Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 32


    విష్ణు మాట్లాడలేదు. భయం, ఆశ?
    "మన జాగ్రత్తలో మనం వుండి ప్రయత్నాలు చేద్దాం? ఇంత శ్రమపడి ఏం తెలుసుకోకుండా మరీ సాధించకుండా వెళ్ళటమా?
    విష్ణు మనసులో ఆశ ఎగతోశాడు రవి.
    "ఆల్ రైట్! లెటజ్ ట్రై!" అనేశాడు విష్ణు.
    ఎప్పటి వేడుకలు లేవు గుడారాలలో. ఎలాగో భోజనాలు అయ్యాయనిపించారు. పులిమీద పుట్రలాగ మళ్ళీ ఉధృతమైన గాలులు. ఈసారి ఎవరూ భయపడలేదు సరికదా, ఎవరి గుడారాలలో వాళ్ళు నిద్ర రాకుండా గడిపేకంటే ఈ గాలి వంకతో అందరూ ఒకచోట చేరే అవకాశం వచ్చినందుకు ఆనందించారు.
    పెద్ద భయం ముందు చిన్న భయం తేలిపోయింది. "జీవనాదం" వినిపిస్తోంది. గాలి తరంగాలలో కలిసి రకరకాలుగా. విష్ణుకీ, జెన్నిఫర్ కీ ఆ శబ్దం గుండె దడదడలాడిస్తే రవికీ, అనిలకీ ఏదో ఓదార్పునీ, ధైర్యాన్ని ఇచ్చింది.
    గాలి ఆగిపోయినా మళ్ళీ గుడారాలు వేసుకోలేదు. అందరూ గుంపుగా ఆరుబయట కూర్చున్నారు. అప్పుడు గుర్తించాడు రవి. తమలో ఒక టెక్నీషియన్ లేకపోవటం...
    "జగన్ ఎక్కడికి వెళ్ళాడు?" అన్నాడు. ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అతడు సాయంత్రం వేళ అప్పుడప్పుడు గ్రామాలలోకి వెళుతుంటాడు. ఆ సంగతి తెలిసినా మరో టెక్నీషియన్ మాట్లాడలేదు.
    "మనలో డిసిప్లిన్ లేదు" విసుక్కున్నాడు విష్ణు.
    సూర్యోదయమయ్యాక అప్పుడు డేరాలు వేసుకున్నారు. కూలీలు రాలేదు. వాళ్ళకోసం కబురు చేశాడు. గ్రామాలలోకి వెళ్ళిన టెక్నీషియన్ ఒగరుస్తూ వచ్చాడు వల్లమాలిన భయంతో వణికిపోతూ.
    "ఏం జరిగిందీ? ఎందుకిలా వణుకుతున్నారూ?" అడిగాడు రవి.
    టెక్నీషియన్ కొద్దిసేపటివరకూ సమాధానం చెప్పలేకపోయాడు. మంచినీళ్ళు తాగి కొన్ని నిముషాలు కూలబడి అప్పుడు చెప్పాడు "డాక్టర్ రవీ! మీరు దిబ్బ తవ్వారు. ఆ దిబ్బలో ఉన్న దయ్యాలన్నీ వచ్చి గ్రామాలమీద పడ్డాయట. కూలీలంతా కక్కుకుంటున్నారు. కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ బాధపడుతున్నారు. నన్ను చూసి దెయ్యాన్ని చూసినట్లే బెదిరిపోయారు. వాళ్ళెవరూ ఇకమీదట కూలికి రారు!"
    తన చెవులు తను నమ్మలేకపోయాడు రవి. దెయ్యాలు దిబ్బలోంచి బయటికి రావటం, గ్రామ ప్రజల మీద పడటం, ఇదంతా సంభవమేనా? ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా ఈ నమ్మకాలతో ఉన్నవాళ్ళని కూలికి పిలిపించుకోవటం అసంభవం.
    "దెయ్యాలా!...ఆ చచ్చిపోయిన శరీరాల ఆత్మలన్నీ నిజంగా దెయ్యాలయ్యాయంటావా?" భయపడిపోతూ అడిగాడు విష్ణు. జెన్నిఫర్ క్రాస్ గుర్తు వేసుకోసాగింది వక్ష స్థలం మీద.
    రవికి చిరాకేసింది "చదువూ సంస్కారమూ ఉన్న మీరు కూడా ఇలా ఆలోచిస్తారేమిటి విష్ణుగారు. నిజంగా దయ్యాలే ఉంటే, అవి మనం గొయ్యి తవ్విన తర్వాతనే బయటికి రావాలా? అంతకు ముందు లేచి రాలేవా? దెయ్యాలకి ఆ మాత్రం శక్తి ఉండదా? మనం తవ్వాక కాని బయటికి రాలేని దయ్యాలకి మనం భయపడవలసిన అవసరం ఏముందీ?"
    "అదికాదు. దెయ్యాలు గోతిలో ఉన్న నిధికి కాపలా ఉన్నాయట. మనం నిధి కోసం ప్రయత్నించేసరికి, ఆ ప్రయత్నం చేసిన వాళ్ళమీదపడి వేధిస్తున్నాయట?"
    "అయితే అక్కడ నిజంగా నిధి ఉందన్నమాట?" దెయ్యాల భయాన్ని మరిచిపోయి ఆశపోతుతనంతో అన్నాడు విష్ణు.
    అతి కష్టంమీద సహనం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు రవి. "అలా అనుకున్నా ఆ దెయ్యాలు ప్రధానంగా మనమీద పడాలి! మధ్యలో కూలీల మీద ఎందుకు పడతాయి?"
