శంకరానికి యింకో ఆలోచనకూడా వచ్చింది. నాన్న ఎలాగూ సిగ్గులేని వాడు కాబట్టి ఆయనకు నలుగురూ ఏమనుకున్న ఫర్వాలేదు. కాని అక్కయ్య విషయం అలాకాదుగా బాగా ఆలోచిస్తే తెలుస్తున్నది. అసలు వచ్చే చిక్కంతా అక్కయ్యదే. అక్కయ్యవల్లే బావ ఇక్కడికి రావటం సంభవించింది కాబట్టి అవమానమంతా అక్కయ్యదే. అవమానం మాట అటుంచి అక్కడికి వాళ్ళవూరికి పోయిన తర్వాత ఎలా తలెత్తుకు తిరుగుతుంది? అక్కయ్య అత్తగారు వట్టి గయ్యాళిదని కూడా చెప్పుకొంటారు. ఆవిడకి కోపం వచ్చి అక్కయ్యను యిష్టం వచ్చినట్లు తిట్టేస్తే?
బావ అవమానించబడటమే సహించలేకపోయిన శంకరానికి అక్కయ్య బాధపడే విషయం తలుచుకొంటె మరీ భరించరాని విషయం అయింది. అక్కయ్యను ఎలా అయినా యీ ఉపద్రవం (అసలు శంకరానికి ఈ మాటకు అర్ధం సరిగ్గా తెలీదు. అయితే ఎక్కడ ఉపయోగించాలో మట్టుకు అఖండంగా తెలుసు) నుంచి ఎలా కాపాడటం? అక్కయ్యను ఆ ముసలిదెయ్యం తిట్లనుండి ఎలా రక్షించడం?
ఆలోచించగా ఆలోచించగా శంకరానికి ఉపాయం తట్టింది. తనకు అనువైన మార్గంలో వున్నదీ, అలవాటైనదీ అది ఒక్కటే. ఈ ఆలోచన వచ్చిన తర్వాత అతను పడుకుని హాయిగా నిద్రపోయాడు.
తెల్లవారుజమున అయిదింటికి మెలకువ వచ్చింది శంకరానికి. అదే అతనిలోని ప్రత్యేకత. పరీక్షల సమయంలోకాని, సెలవుల్లో కాని అతనికి తెల్లవారుజామున నాలుగింటికో నాలుగున్నరకో, అయిదింటికో మెలకువ వచ్చేస్తుంది. ఐతె అది అతని ప్రయత్నంమీద వచ్చే మెలకువకాదు. ఆ టైముకల్లా అతను ఎంత నిద్రలో వున్నా సరే లేచి తీరాలి. అదీ అతని అలవాటు. ఈ అలవాటు వేసవికాలంలో అయినా, శీతాకాలంలో అయినా, వానాకాలంలో అయినా నిర్విఘ్నంగా జరిగితీరవలసిందే.
శంకరం లేచాడు. నారాయణరావుగారూ, శాంతమ్మగారూ గాఢంగా నిద్రసాగిస్తున్నారు. నాగమణి అక్కయ్యా, సుందరం బావా పెద్దగదిలో పడుకుంటారు తలుపులు బిదయైంచుకొని శంకరం నిశ్శబ్దంగా లేచి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అతని గుండె దడదడా కొట్టుకొంటున్నది. అలాగే వెళ్ళితాళంచెవి తీసేశాడు. కావడిపెట్టె తెరిచాడు జాగ్రత్తగా, చేయిజారి ఎక్కడ ఆ మూత జారిపడి చప్పుడు చేస్తుందో అని హడలిపోతూ రెండుచేతుల్తో గట్టిగా పట్టుకుని మూతమీద గ్లాసేదో పెట్టివుంది. పైకి ఎత్తటంలో వెనక్కి దొర్లుకుపోయి నేలమీద పడి చప్పుడుచేసింది. శంకరం గుండె ఆగిపోయినంత పనయింది. ఏం చెయ్యటానికీ తోచక మూత పట్టుకుని అలాగే నిలబడ్డాడు. తల్లిది బండనిద్దర అని శంకరానికి తెలుసు. ఒకసారి ఏదో వూరికిపోయి తండ్రి అర్దరాత్రిపూట యింటికి వచ్చేసరికి ఆవిడ గాఢంగా నిద్రాదేవిని కౌగలించేసుకొని పడుకొంది. శంకరం ఎలాగూ చిన్నవాడు గనక సరేసరి. అరగంటసేపు ఆయన తలుపుతో కుస్తీ పట్టేసి అలసిపోయిన తరవాత ఆవిడకు మెలకువ వచ్చింది. అదయినా ఆయన చేసిన చప్పుళ్ళకు కాదు. ఏదో పీడకల రావటంవల్ల దానంతట అది రావాల్సివచ్చింది. పీడకల భయంతో ఆమెపెట్టిన గావుకేకతో శంకరానికి కూడా మెలకువ రాక తప్పలేదు. తలుపు తీసిన తర్వాత నారాయణరావుగారు లోపలికివచ్చి ఒక నెలకు సరిపడే పీడకలలు వచ్చేలాగా ఆవిడకు బుద్దిచెప్పారు.
