"అలాగా?" అన్నాడు వసంతకుమార్. అతని మాటల్లో చాలా వ్యంగ్యం వుంది. "ఆ మచ్చ తొలగించాలంటే చీటికీ మాటికీ మమ్మల్ని వేధించటం మానెయ్యండి. మీరు మా జోలికి రాకుండా వుంటే, పోయిన మా ప్రతిష్ఠ మేమే పునరుద్ధరించుకుంటాం."
"మీరు నిరాకరిస్తే మేము మా అధికారాన్ని ఉపయోగించాల్సి వస్తుంది."
ఇనుమడించిన కోపంతో అతని మొహం జేవురించింది. కళ్ళలోకి ఎర్రని జీరలు ప్రవేశిస్తున్నాయి. రంజిత అతని మొహంలోకి పరిశీలనగా చూస్తోంది.
"మీరు అధికారం ఉపయోగించటానికి ప్రయత్నిస్తే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తానుగానీ, ఈ పరీక్షలకు నిలబడను. యూ కెన్ గో!" అన్నాడు.
"మీ ఇష్టం!" అని లేచి నిలబడింది రంజిత. "మీ నిరాదరణతో లేనిపోని కాంప్లికేషన్స్ కు దారి తీస్తున్నారు" అని బయటకు వచ్చేసింది. సగం తెరిచివున్న ఆమె హ్యాండ్ బ్యాగ్ లో పొందుపరిచిన మినీ టేప్ రికార్డర్ లో అతని వాయిస్ రికార్డ్ చెయ్యబడిందన్న విషయం వసంతకుమార్ కి తెలియదు.
ఆమె వెళ్ళిపోయిన పది నిమిషాలదాకా అతనలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు. గబగబా రెండు సిగరెట్లు కాల్చాడు. తర్వాత లేచి నిలబడి రూంలోంచి బయటకు వచ్చి తన కారు పార్కు చేసివున్న ప్రదేశంలో నడిచాడు.
అతని కారు మెయిన్ రోడ్ మీదకి వచ్చి కొంతదూరం పోయాక ప్రక్క సందులోకి మళ్ళింది.కొంచెం దూరమలా పోయాక మళ్ళీ ఇంకో మెయిన్ రోడ్ మీద కొచ్చింది. అక్కడ్నుంచి అయిదారు నిమిషాలు సరాసరి ప్రయాణం చేశాక తిరిగి ఇంకో చిన్నసందులోకి తిరిగింది. కొంత ముందుకు వెళ్ళి ఓ చిన్న డాబా ఇంటిముందాగింది. వసంతకుమార్ కారు దిగి, ఆ ఇంటిముందు నిలబడి బజర్ నొక్కాడు.
తలుపు తియ్యబడింది. గుమ్మానికవతల ఓ ఇరవై ఏళ్ళ యువతి నిలబడి వుంది. సామాన్యమైన అందమే కాని, ఒంట్లో పుష్కలంగా యవ్వనముంది. పమిట ప్రక్కకి తొలగి యవ్వనాన్ని మరింత బయటకు విరజిమ్ముతోంది.
అతన్ని చూడగానే ఆమె కళ్ళలో ఏదో మార్పు. "మీరా?" అంది.
"నీతో కొంచెం మాట్లాడాలి."
"ఇప్పుడా?"
"అవునిప్పుడే."
"లోపలకు రండి" అంది.
* * *
రంజిత మినీ టేప్ రికార్డర్ వెంటతీసుకుని హేమసుధ ఇంటికి వెళ్ళింది. ఎప్పుడు పడితే అప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఆమె పై అధికారుల దగ్గర్నుంచి అనుమతి తీసుకుంది. ఆమె గురించి తెలిసి వుండటం చేత వాచ్ మేన్ అభ్యంతరం చెప్పకుండా లోపలకు పోనిచ్చాడు. బజర్ నొక్కగానే హేమసుధ తల్లి కల్పవల్లి వచ్చి తలుపు తీసింది. రంజితను చూడగానే ఆమె మొహంలో రంగులు మారాయి. అలా ఒక్కక్షణం... అంతలోనే మళ్ళీ మామూలుగా అయిపోయింది.
