Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 34


    రవి ఆశ్చర్యానికి అంతులేదు. తను సహకారాల సంఘాల సుబ్బయ్యతో మాట్లాడింది కూడా ఈ దేవికి తెలుసా?
    "నువ్వు సర్వాంతర్యామివా?"
    విగ్రహం పలకలేదు కొన్ని క్షణాలు. తర్వాత చిన్న చిరునవ్వుతో చెప్పింది.
    "కాదు. ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకూ సర్వ 'బాహిర్యామిని' అంటే, ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోగలను. కానీ ఎవరెవరి అంతరాలలో ఏముందో తెలుసుకోగలిగే శక్తి మాత్రం నాకు లేదు. మీ అందరిలాగా నేను కూడా బాహిరమైన చర్యలను బట్టి అంతరంగాలను అంచనా వేసుకోగాలను. అంతే!"
    రవి మాట్లాడలేకపోతున్నాడు. అతడి మనసులో అనేక ప్రశ్నలు.
    "ఏ మనిషికయినా అతడి అంతరంగాన్ని బట్టే కదా ప్రవర్తన ఉంటుంది?"
    "అనేక సందర్భాలలో అంతే! చాలా అరుదుగా బాహ్య ప్రవర్తనకి అంతరంగానికి సంబంధంలేని పరిస్థితులెదురవుతాయి" విచిత్రంగా, బరువుగా పలికింది దేవి.
    ఆ స్వరంలో ఎదుటి హృదయాలను కదిలించే దైన్య భావం ఏదో ఉంది.
    "ఇక్కడ ఏం జరుగుతుందో వివరంగా చెప్పగలవా?"
    "చెప్పగలను. కానీ, చెప్పటానికి వీల్లేదు. అది నువ్వు తెలుసుకోవాలి. ఒక్క విషయం అర్థంచేసుకో! దేవి మానవుల action కి re-action మాత్రమే! ACTION గా ఎప్పుడూ ఉండదు, ఉండలేదు."
     "పోనీ, ఇక్కడ నేను నిధి రహస్యం సాధించగలనా? కనీసం 'సూర్యనేత్రం' రహస్యం తెలుసుకోగలనా?"
    "ఇది నేను చెప్పలేను. నేనే కాదు. ఏ దేవీ, ఏ దేవుడూ చెప్పలేడు. మానవుడు తన భవిష్యత్తు తనే నిర్మించుకోవాలి. దేవి, లేక దేవుళ్ళు కర్మ సాక్షులుగా చేయూత అందించగలరు అంతే!"
    "కర్మసాక్షి, దేవి, 'సూర్యనేత్రం' ఈ మూడింటికి కూడా ఏదైనా సంబంధం ఉందా?"
    పకపక నవ్వింది దేవి.
    "ఒకవేళ ఉంటే, అందుకు విరుగుడుగా ఆంజనేయస్వామి ఉన్నాడుగా! ఈ రోజు మీ అనిలకి పూనాడు గదా?"
    "అయితే దెయ్యాలు నిజమేనా? వాటిని పారదోలటానికి ఆంజనేయస్వామి నిజమేనా?"
    "నిజం అంటే ఏమిటో చెప్పలేమని ఇందాకే చెప్పాను. అయితే ఈ విషయం మనం కొంచెం శాస్త్రీయంగా తర్కబద్ధంగా ఆలోచించుకోవచ్చును. మానవ శరీరం పంచభూతాత్మకమైనది. పృథ్వీ, వాయువు, జలము, ఆకాశము, అగ్ని-అనే ఈ అయిదింటిలో వాయువు ప్రధానం. అందుకే వాయువుని ప్రాణం అని కూడా అంటారు.
    'ప్రాణము' అనే మాటకి గొప్పదైన జ్ఞానము అనే అర్థం కూడా ఉంది. మిగిలినవి అన్నీ ఉన్నా వాయువు శరీరంలో బంధించి ఎంతకాలమైనా నిలుపుకోవచ్చు కానీ, వాయువు లేకపోయాక, ఒక్క క్షణం కూడా శరీరం నిలవదు. మానవుల హృదయాకాశంలో ఉండే ఈ వాయువు లేక ప్రాణము లేక జ్ఞానము బ్రాహ్మమని వేదాంతులంటారు"
    "కొంతతీసి మెట్టవేదాంతం బోధిస్తున్నావా?" విసుగ్గా అడిగాడు రవి.
    'కాదు. ఉపనిషత్తులలో కాని, ఉపనిషత్సారమైన భగవద్గీతలో కాని, మెట్ట వేదాంతం ఎక్కడ కనిపించదు. కర్మ వీరుడవై జీవన సంగ్రామంలో దుష్టశక్తుల్నీ ఎదుర్కొంటూ కర్మం పాలించు అని బోధించేదే భగవద్గీత."
    "మరి ఈ దెయ్యాల ప్రసక్తి ఏమిటి? దెయ్యాలని పారద్రోలటానికి ఆంజనేయస్వామినే ఎందుకు ఎంచుకున్నారు?"