    "డోంట్ టాక్ లైక్ దట్? యు మస్ట్ నాట్ ప్రోవోక్ డెవిల్స్" అంది జెన్నిఫర్ మెడలో క్రాస్ బిళ్ళ గట్టిగా పట్టుకుని.
    అప్పుడు వచ్చాడు జగన్. డోక్కుపోయిన ముఖంతో వణుకుతున్న కాళ్ళతో...
    "ఎక్కడికెళ్ళావు జగన్? రాత్రి టెంట్ కెందుకు రాలేదూ?" కోపంగా అడిగాడు విష్ణు.
    సమాధానం చెప్పేలోగానే భళ్ళున వాంతి చేసుకున్నాడు జగన్. అతడి కళ్ళు తేలిపోతున్నాయి.
    "రాత్రి...సారా...కల్తీ..."
    మాట్లాడలేకపోతున్నాడు. రవికి సంగతి అర్థమయిపోయింది. రాత్రి కూలీలందరూ అలవాటుగా సారా తాగారు. అందులో కల్తీ ఉంది. దాని ప్రభావం ఇదంతా. జగన్ చదువుకున్నవాడు గనుక సారాలో కల్తీ ఉందని అనుమానించగలిగాడు. కానీ గ్రామ ప్రజలు, గిరిజనులూ దెయ్యాల ప్రభావమని భయపడుతున్నారు. విషయం అర్థమయ్యాక రవికి ధైర్యం వచ్చింది. చెయ్యవలసింది కూడా చురుగ్గా ఆలోచించుకున్నాడు. విష్ణు బలహీనత అతనికి తెలుసు. ఇప్పుడు ఆ బలహీనతనే ఉపయోగించుకుని ఈ సమస్య పరిష్కరించుకోవాలి.
    "విష్ణుగారూ ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు గనుక మనం వాళ్లకి తగిన వైద్యం చేయించి వాళ్ళ ఆరోగ్యం బాగుచేశామంటే, వాళ్ళిక దెయ్యాలకి భయపడరు. మనకి సహాయం చేస్తారు. మీరు జీప్ ఇవ్వండి. డాక్టర్ కీ, మందులకీ కూడా డబ్బు అవసరమవుతుంది. కాస్త ఇప్పుడు మీరు ఖర్చు పెడితే తొందరలో మనం నిధి రహస్యం కనుక్కోవచ్చు."
    "నిధి" అనే రెండక్షరాలూ మంత్రంలా పనిచేస్తున్నాయి విష్ణు మీద.
    "అలాగే, వెంటనే జీప్ తీసుకుని టౌన్ కెళ్ళి మంచి డాక్టర్ని తీసుకురండి. స్టమక్ వాష్ వగైరాలకి కావలసిన మందులు కూడా తీసుకురండి" ఒప్పేసుకున్నాడు.
    ముందుగా జగన్ 'వోమిట్'ని ఒక చిన్న బాటిల్ లోకి తీసుకున్నాడు రవి. కెమికల్ ఎగ్జామినేషన్ కి పంపించటానికి. అప్పుడు అందులో కల్తీ ఏమిటో అర్థమవుతుంది. దానికి తగిన ట్రీట్ మెంట్ ఇస్తాడు డాక్టర్. రవికి సహాయంగా మరొక టెక్నీషియన్ కూడా టౌన్ కి బయలుదేరాడు. చేతిలో డబ్బు ఉండటం వల్ల డాక్టర్ వెంటనే పలికాడు.
    "ఈ ప్రాంతాల్లో సారా కల్తీ వల్ల జనం జబ్బు పడటం ఇది రెండోసారి. డాక్టర్ ని పిలవటం మాత్రం ఇదే మొదటిసారి. రండి! ముందు స్టమక్ వాష్ చేద్దాం" అన్నాడు డాక్టర్. ముఖ్యమయిన మందులు, ప్రధానంగా "Cortisone" ఇంజక్షన్ ట్యూబ్స్ రవి చేత కొనిపించాడు.
    ముందుగా జగన్ కి స్టమక్ వాష్ చేయించి అతడికి ఎక్కువ మోతాదులో "Cortisone" ఇంజక్ట్ చేసి, అప్పుడు గ్రామాలలోకి బయలుదేరారు.
    అప్పటికే గ్రామాప ప్రజల మధ్య అనిల, త్రిసికి ఉన్నారు చేతనయిన సాయం చేస్తూ.
    జీప్ లో రవి, టెక్నీషియన్, డాక్టర్ గ్రామాలలోకి వచ్చేసరికి గిరిజనులు సంతోషించలేదు సరికదా బెదిరిపోయారు. ఆరోగ్యంగా ఉన్న కొందరు జీప్ కి అడ్డుగా నిలబడ్డారు.
    "మీరు మా వూళ్ళో అడుగెట్టటానికి వల్లకాదు. మీ వెంట దయ్యాలొచ్చి పడతాయ్! పొండి పొండి" అన్నారు కర్రలు పట్టుకుని.
    "లాభం లేదు" అన్నాడు డాక్టర్ అతడికి ఆ గ్రామవాసుల మనస్తత్వాలు బాగా తెలుసు. అమ్మవారికి పూజలు చెయ్యటానికి సిద్ధపడినంత తేలిగ్గా డాక్టర్ దగ్గిర మందులు తీసుకోవటానికి సిద్ధపడరు.
    రవి నీరుకారిపోయాడు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళకి వైద్యం చేయించటం ఎలా? గిరిజనులు ఎంత సాత్వికులో అంత మొండివాళ్ళు. అవసరమనిపిస్తే ఎంతకైనా తెగిస్తారు. నిస్సహాయంగా అనిలని చూశాడు. అనిల ముఖంలోనూ దైన్యభావన కనిపించింది క్షణికంగా మాత్రమే.

 Previous Page Next Page