"రండి" అంది
రంజిత లోపలకడుగు పెట్టింది.
"హేమసుధగారితో ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి."
"తను మాట్లాడే స్థితిలో లేదు."
"ఏం?"
"షాక్ లో వుంది. తనలో తను ఏడుస్తుంది. నవ్వుకుంటుంది. బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయింది."
"అయ్యో!" అనుకుంది రంజిత.
"రండి చూద్దురుగాని" అంటూ కల్పవల్లి లోపలకు దారితీసింది.
హేమసుధ గదిలో ఒక్కతే కూర్చుని వుంది.
తెల్లచీరె, వంటికి అతుక్కుని వున్న నల్లజాకెట్, కళ్ళకు చిక్కటి నలుపుతో నిండి వున్న గాగుల్స్. ఆమె ముఖం ఎటో త్రిప్పి వుంది. అలికిడయినా తల ప్రక్కకి త్రిప్పి చూడలేదు.
"హేమసుధగారూ!" అని పిలిచింది రంజిత.
హేమసుధ తలత్రిప్పలేదు. కదలకుండా అలానే కూచుని ఉంది. దగ్గరకు వెళ్ళి భుజంమీద చెయ్యివేసి మళ్ళీ పిలిచింది. హేమసుధలో చలనం లేదు, బొమ్మలా ఉండిపోయింది.
"అంతే. ఎవరితో మాట్లాడదు. ఏమడిగినా జవాబు చెప్పదు. అసలీ ప్రపంచంలో వున్నట్లు కనబడదు."
"సైకియాట్రిస్ట్ కు చూపించలేదా?"
"చూపించాము. ఒకరికికాదు. ఐదారుగురికి చూపించాము. ట్రీట్ మెంట్ ఇస్తున్నారుగానీ ఏమీ ప్రయోజనం కనబడటం లేదు."
రంజిత మౌనంగా నిలబడివుంది.
"అలా గంటల తరబడి నిశ్శబ్దంగా వుండిపోతుంది. ఉన్నట్లుండి బిగ్గరగా నవ్వుతుంది. అంతలోనే గట్టిగా ఏడ్చేస్తుంది. కంట్లోంచి నీటిచుక్క రాలిపడే అదృష్టానికి మాత్రం నోచుకోలేదు."
కల్పవల్లి మాటల్లో ఎనలేని బాధ, కూతురి గురించి పడుతున్న ఆవేదన ధ్వనిస్తోంది. ఇద్దరూ బయటకు వచ్చారు.
"అన్నట్లు వసంతకుమార్ ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది?" అనడిగింది రంజిత ఆకస్మికంగా.
"వసంతకుమార్ ఎవరు?"
రంజిత ఆమె మొఖంలోకి పరిశీలనగా చూసింది. ఎలాంటి తొట్రుపాటూ లేదు.
"అతను ఓ డాక్టరు."
"అతనెవరో తెలీదు. హేమసుధను సైకియాట్రిస్టుల దగ్గరకు మాత్రం తీసుకెళ్ళాను. కావాలంటే వాళ్ళ పేర్లు చెబుతాను."
"చెప్పండి."
ఆమె కొన్ని పేర్లు చెప్పింది. రంజిత తన నోట్ బుక్ లో వాటిని నోట్ చేసుకుంది.
"వస్తాను" అంటూ గుమ్మందాకా వెళ్ళి" అన్నట్లు డాక్టర్ కృష్ణచైతన్యను ఎప్పుడైనా కలిశారా మీరు లేదా" అనడిగింది హఠాత్తుగా వెనక్కి తిరిగి.