7
సెలవులు అయిపోయాయి. మరునాటినుంచీ బడి తెరుస్తారు. అప్పుడే సుందరం బావ వెళ్ళిపోతానంటున్నాడు. శంకరం నాన్న మరో నాలుగురోజులు వుండమన్నారు. "వీల్లేదు, సెలవులు అయిపోయాయి" అన్నాడు సుందరం బావ. అసలు సుందరం బావ ఎప్పుడూ శాంతంగా, నిదానంగా వుంటాడు. కాని ఎంచేతనో రెండురోజుల్నుంచి అతని మొహం ధుమధుమలాడిపోతున్నది.
బావ వెళ్ళిపోతానంటే శంకరానికి విచారం పట్టుకుంది. ఇన్నాళ్ళనుంచీ బావతో ఆడిన సిన్ బోర్డు గేమ్సూ, కేరమ్సూ, చూచినా సినిమాలు గుర్తుకొచ్చాయి. నాన్న చెప్పినట్లు మరో నాలుగురోజులు వుంటే బాగుండుననుకున్నాడు. కాని ఎలా? బావకు ఆఫీసు వుంటుంది. అతను యిక్కడ వుండి పోవటానికి వీలులేదు. వున్నా తను బావతో కులాసాగా గడపటానికి ఎలా వీలవుతుంది? తనకుకూడా రేపటినుంచీ స్కూలు వుందిగా!
ఆనాటి రాత్రి అంతా భోజనాలు చేశాక బావతో మాట్లాడుదామని అతనున్న గది దగ్గరకి పోయాడు. కాని అతను గదిలోకి కాలుపెట్టకముందే బావ నాగమణి అక్కయ్యతో కోపంగా అంటున్న మాటలు వినిపించినవి. శంకరం అక్కడే ఆగిపోయి వినసాగాడు.
"వచ్చినందుకు బాగానే మర్యాద జరిగిందిగా! పండక్కి వచ్చాను కదా అని నాకు మహా తొడిగేశారుకదూ! ఇంటికి పోయిన తర్వాత అమ్మతో చెప్పుకునేందుకు కూడా సిగ్గుగా వుంది" అన్నాడు బావ.
"అంత కోపమయితే ఎలాగండీ? నాన్న ఎందుకు పెట్టలేదో ఏమో నాకు అర్ధం కావటంలేదు' అంది నాగమణి అక్కయ్య.
"అర్ధం కాకపోవటానికి ఏముంది ఇందులో? ఆయన ఆస్తంతా కరిగిపోతుందని కాబోలు పెడితే! ఎందుకూ! డబ్బు వుండగానే సరా? ఒక ముద్దూ ముచ్చటా ఏమీ అక్కర్లా?" అన్నాడు సుందరం బావ.
అక్కయ్య చిన్నబుచ్చుకున్నట్టుంది. "నన్నంటారేమండీ మధ్య? నాకేం తెలుసు?" అంది దీనంగా.
"నిన్నెవరంటున్నారు? అసలు ఎవర్నిమట్టుకు అనేందుకు నాకేం అధికారం ఏడిసింది? అక్కడ తిండిగ్గతిలేక యిక్కడ మెక్కిపోదామని వచ్చాను కదూ" అన్నాడు బావ చిరాగ్గా.
అక్కయ్య మాట్లాడలేదు. బహుశా ఏం మాట్లాడాలో తెలిసివుండదు. "పద పద, జరిగిన మర్యాద చాలుగాని బయలుదేరు. యింకా అడ్డుపుల్లలు వేయకుండా రేప్పొద్దునే బయలుదేరు" అన్నాడు సుందరం బావే మళ్ళీ.
శంకరం యింక అక్కడ వుండలేదు. గబగబ అమ్మదగ్గరికి పోయాడు. నాన్న అక్కడ లేడు. అందుకని వీలుచిక్కింది. అమ్మ వంటింట్లో ఏదో సర్దుతున్నది.
"అమ్మా! అమ్మా!" అన్నాడు శంకరం.
"ఏమిట్రా?" అన్నదావిడ.
"మరీ-" అని గట్టిగా అనేసి దగ్గరికి చేరి రహస్యంగా "నాన్న బావకు పండక్కి ఏవీ యివ్వలేదుటగా?" అన్నాడు.
శాంతమ్మగారు కొడుకువంక ఆశ్చర్యంగా చూసి "నీకెలా తెలిసిందిరా?" అనడిగింది.
