Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 33


    ఫోన్ లో సబ్మిసివ్ గా మాట్లాడిన దృశ్య వేసిన పథకం తెలీని శ్రీహర్ష సరిగ్గా నాలుగు యాభై అయిదు నిముషాలకి సరుగుడు తోటలో అడుగుపెట్టాడు.

 

    శ్రీహర్ష చేసిన పొరపాటు నమ్మి నిరాయుధుడిగా రావటం.


                                   *  *  *


    సమీపంలో సముద్రపు హోరు...

 

    పశ్చిమాన సూర్యుడు అస్తమిస్తూ ఆకాశానికి అద్దుతున్న రక్త సింధూరం...

 

    మొదలుకాబోతున్న తుఫాన్ ని సూచనగా ఉధృత ప్రభంజనం... నిర్జనంగా వున్న పరిసరాల్ని చూస్తూ ఒక్కో అడుగు వేస్తున్నాడు శ్రీహర్ష. గాలి తాకిడికి సరుగుడు చెట్లు చిత్రమైన శబ్దాన్ని చేస్తున్నాయి. శ్రీహర్ష చేతికున్న వాచీని చూసుకున్నాడు.

 

    అయిదుగంటల రెండు నిముషాలు.

 

    "శ్రీహర్షా!"

 

    ఎవరో పిలిచినట్లయి గభాలున వెనక్కి తిరగబోయిన శ్రీహర్ష వెన్నెముక్కి గుచ్చుకుంది రివాల్వర్,

 

    "గాడ్ డేమ్నె సన్నాఫె బిచ్!" డేవిడ్ వికృతంగా నవ్వేడు. రివాల్వర్ మరింత బలంగా నొక్కిపెడుతూ "నిన్న రాత్రి తెలివిగా నన్ను ఫూల్ ని చేశావ్."

 

    శ్రీహర్షలో చలనం లేదు. చాలా ప్రమాదాల్లో నిగ్రహంగా నిలబడగలిగిన అతడికిది మామూలు పరీక్షలాంటిది.

 

    "సమర్ధుడు వెనుకనుంచి సాహసాన్ని ప్రదర్శించడు మిస్టర్ డేవిడ్!"

 

    "అంటే?" ఈసారి తనే ముందుకి నడిచాడు డేవిడ్.

 

    "నా గురించి తెలుసన్న మాట!"

 

    తల పంకించాడు శ్రీహర్ష. "చాలా కిరాతకుడివని విన్నాను."

 

    "ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలుసుకోబోతున్నావ్."

 

    "మరి నా బయోడేటాను గురించి తెలుసుకోవాలని లేదా "సుమారు ఆరడుగుల పొడవున్న డేవిడ్ మొహం చూస్తుంటే అర్ధమయిపోయింది డేవిడ్ రక్తం అలవాటుపడ్డ మేనీటరని. "మాట్లాడు మిస్టర్ డేవిడ్!"

 

    శ్రీహర్షలో ఈ నిబ్బరం భరింపశక్యం కావడంలేదు.

 

    "ఒక మామూలు క్రిమినల్ గురించి వివరాలు తెలుసుకునే అవసరం నాకు లేదు.

 

    "నీమీద వున్న గౌరవం తరిగిపోతూంది డేవిడ్! నీలాంటివాడిచేత పరిరక్షింపబడుతున్న వ్యవస్థలోకి అడుగుపెట్టి నిన్నూ, నీ బాస్ నీ, యిప్పుడు నిన్నిలా పంపిన నీ బాస్ గారాలకూతుర్ని మొత్తం వెధవాయిల్ని చేయగలిగిన నన్ను ఓ మామూలు దొంగగా భావించడం నీ అవివేకానికి ఓ అందమైన ఉదాహరణ."

 

    కొంతసేపలా ఏమార్చాలనుకున్న శ్రీహర్ష వూహించలేదు డేవిడ్ తొందర పడగలడని. కాలిపాదంతో ఇసుకను డేవిడ్ మొహంపైకి నెట్టాలనుకుంటుండగానే రివాల్వర్ నిప్పులు కక్కింది.

 

    అది క్షణంలో శ్రీహర్ష తొడలోనుంచి దూసుకుపోయింది.

 

    మరో తూటా దూసుకురాకముందే అదే కాలితో బలంగా డేవిడ్ పిడికిలిపై తన్నాడు.

 

    చేతి మణికట్టు విరిగిపోయేటంత దెబ్బని తట్టుకోగలిగిన డేవిడ్ సామాన్యుడు కాడని అర్థమైన క్షణమది.

 

    సెంట్రిప్ర్యుగల్ ఫోర్స్ తో శరీరాన్ని వెనక్కి తిప్పిన శ్రీహర్ష ఈసారి పిడికిలి నుపయోగించాడు.

