రైలు కూతవేసింది.
"అది కాదే, మీరు వెళ్ళిన తర్వాత నాన్న వున్నట్టుండి ఒక్కసారిగా అదోలా అయిపోయాడు. ఆ తర్వాత నాకు యీ డబ్బుయిచ్చి బావకిచ్చేసి రమ్మన్నాడు. ఇదిపెట్టి బట్టలన్నా ఏమైనా కొనుక్కోమన్నాడు" అనేసి శంకరం ఎడంవైపు నిక్కరుజేబులో చెయ్యి పెట్టుకున్నాడు. హృదయం ఒక్కసారిగా ఝల్లుమంది.
రైలు కదిలింది.
శంకరం తెల్లమొహం వెయ్యటం కనిపెట్టి అక్కయ్య "ఏమిట్రా? ఏమిట్రా?" అని అరుస్తున్నది ఆత్రంగా.
శంకరం వణికిపోతూ నిక్కరు కుడిజేబులోకి చెయ్యిపెట్టాడు. హమ్మయ్య! అందులో వుంది డబ్బు చటుక్కున బయటకి లాగేశాడు. తల ఎత్తి చూసేసరికి అప్పటికే అయిదుగజాలు ముందుకుపోయింది వాళ్ళు కూచున్న పెట్టె. శంకరం పరుగెత్తుకుపోయి "ఇదిగో బావా!" అన్నాడు చెయ్యి ముందుకుజాచి అందిస్తూ. బావ చెయ్యిజాచాడు. శంకరం చటుక్కున అందిచ్చేశాడు. శంకరానికి హృదయం తేలికయినట్లు అనిపించింది. ఊరికినే యింకా కొంచెం దూరం పరిగెత్తాడు. అక్కయ్య ముఖంలో పెదవులమీద హాసరేఖలు ఉదయించాయి. "చూశారా" అన్నట్లుగా బావవంక చూసింది. సుందరం బావకూడా కోపమంతా మరచిపోయి మనసారా నవ్వేశాడు. అక్కయ్య పరిగెత్తుతున్న శంకరంవంక చూసి "అయ్యో! ఇదేమిటి? ఇంక వెళ్ళిరా" అంది. శంకరం ఆగిపోయి "వెళ్తున్నా అక్కయ్యా, వెళ్తున్నా బావా!" అని సంతృప్తితో వెనక్కి తిరిగాడు. రైలు తనను దాటిపోయిన తర్వాత ఈల వేసుకొంటూ హుషారుగా ఇంటిదారి పట్టాడు.
8
శంకరం ఇంటికి వచ్చేసరికి నారాయణరావుగారు రంగయ్యతో మాట్లాడుతున్నారు.
"ఈసారికి క్షమించండి. వచ్చేసారికి ఇవ్వవలసిందంతా ఇచ్చేసుకుంటాను" అంటున్నాడు రంగయ్య.
"ఇలా ఎంతకాలమయ్యా?"అంటున్నాడు తండ్రి.
"పంటలు పండకపోతే మేముమాత్రం ఏంచేస్తాం బాబూ! ఏదో దయ తల్చండి. తమరు దయతలచకపోతే బ్రతకలేం" అంటున్నాడు రంగయ్య.
"ఆఁ, మాటలు మట్టుకు నేర్చారు మీకు ఎక్కువ లాభాలు వచ్చినప్పుడు మాకు ఇస్తున్నారా? తక్కువ వస్తే మేము దయతల్చేటందుకు" అన్నారు నారాయణరావుగారు.
"అదేంటయ్యగారూ అలా అంటారు? ఎక్కువ లాభాలు ఎప్పుడు వచ్చినై మాకసలు?" అని దీనంగా అన్నాడు రంగయ్య.
శంకరం ఆ కాస్తామట్టుకు విని ఇంకా అక్కడ వుంటే బావుండదని లోపలకు వెళ్ళిపోయాడు. నాన్నకు బొత్తిగా దయలేదేం! తనకు పొలాల విషయం ఎక్కువగా తెలియదు. నిజమే, అయినా సినిమాల్లో చూడటంలా? రైతులు పొలాలు పండటంలేదని వచ్చి మొరపెట్టుకుంటుంటే ధనవంతులయిన యజమానులు వినిపించుకోకుండా ఇబ్బందులు పెట్టటం. నాన్నకూడా అలాంటి బాపతులోనివాడే.