ఇటువంటి అపాయకరమైన స్థితిలో కూడా అదంతా ఒకసారి శంకరం బుర్రలో గిర్రున తిరిగింది అంతే.
అంతకంటే అపాయం మరేమీ కలగలేదు. నాన్న రెండు మూడుసార్లు కదిలి మళ్ళీ నిశ్చలంగా వుండిపోయాడు. శంకరం పని నిర్విఘ్నంగా కొనసాగిపోయింది. ఆ చీకట్లోనే ఎలాగో తంటాలుపడి ఐదు పదిరూపాయలనోట్లు జేబులోకి తోసేశాడు. మళ్ళీ ఆ పెట్టె తాళంవేసి, తాళంచెవి దేముడి పటం క్రింద పెట్టేసి ఏమీ తెలియనట్లు తలుపులు మూసేసి వచ్చి పడుకున్నా అతని గుండెదడమాత్రం అరగంటదాకా తగ్గలేదు.
మళ్ళీ శంకరం లేచేటప్పటికి ఏడైంది. అప్పటికి అక్కయ్యా, బావా స్నానాలు కూడా చేసేసి ప్రయాణానికి సిద్దంగా వున్నారు. శంకరం మొహం కడుక్కుంటుంటే రంగయ్య కనిపించాడు. అంటే ఎర్రపాలెంలో వాళ్ళ రైతు. నారాయణరావుగారి పొలం కొంత అక్కడుంటే అది కౌలుకు పుచ్చుకున్నాడు. అతను అప్పుడప్పుడూ రావటం అలవాటే గనక ఆశ్చర్యం కలిగించలేదు అతనికి.
ఎనిమిదింటికి నాగమణి అక్కయ్యా, సుందరం బావా బయల్దేరారు. రాముడు పోయి జట్కా పిల్చుకు వచ్చాడు. "వెళ్తున్నానమ్మా" అని చెప్పింది నాగమణి అక్కయ్య. బావకూడా రెండుమాటలు చెప్పాడు నాన్నతో శంకరం చూస్తూ నిల్చున్నాడు. "ఏరా స్టేషన్ దాకా వస్తావా?" అంది అక్కయ్య. "రానులే అక్కయ్యా!" అన్నాడు శంకరం. అలా అన్నందుకు బోలెడంత కారణంవుంది. "వెళ్తున్నానోయ్ శంకరం!" అన్నాడు సుందరం బావ. శంకరం తలవూపాడు. అంతకంటే ఇంకేదో చెయ్యాలి అని తెలిసినా చెయ్యవలసిందేమిటో తెలిసింది కాదు అతనికి బండి కదిలింది.
బండి దృష్టిపథంనుండి తొలిగేవరకూ నిల్చున్నాడు శంకరం. తర్వాత రైలు ఎనిమిదిన్నరకు కదూ పోవటం" అనుకుని లోపలికి పోయాడు. ఇంట్లోంచి బయటకు వచ్చాడు. శాంతమ్మగారు చూసి "ఎక్కడకురా?" అనడిగింది. "ఇక్కడికేనే" అంటూ తుర్రుమన్నాడు శంకరం. ఆ సందు దాటిపోయిన తర్వాత ఒకసారి వెనక్కు చూసి రైలుస్టేషన్ వైపు పరుగు లంకించుకున్నాడు. శంకరం ఎంత వేగంగా పరుగెత్తినా అతను స్టేషన్ చేసేసరికి అప్పటికే సిగ్నలు యిచ్చేశారు. శంకరానికి దిగులుపుట్టింది. గబగబ ఫ్లాటుఫారం మీదే పరుగెత్తుతూ యింటరుక్లాసు కంపార్టుమెంటుదగ్గర ఆగాడు. సుందరంబావ, నాగమణి అక్కయ్య కూచునే పెట్టె అదేనని అతని భావం. అలాగేకూడా జరిగింది. వాళ్ళిద్దరూ ఒకరికెదురుగా ఒకరు కూచుని వున్నారు.
"అక్కయ్యా! బావా!" అన్నాడు శంకరం వగరుస్తూ ఇద్దరూ తెల్లబోయి ఆశ్చర్యంగా చూశారు యితనివంక.
"ఏమిట్రా అలా ఆయాసపడుతున్నావు? ఏం జరిగింది?" అని అడిగింది. అక్కయ్య చప్పున బావ అడగకుండా యింకా ఆశ్చర్యంగా చూస్తున్నాడు.