    "మానవ శరీరంలో వాయువే ప్రాణమని మన పూర్వీకులు ఏనాడో గ్రహించారు. ప్రాణం పోయాక మనిషి ఏమవుతాడు?"
    "ప్రతి మనిషిలోనూ తలెత్తే ప్రశ్న ఇది. జడ శరీరం, జడ ప్రకృతిలో కలిసిపోగా చిన్మయ విభూతిలో భాగమైన అజీవ చైతన్యం ఆ విభూతిలోనే లీనవుతుందని చెప్తోంది బృహదారణ్య కోపనిషత్తు. కానీ సాధారణ మానవుడు ఈ సత్యం జీర్ణించుకోలేడు. అందుకే ప్రాణం పోయినా, దెయ్యంగా మారి ఉంటాడనే భావనకు రూపకల్పన జరిగింది. మళ్ళీ మంచి దెయ్యాలు, చెడ్డ దెయ్యాలు, మొగ దెయ్యాలు, ఆడ దెయ్యాలు గురజాడ వెక్కిరించినట్టు, దెయ్యాల దాంపత్యాలు, వాటి పిల్లలూ...."
    నవ్వింది దేవి.
    "అంటే దెయ్యాలు ఒట్టి కల్పన అనే అంటావా?"
    "ఉపనిషత్తునీ, మన వేదాంతాన్నీ ఆధారం చేసుకుంటే, అలానే అనుకోవాలి. అంతేకాదు దెయ్యాల్ని "గాలి చేష్టలు" అనీ, "గాలి సోకింది" అనీ వ్యవహరించటం నువ్వు వినలేదా?"
    "విన్నాను అవి గాలి రూపంలో ఉంటాయని కాబోలు!"
    "గాలికి రూపమేమిటయ్యా పిచ్చివాడా. ప్రాణం పోవటం అంటే గాలి పోవటం కనుక. మనిషిలో ఉన్న ప్రాణం అలా గాలిగా ప్రకృతిలో తిరుగుతూ ఉంటుందనే భావన దీనికి మూలం కావచ్చు. ఆంజనేయస్వామినే దెయ్యాలకి విరుగుడుగా ఎంచుకోవటం కూడా ఇదంతా మన భ్రాంతి అని నిరూపిస్తోంది."
    "అదెలా?"
    "మన పురాణ గాథలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి కల్పన వెనుకా ఒక పరమార్థం ఉంటుంది. ఒక మహత్తర సృష్టి సత్యం ఉంటుంది. ఆంజనేయస్వామిని వాయుదేవుడి కుమారు అన్నారు. ఈ వాయువే ప్రాణం అని చెప్పుకున్నాం కదూ! అందుచేత ఆకృతిలేని వాయువే ఆంజనేయస్వామి అవతరణకి మూలాధారం. ఇక ఆ స్వామి రూపం కోతి మనసు రామమయం. మనసు కోతిలాంటిది. చాంచల్యాన్ని నిలయమైన కోతిలాంటి మనసులో భగవంతుడిని నిలుపుకొంటే  ఏ భయాలూ, ఏ భ్రాంతులూ మనిషిని బాధించవు. ఇదీ, ఆంజనేయస్వామి! అందుకే ఆ స్వామి దెయ్యాలకు విరుగుడు!"
    దేవి పట్ల అంతులేని గౌరవం కలిగింది రవిలో! దేవి మాటల్లో ఉన్నవి మూఢవిశ్వాసాలు కావు. పరంపరగా చెప్పే వేదాంత వాక్యాలూ కావు. తర్క బద్ధమైన విజ్ఞానం, విశ్లేషణాత్మకమైన అవగాహన!
    "నువ్వు ఎవరివైనా కానీ, నిన్ను గౌరవిస్తున్నాను, అభిమానిస్తున్నాను. పూజలు చెయ్యమంటే మాత్రం చెయ్యను."
    నవ్వింది దేవి.
    "థాంక్యూ! ఈరోజు నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా?"
    "చెప్పు!"
    "నిన్ను హెచ్చరించటానికి!"
    "దేనికి?"
    "నువ్వు సత్యానికి దగ్గిరగా వస్తున్నావు. అంచేత ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది!"
    "సత్యం తెలుసుకుంటే ప్రమాదాలా?"
    "అవును! సత్యం తెలుసుకున్న-తెలుసుకోవాలనుకున్న, ఎవరైనా ప్రమాదాలు తప్పించుకోలేరు. క్రీస్తు-సోక్రటీస్-గాంధీ- ఎవరైనా అంతే!"
    "ఏ రకమైన ప్రమాదాలు?"
    "ఏదైనా కావచ్చు! ప్రకాశానికెదురయిన లాంటిది. లేదా గ్రామాలలో గిరిజనుల కెదురైన లాంటిది."
    "వాట్! గిరిజనులకి కల్తీ సారా తాగించటం ఒక పథకం ప్రకారం జరిగిందా?" అంతులేని ఆశ్చర్యంతో అడిగాడు రవి.
    "నీ ఊహకి అందటం లేదా? సరిగ్గా అస్థిపంజరాలు బయటపడ్డ రోజునే గిరిజనులందరూ ఇలా జబ్బు పడటం..."

 Previous Page Next Page