Previous Page Next Page 
తదనంతరం పేజి 32


    "ఊ"


    "ఏమిటి మాట్లాడవు?"


    "ఇందులోని నిజానిజాల గురించి ఆలోచిస్తున్నాను"


    "నీకేమనిపిస్తోంది?


    "ఈ సమస్యని మనం రెండువైపుల గురించీ చూడగలగాలి"


    "అంటే?"


    "ఆర్ధిక పరిస్థితి చాలీ చాలని స్థితిలో వున్న కుటుంబాలు, అంటే ఉదాహరణకి మధ్యతరగతి కుటుంబాలనుకుందాం. ఈ కుటుంబాల్లో పరిస్థితులకి తగ్గట్లుగా ఎవరు నడుచుకుంటున్నారు? ఈ రోజుల్లో ప్రతివారూ తాహతును, నిజం చెప్పాలంటే అర్హతకు మించిన జీవితం కోరుకుంటున్నారు. చిన్నపిల్లలా చదువు దగ్గర్నుంచీ, వ్యక్తిగతంగా పిల్లల చదువుల మీద శ్రద్ధ తీసుకోలేక, పెద్దపెద్ద కాన్వెంటులలో చేర్పించటం, వాటికి ఫీజులు కట్టటానికి చేతగాక నానా యిబ్బందులూ పడటం, పిల్లలకు మొదట్నించీ పనికిరాని ఖర్చులు అలవాటు చెయ్యటం, అంటే క్రమశిక్షణ నేర్పించలేక పోవటం, అర్థంలేని ప్రయాణాలు, ఇంకొకరితో పోటీపడి లేనిపోని ఆడంబరాలు, ఆర్ధిక పరిస్థితులతో రాజీ పడలేక పోవటం, సినిమాలకీ, విలాసాలకూ, తిళ్ళకూ, డ్రస్సులకీ, భేషజాలకీ, అర్థంలేకుండా తగలెయ్యటం, ఈ కుటుంబాల్లో విద్యార్థులగానో, విద్యార్థినులగానో వున్నవారు తమ పరిస్థితుల్ని గురించి పట్టించుకోకుండా వున్న వాళ్ళతో పోటీపడి చదువుమీద కాకుండా, ఆషామాషీ వ్యవహారాల్లో దూసుకెళ్ళిపోతూ ఉండటం, పిచ్చి పిచ్చి డ్రెస్సులు, సైకిళ్ళతో సరిపెట్టుకునే దానికి లూనాలు, టి.వి.ఎస్ లు, స్కూటర్లు, వేళాపాళా లేకుండా తిరగటాలు, పెద్దవాళ్ళు మందలించక పోగా తటస్థంగా చూస్తూ వూరుకోవటం. లేకపోతే ఎంకరేజ్ చెయ్యటం, దేవుళ్ళ పేరుతో, తీర్థయాత్రల పేరుతో, సంప్రదాయాల పేరుతో, పెళ్ళిళ్ళకూ, చావులకూ, షోషల్ కాంటాక్టులకూ శక్తికి మించి ఖర్చు చెయ్యటం, దాంతో అప్పుల పాలయిపోవటం, ఆ అప్పులు తీర్చలేక నానా యాతనా పడుతూ ఉండటం, పాత అప్పులు తీర్చటానికి కొత్త అప్పులు చివరకు అదో ఛాయిస్ లా తయారవుతుంది. ఉన్న ఆస్తులు అమ్ముకోవాలంటే సెంట్ మెంట్, అవసరానికి పనికొస్తుందని చేయించుకున్న బంగారం అమ్ముకోవాలంటే సెంట్ మెంట్, దానికితోడు ఈ ఆస్తులని అవసరార్థం ఉపయోగించుకోకుండా పెద్దవాళ్ళు వీలునామాలు తయారు చెయ్యటం. మనిషి జీవితంలో యీ వీలునామా రాయటమనేది మహా అసహ్యమైన ఘట్టం. ఎన్నో అలజడులు, ప్రభావాలు, దుష్ప్రభావాలు ఆ సమయంలో మనిషి మీద పనిచేస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలనుంచీ కూడబెట్టిన ఆస్తి మీద ప్రలోభం, దానిమీద హక్కు వొదులుకోలేని వ్యామోహం, ఇవన్నీ కలసి తదనంతరాలుగా రూపొందుతాయి. ఆశ్చర్యమేమిటంటే పిల్లల్లో మంచివాళ్ళూ వుంటారు. చెడ్డవాళ్ళూ ఉంటారు. ఆస్తులని దుర్వినియోగం చేసేవాళ్ళూ వుంటారు. మంచి మంచి ఆలోచనలూ, సమర్థతా, ట్యాలెంటూ వున్నవాళ్లూ వుంటారు. చాలీచాలని ఉద్యోగాల వచ్చే జీతాల వల్ల జీవితాల్లో ఎదుగూ బొదుగూ కనబడక, మంచి మంచి ప్రయోగాలు చేసి పైకి రావాలన్న కలలుగనేవాళ్ళూ వుంటారు. స్థిరాస్థుల్ని క్యాష్ రూపంలో మార్చకుండా, దాన్ని ఇంప్రూవ్ చెయ్యలేక, కళ్ళాలను పిల్లల చేతుల్లోకి యివ్వగా చివరిదాకా ఎదుగూ బొదుగూ లేకుండా, ఇబ్బందుల వలయం నుంచీ బయటపడలేకా ఒక రకంగా చెప్పాలంటే జీవచ్చవాల్లా గడిపేస్తూ వుంటారు. అన్నిటికన్నా మనిషినీ పీల్చుకు తినేస్తోంది అహంభావం. లెవల్ తెలుసుకోకుండా ఇతరులతో పోటీపడుతూ అర్థంలేని ఆడంబరాలకి పోతూ ఉండటం క్లాస్ ఫోర్ అంటారే...