 

    భుజం ఎముక విరిగిపోయేదే... మెరుపులా పక్కకి జరిగిన డేవిడ్ కసిగా ట్రిగ్గర్ నొక్కాడు.

 

    వెంట్రుకవాసిలో తప్పించుకున్న శ్రీహర్ష ఈసారి ఎడమపాదంతో డేవిడ్ గెడ్డంపై తన్నాడు గాలిలో కదుల్తూ.

 

    తూలిపడలేదు డేవిడ్. కాని రివాల్వర్ జారిపోయింది. ఇసుకలోని రివాల్వర్ అందుకోవాలని ఒరిగాడో లేదో శ్రీహర్ష పాదం అతడి వెన్నెముక్కి తాకింది.

 

    సన్నని మూలుగు.  

 

    రివాల్వర్ కి అయిదడుగుల దూరాన చిన్న బండరాయిలా దొర్లిన డేవిడ్ శక్తిని కూడగట్టుకుంటూ చూశాడు.

 

    అప్పటికే రివాల్వర్ అందుకున్న శ్రీహర్ష గురిపెట్టి డేవిడ్ కి అభిముఖంగా నిలబడివున్నాడు.

 

    డేవిడ్ మొహంలో ఆందోళన లేదు. అసలు మరణంగురించి భయపడుతున్న కంగారూ కనిపించలేదు.

 

    తోడేలుగా నవ్వుతున్నాడు అసలేమీ జరగనంత మామూలుగా.

 

    "అభినందిస్తున్నాను మిస్టర్ డేవిడ్! ఇంకా చెక్కుచెదరని నీ గుండె నిబ్బరానికి ఆనందపడుతున్నాను". చెప్పు. నన్ను ఈ మాత్రమైనా ఆందోళనపరిచిన నిన్ను అభినందించి విడిచిపెట్టమంటావా లేక కాల్చి చంపమంటావా?

 

    "చేవ ఉంటే నాతో పోరాడు" ఛాలెంజ్ చేశాడు డేవిడ్.

 

    ఒక సుశిక్షితుడయిన ఉగ్రవాదిగా అర్థమైపోయింది.

 

    "పోరాడగలననే అనుకుంటున్నావా?"

 

    "పోరాడటమే కాదు. నిన్ను శవంగా మార్చి నీ శవానికి వెచ్చించబడిన లక్షరూపాయల్ని సాధించగలను."

 

    దృశ్య విషయంలో రేష్మి అన్నమాటలు గుర్తుకొచ్చిన శ్రీహర్ష రివాల్వర్ ని విసిరేసాడు దూరంగా.

 

    విదేశాలలో శ్రీహర్ష 'షా'గా సాగించిన సంగ్రామం కేపిటలిస్టులపై మాత్రమే. ఏ వ్యవస్థ అహాన్ని తను అంగీకరించలేక అన్ని హత్యల్ని చేశాడో, సరిగ్గా అలాంటి వ్యవస్థ ఈ దేశంలోకూడా తనపై వేట ప్రారంభించింది.

 

    శ్రీహర్ష ఆలోచనలనుంచి ఇంకా తేరుకోలేదు.

 

    గాలి వీచిన చప్పుడు.

 

    డేవిడ్ చేతిలో మెరుస్తూంది ఆరంగుళాల పొడవున్న స్ప్రింగ్ నైఫ్.

 

    చిన్న మెరుపులా ముందుకు కదిలిన డేవిడ్ వికృతంగా నవ్వుతున్నాడు "రివాల్వర్ ని విసిరి పొరపాటు చేసావుకదూ!"

 

    శ్రీహర్షలో చలనం లేదు. ముందటి ప్రశాంతతనే వ్యక్తం చేస్తూ అన్నాడు "గెరిల్లా పోరాటానికి అలవాటుపడిన ఓ ఉగ్రవాదినుంచి ఇంతకన్నా నిజాయితీని నేను ఆశించలేదు మిస్టర్ డేవిడ్! ఒక చిన్న సూచన. నీ తలని నా పిడికిలికి చిక్కకుండా జాగ్రత్తపడు. లేకపోతే నీ స్వరపేటిక తెగిపోతుంది."

 

    శ్రీహర్ష అలా అన్నది నిజాయితీగానే అని డేవిడ్ ఊహించలేకపోవడం అతడి దురదృష్టం.

 

    రెప్పపాటులో శ్రీహర్షపైకి లంఘించాడు.

 

    కొద్దిగా పక్కకి జరిగిన శ్రీహర్ష పాదం నేలకి సమాంతరంగా లేచి డేవిడ్ నడ్డిని తాకింది.

 

    తూలిపడ్డాడుకాని వెంటనే బంతిలా పైకి లేచాడు.

 Previous Page Next Page