నిజానికి నాన్నకు హృదయం అనేది వుందా...అనిపించింది శంకరానికి.
శంకరం ఆ రోజున బడికి పోవాలి. పదిహేనురోజుల సెలవుల తర్వాత తిరిగి ఆనాడు బడికి పోవాలి. శంకరం పదిగంటలకల్లా అన్నం తినేసి బయల్దేరాడు. స్కూలు గేటుదగ్గరికి రాగానే "ఏంరోయ్ పిల్లదొంగా!" అనీ, "ఏమండోయ్ పిల్లదొంగగారూ!" అనీ ఇలా పదే పదే గొంతుకలు వినిపించాయి. శంకరానికి ఏమాత్రమో పరిచయమున్న ప్రతివారూ అలానే పలకరించారు.
శంకరం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
తను ఇందాక చేసిన పని జ్ఞాపకం వచ్చింది. అంతకుముందు చేసినవన్నీ ఒక్కనిముషంలో కళ్ళముందు చకచకా తిరిగిపోయినై తను చేసిన పనులు వీళ్ళకు ఎలా తెలిసిపోయాయి? తెలియకపోతే "పిల్లదొంగా" అని తననెలా ఆట పట్టిస్తున్నారు?
శంకరం అంత ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోకముందే తను వేసిన నాటకం విషయం గుర్తుకువచ్చింది. వెంటనే ఒక్కసారిగా నవ్వు వచ్చింది అతనికి. "ఓస్, యింతేనా" అనుకొన్నాడు.
ఎలాగైనా అందరూ అతణ్ణి "పిల్లదొంగా" అని పిలిచి ఆటపట్టించేశారు. శంకరానికది కొంతకాకపోతే కొంతయినా కష్టం కలిగించింది. అయినా, అలా అన్నవాళ్ళందరివైపూ నవ్వుతూ చూస్తూ, "ఏడిశావులేరా" అనసాగాడు. క్లాసులోకి పోయిన తర్వాత ఇంగ్లీషుమాస్టారు వచ్చారు. ఆయన వచ్చీ రాగానే అటెండెన్సు వేసుకోసాగాడు. శంకరంపేరు రాగానే "శం... పిల్లదొంగా" అన్నాడు. శంకరం కంగారులో "ప్రజెంటుసార్" అనేశాడు. క్లాసంతా గొల్లుమంది. అయినా ఆ సమయంలో అవమానింపబడినట్లు కనబడటం మరింత అవమానానికి హేతువవుతుందని కష్టంమీద నవ్వు తెప్పించుకొని కూచున్నాడు.
"పిల్లదొంగవంటే నువ్వేన్రా ఏమిట్రా శంకరం?" అన్నారు ఇంగ్లీషు మేస్టారు.
శంకరానికి సమాధానం చెప్పాలని బుద్దిపుట్టింది. "వెధవలంతా అలానే అంటున్నారండీ" అనేశాడు పుటుక్కుమని.. అనుకోని ఈ దెబ్బకు ఇంగ్లీషు మేస్టారి మొహం కందగడ్డ అయిపోయింది.
"అయితే నువ్వూ వెధవ్వేనన్నమాట!" అన్నాడు ఆయన ఒకక్షణం ఆలోచించి ఆ సమయంలో కోపం చూపిస్తే పిల్లలు తనకు తాటాకులు కట్టెయ్యడానికి ఏమాత్రం అభ్యంతరం వుండదని ఆయన వూహించాడు.
శంకరం ఏమాత్రం తగ్గలేదు. "నేను వెధవనయినందుకు నాకేమీ విచారం లేదు. కాని మిగతావారి విషయమే..." అని మాట సగంలోనే ఆపేశాడు మిగిలింది వూహించుకోమని వదిలిపెట్టేసి ఈమాటుకూడా పిల్లలంతా గొల్లుమన్నారు. ఎవర్ని చూసి గొల్లుమన్నారో నిశ్చయించుకోలేని ఇంగ్లీషు మేస్టారి మొహం కందగడ్డలోంచి ఉల్లిపాయసైజులోకి మారింది. కాని శంకరాన్ని ఏమీ అనలేక వూరుకున్నాడు.
ఆ సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక తండ్రి ఎందుకో కంగారుపడుతుండటమూ, తల్లికూడా అదేస్థితిలో వుంటమూ చూశాడు. తండ్రి కంగారులో కూడా కోపంతో బుసలు కొడుతున్నాడు.


