.
"నేను ఆంజనేయస్వామిని రా. మీ పూజలకి మెచ్చి వచ్చానురా. నాకు హారతియ్యండిరా హారతి ఆ..."
జనం గబగబ చెంపలు వాయించుకుని అనిలకి హారితిచ్చారు. కొందరు కొబ్బరికాయలు కొట్టారు. గిరిజనులకి దొరలాంటి నాయకుడు ముందుకొచ్చి దండం పెట్టి "దేవా! మమ్మల్ని ఈ దెయ్యాల నుంచి కాపాడు. నీకు పాలు పళ్ళూ నైవేద్యం పెట్టుకుంటాం!" అన్నాడు.
అనిల ఊగిపోతూ అంది.
"మిమ్మల్ని కాపాడాలనే వచ్చానురా. ఈ రవిగారు నా భక్తుడురా! ఆయన మాట వింటే మేలవుతుందిరా. మిమ్మల్ని పట్టిన దెయ్యాలు వదిలిపోతాయిరా?"
"రామ! రామ! రామ! రామ! సీత!"
చేతులతో చప్పట్లు కొడుతూ భజన చేస్తున్నట్లు గెంతుతూ ఊగిపోసాగింది అనిల. వుండుండి "ఆ..." అంటోంది.
"అట్టాగే దేవా! ఈ దొర సెప్పినట్టే ఇంటాం! నీ మాట కాదనం. శాంతించు. ఆంజనేయస్వామీ! రచ్చించు!"
సాగాలపడి మొక్కారు. ఇంచుమించు అందరూ అనిల మరికొంత సేపు "ఆ" అంటూ ఊగి భజన చేసి "రవిగారు మాట వినండి దెయ్యాలు పారిపోతాయి. నా తోకతో చుట్టి సముద్రాల అవతల పారేస్తాను" అని చీర చెంగు గిర్రున గాలిలో తిప్పి చివరికి సొమ్మసిల్లి త్రిసికి వళ్ళో పడిపోయింది.
రవికి అర్థమయిపోయింది. అనిలని మనసులో ఎంతో మెచ్చుకున్నాడు. అనేక మానసిక రోగాలలో "God sickness" కూడా ఒకటి!
మహా మహావాళ్ళే ఈ మానసికరోగం నుంచి తప్పించుకోలేరు. అమాయకులైన గిరిజనులనగా ఎంత?
రవి ఆలస్యం చెయ్యకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. డాక్టర్ సహాయంతో కల్తీసారా తాగిన వాళ్ళందరికీ ముందు స్టమక్ వాచ్ చేయించాడు. తమకే సరిగా అర్థంకాని అయోమయావస్థలో పడిపోయి గిరిజనులు అడ్డుచెప్పలేకపోయారు. సాక్షాత్తూ ఆంజనేయస్వామి వారి మాటలు కాదనే దమ్ములు వాళ్ళకి లేవు.
అక్కడి వాళ్ళలో ఒకడు అన్నాడు "ఇట్టా ఇదివరకోసారి మరెవరికో దిబ్బ తవ్వినప్పుడు ఊళ్ళోకి దెయ్యాలొచ్చిపడ్డాయయ్యా. ఆ సుడ్డు సానా మందికి కంటిచూపే పోనాది!"
రవి డాక్టర్ ముఖం చూశాడు. "కంటి చూపు పోయిందంటే సారాలో Methxl Alcohal Cortisone కలిపి ఉంటారు. ఇంజక్షన్ తేవటం చాలా మంచిపని చేశాం! ముందు ఈ ఇంజక్షన్స్ ఇచ్చి తరువాత జాగ్రత్తగా ట్రీట్ చేస్తే కంటిచూపు పోకుండా కాపాడవచ్చును" అన్నాడు డాక్టర్.
"థాంక్యూ! ప్రస్తుతం వాంతులు తగ్గి కొంత కుదుటపడతారు గనుక మనలో నమ్మకం కలుగుతుంది" అన్నాడు రవి. ఈ సంభాషణ అంతా ఇంగ్లీష్ లో జరిగింది.
త్రిసికి, రవి, టెక్నీషియన్ దగ్గిరుండి సహాయం చేస్తుండగా కల్తీ సారా తాగిన వాళ్ళందరికీ స్టమక్ వాష్ చేయించి ఇంజక్షన్స్ ఇచ్చాడు డాక్టర్. వాళ్ళంతా కొంత స్థిమితపడ్డారు. రవి ఆశించినట్లే వాళ్ళలో రవి పట్ల విశ్వాసం కలిగింది. "నేను మళ్ళీ రేపు వస్తాను." అని డాక్టర్ అంటే ఎవరూ రావొద్దనలేదు.
అప్పుడు తిరిగి టౌనుకు బయలుదేరారు. అనిల, త్రిసికి గిరిజనుల మధ్యనే ఉండిపోయారు.
దారిలో రవి జీప్ కి ఎదురుగా వచ్చింది మరో జీప్. ఇరుకు రోడ్డు కావటం వల్ల తన జీప్ పక్కకు తిప్పి ఆపాడు రవి! ఎదుట జీప్ వెళ్ళిపోవటానికి వీలుగా! కానీ, ఆ జీప్ వెళ్ళిపోకుండా అదీ ఆగింది. దానిలోంచి వెనుకటి కాషాయాంబధారి దిగాడు.
"రవిగారు! గుర్తున్నానా?"
రవిని పలకరించాడు. రవి వెంటనే గుర్తుపట్టాడు.
"మీరు నన్ను...దేవీ దగ్గరకి..."
"కరెక్టే. ఇప్పుడు మిమ్మల్ని తీసుకురమ్మని దేవి ఆజ్ఞ అయింది. వస్తారా?"