"బావ అక్కయ్యతో అంటున్నాడులే గట్టిగా" అన్నాడు శంకరం తానో పెద్దవాడిలాగా.
"ఏడిశావులే ఆ విషయాలన్నీ నీకెందుకు?" అని అమ్మ కసిరేసింది. "అదికాదే అమ్మా" అంటూ శంకరం యింకేదో అనబోయాడు. "అరవబోకురా పెద్దవాళ్ళ విషయాలు నీకెందుకు? పద పద" అన్నది అమ్మ వినిపించుకోకుండా శంకరం విధిలేక అక్కడినుంచి వచ్చేశాడు.
తర్వాత అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. నారాయణరావుగారు అప్పుడే పడుకుని ఏదో ఆలోచించుకుంటున్నారు.
"చూశారా?" అంది శాంతమ్మగారు. "అల్లుడుకూడా మనసు కష్టపెట్టుకున్నాడట.
"ఎందుకు?"
"ఎందుకేమిటి? మీరు చేసినపనికి, లేకపోతే పండక్కని అల్లుడిని పిలిచి వట్టి చేతుల్తో పంపటం భావ్యమేనా చెప్పండి" అన్నదావిడ బ్రతిమలాడుతూ.
"ఏడిశావులే" అన్నారు నారాయణరావుగారు. "ఈ విషయాలన్నీ నీకేం తెలుసు? అల్లుడైతే మట్టుకు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి యివ్వాలని వుందా? చాలు చాల్లే, నీ నిర్వాకం బాగానే వుంది. అయినా కొత్తల్లుడా ఏమన్నాడా? కొత్తలో ఏమన్నా పెట్టామూ అంటే అర్ధముంది. ఇప్పుడెందుకే? చాలుగాని ఇక వూరుకో" అని చిన్న ఉపన్యాసం ఇచ్చారు.
శాంతమ్మగారు చిన్నబుచ్చుకుంది. అయినా నచ్చచెప్పి చూద్దామని" అది కాదండి" అంటూ యింకేమో చెప్పబోయింది. అయినా నారాయణరావుగారు వినిపించుకోలేదు.
"నాకు తెలుసులే అంతా చెప్పేవాళ్ళే మీరంతా చెప్పినట్లుగనుక ఆచరించానంటే ఇహ ముష్టిచిప్పే చేతికి" అంటూ తిట్టేశారు. శాంతమ్మగారు చేసేదిలేక బయటికి వచ్చేసింది. ఆ సమయానికే నాగమణికూడా తల్లిదగ్గరకు వచ్చింది.
"అమ్మా" అని పిలిచింది నాగమణి. శాంతమమగారు కూతురువంక చూసింది. కూతురు దీనవదనాన్ని చూసి ఆవిడ హృదయం జాలితో నిండిపోయింది. దగ్గరకు తీసుకొని తల నిమురుతూ "ఏం చెయ్యనే మణీ! మీ నాన్నగారి సంగతి తెలుసుగా నీకు. ఒక కూతురనీ, అల్లుడనీ ముద్దూ ముచ్చటా లేకపోయె మనిషికి" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
శంకరం ఇదంతా పరికించే స్థితిలో లేడు. అతని ఆలోచనలలో అతననుకున్నాడు.
నాన్న వట్టి పిసినారి. లేకపోతే పండక్కి ఎవరైనా అల్లుడొస్తే ఏమీ యివ్వకుండానే పంపిస్తారా? అలా పంపించకూడదన్న విషయం తనకు బాగా తెలుసు. తమ యింటికి రెండిళ్ళ అవతలే వున్న చంద్రం చెప్పాడు. వాడుకూడా తన క్లాసుమేటే. వాళ్ళ బావ వస్తే వాళ్ళ నాన్న రిస్టువాచి కొని ఇచ్చాడట. అతనొక్కడేనేమిటి? అందరూ అలానే ఇస్తాహరు. నాన్న ఒక్కడే అలా ఎగ్గొట్టేస్తున్నాడు. అది తప్పేగామరి. అసలు బావకు సాధారణంగా కోపంరాదు. వచ్చిందంటే నాన్న క్షమించరాని తప్పే చేసి వుంటాడన్నమాట. చేసివుంటాడేమిటి? చేశాడు. మరి బావకు కోపంరాదూ! ఆయన పండక్కి వస్తే అలా ఏమీ యివ్వకుండా వుండటం ఆయన్ని అవమానం చేసినట్లేగా!