వాళ్ళిప్పుడు యితరులు సానుభూతి చూపించే స్థితిలో లేరు. ఇంట్లో ఫ్యాన్ చెడిపోతే కరెంటుకు సంబంధించిన ఏ ఇతర వస్తువైనా చెడిపోతే ఏ ఎలక్ట్రిషియన్ కోసం పిచ్చికుక్కలా తిరగాల్సి వస్తుంది. వస్తువిచ్చే సుఖానికి అలవాటు పడ్డ మనం అతన్ని బ్రతిమలుతూ, అతని కోసం పడిగాపులు కాస్తూ, డబ్బులు శక్తికి మించి ఖర్చుపెడుతూ కొనసాగిస్తూ వుండాలి. గ్యాస్ సిలెండర్లకు అలవాటు పడ్డ మనం సకాలంలో బుక్ చేసుకుని కూడా, అది సరియైన టైములో పొందే అర్హత వుండికూడా, ఆ గ్యాస్ సిలెండర్లు తెచ్చేవాడికి టిప్స్ యిచ్చుకుంటూ నిత్యం బ్రతిమిలాడుకుంటూ వుండాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఓ ఇల్లు కట్టించుకోటానికి ముచ్చటపడి, అది పూర్తయే లోపల తాపీమేస్త్రీ వల్ల కట్టే కూలీలవల్ల, కార్పెంటర్ వల్ల ఎలక్ట్రిషియన్ వల్ల ఎంతో వ్యధకు గురయి, ఖర్చు ఎస్టిమేషన్ కి మించిపోయి, అప్పులపాలయిపోయి ఇల్లెందుకు కట్టానా అన్న మానసిక హింసకి గురవుతూ వుంటారు. అప్పుల పాలయినప్పట్నుంచీ, అందులోనుంచి బయటపడలేక అనుక్షణము టెన్షన్ బయట నిల్చుని వ్యాఖ్యానించేవాళ్ళు "వాళ్ళు పొగరెక్కికాక పోతే ఎవరు చెయ్యమన్నారు? అని హేళన చేసి నిరసనగా మాట్లాడతారు. ఎవరూ రంగూ రుచీ లేని వాడికి తప్ప జీవితంలో ఏదో సాధించాలన్న తపన చాలామందికి వుంటుంది. అందుకని ధైర్యంచేసి కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగాలు కొన్నిసార్లు ఫెయిలవుతాయి. ఫెయిలయినప్పుడు ఆ మానసిక వ్యధలో నుండి, ఆర్ధిక దుస్థితి వల్ల కృంగిపోతున్నప్పుడు...యింకా చీదరించుకునేవారేగాని, దానికి పబ్లిసిటీ ఇచ్చేవారేగాని చేయూతనిచ్చేవారే కనబడరు. ఆశ్చర్యమేమంటే ఎంతో అయిన వాళ్ళయివుండి, చేయూతనివ్వగలిగిన సమర్థత వుంటే సాయం చెయ్యటానికి ముందుకు రారు. బహుశా యీ ప్రపంచంలో ప్రతిమనిషిలోనూ శాడిజం ఎంతో కొంత, ఎంతో కొంతమంది ఎక్కువ పాళ్ళలోనే ఉండి ఉంటుంది. ఇతరులు, మనచుట్టూ వున్నవాళ్ళు, అయినవాళ్ళు, ఆప్తులు, బంధువులు కష్టాల వూబిలో యిరుక్కొని వున్నప్పుడు లోలోపల సంతోషిస్తారేగాని, అసహ్యంగా వ్యాఖ్యానిస్తారేగానీ, ఎవరూ జాలిపడరు. అసలు జాలి అనేది ప్రపంచంలోనుండి అంతరించిపోయిందేమోననిపిస్తుంది. ఈ రాజకీయనాయకులు, వివిధ సేవా సంస్థలవాళ్ళు...వీళ్ళందరూ చేసే ఏ ప్రకర్షకోసమో, ఆత్మవంచన కోసమే తప్ప అసలు కష్టాల ఊబిలో యిరుక్కుని ఉన్నవాడికి, అర్హత ఉన్నవాడికి ఎటువైపునుంచీ సాయం లభించటంలేదు. ఎగువ తరగతులవాళ్ళు దిగువ తరగతులవాళ్ళని దోపిడీ చేస్తున్నారన్న మాట. పనిలేని వాళ్ళకి పనికిమాలిన నినాదమైపోయింది. ఈ హృదయ విదారకమైన స్థితిలో మధ్య తరగతి మానవుడు దిన దినం దిగజారిపోతున్నాడు. అటుపైకి ఎదగలేక యింకా పేదరికంతో రాకీపడలేక అయోమయస్థితిలో పడిపోయాడు. ఎటొచ్చీ కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళుండేవారు. ఇప్పుడు బాధ నామోషీపడి గుప్తంగా వుండిపోయి, ప్రెస్టేజ్ కోసం లోలోపల మగ్గిపోతూ బయటకు ఏమీ జరగనట్లు ప్రవర్తిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ళూ వాకిళ్ళూ హరించుకుపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలు ఉద్యోగం చేస్తే తప్పేమిటి? ఏమీ చెయ్యకుండా, ముందుకు సాగకుండా కుటుంబ వ్యవస్థ ఎలా బలపడుతుంది?"

 Previous Page Next Page