ఎవరీ దేవి? ఆనాడు తను ప్రార్థించినా కనపడలేదు. ఇప్పుడు రమ్మని ఆజ్ఞాపిస్తోంది! దేవి ఎవరైనా ఆ రహస్యం తెలుసుకోవాలి!
"వస్తాను" అన్నాడు. జీప్ లోంచి దిగి డాక్టర్ ని దింపి రమ్మని టెక్నీషియన్ తో చెప్పాడు. అతడికి డ్రైవింగ్ వచ్చు.
కాషాయాంబధారి పక్కన అతడి జీప్ లో కూర్చున్నాడు.
జీప్ కొంతదూరం సాగాక "మనం తొందరగా వెళ్ళాలి. ఆకాశ మార్గాన వెళదాం! మీకు కళ్ళకు గంతలు కట్టాలి! అభ్యంతరం లేదుగా!" అన్నాడు కాషాయాంబధారి.
"లేదు"
"మధ్యలో గంతలు విప్పటానికి ప్రయత్నించకూడదు. ప్రమాదం!"
"ప్రయత్నించను"
రవి కళ్ళకి గట్టిగా గంతలు కట్టాడు కాషాయాంబధారి.
"వెల్ కం అండ్ కంగ్రాట్స్!"
ఆదరంతో అంది విగ్రహం. రవి థాంక్స్ చెప్పలేదు. విగ్రహాన్ని పరిశీలనగా అన్నివైపుల నుంచీ చూస్తూ "నాకు నిజం చెప్తావా?" అన్నాడు.
"నిజం అంటే?" కవ్విస్తున్నట్లు అడిగింది.
తెల్లబోయాడు రవి. విగ్రహం నవ్వుతూ అంది "వేదాంతులు ఈ జగత్తు అంతా మిధ్య అంటారు. భౌతికవాదులు కంటికి కనిపించేదే నిజం అంటారు. కనిపించే నిజం నీకు నేను చెప్పక్కర్లేదు. కనిపించని నిజాలు అనుభూతితో అందుకోవలసిందే కాని, చెప్తే అర్థంకావు"
ఈ దేవి ఎవరో చాలా తెలివైనది!
"దేవి అంటే?"
"దివ్యమైన శక్తులు కలది అనుకోవచ్చు."
"నాకు కొన్ని శక్తులున్నమాట నిజమే! అని సంపాదించిన విధానమూ, ప్రయోగించే విధానమూ కూడా ఉదాత్తమైనవే కనుక దివ్యమైనవే అనుకోవచ్చు."
"నువ్వు నిజంగా దేవివే అయితే, నేను నిన్ను మనసారా ప్రార్థించినప్పుడు ఎందుకు నాకు ప్రత్యక్షం కాలేదూ?"
"పిచ్చివాడా! నువ్వు మనసులో భావించే ఒక మూర్తి ఆకృతి ధరించి నీ ముందు నిలవాలంటే, దానికి ఎంత ఏకాగ్రత కావాలి? ఎంత తపస్సు చెయ్యాలి? ఎన్నో వేల సంవత్సరాలు ఆ ధ్యానంలో నీ మనసు మరిగిపోయి, పదును దేరితే, అప్పుడు వశమవుతుంది సృష్టి, శక్తి నీ మనసుకి...అదీగాక స్వార్థ ప్రయోజనాలతో చేసే ధ్యానానికి సిద్ధి మరింత ఆలస్యంగా కలుగుతుంది!"
"అంటే, ఆ రోజు నేను ఎందుకు ధ్యానం చేశానో నీకు తెలుసా?"
"తెలుసు. నిధి రహస్యం తెలుసుకోవాలని. ఇది నా దివ్య శక్తి వల్ల గ్రహించిన రహస్యం కాదు కొద్దిపాటి సామాన్య పరిజ్ఞానం వున్న ఎవరైనా గ్రహించగలరు. నిధి కోసం కాకపోతే ఇక్కడికి మీరు వచ్చింది దేనికి?"
నవ్వాడు రవి. దేవి ఫ్రాంక్ నెస్ ని మెచ్చుకున్నాడు.
"మరి ఇప్పుడెందుకు అనుగ్రహించినట్లు?"
"ఇంకా అర్థం చేసుకోలేదూ? కల్తీసారా తాగి కంటిచూపు పోగొట్టుకోబోతున్న దౌర్భాగ్యులకి అండగా నిలబడ్డావు. నిస్వార్థంగా వాళ్ళ మేలు కోరి, వాళ్ళే ఎదురుతిరిగినా వాళ్లకి సహాయం చేశావు. నీ, నా అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యమూ బాగుపడాలని తాపత్రయపడ్డావు. అందుకే పిలిపించాను."
విభ్రాంతితో నిలబడిపోయాడు రవి.
దేవి ఆర్ద్రంగా అంది మళ్ళీ. "ఇదివరలో నీకు అబూ-బెన్-ఆడమ్ కథ చెప్పాను గుర్తుంది కదూ! నువ్వు దేవిని పిలవాలంటే కఠోరమైన దీక్ష, ఏకాగ్రమైన తపస్సు, కొన్ని వేల సంవత్సరాల సాధన అవసరం. కానీ దేవి నిన్ను పిలవాలంటే నీతోటి మానవులను నీవారిగా ప్రేమిస్తే చాలు. ఇంతకుముందు నువ్వు గిరిజనులని సహకార సంఘాల బారినుంచి తప్పించావు. అందుకే నా భక్తురాలి ద్వారా ఇక్కడి రహస్యాలు కొన్ని నీకు చూపించాను. కర్తవ్యం నిర్ణయించుకోవలసింది మాత్రం నువ్వే!"